26-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సుఖాన్ని ఇచ్చే ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఈ కొద్ది సమయములో యోగబలాన్ని జమ చేసుకున్నట్లయితే అంతిమములో అది చాలా ఉపయోగపడుతుంది’’

ప్రశ్న:-
అనంతమైన వైరాగ్యము గల పిల్లలైన మీకు ఏ స్మృతి సదా ఉండాలి?

జవాబు:-
ఇది మా ఛీ-ఛీ శరీరము, దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలి - ఈ స్మృతి సదా ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి, ఇంకేదీ గుర్తుకు రాకూడదు. ఇది అనంతమైన వైరాగ్యము. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేందుకు ఎటువంటి పురుషార్థము చేయాలంటే, దానితో పాపాల భారము తలపై నుండి తొలగిపోవాలి మరియు ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోవాలి.

ఓంశాంతి
తండ్రి పిల్లలకు ప్రతి రోజూ చాలా సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవానువాచ అని సరిగ్గా చెప్పారు. భగవంతుడైన తండ్రి అందరికీ ఒక్కరే. అందరూ భగవంతుడు కాలేరు, కానీ అందరూ ఆ ఒక్క తండ్రికి పిల్లలుగా అవ్వగలరు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేసేవారని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము తప్పకుండా లభించే ఉంటుంది. భారత్ లోనే శివజయంతి అని అంటూ ఉంటారు కానీ శివజయంతి ఎలా జరుగుతుంది అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కల్పము యొక్క సంగమయుగములో పిల్లలను పతితము నుండి మళ్ళీ పావనముగా చేయడానికి అనగా వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారు. ఈ సమయములో అందరికీ రావణుడి శాపముంది, అందుకే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఇప్పుడిది కలియుగీ పాత ప్రపంచము. మేము బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణులమని సదా గుర్తుంచుకోండి. ఎవరెవరైతే తమను తాము బ్రహ్మాకుమార-కుమారీలుగా భావిస్తారో, వారు తప్పకుండా - మేము కల్ప-కల్పము తాతగారి నుండి బ్రహ్మా ద్వారా వారసత్వము తీసుకుంటామని అర్థం చేసుకోవాలి. ఇంతమంది పిల్లలు ఇంకెవ్వరికీ ఉండలేరు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మా కూడా వారి సంతానమే. పిల్లలందరికీ వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. వారిచ్చే వారసత్వము సత్యయుగ రాజధాని. ఈ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా మనకు స్వర్గ రాజ్యాధికారము ఉండాలి. కానీ మనకు స్వర్గ రాజ్యాధికారము ఒకప్పుడు ఉండేది అన్నది మర్చిపోయాము. కానీ, నిరాకార తండ్రి ఎలా ఇస్తారు, తప్పకుండా బ్రహ్మా ద్వారానే ఇస్తారు. భారత్ లో వీరి రాజ్యముండేది. ఇప్పుడిది కల్పము యొక్క సంగమము. సంగమయుగములో బ్రహ్మా ఉన్నారు, అందుకే బి.కె.లుగా పిలవబడతారు. ఇది అంధ విశ్వాసము యొక్క విషమేమీ కాదు, ఇక్కడ దత్తత తీసుకున్నారు. మనము బ్రహ్మాకుమార, కుమారీలము. బ్రహ్మా శివబాబా యొక్క బిడ్డ. మనకు శివబాబా నుండి మళ్ళీ స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. ఇంతకుముందు కూడా లభించింది, అలా లభించి 5 వేల సంవత్సరాలయ్యింది. మనము దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. చివరి వరకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు క్రైస్ట్ వచ్చారు, క్రిస్టియన్ ధర్మము ఇప్పటివరకు ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రైస్ట్ ద్వారా మేము క్రిస్టియన్లుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి 2 వేల సంవత్సరాల క్రితము క్రైస్ట్ వచ్చారు. ఇప్పుడు వృద్ధి జరుగుతూ ఉంది. మొట్టమొదట సతోప్రధానముగా ఉంటారు, ఆ తర్వాత రజో, తమోలలోకి రావాలి. మీరు సత్యయుగములో సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత రజో, తమోలలోకి వచ్చారు. సృష్టి తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానముగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచములో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మీ ధర్మము అర్ధకల్పము కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మానికి చెందినవారే కానీ వికారులుగా ఉన్న కారణముగా మీరు స్వయాన్ని దేవీ-దేవతలుగా పిలుచుకోరు. మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగానే ఉండేవారు, కానీ వామ మార్గములోకి వెళ్ళిన కారణముగా మీరు పతితముగా అయిపోయారు, కావుననే మిమ్మల్ని మీరు హిందువులమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. వారి తర్వాత బ్రాహ్మణులైన మీరు. బ్రాహ్మణులైన మీది ఉన్నతోన్నతమైన వర్ణము. బ్రహ్మాకు పిల్లలుగా అయ్యారు. కానీ వారసత్వము బ్రహ్మా ద్వారా లభించదు. శివబాబా బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఆత్మలైన మీరు ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి అంటారు, నా ద్వారా నన్ను తెలుసుకోవడముతో మొత్తం సృష్టి చక్రము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఆ జ్ఞానము నాలో మాత్రమే ఉంది. నేను జ్ఞాన సాగరుడను, ఆనంద సాగరుడను, పవిత్రతా సాగరుడను. 21 జన్మల కొరకు మీరు పవిత్రముగా అవుతారు, ఆ తర్వాత విషయసాగరములో పడిపోతారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేస్తారు. గంగా నీరు పావనముగా చేయలేదు. స్నానము చేయడానికి వెళ్తారు కానీ ఆ నీరు పతిత-పావని కాదు. ఈ నదులైతే సత్యయుగములో కూడా ఉన్నాయి, కలియుగములో కూడా ఉన్నాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. ‘‘సర్వుల సద్గతిదాత ఒక్క రాముడే’’ అని అంటారు కూడా. వారే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు.

బాబా వచ్చి జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, తద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి, శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. మీరు తండ్రి నుండి సదా సుఖము యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అక్కడ మీరు గంగా స్నానాలు చేయడము లేక యాత్రలు చేయడము అనేవేమీ ఉండవు. ఇది మీ ఆత్మిక యాత్ర, దీనిని మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. బాబా ఆత్మలందరికీ తండ్రి, శారీరక తండ్రులైతే అనేకమంది ఉన్నారు. ఆత్మిక తండ్రి ఒక్కరే. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. మీకు ఎంతమంది తండ్రులని బాబా అడిగినప్పుడు తికమకపడతారు - ఇలా అడుగుతున్నారేమిటి, తండ్రి అయితే అందరికీ ఒక్కరే ఉంటారు, ఇద్దరు-ముగ్గురు తండ్రులు ఎలా ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఆ తండ్రియైన పరమాత్మను దుఃఖములో తలచుకుంటారు. ఓ పరమపిత పరమాత్మ, మమ్మల్ని దుఃఖము నుండి విడిపించండి అని దుఃఖములో సదా వేడుకుంటారు. అనగా ఇద్దరు తండ్రులు ఉన్నట్లు కదా. ఒకరు దైహిక తండ్రి, మరొకరు ఆత్మిక తండ్రి. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖము లభిస్తుంది అని వారి మహిమనే చేస్తారు. లౌకిక తల్లిదండ్రుల నుండి అపారమైన సుఖము లభించదు. ఎప్పుడైతే దుఃఖము కలుగుతుందో, అప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రియే ఇటువంటి ప్రశ్నలను అడుగుతారు, ఇంకెవ్వరూ ఇలా అడగలేరు.

బాబా, మీరు వస్తే మేము మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినము, మిగిలినవారంతా దుఃఖాన్ని ఇస్తారు, సుఖాన్ని ఇచ్చేవారు మీరే అని భక్తి మార్గములో మీరు పాడుతారు. కావున తండ్రి వచ్చి - మనము ఏమి పాడేవారము అన్నది గుర్తు తెప్పిస్తున్నారు. మీరే బ్రహ్మాకుమార, కుమారీలుగా పిలవబడతారని మీకు తెలుసు. మనుష్యుల బుద్ధి ఎంతటి రాతిబుద్ధిగా ఉందంటే, బి.కె.లు ఎవరు, మమ్మా, బాబా ఎవరు అనేది కూడా వారు అర్థం చేసుకోరు. వీరు ఏమీ సాధువు లేక సత్పురుషుడు కాదు. సాధు-సన్యాసులను గురువులని అంటారు కానీ మాత-పితలని అనరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అక్కడ ఈ రాజు-రాణి అయిన లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు. మొదట పవిత్రముగా ఉండేవారు, తర్వాత అపవిత్రముగా అవుతారు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారు మళ్ళీ 84 జన్మలను తీసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి నుండి 21 జన్మల సుఖపు వారసత్వము లభిస్తుంది. కుమారీలంటే 21 కులాలను ఉద్ధరించేవారు. ఇది మీ మహిమనే. మీరు కుమారీలు, అంతేకానీ గృహస్థులు కారు. పెద్దవారైనా కానీ మరజీవాగా అయ్యి, అందరూ తండ్రికి పుత్రులుగా, పుత్రికలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మాకు అనేకమంది పిల్లలు ఉన్నారు, ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. తర్వాత వీరంతా దేవతలుగా అవుతారు. ఇది శివబాబా యజ్ఞము. దీనిని రాజస్వ యజ్ఞము, స్వరాజ్యాన్ని పొందే యజ్ఞము అని అంటారు. ఆత్మలకు తండ్రి నుండి స్వర్గ రాజ్యము యొక్క వారసత్వము లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞములో ఏం చేయాలి? శరీర సహితముగా ఏదైతే ఉందో, అదంతా బలిహారము చేయాలి అనగా స్వాహా చేయాలి. ఈ యజ్ఞము ద్వారానే మీరు మళ్ళీ రాజ్యము పొందుతారు. తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు - మీరు భక్తి మార్గములో, ఓ బాబా, మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీపై బలిహారము అవుతాము, సమర్పణ అవుతాము అని పాడేవారు. ఇప్పుడు మీరంతా స్వయాన్ని బ్రహ్మాకుమార, కుమారీలుగా భావిస్తారు. మీరు మీ గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ కమలపుష్ప సమానముగా పావనముగా ఉండవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనము బాబా పిల్లలము. ఆత్మలైన మీరు ప్రేయసులు. తండ్రి అంటారు, నేనొక్కడినే ప్రియుడిని. మీరు ప్రియుడినైన నన్ను పిలుస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పము నుండి ప్రేయసులు. పరమపిత పరమాత్మ అని ఎవరినైతే అంటారో, వారు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారియే, అది ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. భక్తి మార్గములో కూడా మీరు పాత్రను అభినయించాలి. భక్తి అనగా రాత్రి. అంధకారములో మనుష్యులు భ్రమిస్తూ ఉంటారు. ద్వాపరము నుండి మొదలుకుని మీరు భ్రమిస్తూ వచ్చారు. ఈ సమయములో మహా దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడిది పాత ప్రపంచము యొక్క అంతిమము. ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఎవరైనా కోటీశ్వరులైనా లేక రాజులైనా, పిల్లలు జన్మిస్తే ఈ ధనమంతా మా పిల్లల కోసమే, మా పిల్లలు, మనవలు తింటారని భావిస్తారు. తండ్రి అంటారు, వారేమీ తినరు. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. విఘ్నాలు ఎన్నో వస్తాయి. పరస్పరము కొట్లాడుకుంటారు. అంతిమములో ఏ విధముగా కొట్లాడుకుంటారంటే, ఇక రక్తపు నదులు ప్రవహిస్తాయి. మీకు ఎవరితోనూ యుద్ధము లేదు. మీరు యోగబలముతో ఉంటారు. మీరు స్మృతిలో ఉన్నట్లయితే, మీ ముందుకు ఎవరైనా చెడు ఆలోచనలతో వచ్చినా కానీ, వారికి భయంకరమైన సాక్షాత్కారము కలిగి వెంటనే పారిపోతారు. మీరు శివబాబాను స్మృతి చేస్తారు మరియు వారు పారిపోతారు. పక్కా పిల్లలుగా ఉన్నవారు, మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పురుషార్థములో ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, చేతులతో పని చేస్తూ బుద్ధితో తండ్రి స్మృతిలో ఉండాలి. పిల్లలను, ఇంటిని కూడా సంభాళించాలి. కానీ ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాల భారము కూడా తొలగిపోతుంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు, కానీ నంబరువారు పురుషార్థానుసారముగా అవుతారు. తర్వాత మీరందరూ ఈ శరీరాలను వదిలేస్తారు, బాబా ఆత్మలందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్తారు. ఇకపోతే మిగిలిన ప్రపంచములోని వారంతా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భారత్ లో కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు. దాని కోసమే ఈ మహాభారత యుద్ధము జరగనున్నది. ఇక్కడైతే చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శనీలు, ప్రొజెక్టర్లు మొదలైనవాటి ద్వారా ఎంతమంది వింటారు. వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. రాజు అయితే ఒక్కరే ఉంటారు, మిగిలినవారంతా ప్రజలు. మంత్రులు కూడా ప్రజల లైనులోనే వస్తారు. అనేకమంది ప్రజలు ఉంటారు. ఒక రాజుకు లక్షల సంఖ్యలో ప్రజలు ఉంటారు. కావున రాజు-రాణులు కృషి చేయవలసి ఉంటుంది కదా.

తండ్రి అంటారు - అన్నీ చేస్తూ నిరంతరము నన్ను స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియుడు ఉంటారు, వారి మధ్యన దైహిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరు ఈ సమయములో ప్రేయసులు. మీ ప్రియుడు వచ్చి ఉన్నారు. వారు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. చదువుకుంటూ, చదువుకుంటూ మీరు దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సదా కోసం నిరోగులుగా కూడా అవుతారు. అంతేకాక 84 జన్మల చక్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సత్యయుగములో ఇన్ని జన్మలు ఉంటాయి, త్రేతాలో ఇన్ని జన్మలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనము 84 జన్మల చక్రములో పూర్తిగా తిరిగాము. మున్ముందు మీరు చాలా వృద్ధి చెందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యకు చేరుకుంటాయి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని మీరు ప్రతి వీధిలోనూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి ఇంటికి పదండి. ఇది ఛీ-ఛీ శరీరము. ఇది అనంతమైన వైరాగ్యము. సన్యాసులైతే కేవలం హద్దులోని ఇళ్ళు-వాకిళ్ళను వదులుతారు. వారు హఠయోగులు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాదిగా ఉందని అంటారు. తండ్రి అంటారు, ఈ భక్తి ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది. 84 మెట్లు దిగి ఇప్పుడు మీరు తమోప్రధానముగా అయ్యారు. మీరే దేవీ-దేవతలుగా ఉండేవారు. మేము క్రిస్టియన్లుగా ఉండేవారమని క్రిస్టియన్లు అంటారు. మనము సత్యయుగములో ఉండేవారమని మీకు తెలుసు. తండ్రి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు. లక్ష్మీ-నారాయణులుగా ఉన్నవారే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యయుగములో ఒకే రాజా-రాణి ఉండేవారు, ఒకే భాష ఉండేది. ఈ సాక్షాత్కారము కూడా పిల్లలకు కలిగింది. మీరంతా ఆది సనాతన ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. వారు ఆత్మ నిర్లేపి అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు, అది తప్పు. అందరిలోనూ ఆత్మ ఉంది, అటువంటప్పుడు మాలో పరమాత్మ ఉన్నారని ఎలా అంటారు. అలా అయితే అందరూ తండ్రులు అయినట్లు. ఎంత తమోప్రధానముగా అయిపోయారు. ఇంతకుముందు ఏది వింటే అది నమ్మేసేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు, దాని ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. అమరకథ కూడా ఇదే. అంతేకానీ సూక్ష్మవతనములో కథలు మొదలైనవేవీ లేవు. అదంతా భక్తి మార్గపు అంటు. మీరు అమరులుగా అయ్యేందుకు అమరకథను వింటున్నారు. అక్కడ మీరు సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు, రోదిస్తారు. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయుష్షు కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ పతితత్వము ఉండదు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసామని, ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారని పక్కా చేసుకోవాలి. పావనముగా అయ్యే యుక్తులను కూడా మీకు తెలియజేస్తారు. కేవలం తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యయుగములో 16 కళల సంపూర్ణులుగా ఉంటారు, ఆ తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మీలో ఏ కళలు లేవు. తండ్రియే దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకువెళ్తారు, అందుకే వారిని ముక్తిదాత అని అంటారు. వారు అందరినీ తమతోపాటు తీసుకువెళ్తారు. మీ గురువులు మిమ్మల్ని వారితోపాటు తీసుకువెళ్ళరు. ఆ గురువు వెళ్ళిపోతే, వారి శిష్యుడు సింహాసనముపై కూర్చుంటారు. ఇక తర్వాత, ఆ శిష్యుల మధ్యన చాలా గొడవలు జరుగుతాయి. పరస్పరములో సింహాసనము కోసం కొట్లాడుకుంటారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను. మీరు సంపూర్ణులుగా అవ్వకపోతే శిక్షలు అనుభవిస్తారు మరియు పదవి భ్రష్టమవుతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి యొక్క అభ్యాసమును ఎంతగా చేయాలంటే, చెడు ఆలోచనలు కలవారు మీ ఎదురుగా రాగానే మారిపోవాలి. నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు... ఈ పురుషార్థములో ఉండాలి.

2. స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితముగా మీ వద్ద ఏదైతే ఉందో, దానినంతటినీ బలిహారము చేయాలి. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞములో సర్వస్వాన్ని స్వాహా చేస్తారో, అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది.

వరదానము:-
సహన శక్తి అనే విశేషత ద్వారా ఇతరుల సంస్కారాలను పరివర్తన చేసే దృఢ సంకల్పధారీ భవ

ఏ విధముగా బ్రహ్మాబాబా జ్ఞానీ మరియు అజ్ఞానీ ఆత్మల ద్వారా అవమానాన్ని సహించి వారిని పరివర్తన చేసారో అలా బాబాను అనుసరించండి. దీని కొరకు మీ సంకల్పాలలో కేవలం దృఢత్వాన్ని ధారణ చేయండి. ఇది ఎంతవరకు సాధ్యము అని ఆలోచించకండి. ఇది ఎలా సాధ్యము, ఎంతవరకని సహనము చేయగలము? అని కేవలం ప్రారంభములో అనిపిస్తుంది. కానీ ఒకవేళ మీ గురించి ఎవరైనా ఏదైనా అన్నా కానీ మీరు మౌనముగా ఉండండి, సహనము చేయండి, అప్పుడు వారు కూడా మారిపోతారు. కేవలం నిరుత్సాహులుగా అవ్వకండి.

స్లోగన్:-
సంగమయుగములో సహనము చేయడము, వంగడము, ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే - పిల్లలకు ముందుగా సహచరులలో, సేవలో, వాయుమండలములో ఏకత ఉండాలి, వీటితోపాటు ఒకే బలము, ఒకే నమ్మకము, ఏకమతము ఉండాలి, అప్పుడు సేవలో సఫలత లభిస్తుంది. ఏ విధముగా కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవము చేస్తారో, అదే విధముగా ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము మరియు ఏకత అనే రిబ్బన్ ను కట్ చేయండి మరియు సర్వుల సంతుష్టత, ప్రసన్నత అనే కొబ్బరికాయను కొట్టండి. ఆ నీటిని భూమిలో వేయండి, అప్పుడు ఎంత సఫలత లభిస్తుందో చూడండి.