ఓంశాంతి
పిల్లలు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? నడుస్తూ-తిరుగుతూ మరియు ఇక్కడ
కూర్చుని-కూర్చునే జన్మజన్మాంతరాల పాపాలు ఏవైతే శిరస్సుపై ఉన్నాయో, ఆ పాపాలను
స్మృతియాత్రతో వినాశనం చేసుకుంటున్నారు. మనం ఎంతగా తండ్రిని స్మృతి చేస్తామో, అంతగా
పాపాలు తొలగుతూ ఉంటాయని ఆత్మకు తెలుసు. తండ్రి అయితే మంచి రీతిలో అర్థం చేయించారు -
ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ, శ్రీమతంపై నడిచేవారు ఎవరైతే ఉన్నారో, వారికైతే తండ్రి
సలహా మంచిగానే అనిపిస్తుంది. అనంతమైన తండ్రి సలహా లభిస్తుంది, అనంతమైన పవిత్రులుగా
అవ్వాలి. అనంతమైన పవిత్రులుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, ఆ విధంగా స్మృతి
యాత్ర ద్వారానే అవుతారు. కొందరైతే ఏ మాత్రమూ స్మృతి చేయలేరు, కొందరేమో - మేము స్మృతి
యాత్రతో మా పాపాలను తొలగించుకుంటున్నాము అనగా మా కళ్యాణాన్ని చేసుకుంటున్నాము అని
భావిస్తారు. బయటివారికైతే ఈ విషయాల గురించి తెలియదు. మీకే తండ్రి లభించారు, మీరు
తండ్రి వద్దనే ఉంటారు. మీకు తెలుసు - ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానంగా అయ్యాము,
ఇంతకుముందు అసురీ సంతానముగా ఉండేవారము. ఇప్పుడు మన సాంగత్యము ఈశ్వరీయ సంతానముతో ఉంది.
సత్యమైన సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అన్న గాయనము
కూడా ఉంది కదా. మేము ఈశ్వరీయ సంతానము కావున మేము ఈశ్వరీయ మతంపైనే నడవాలి, అంతేకానీ
మా మన్మతముపై నడవకూడదు అని పిల్లలు ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు. మన్మతము అని మనుష్య
మతాన్ని అంటారు. మనుష్య మతము అసురీగానే ఉంటుంది. ఏ పిల్లలైతే తమ కళ్యాణాన్ని
కోరుకుంటారో, వారు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని మంచి రీతిలో స్మృతి చేస్తూ
ఉంటారు. సతోప్రధానంగా ఉన్నవారి మహిమ కూడా జరుగుతుంది. వారికి తెలుసు - మేము
నంబరువారుగా సుఖధామానికి యజమానులుగా అవుతాము అని. ఎంతెంతగా శ్రీమతంపై నడుస్తారో,
అంతగా ఉన్నత పదవిని పొందుతారు, ఎంతగా స్వయం యొక్క మతముపై నడుస్తారో, అంతగా పదవి
భ్రష్టమైపోతుంది. తమ కళ్యాణము చేసుకునేందుకు తండ్రి డైరెక్షన్లు అయితే లభిస్తూనే
ఉంటాయి. బాబా అర్థం చేయించారు - ఇది కూడా పురుషార్థమే, ఎవరెంతగా స్మృతి చేస్తారో,
అంతగా వారి పాపాలు కూడా అంతమవుతాయి. స్మృతియాత్ర లేకుండానైతే పవిత్రంగా అవ్వలేరు.
లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ ఇదే చింత ఉంచుకోవాలి. పిల్లలైన మీకు ఎన్ని సంవత్సరాలుగా
శిక్షణ లభిస్తుంది, అయినా కానీ - మేము ఇంకా ఎంతో దూరంగా ఉన్నాము, అంతగా తండ్రిని
స్మృతి చేయలేకపోతున్నాము అని భావిస్తారు. సతోప్రధానంగా అవ్వడానికైతే ఎంతో సమయం
పట్టేస్తుంది. ఈ మధ్యలో శరీరము వదిలేస్తే కల్ప-కల్పాంతరాల కొరకు పదవి తగ్గిపోతుంది.
ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారు కావున వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే
పురుషార్థం చేయాలి. బుద్ధి ఒకవైపే ఉండాలి. మీకు ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. వారు
ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారి మతంపై నడుచుకోకపోతే ఎంతో మోసపోతారు. మీరు వారి మతంపై
నడుస్తున్నారా లేదా అన్నది మీకు తెలియాలి, శివబాబాకు తెలియాలి. మీ చేత పురుషార్థం
చేయించేవారు ఆ శివబాబా. దేహధారులందరూ పురుషార్థం చేస్తారు. వీరు కూడా దేహధారియే,
వీరి చేత శివబాబా పురుషార్థం చేయిస్తారు. పిల్లలే పురుషార్థం చేయాలి. ముఖ్యమైన
విషయము - పతితులను పావనంగా తయారుచేయడము. ఆ మాటకొస్తే ప్రపంచములో పావనమైనవారు
ఎంతోమంది ఉంటారు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు. వారైతే ఒక్క జన్మ కొరకు పావనంగా
అవుతారు. ఈ జన్మలో బాల బ్రహ్మచారులుగా ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. వారేమీ
ప్రపంచానికి పవిత్రతా సహాయాన్ని అందించలేరు. ఎప్పుడైతే శ్రీమతం అనుసారంగా పావనంగా
అవుతారో మరియు ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారో, అప్పుడే సహాయం లభిస్తుంది.
ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది. జన్మ-జన్మాంతరాలూ మీరు అసురీ మతంపై నడిచారు.
సుఖధామం యొక్క స్థాపన జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఎంతగా మనం శ్రీమతం అనుసారంగా
పురుషార్థం చేస్తామో, అంతగా ఉన్నత పదవిని పొందుతాము. ఇది బ్రహ్మా యొక్క మతము కాదు.
వీరు పురుషార్థీ. వీరి పురుషార్థం తప్పకుండా ఎంతో ఉన్నతమైనది, అందుకే కదా
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. కావున పిల్లలు దీనిని ఫాలో చేయాలి. శ్రీమతంపై నడవాల్సి
ఉంటుంది, మన్మతముపై కాదు. మన ఆత్మా జ్యోతిని మేల్కొలపాలి. ఇప్పుడు దీపావళి వస్తుంది,
సత్యయుగంలో దీపావళి జరగదు. కేవలం పట్టాభిషేకం జరుగుతుంది. ఇకపోతే ఆత్మలైతే
సతోప్రధానంగా అవుతాయి. ఇక్కడ ఏ దీపావళినైతే జరుపుతారో, అది అసత్యమైనది. బాహ్యంగా
దీపాలను వెలిగిస్తారు, అక్కడైతే ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగి ఉంటుంది అనగా అందరి
ఆత్మ సతోప్రధానంగా ఉంటుంది. 21 జన్మల కొరకు జ్ఞానమనే తైలం పడుతుంది. ఆ తర్వాత
నెమ్మది-నెమ్మదిగా తగ్గుతూ-తగ్గుతూ ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క జ్యోతి ఆరిపోయి
ఉంది. అందులోనూ విశేషంగా భారతవాసులది మరియు మొత్తం ప్రపంచం యొక్క జ్యోతి ఆరిపోయి
ఉంది. ఇప్పుడైతే అందరూ పాపాత్ములే, ఇది అందరి వినాశన సమయము, అందరూ లెక్కాచారాలను
సమాప్తం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు
పురుషార్థం చేయాలి, అది శ్రీమతంపై నడవడం ద్వారానే పొందగలరు. రావణ రాజ్యంలోనైతే
శివబాబా ఆజ్ఞను ఎంతగానో ఉల్లంఘించారు. ఇక ఇప్పుడు కూడా వారి ఆజ్ఞపై నడుచుకోకపోతే
ఎంతో మోసపోతారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని వారినే పిలిచారు. కావున
ఇప్పుడు మీ కళ్యాణాన్ని చేసుకునేందుకు శివబాబా యొక్క శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది.
లేకపోతే ఎంతో అకళ్యాణము జరుగుతుంది. మధురాతి-మధురమైన పిల్లలకు ఇది కూడా తెలుసు -
శివబాబా స్మృతి లేకుండా మనం సంపూర్ణ పావనులుగా అవ్వలేము. మీరు వచ్చి ఇన్ని
సంవత్సరాలు అయినప్పటికీ జ్ఞాన ధారణ ఎందుకు జరగడం లేదు. బంగారు పాత్రలోనే ధారణ
జరుగుతుంది. కొత్త-కొత్త పిల్లలు ఎంతగా సేవాధారులుగా తయారవుతూ ఉంటారు. తేడా ఎంత ఉందో
చూడండి. ఎంతైతే కొత్త పిల్లలు స్మృతిలో ఉంటారో, అంతగా పాత పిల్లలు స్మృతియాత్రలో
ఉండరు. కొందరు శివబాబా యొక్క మంచి, ప్రియమైన పిల్లలు వస్తారు, వారు ఎంతగా సేవ
చేస్తారు. వారు శివబాబాపై తమ ఆత్మను బలిహారం చేసేసినట్లుగా ఉంటారు. బలిహారం
చేసినందుకు ఇక సేవ కూడా ఎంతగా చేస్తారు. వారు ఎంత ప్రియముగా, మధురంగా అనిపిస్తారు.
స్మృతియాత్రలో ఉండడం ద్వారానే తండ్రికి సహాయం చేస్తారు. తండ్రి అంటారు - నన్ను
స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. మీరు వచ్చి నన్ను పావనంగా చేయండి అనే
పిలిచారు, కావున తండ్రి అంటారు - నన్ను స్మృతి చేస్తూ ఉండండి. దేహ సంబంధాలన్నింటినీ
త్యజించాల్సి ఉంటుంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవ్వరి
స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్మృతి చేయకపోతే ఉన్నత
పదవిని పొందలేరు. ఇది బాప్ దాదా కూడా అర్థం చేసుకోగలరు. అలాగే పిల్లలైన మీకు కూడా
తెలుసు. కొత్త-కొత్తవారు వస్తారు, అర్థం చేసుకుంటారు, రోజు-రోజుకూ బాగవుతూ ఉంటారు.
శ్రీమతంపై నడవడం ద్వారానే బాగవుతారు. క్రోధంపై కూడా పురుషార్థం చేస్తూ-చేస్తూ
విజయాన్ని పొందుతారు. కావున తండ్రి కూడా అర్థం చేయిస్తారు - లోపాలను తొలగించుకుంటూ
ఉండండి. క్రోధము కూడా చాలా చెడ్డది. దాని వలన స్వయాన్ని ఆంతరికంగా కూడా
కాల్చుకుంటారు, అలాగే ఇతరులను కూడా కాలుస్తారు. అది కూడా తొలగిపోవాలి. పిల్లలు
తండ్రి శ్రీమతంపై నడవకపోతే పదవి తగ్గిపోతుంది, మరియు జన్మ-జన్మాంతరాలు,
కల్ప-కల్పాంతరాల కొరకు నష్టం కలుగుతుంది.
పిల్లలైన మీకు తెలుసు - అది స్థూల చదువు, ఇది ఆత్మిక చదువు, దీనిని ఆత్మిక తండ్రి
చదివిస్తారు. అన్ని విధాలుగా సంభాళన కూడా జరుగుతూ ఉంటుంది. వికారులు ఎవ్వరూ ఇక్కడికి
(మధుబన్ కు) రాలేరు. అనారోగ్యంలో కూడా వికారీ మిత్ర-సంబంధీకులు రావడము, అది మంచిది
కాదు. అది మనకు ఇష్టమనిపించకూడదు కూడా. లేకపోతే అంతిమ సమయంలో ఆ మిత్ర-సంబంధీకులే
గుర్తుకొస్తారు. అటువంటప్పుడు వారు ఉన్నత పదవిని పొందలేరు. తండ్రి అయితే పురుషార్థం
చేయిస్తారు, ఎవ్వరి స్మృతీ రాకూడదు. మేము అనారోగ్యంగా ఉన్నాము కావున
మిత్ర-సంబంధీకులు మొదలైనవారు చూడటానికి రావాలి అని కూడా భావించకూడదు. లేదు, అలా
వారిని పిలవడము అనేది నియమం కాదు. నియమానుసారంగా నడుచుకున్నట్లయితేనే సద్గతి
లభిస్తుంది. లేకపోతే అనవసరంగా తమను తాము నష్టపర్చుకుంటారు. కానీ తమోప్రధాన బుద్ధి
కలవారు ఇది అర్థం చేసుకోరు. ఈశ్వరుడు సలహా ఇచ్చినా కానీ బాగుపడరు. చాలా జాగ్రత్తగా
నడుచుకోవాలి. ఇది పవిత్రాతి పవిత్రమైన స్థానము. ఇక్కడ పతితులు నిలవలేరు.
మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తున్నట్లయితే మరణించే సమయంలో కూడా తప్పకుండా వారు
గుర్తుకొస్తారు. దేహాభిమానంలోకి రావడంతో తమను తామే నష్టపర్చుకుంటారు. శిక్షకు
పాత్రులుగా అవుతారు. శ్రీమతంపై నడవకపోతే ఎంతో దుర్గతి జరుగుతుంది. సేవకు యోగ్యులుగా
అవ్వలేకపోతారు. ఎంతగా కష్టపడినా కానీ వారు సేవకు యోగ్యులుగా అవ్వలేరు. ఆజ్ఞను
ఉల్లంఘించినట్లయితే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. పైకి ఎక్కేందుకు బదులుగా కిందకు
పడిపోతారు. తండ్రి అంటారు - పిల్లలు ఆజ్ఞాకారులుగా అవ్వాలి. లేకపోతే పదవి
భ్రష్టమైపోతుంది. లౌకిక తండ్రి వద్ద కూడా నలుగురు, ఐదుగురు పిల్లలు ఉంటారు, కానీ
వారిలో కూడా ఎవరైతే ఆజ్ఞాకారులుగా ఉంటారో, ఆ పిల్లలే ప్రియమనిపిస్తారు. ఎవరైతే
ఆజ్ఞాకారులు కారో, వారు దుఃఖాన్నే ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఇద్దరు తండ్రులూ
చాలా గొప్పవారు లభించారు, వారి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు. ఉల్లంఘించినట్లయితే
జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు చాలా తక్కువ పదవిని పొందుతారు. పురుషార్థం ఎలా
చేయాలంటే అంతిమ సమయంలో ఒక్క శివబాబాయే గుర్తుకురావాలి. తండ్రి అంటారు - ప్రతి ఒక్కరూ
ఏ పురుషార్థం చేస్తారు అనేది నేను తెలుసుకోగలను. కొందరైతే చాలా తక్కువగా స్మృతి
చేస్తారు, మిగిలినవారైతే తమ మిత్ర-సంబంధీకులనే స్మృతి చేస్తూ ఉంటారు. వారు అంతటి
సంతోషంలో ఉండలేరు. ఉన్నత పదవిని పొందలేరు.
మీకైతే ప్రతి రోజూ సద్గురువారమే. సద్గురువారం రోజు కాలేజీలో కూర్చోబెడతారు. అది
స్థూలమైన విద్య. ఇది ఆత్మిక విద్య. మీకు తెలుసు - శివబాబా మనకు తండ్రి, టీచర్,
సద్గురువు. కావున వారి డైరెక్షన్ పై నడుచుకోవాలి, అప్పుడే ఉన్నత పదవిని
పొందగలుగుతారు. పురుషార్థులు ఎవరైతే ఉంటారో, వారికి లోపల ఎంతో సంతోషం ఉంటుంది.
చెప్పలేనంత సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నట్లయితే ఇతరులను కూడా సంతోషపరిచే పురుషార్థము
చేస్తారు. కుమార్తెలు చూడండి, రాత్రింబవళ్ళు ఎంత కృషి చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది
అద్భుతమైన జ్ఞానం కదా. కొంతమంది పిల్లలు వివేకహీనత కారణంగా ఎంతగా నష్టపోతూ ఉంటారు
అని బాప్ దాదాకు దయ కలుగుతుంది. దేహాభిమానంలోకి వచ్చి లోలోపల ఎంతగానో కాలిపోతూ
ఉంటారు. క్రోధంలో మనుష్యులు రాగి లాగ ఎర్రగా అయిపోతారు. క్రోధం మనుష్యులను
కాల్చేస్తుంది, కామము నల్లగా చేస్తుంది. మోహము మరియు లోభము వలన అంతగా కాలిపోరు.
క్రోధంలో కాలిపోతారు. క్రోధమనే భూతము అనేకులలో ఉంది. ఎంతగా గొడవపడుతూ ఉంటారు. అలా
గొడవపడడం వలన తమను తామే నష్టపర్చుకుంటారు. నిరాకారుడిని, సాకారుడిని, ఇరువురి ఆజ్ఞను
ఉల్లంఘిస్తారు. అటువంటివారిని కుపుత్రులు అని తండ్రి భావిస్తారు. కృషి చేస్తే ఉన్నత
పదవిని పొందుతారు. స్వ కళ్యాణము కొరకు అన్ని సంబంధాలనూ మర్చిపోవాలి. ఒక్క తండ్రిని
తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. ఇంట్లో ఉంటూ, సంబంధీకులను చూస్తూ శివబాబాను
స్మృతి చేయాలి. మీరు సంగమయుగంలో ఉన్నారు, ఇప్పుడు మీ కొత్త ఇంటిని, శాంతిధామాన్ని
స్మృతి చేయండి.
ఇది అనంతమైన చదువు కదా. తండ్రి శిక్షణను ఇస్తారు, ఇందులో పిల్లలకే లాభం ఉంది.
కొంతమంది పిల్లలు తమ నియమవిరుద్ధమైన నడవడిక వలన అనవసరంగా తమను తాము నష్టపర్చుకుంటారు.
విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తారు కానీ మాయా పిల్లి బాబా
చెప్పినట్లు విననివ్వదు, బాబా చెప్పినట్లు చేయనివ్వదు. జన్మ తీసుకున్నారు, మేము ఈ
పదవిని పొందుతాము అని అంటారు కానీ మాయా పిల్లి దానిని తీసుకోనివ్వదు, కావున పదవి
భ్రష్టమైపోతుంది. మాయ ఎంతో తీవ్రంగా దాడి చేస్తుంది. మీరు ఇక్కడికి రాజ్యాన్ని
తీసుకోవడానికి వస్తారు. కానీ మాయ హైరానా పరుస్తుంది. పాపం వీరు ఉన్నత పదవిని పొందితే
బాగుంటుంది అని తండ్రికి దయ కలుగుతుంది. నన్ను నిందింపజేసేవారిగా అవ్వకూడదు.
సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు. ఎవరి
నింద? శివబాబా యొక్క నింద. తండ్రిని నిందింపజేసే విధంగా నడవడిక ఉండకూడదు, ఇందులో
అహంకారం విషయమేమీ లేదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.