26-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచములో నిష్కామ సేవను కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు, ఇకపోతే మీరు ఏవేవైతే కర్మలు చేస్తారో, వాటన్నింటికీ ఫలం తప్పకుండా లభిస్తుంది’’

ప్రశ్న:-
డ్రామానుసారముగా, పిల్లలైన మీకు సంతోషము కలిగించే ఏ విషయము, 100 శాతం నిశ్చితము?

జవాబు:-
డ్రామానుసారముగా నిశ్చితము అన్నది ఏమిటంటే - కొత్త రాజధాని స్థాపనయ్యేదే ఉంది. శ్రీమతాన్ని అనుసరించి మేము మా కోసం మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము అని పిల్లలైన మీకు సంతోషము ఉంది. ఈ పాత ప్రపంచము యొక్క వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలైన మీరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతటి ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది.

పాట:-
మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్ని పొందాము...

ఓంశాంతి
పిల్లలు ఏమంటారో, బాబా కూడా అదే అంటారు. పిల్లలంటారు - బాబా, మిమ్మల్ని పొంది మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము. తండ్రి కూడా అంటారు - పిల్లలూ, మన్మనాభవ. విషయం ఒకటే అయినట్లు. ఈ సత్సంగానికి వెళ్ళడము వలన బ్రహ్మాకుమార-కుమారీలకు ఏమి లభిస్తుందని మనుష్యులందరూ అడుగుతారు. అప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలంటారు, మేము బాప్ దాదా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము. విశ్వానికి యజమానులుగా ఇంకెవరూ అవ్వలేరు. విశ్వానికి యజమానులు ఈ లక్ష్మీ-నారాయణులే, శివబాబా అయితే విశ్వానికి యజమానిగా అవ్వలేరు. పిల్లలైన మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి విశ్వానికి యజమానిగా అవ్వరు. ఇటువంటి నిష్కామ సేవను చేసేవారు ఇంకెవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి తాము చేసిన సేవకు ఫలం తప్పకుండా లభిస్తుంది. భక్తి మార్గములో లేదా ఇంకే రకంగానైనా ఎవరైనా ఏమైనా చేస్తే... సోషల్ వర్కర్లకు కూడా సేవా ఫలం తప్పకుండా లభిస్తుంది. గవర్నమెంట్ నుండి జీతం లభిస్తుంది. తండ్రి అంటారు - నేను ఒక్కడిని మాత్రమే నిష్కామ సేవను చేస్తాను, అదేమిటంటే - పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తాను, కానీ నేను అలా అవ్వను. పిల్లలను సుఖవంతులుగా చేసి, సుఖధామానికి యజమానులుగా చేసి, 21 జన్మల కొరకు సుఖాన్ని ఇచ్చి, నేను నా నిర్వాణధామములో లేక వానప్రస్థ అవస్థలో కూర్చుండిపోతాను. వానప్రస్థము అని మూలవతనాన్నే అంటారు. మనుష్యులు వానప్రస్థము తీసుకుంటారు. పిల్లలకు అంతా ఇచ్చేసి, సత్సంగాలు మొదలైనవాటికి వెళ్తారు. ముక్తికి మార్గాన్ని తెలియజేస్తారని గురువులను ఆశ్రయిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు - ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని మనుష్యమాత్రులెవరూ ఎప్పుడూ ఎవరికీ తెలియజేయలేరు, వారు ఎవరికీ సద్గతిని ఇవ్వలేరు. తమకు తాము కూడా సద్గతిని ఇచ్చుకోలేరు. స్వయానికి ఇచ్చుకోగలిగితే అప్పుడు ఇతరులకు కూడా ఇవ్వగలుగుతారు. తండ్రి పరంధామము నుండే వస్తారు. వారు అక్కడి నివాసి, పిల్లలైన మీరు కూడా అక్కడి నివాసులే. మీరు ఈ కర్మక్షేత్రములో పాత్రను అభినయించాలి. పిల్లలైన మీ కోసం బాబాకు కూడా ఒకసారి ఇక్కడకు రావాల్సి ఉంటుంది. స్వర్గ స్థాపన జరుగుతున్నప్పుడు తప్పకుండా నరకము యొక్క వినాశనము జరగాల్సిందే.

శివబాబా బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. మనము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మేము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి వారసత్వాన్ని పొందేందుకు మళ్ళీ బ్రహ్మా ద్వారా శివబాబాకు పిల్లలుగా అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పతిత-పావనుడు అని వారిని అంటారు. వారు నాలెడ్జ్ ఫుల్, జ్ఞాన సాగరుడు కూడా. యోగాన్ని అనగా స్మృతి చేయడాన్ని నేర్పిస్తారు కానీ నిరాకారుడు ఎలా అర్థం చేయించగలరు, అందుకే బ్రహ్మా ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను అనగా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తాను అని అంటారు. ఇప్పుడు ఆ ధర్మము లేదు, మళ్ళీ స్థాపన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వారందరినీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. భారత్ ప్రాచీన ఖండము, అందుకే వాస్తవానికి భారత్ యొక్క జనాభా సంఖ్య అందరికన్నా ఎక్కువ ఉండాలి. ఇటువంటి విషయాలు ఇంకెవరి బుద్ధిలోకి రావు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అన్నింటికన్నా పెద్దగా ఉండాలి. 5 వేల సంవత్సరాల నుండి వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. మిగిలినవారైతే 2500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఆ లెక్కన ఇస్లాముల జనాభా తక్కువ ఉండాలి, మళ్ళీ కొంత సమయము తర్వాత బౌద్ధ ధర్మము వారు వస్తారు, కావున ఇరువురి సంఖ్యలో కొద్దిగా తేడా ఉండాలి. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారు ముందు సతోప్రధానముగా ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా తమోప్రధానముగా అవుతారు. ఇది కూడా ఒక లెక్క. ఎవరైతే అనన్యులైన, తెలివైన పిల్లలు ఉన్నారో, వారు వీటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. చైనీయుల జనాభా సంఖ్య అందరికన్నా ఎక్కువగా ఉందని ఈ రోజుల్లో వ్రాస్తూ ఉంటారు. కానీ వారికి సృష్టి చక్రము యొక్క జ్ఞానమైతే లేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరైతే చదువుకున్నవారు ఉంటారో, వారికి ఈ విషయాలను వివరముగా అర్థం చేయించవలసి ఉంటుంది. దేవీ-దేవతా ధర్మము వారు వచ్చి 5 వేల సంవత్సరాలయ్యింది కావున ఈ సమయములో వారి సంఖ్య చాలా ఎక్కువ ఉండాలి. కానీ దేవీ-దేవతా ధర్మము వారు తర్వాత వేర్వేరు ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మొట్టమొదట చాలామంది ముసల్మానులుగా అయ్యారు, తర్వాత బౌద్ధులుగా కూడా చాలామంది అయ్యారు. ఇక్కడ కూడా బౌద్ధులు చాలామంది ఉన్నారు. క్రిస్టియన్లు అయితే లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ దేవతా ధర్మము యొక్క పేరు కూడా లేదు. ఒకవేళ - మేము బ్రాహ్మణ ధర్మమువారిమని చెప్పినా కూడా, హిందువుల లైన్ లోనే కలిపేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు - బ్రాహ్మణులైన మన ద్వారా, శ్రీమతమనుసారముగా ఆది సనాతనా దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఈ వివేకము కూడా ఉండాలి. ధర్మాలు గాయనమైతే చేయబడతాయి కదా. ఇక్కడి మనుష్యులు స్వయాన్ని హిందువుల లైన్ లో వేసుకుంటారు. హిందూ ధర్మమనేది ఆర్య ధర్మము, అది అన్నింటికన్నా ప్రాచీనమైనదని అంటారు. భారతవాసులు మొదటిలో ఆర్యులుగా (సభ్యత కలవారిగా) ఉండేవారు, చాలా ధనవంతులుగా ఉండేవారు, ఇప్పుడు అనార్యులుగా (సభ్యత లేనివారిగా) అయిపోయారు. కొంచెం కూడా తెలివి లేదు, ఎవరికి ఏది తోస్తే ఆ ధర్మము పేరు పెట్టేస్తారు. వృక్షము చివరి భాగములో చిన్న-చిన్న ఆకులు, కొమ్మలు-రెమ్మలు వెలువడుతాయి. కొత్తవాటికి కొంత గౌరవముంటుంది.

మనము బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కనుక ఇటువంటి వారసత్వాన్ని ఇచ్చే తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మీరు ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో, అంతగా - ఒకటేమో వారసత్వము లభిస్తుంది మరియు మీరు పావనముగా అవుతారు. లౌకిక తండ్రి నుండైతే ధనము యొక్క వారసత్వము లభిస్తుంది. దానితో పాటు పతితముగా అయ్యే వారసత్వము కూడా లభిస్తుంది. అతను లౌకిక తండ్రి, వారు పారలౌకిక తండ్రి మరియు మధ్యలో వీరు అలౌకిక తండ్రి. మధ్యలో ఉన్న వీరిని ఇరువైపులతో జోడించడము జరుగుతుంది. శివబాబాకైతే ఎటువంటి కష్టము ఉండదు కానీ వీరు ఎన్ని నిందలు పడవలసి వస్తుంది. వాస్తవానికి శ్రీకృష్ణుడిని నిందించరు. మధ్యలో చిక్కుకున్నది వీరు. దారిలో వెళ్తూ బ్రాహ్మణుడు చిక్కుకున్నాడని అంటారు కదా. నిందలు పడేందుకు వీరు చిక్కుకున్నారు. అలౌకిక తండ్రే సహనము చేయవలసి ఉంటుంది. శివబాబా వీరిలో ప్రవేశించి పతితులను పావనముగా చేస్తారని అసలు ఎవరికీ తెలియనే తెలియదు. పవిత్రముగా అయ్యే విషయములోనే దెబ్బలు తింటారు. తండ్రి అంటారు - నేను అందరినీ తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. వినాశనమైతే తప్పకుండా జరగాలి. వినాశనము జరగకుండా సుఖ-శాంతులు ఎలా స్థాపనవుతాయి. యుద్ధము ప్రారంభమైనప్పుడు, ఆ యుద్ధము ఆగిపోవాలని మనుష్యులు యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుందని బ్రాహ్మణ కుల భూషణులైన మీకు తెలుసు. లేదంటే స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి. స్వర్గములోకైతే అందరూ రారు. ఎవరైతే పురుషార్థము చేస్తారో, వారే వస్తారు, మిగిలినవారు ముక్తిధామానికి వెళ్తారు. ఈ విషయాలు ఎవరికీ తెలియని కారణముగా ఎంతగా భయపడతారు. శాంతి కోసం ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. సుఖధామము, శాంతిధామము యొక్క స్థాపన ఎలా జరుగుతుంది అనేది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశనము జరగకుండా స్థాపన జరగదు. మీరు ఇప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. ఎవరూ కొట్లాడుకోకుండా ఉండేలా శాంతి ఎలా ఏర్పడుతుందని వారు అడుగుతూ ఉంటారు. ఐక్యత ఉండాలని అందరూ అంటూ ఉంటారు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరములో సోదరులము అనేటువంటి ఒక్క తండ్రి మతాన్నే తీసుకున్నట్లయితే ఐక్యత ఏర్పడుతుంది. ఒక్క తండ్రి పిల్లలము అన్నప్పుడు పరస్పరములో కొట్లాడుకోకూడదు. సత్యయుగములో అలానే ఉండేది. అక్కడ పరస్పరములో ఎవరూ కొట్లాడుకోరు. కానీ అది సత్యయుగము యొక్క విషయము, ఇక్కడున్నది కలియుగము. సత్యయుగములో తప్పకుండా దేవతలు ఉండేవారు, మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారో తెలియదు. కేవలం సత్యయుగములో మాత్రమే ఏక రాజ్యముండేదని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖ-శాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఈ విషయాలన్నీ నంబరువారు పురుషార్థానుసారముగా మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా మనము సత్యయుగములో రాజ్యము చేసేవారమని, చాలా సుఖముండేదని, అద్వైత ధర్మము ఉండేదని అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానము ఎవరికీ లేదు. ఈ సమయములో మీరు నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు. తండ్రి మిమ్మల్ని తమ సమానముగా తయారుచేస్తారు. తండ్రి మహిమ ఏదైతే ఉందో, మీరు కూడా అలాగే తయారవ్వాలి. కేవలం దివ్య దృష్టి యొక్క తాళంచెవి తండ్రి వద్ద ఉంటుంది. తండ్రి చెప్పారు - భక్తి మార్గములో నేను పని చేయవలసి ఉంటుంది, ఎవరు ఎవరిని పూజిస్తారో నేను వారి మనోకామనలను పూర్తి చేస్తాను. ఇక్కడ కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది. అర్జునుడికి వినాశన సాక్షాత్కారము కలిగిందని అంటారు కదా. వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది. విష్ణుపురి కూడా తప్పకుండా స్థాపనవ్వనున్నది. తండ్రి కల్పక్రితం ఎలాగైతే అర్థం చేయించారో, అలాగే కూర్చుని అర్థం చేయిస్తారు. బాబా మనల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. దేవతలుగా అయినప్పుడు, ఆసురీ సృష్టి యొక్క వినాశనము తప్పకుండా జరుగుతుంది. నలువైపులా హాహాకారాలు జరగనున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించనున్నాయని, కుండపోత వర్షాలు కురవనున్నాయని బుద్ధి అర్థం చేసుకోగలదు. ఇదంతా వినాశనమైనప్పుడే సత్యయుగ స్థాపన జరుగుతుంది. భూమికి 5 తత్వాల ఎరువు కూడా లభిస్తుంది. ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. తండ్రి అంటారు, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో ఇదంతా స్వాహా అయిపోతుంది. భక్తి మార్గములో రుద్ర యజ్ఞాలను ఎలా రచిస్తారో చూడండి. శివబాబా లింగాన్ని మరియు అనేక చిన్న-చిన్న సాలిగ్రామాలను ఎన్నో తయారుచేసి, పూజించి, వాటిని సమాప్తము చేసేస్తారు. అలా రోజూ తయారుచేస్తారు, పూజించిన తర్వాత సమాప్తము చేసేస్తారు. శివబాబాతో పాటు ఎవరైతే సేవ చేసారో వారికి కూడా ఈ విధముగా చేస్తారు. రావణుడి విషయములో చూడండి, ప్రతి సంవత్సరము దిష్టిబొమ్మను తయారుచేసి దానిని కాలుస్తారు. శత్రువు దిష్టిబొమ్మనైతే ఒకటి-రెండు సార్లు తయారుచేసి కాలుస్తారు, అంతేకానీ ప్రతి సంవత్సరము కాల్చే నియమము పెట్టుకోరు. ఒక్కసారే కోపాన్ని తీర్చేసుకుంటారు. రావణుడినైతే ప్రతి సంవత్సరము కాలుస్తారు. దీని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇంకా, రావణుడు సీతను అపహరించాడని అంటారు, దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. విదేశీయులు ఏమి అర్థం చేసుకుంటారు, ఏమీ అర్థం చేసుకోరు. రోజురోజుకు రావణుడిని పెద్దగా తయారుచేస్తూ ఉంటారు, ఎందుకంటే రావణుడు చాలా దుఃఖాన్ని ఇచ్చేటటువంటివాడు. ఇప్పుడు మీరు అతనిపై విజయము పొందుతారు. సత్యయుగములో రావణుడు ఉండనే ఉండడు. ఈ కర్మభోగము, అనారోగ్యము మొదలైనవన్నీ రావణుడి కారణముగానే కలుగుతాయి. రావణుడు ప్రవేశించిన కారణముగా మనుష్యులు ఏ కర్మలు చేసినా, అవి వికర్మలుగా అయిపోతాయి. ఈ సుఖ-దుఃఖాల ఆట తయారుచేయబడింది. ఈ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవరికీ తెలియదు. లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యము ఎలా లభించింది? అది ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగములో రాజ్యము చేసేవారని చిన్న-చిన్న పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు. వారు సంగమములో ఈ రాజయోగాన్ని నేర్చుకుని ఈ పదవిని పొందారు. బిర్లా వద్దకు కూడా చిన్న-చిన్న కుమార్తెలు వెళ్ళి, లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది అర్థం చేయించాలి. ఇప్పుడిది కలియుగము, దీనిని సత్యయుగమని అనరు. రాజ్యమైతే ఇప్పుడు లేదు. రాజుల కిరీటాలనే తొలగించేసారు. ధర్మ శాస్త్రాలు కేవలం నాలుగు ఉన్నాయి. గీత ధర్మ శాస్త్రము, దాని నుండి మూడు ధర్మాలు ఇప్పుడు స్థాపనవుతాయి, సత్యయుగములో కాదు. లక్ష్మీ-నారాయణులు లేక రాముడు ధర్మ స్థాపన చేసారని కాదు. ఈ ధర్మాలను ఇప్పుడు స్థాపన చేస్తున్నారు, ఆ తర్వాత ఇస్లాముల ధర్మము, బౌద్ధ ధర్మము మరియు క్రిస్టియన్ ధర్మము వస్తాయి. క్రిస్టియన్లకు ఒకే ఒక ధర్మ శాస్త్రము ఉంది, బైబిల్, అంతే. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆది సనాతనమైనది దేవతా ధర్మమే, ఇప్పుడు మళ్ళీ దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మీరు డ్రామా రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. మీకు సంతోషము కూడా ఉంటుంది. మేము మళ్ళీ మా రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు 100 శాతం నిశ్చయముంది, ఇందులో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. రాజధాని స్థాపనవుతోంది, ఇది నిశ్చితము. మృత్యువు ఎంత నిశ్చితమో, ఇది కూడా అంతే నిశ్చితము. మనము మళ్ళీ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కల్ప-కల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఎంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమను స్వయంలో అలవరచుకోవాలి. తండ్రి సమానముగా మహిమా యోగ్యులుగా అవ్వాలి. పారలౌకిక తండ్రి నుండి పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. పవిత్రముగా అవ్వడముతోనే స్వర్గ వారసత్వము లభిస్తుంది.

2. శ్రీమతాన్ని అనుసరిస్తూ తమ తనువు, మనసు, ధనముల ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి.

వరదానము:-
పాత సంస్కారాల రూపీ అస్థికలను సంపూర్ణ స్థితి రూపీ సాగరములో కలిపివేసే సమాన మరియు సంపూర్ణ భవ

బాబా సమానముగా మరియు సంపూర్ణముగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే మీ బలహీనతలను మరియు లోపాలను సమాప్తము చేయండి. ఎటువంటి చిక్కుల యొక్క నామ-రూపాలు కూడా ఉండకూడదు. ఈ విధముగా మిమ్మల్ని మీరు ఉజ్వలముగా తయారుచేసుకోండి. ఏ విధముగా జన్మ పరివర్తన అయిన తర్వాత పాత జన్మ యొక్క విషయాలను మర్చిపోతారో, అలా పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మము చేయండి. అస్థికలను కూడా సంపూర్ణ స్థితి రూపీ సాగరములో ముంచేయండి, అప్పుడు సమానమైన మరియు సంపూర్ణమైనవారు అని అంటారు.

స్లోగన్:-
విస్తారాన్ని సారములో ఇమిడ్చివేసే ఇంద్రజాలాన్ని నేర్చుకున్నట్లయితే బాబా సమానముగా అయిపోతారు.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

సహనశీలత కలవారు బాహ్య వైబ్రేషన్లకే కాకుండా, మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలను చూసి కూడా గాభరాపడరు. తమ సహనశీలతతో ఎదుర్కుంటారు మరియు ముఖము ద్వారా సదా సంతుష్టముగా మరియు ప్రసన్నచిత్తులుగా కనిపిస్తారు. వారి నయనాలలో మరియు హావభావాలలో ఎప్పుడూ అసంతుష్టత కనిపించదు. వారు సంతుష్టమణులుగా ఉన్న కారణముగా సదా హర్షితముగా ఉంటారు.