26-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి చేయి పట్టుకున్నారు, మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు’’

ప్రశ్న:-
పిల్లలైన మీలో ఏ ఉల్లాసము ఉండాలి? సింహాసనాధికారులుగా అయ్యేందుకు విధి ఏమిటి?

జవాబు:-
సదా ఉల్లాసము ఉండాలి - జ్ఞాన సాగరుడైన తండ్రి మనకు ప్రతి రోజూ జ్ఞాన రత్నాలతో పళ్ళాలను నింపి-నింపి ఇస్తున్నారు. ఎంతగా యోగములో ఉంటారో అంతగా బుద్ధి కాంచనముగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశీ జ్ఞాన రత్నాలే మీతోపాటూ వస్తాయి. సింహాసనాధికారులుగా అవ్వాలంటే తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి. వారి శ్రీమతమనుసారముగా నడవండి, అలాగే ఇతరులను కూడా మీ సమానముగా తయారుచేయండి.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఈ సమయములో ఎక్కడ కూర్చున్నారు? ఆత్మిక తండ్రి యొక్క యూనివర్శిటీలో లేక పాఠశాలలో కూర్చున్నాము అని అంటారు. బుద్ధిలో ఉంది - మనము ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నాము, ఆ తండ్రి మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు మరియు భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము ఎలా జరుగుతుందో, అది కూడా తండ్రి తెలియజేస్తున్నారు. ఒకప్పుడు పావనముగా ఉన్న భారత్ ఇప్పుడు పతితముగా ఉంది. భారత్ శిరోకిరీటముగా ఉండేది, మరి తర్వాత ఎవరు విజయము పొందారు? రావణుడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నారంటే పతనమైనట్లే కదా! ఇక్కడ రాజులెవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా కూడా పతితులే ఉంటారు కదా. ఇదే భారత్ లో సూర్యవంశీ మహారాజు-మహారాణి ఉండేవారు. సూర్యవంశీ మహారాజులు మరియు చంద్రవంశీ రాజులు ఉండేవారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి, ప్రపంచములో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. మన ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మనము ఆత్మిక తండ్రి చెయ్యి పట్టుకున్నాము. మనము గృహస్థ వ్యవహారములో ఉంటున్నా కూడా ఇప్పుడు మనము సంగమయుగములో నిలబడి ఉన్నాము అని బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచము నుండి మనము పావన ప్రపంచములోకి వెళ్తాము. కలియుగము పతిత యుగము, సత్యయుగము పావన యుగము. పతిత మనుష్యులు పావన మనుష్యుల ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. వాస్తవానికి వారు కూడా భారత్ లోని మనుష్యులే. కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనము కూడా తండ్రి ద్వారా ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము. సత్యయుగములో ఈ పురుషార్థము చేయరు. అక్కడ కేవలం ప్రారబ్ధము ఉంటుంది. ఇక్కడ పురుషార్థము చేసి దైవీ గుణాలను ధారణ చేయాలి. సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను బాబాను ఎంతవరకు స్మృతి చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతున్నాను? ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానముగా అవుతారు. తండ్రి అయితే ఎల్లప్పుడూ సతోప్రధానముగానే ఉంటారు. ఇప్పుడు కూడా పతిత ప్రపంచము మరియు పతిత భారత్ ఉంది. పావన ప్రపంచములో పావన భారత్ ఉండేది. మీ వద్దకు ప్రదర్శనీ మొదలైనవాటిలో భిన్న-భిన్న రకాల మనుష్యులు వస్తారు. కొందరు ఏమంటారంటే - ఏ విధంగా భోజనము తప్పనిసరిగా అవసరమో, అలా ఈ వికారాలు కూడా భోజనము వంటివి, అవి లేకపోతే చనిపోతాము అని. వాస్తవానికి అటువంటి విషయమేమీ లేదు. సన్యాసులు పవిత్రముగా ఉంటారు, మరి వారేమైనా చనిపోతారా ఏమిటి! ఆ విధంగా చెప్పేవారిని అజామిళుని వంటి పాపాత్ములు అని భావించడం జరుగుతుంది, వారు ఈ విధంగా మాట్లాడుతారు. వారితో ఇలా అనాలి - వికారాలను భోజనముతో పోలుస్తున్నావు, అవి లేకపోతే నీవు చనిపోతావా ఏమిటి! స్వర్గములోకి వచ్చేవారు ఎవరైతే ఉంటారో, వారు సతోప్రధానముగా ఉంటారు. ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు కదా. ఎవరైతే చివరిలో వస్తారో, ఆ ఆత్మలు నిర్వికారీ ప్రపంచాన్ని అయితే చూడనే లేదు. కావున ఆ ఆత్మలు - వికారాలు లేకుండా మేము ఉండలేము అని అంటారు. సూర్యవంశీయులు ఎవరైతే ఉంటారో, వారికైతే వెంటనే, ఇది సత్యము అన్న మాట బుద్ధిలోకి వస్తుంది. తప్పకుండా స్వర్గములో వికారాల నామ-రూపాలు ఉండేవి కావు. భిన్న-భిన్న రకాల మనుష్యులు భిన్న-భిన్న రకాల మాటలు మాట్లాడుతారు. ఎవరెవరు పుష్పాలుగా అవుతారు అనేది మీరు అర్థం చేసుకుంటారు. కొందరైతే ముళ్ళగానే మిగిలిపోతారు. స్వర్గము పేరు పుష్పాలతోట. ఇది ముళ్ళ అడవి. ముళ్ళు కూడా అనేక రకాలవి ఉంటాయి. ఇప్పుడు మీకు తెలుసు - మనము పుష్పాలుగా అవుతున్నాము. తప్పకుండా ఈ లక్ష్మీ-నారాయణులు సదా గులాబీ పుష్పాల వలె ఉంటారు. వారినే కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. దైవీ పుష్పాల రాజ్యము కదా. తప్పకుండా వారు కూడా పురుషార్థము చేసి ఉంటారు. చదువు ద్వారానే అలా అయ్యారు కదా.

ఇప్పుడు మనము ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. ఇంతకుముందైతే ఈశ్వరుని గురించి ఏ మాత్రము తెలియదు. తండ్రి వచ్చి ఈ పరివారాన్ని తయారుచేసారు. తండ్రి మొదట స్త్రీని దత్తత తీసుకుంటారు, తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తారు. బాబా కూడా వీరిని దత్తత తీసుకుని, తర్వాత వీరి ద్వారా పిల్లలను రచించారు. వీరందరూ బ్రహ్మాకుమార-కుమారీలు కదా. ఈ సంబంధము ప్రవృత్తి మార్గానికి సంబంధించినది. సన్యాసులది నివృత్తి మార్గము. ఆ మార్గములో ఎవరూ తల్లీ, తండ్రీ అని అనరు. ఇక్కడ మీరు మమ్మా, బాబా అని అంటారు. ఇతర సత్సంగాలన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ నివృత్తి మార్గానికి చెందినవి, ఈ తండ్రి ఒక్కరినే మాత, పిత అని పిలుస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - భారత్ లో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది, ఇప్పుడు అది అపవిత్రము అయిపోయింది. నేను మళ్ళీ అదే ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తాను. మీకు తెలుసు, మన ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. మరి మనము ఇతర పాత ధర్మాలవారితో సాంగత్యము ఎందుకు చేయాలి! మీరు స్వర్గములో ఎంత సుఖముగా ఉంటారు. వజ్ర-వైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళు ఉంటాయి. ఇక్కడ అమెరికా, రష్యా మొదలైన చోట్ల ఎంత షావుకారులు ఉన్నారు కానీ స్వర్గము వంటి సుఖము ఉండదు. బంగారు ఇటుకలతో కూడిన మహళ్ళను అయితే ఎవరూ నిర్మించలేరు. బంగారు మహళ్ళు సత్యయుగములోనే ఉంటాయి. ఇక్కడ అసలు బంగారము ఎక్కడ ఉంది. అక్కడైతే ప్రతిచోట వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. ఇక్కడైతే వజ్రాలకు కూడా ఎంత ధర పెరిగిపోయింది. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయి. బాబా అర్థం చేయించారు, కొత్త ప్రపంచములో మళ్ళీ గనులన్నీ కొత్తగా నిండిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ అవుతూ ఉంటాయి. సాగరుడు వజ్ర-వైఢూర్యాలతో నిండిన పళ్ళాలను ఇచ్చారు అని చూపించారు. వజ్ర-వైఢూర్యాలైతే అక్కడ మీకు ఎన్నో లభిస్తాయి. సాగరుడిని కూడా దేవతగా భావిస్తారు. తండ్రి అయితే జ్ఞాన సాగరుడు అని మీరు అర్థం చేసుకుంటారు. సదా ఉల్లాసము ఉండాలి - జ్ఞాన సాగరుడైన తండ్రి మనకు ప్రతి రోజు జ్ఞాన రత్నాలతో, వజ్ర-వైఢూర్యాలతో పళ్ళాలను నింపి ఇస్తున్నారు. ఇకపోతే అది కేవలం నీటి సాగరము మాత్రమే. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు, వాటిని మీరు బుద్ధిలో నింపుకుంటున్నారు. ఎంతగా యోగములో ఉంటారో అంతగా మీ బుద్ధి కాంచనముగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశీ జ్ఞాన రత్నాలనే మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి స్మృతి మరియు ఈ జ్ఞానము ముఖ్యమైనవి.

పిల్లలైన మీకు లోపల చాలా ఉల్లాసము ఉండాలి. తండ్రి కూడా గుప్తమైనవారు, మీరు కూడా గుప్తమైన సైన్యము. అహింసాయుతమైన గుప్తయోధులు అని అంటారు కదా. ఫలానావారు చాలా శక్తివంతమైన యోధులు కానీ వారి నామ-రూపాలు తెలియవు అని అనడానికి వీలు లేదు. గవర్నమెంటు వద్ద ప్రతి ఒక్కరి నామ-రూపాలు పూర్తిగా ఉంటాయి. గుప్తమైన యోధులు, అహింసాయుతమైన యోధులు అన్న పేరు మీది. అన్నింటికన్నా మొట్టమొదటి హింస ఈ వికారాలు, ఇవే ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తాయి, అందుకే - ఓ పతిత-పావనా, పతితులమైన మమ్మల్ని వచ్చి పావనముగా తయారుచేయండి అని అంటారు. పావన ప్రపంచములో పతితులు ఒక్కరు కూడా ఉండలేరు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఇప్పుడే మనము భగవంతుని పిల్లలుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు, కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. మాయ చేతితో ఒకే చెంపదెబ్బ ఎలా తగులుతుందంటే, అది పూర్తిగా మురికి గుంటలో పడేస్తుంది. వికారాలలోకి పడిపోతే బుద్ధి ఒక్కసారిగా భ్రష్టమైపోతుంది. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నారు - పరస్పరము దేహధారుల పట్ల ఎప్పుడూ ప్రీతిని పెట్టుకోకండి. మీరు ఒక్క తండ్రితోనే ప్రీతిని పెట్టుకోవాలి. ఏ దేహధారుల పట్ల ప్రేమ పెట్టుకోకూడదు. ప్రేమ అనేది దేహ రహితుడైన, విచిత్రుడైన తండ్రితోనే పెట్టుకోవాలి. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా అర్థం చేసుకోరు. భాగ్యములో లేకపోతే పరస్పరము ఒకరి దేహములో ఒకరు చిక్కుకుంటారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు - మీరు కూడా రూపమే. ఆత్మ మరియు పరమాత్మల రూపము ఒక్కటే. ఆత్మ చిన్నగా, పెద్దగా అవ్వదు. ఆత్మ అవినాశీ. ప్రతి ఒక్కరికీ డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది. ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ఇక తర్వాత 9-10 లక్షల మంది మాత్రమే ఉంటారు. సత్యయుగ ఆదిలో ఎంత చిన్న వృక్షము ఉంటుంది. ప్రళయమైతే ఎప్పుడూ జరగదు. మీకు తెలుసు, మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారందరి ఆత్మలు మూలవతనములో ఉంటాయి. ఆత్మల వృక్షము కూడా ఉంది. బీజము నాటితే దాని నుండి మొత్తము వృక్షమంతా వెలువడుతుంది. మొట్టమొదట రెండు ఆకులు వెలువడుతాయి. ఇది కూడా అనంతమైన వృక్షము. సృష్టి చక్రముపై అర్థం చేయించడము ఎంత సహజము, ఆలోచించండి. ఇప్పుడు ఇది కలియుగము. సత్యయుగములో ఒకే ధర్మము ఉండేది, అప్పుడు ఎంత కొద్దిమంది మనుష్యులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులు, ధర్మాలు ఉన్నాయి. వీరంతా ఎవరైతే ఇంతకుముందు లేరో, వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఆత్మలందరూ పరంధామానికి వెళ్ళిపోతారు. మీ బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. ఏ విధంగా తండ్రి జ్ఞాన సాగరుడో, మిమ్మల్ని కూడా అదే విధంగా తయారుచేస్తారు. మీరు చదువుకుని ఈ పదవిని పొందుతారు. తండ్రి స్వర్గ రచయిత కావున స్వర్గ వారసత్వాన్ని భారతవాసులకే ఇస్తారు. మిగిలినవారందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివించడానికి వచ్చాను. ఎంత పురుషార్థము చేస్తారో, అంతటి పదవిని పొందుతారు. ఎంతగా శ్రీమతముపై నడుస్తారో అంత శ్రేష్ఠముగా అవుతారు. మొత్తము ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. మమ్మా, బాబా యొక్క సింహాసనాధికారులుగా అవ్వాలంటే పూర్తిగా తల్లిని, తండ్రిని ఫాలో చేయాలి. సింహాసనాధికారులుగా అయ్యేందుకు వారి నడవడిక అనుసారముగా నడుచుకోండి. ఇతరులను కూడా మీ సమానముగా తయారుచెయ్యండి. బాబా అనేక రకాల యుక్తులను తెలియజేస్తున్నారు. ఒక్క బ్యాడ్జిపైనే మీరు ఎవరికైనా బాగా అర్థం చేయించండి. పురుషోత్తమ మాసమైతే బాబా అంటారు, చిత్రాలను ఉచితముగా ఇవ్వండి. బాబా కానుకను ఇస్తారు. మళ్ళీ పిల్లల చేతికి ధనము వచ్చినప్పుడు తప్పకుండా అనుకుంటారు, బాబాకు కూడా వీటి కోసం ఖర్చు అవుతుంది కదా, అలా అనుకుని వెంటనే పంపిస్తారు. ఇల్లు అయితే ఒకటే కదా. ఈ ట్రాన్స్ లైట్ చిత్రాలతో ప్రదర్శనీ తయారైతే ఎంతమంది చూడటానికి వస్తారు. అది పుణ్య కర్మ కదా. మనుష్యులను ముళ్ళ నుండి పుష్పాలుగా, పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా తయారుచేస్తారు, దానిని విహంగ మార్గము అని అంటారు. ప్రదర్శనీలో స్టాల్ తీసుకుంటే మీ వద్దకు ఎంతోమంది వస్తారు. అక్కడ ఖర్చు కూడా తక్కువగా అవుతుంది. మీరు ఇక్కడకు తండ్రి నుండి స్వర్గ రాజ్యాన్ని కొనుక్కునేందుకు వస్తారు. అలాగే స్వర్గ రాజ్యాన్ని కొనుక్కునేందుకు ప్రదర్శనీకి కూడా వస్తారు. ఇది దుకాణము కదా.

తండ్రి అంటారు, ఈ జ్ఞానము ద్వారా మీకు ఎంతో సుఖము లభిస్తుంది, అందుకే బాగా చదువుకుని, పురుషార్థము చేసి పూర్తిగా పాస్ అవ్వాలి. తండ్రియే కూర్చుని తన మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు త్రికాలదర్శులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో, నా గురించి యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఒకవేళ యథార్థ రీతిగా తెలుసుకున్నట్లయితే ఇక ఎప్పుడూ వదలరు. ఇది చదువు, భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు. వారు అంటారు, నేను మీ విధేయుడినైన సేవకుడిని. తండ్రి మరియు టీచర్, ఇరువురూ విధేయులైన సేవకులు. డ్రామాలో నా పాత్రయే ఈ విధంగా ఉంది, మళ్ళీ అందరినీ నాతో పాటు తీసుకువెళ్తాను. శ్రీమతముపై నడుస్తూ పాస్ విత్ ఆనర్ అవ్వాలి. చదువైతే చాలా సహజమైనది. చదువును చదివించే వీరు అందరికన్నా వృద్ధులు. శివబాబా అంటారు, నేను వృద్ధుడిని కాను. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. ఇకపోతే రాతిబుద్ధి కలదిగా అవుతుంది. నా బుద్ధి అయితే పారస బుద్ధి, అందుకే మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేయడానికి వస్తాను, కల్ప-కల్పమూ వస్తాను. నేను లెక్కలేనన్ని సార్లు మిమ్మల్ని చదివిస్తాను, అయినా మళ్ళీ మర్చిపోతారు. సత్యయుగములో ఈ జ్ఞానము యొక్క అవసరమే ఉండదు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇటువంటి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అందుకే మహామూర్ఖులను చూడాలంటే ఇక్కడే చూడండి అని అంటారు. ఏ తండ్రి నుండైతే స్వర్గ వారసత్వము లభిస్తుందో, వారిని కూడా వదిలేస్తారు. తండ్రి అంటారు, మీరు నా సలహాపై నడిచినట్లయితే అమరలోకములో విశ్వమహారాజుగా, మహారాణిగా అవుతారు. ఇది మృత్యులోకము. మనమే పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము ఎలా తయారయ్యాము? పతితులుగా, బికారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనమే యువరాజులుగా అవ్వనున్నాము. అందరి పురుషార్థము ఒకే విధముగా ఉండదు. కొందరు మధ్యలో ఆగిపోతారు, కొందరు ద్రోహులుగా అవుతారు. ఇటువంటి ద్రోహులు కూడా ఎంతోమంది ఉన్నారు, అటువంటివారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు. జ్ఞాన విషయాలను కాకుండా ఇంకేవైనా అడిగితే వారికి ఆసురీ వృత్తి ఉందని అర్థం చేసుకోండి. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. ఎవరైతే జ్ఞానములో తెలివైనవారో, బాబా హృదయాన్ని అధిరోహించి ఉన్నారో, వారి సాంగత్యమునే చేయండి. వారు మీకు జ్ఞానపు మధురాతి మధురమైన విషయాలను వినిపిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే, సర్వీసబుల్, విశ్వాసపాత్రులు, ఆజ్ఞాకారులైన పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహ రహితుడైన, విచిత్రుడైన తండ్రి పట్ల ప్రేమను పెట్టుకోవాలి. ఏ దేహధారుల నామ-రూపాలలోనూ బుద్ధిని చిక్కుకోనివ్వకూడదు. మాయ చెంపదెబ్బ తగలకుండా సంభాళించుకోవాలి.

2. ఎవరైతే జ్ఞాన విషయాలను కాకుండా వేరే విషయాలను వినిపిస్తారో వారి సాంగత్యము చేయకూడదు. ఫుల్ పాస్ అయ్యేందుకు పురుషార్థము చేయాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవను చేయాలి.

వరదానము:-
‘‘ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు’’ ఈ స్మృతి ద్వారా బంధనముక్త, యోగయుక్త భవ

ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయము, అందుకే బంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా అవ్వండి. బంధనముక్తులు అనగా లూజ్ డ్రెస్, టైట్ డ్రెస్ కాదు. ఆర్డర్ లభించగానే క్షణములో వెళ్ళిపోవాలి. ఇటువంటి బంధనముక్తమైన, యోగయుక్తమైన స్థితి యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి - ‘‘ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు’’. ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు మరియు సత్యయుగీ రాజ్యములోకి వచ్చేందుకు ఈ పాత శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. కావున చెక్ చేసుకోండి - ఈ విధంగా ఎవర్రడీగా అయ్యారా లేక ఇప్పటివరకు ఇంకా ఏమైనా తాళ్ళు బంధింపబడి ఉన్నాయా? ఈ పాత వస్త్రము టైట్ గా అయితే లేదు కదా?

స్లోగన్:-
వ్యర్థ సంకల్పాల రూపీ ఎక్స్ ట్రా భోజనము చేయకుండా ఉంటే అధిక బరువుతో వచ్చే అనారోగ్యాల నుండి రక్షింపబడతారు.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను అలవరచుకోండి

తండ్రికి అన్నింటికంటే మంచిగా అనిపించే విషయము సత్యత, అందుకే భక్తిలో కూడా - గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. అన్నింటికంటే ప్రియమైన వస్తువు సత్యత ఎందుకంటే ఎవరిలోనైతే సత్యత ఉంటుందో వారిలో స్వచ్ఛత ఉంటుంది, వారు క్లీన్ మరియు క్లియర్ గా (స్వచ్ఛము మరియు స్పష్టము)గా ఉంటారు. కనుక సత్యత యొక్క విశేషతను ఎప్పుడూ వదలకండి. సత్యతా శక్తి ఒక లిఫ్ట్ లా పని చేస్తుంది.