27-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ శ్మశానవాటికను పరిస్తాన్ గా తయారుచేస్తున్నారు, అందుకే మీకు ఈ పాత ప్రపంచము, శ్మశానవాటిక పట్ల పూర్తి వైరాగ్యము ఉండాలి’’

ప్రశ్న:-
అనంతమైన తండ్రి తన ఆత్మిక పిల్లలకు అద్భుతమైన సేవకుడు, ఎలా?

జవాబు:-
బాబా అంటారు - పిల్లలూ, నేను మీ చాకలిని, నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక మొత్తం ప్రపంచము యొక్క ఛీ-ఛీ అశుద్ధమైన వస్త్రాలను క్షణములో శుభ్రము చేసేస్తాను. ఆత్మ రూపీ వస్త్రము స్వచ్ఛముగా అయినట్లయితే శరీరము కూడా శుద్ధమైనది లభిస్తుంది. వారు ఎటువంటి అద్భుతమైన సేవకుడంటే, మన్మనాభవ అనే మంత్రముతో అందరినీ క్షణములో శుభ్రము చేసేస్తారు.

ఓంశాంతి
ఓం శాంతి యొక్క అర్థాన్ని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మనైన నా స్వధర్మము శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు ఏ పురుషార్థమూ చేయవలసిన అవసరము ఉండదు. ఆత్మ స్వయమే శాంతి స్వరూపము, శాంతిధామ నివాసి. అయితే, కొద్ది సమయము కోసం శాంతిగా ఉండగలదు. ఆత్మ అంటుంది - నేను కర్మేంద్రియాల భారముతో అలసిపోయాను, నేను నా స్వధర్మములో స్థితి అవుతాను, శరీరము నుండి వేరవుతాను. కానీ కర్మలైతే చేయవలసిందే. శాంతిలో ఎంతసేపని కూర్చుని ఉంటారు. ఆత్మ అంటుంది - నేను శాంతిదేశ నివాసిని, కేవలం ఇక్కడ శరీరములోకి రావడముతో నేను టాకీగా అయ్యాను, ఆత్మనైన నేను అవినాశీ, నా శరీరము వినాశీ. ఆత్మ పావనముగా మరియు పతితముగా అవుతుంది. సత్యయుగములో 5 తత్వాలు కూడా సతోప్రధానముగా ఉంటాయి, ఇక్కడ 5 తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి. బంగారములో మాలిన్యము చేరడముతో బంగారము పతితముగా అయిపోతుంది, దానిని శుభ్రము చేయడానికి అగ్నిలో వేయడము జరుగుతుంది. ఇక్కడ దీని పేరు యోగాగ్ని. ప్రపంచములోనైతే అనేక రకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. వాటిని యోగాగ్ని అని అనరు. దేనితోనైతే పాపాలు భస్మమవుతాయో, దానిని యోగాగ్ని అని అంటారు. ఆత్మను పతితము నుండి పావనముగా చేసేవారు పరమాత్మ. ఓ పతిత-పావనా రండి అని వారిని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ పతితముగా, తమోప్రధానముగా అవ్వాల్సిందే. ఇది ఒక వృక్షము, దీని బీజరూపుడు పైన ఉన్నారు. తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఎవరి నుండైతే మీరు వారసత్వము తీసుకుంటున్నారో, వారు ఇప్పుడు కిందకు వచ్చి ఉన్నారు. నేను రావలసి ఉంటుంది అని వారు అంటారు. మనుష్య సృష్టి రూపీ వృక్షము ఏదైతే ఉందో, అది అనేక వెరైటీ ధర్మాల వృక్షము, అది ఇప్పుడు తమోప్రధానముగా, పతితముగా ఉంది, శిథిలావస్థను చేరుకుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యయుగములో దేవతలు ఉన్నారు, కలియుగములో అసురులు ఉన్నారు. ఇకపోతే అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధము జరగలేదు. మీరు ఈ ఆసురీ పంచ వికారాలపై యోగబలముతో విజయము పొందుతారు. అంతేకానీ హింసాత్మక యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు ఏ రకమైన హింస చేయరు, ఎప్పుడూ ఎవరిపైనా చేయి చేసుకోరు. మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, ఇది అన్నింటికన్నా పెద్ద పాపము. తండ్రి అంటారు, ఈ కామ ఖడ్గము ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుంది, వికారాల్లోకి వెళ్ళకూడదు. మీరు సర్వ గుణ సంపన్నులు... అని దేవతల ఎదురుగా మహిమను పాడుతారు కదా. ఆత్మ - నేను పతితముగా అయ్యాను అని అంటుంది, అందుకే ఓ పతిత-పావనా రండి అని పిలుస్తుంది. పావనముగా ఉన్నప్పుడు ఎవ్వరినీ పిలవరు. దానిని స్వర్గమని అంటారు. ఇక్కడ సాధు-సన్యాసులు మొదలైనవారు - ఓ పతిత-పావన సీతారామ అని ఎంతగా జపం చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా పతితముగా ఉంది, ఇందులో కూడా ఎవరి దోషమూ లేదు. ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది. నేను వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాల్సిందే. జ్ఞానము మరియు భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము. ఇక్కడ ఉన్నది అనంతమైన వైరాగ్యము. వారిది హద్దు వైరాగ్యము.

ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు పాత ఇంటి పట్ల వైరాగ్యము కలుగుతుంది కదా. అనంతమైన తండ్రి అంటారు, ఇప్పుడు మీకు స్వర్గము రూపీ ఇంటిని నిర్మించి ఇస్తాను. ఇప్పుడిది నరకము. స్వర్గము కొత్త ప్రపంచము. నరకము పాత ప్రపంచము. ఇప్పుడు పాత ప్రపంచములో ఉంటూ మనము కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నాము. పాత శ్మశానవాటికపై మనము పరిస్తాన్ ను తయారుచేస్తాము. ఇదే యమునా నది తీరము ఉంటుంది, దీనిపై మహళ్ళు తయారవుతాయి. ఇదే ఢిల్లీ, ఇదే యమునా నది మొదలైనవి ఉంటాయి, ఇకపోతే, పాండవుల కోటలు ఉండేవి అని ఏదైతే చూపిస్తారో, అవన్నీ కల్పితమైన కథలు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఇవి మళ్ళీ తప్పకుండా తయారవుతాయి. ఏ విధముగా మీరు యజ్ఞ-తపాదులు, దానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, వాటిని మళ్ళీ చేయవలసి ఉంటుంది. మొదట మీరు శివుని భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ ఆలయాలు నిర్మిస్తారు, దానిని అవ్యభిచారీ భక్తి అని అంటారు.

ఇప్పుడు మీరు జ్ఞాన మార్గములో ఉన్నారు. ఇది అవ్యభిచారీ జ్ఞానము. ఒక్క శివబాబా నుండే మీరు వింటారు. మొట్టమొదట మీరు వారి భక్తినే ప్రారంభించారు. ఆ సమయములో (స్వర్గములో) వేరే ఏ ధర్మాలు ఉండవు, మీరు మాత్రమే ఉంటారు, మీరు చాలా సుఖముగా ఉంటారు. దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది, ఆ పేరు తీసుకోవడముతోనే నోరు తీపి అవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండే జ్ఞానాన్ని వింటారు. తండ్రి అంటారు, ఇతరులెవ్వరి నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారీ జ్ఞానము. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది, నంబరువారు పురుషార్థానుసారముగా. తండ్రి కూడా కొంత సమయము కోసమే సాకారములోకి వచ్చి ఉన్నారు. బాబా అంటారు - నేనే పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వాలి, నాకు నాదంటూ శరీరము లేదు, నేను వీరిలో ప్రవేశిస్తాను. శివజయంతి జరిగిన వెంటనే గీతా జయంతి జరుగుతుంది, అప్పటినుండే జ్ఞానము ప్రారంభమవుతుంది. ఈ ఆత్మిక విద్యను మీకు సుప్రీమ్ ఆత్మయే ఇస్తున్నారు. ఇది నీటి విషయము కాదు, నీటిని జ్ఞానమని అనరు. పతితము నుండి పావనముగా జ్ఞానముతో అవుతారు, నీటితో పావనముగా అవ్వరు. నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడైతే జ్ఞానసాగరుడైన తండ్రి వస్తారు, వీరిలో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు, వారి నోటిలో గంగా జలము వేస్తారు. ఈ జలము పతితము నుండి పావనముగా చేస్తుంది కనుక స్వర్గములోకి వెళ్ళిపోతారని భావిస్తారు. ఇక్కడ కూడా గోముఖము వద్దకు వెళ్తారు. వాస్తవానికి మీరే చైతన్యమైన గోముఖాలు, మీ నోటి నుండి జ్ఞానామృతము వెలువడుతుంది. గోవు నుండి పాలు లభిస్తాయి, అంతేకానీ నీటి విషయము కాదు. ఇది ఇప్పుడు మీకు తెలిసింది. డ్రామాలో ఏదైతే ఒక్కసారి జరిగిందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత జరుగుతుందని మీకు తెలుసు, యథావిధిగా రిపీట్ అవుతుంది. దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, వారు సర్వుల సద్గతిదాత. ఇప్పుడైతే అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది ఇంతకుముందు మీకు తెలియదు. అనంతమైన దసరా జరగనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మొత్తం సృష్టిపై రావణ రాజ్యము ఉంది కదా. ఈ మొత్తం పృథ్వి అంతా లంకయే. రావణుడు కేవలం హద్దు వరకే ఉండడు, రావణ రాజ్యము మొత్తము సృష్టిపై ఉంది. భక్తి కూడా అర్ధకల్పము కొనసాగుతుంది. మొదట అవ్యభిచారీ భక్తి ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారీ భక్తి ప్రారంభమవుతుంది. దసరా, రక్షాబంధన్ మొదలైనవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపనవుతుంది. ఈ రోజు కంసపురిలో ఉన్నారు, రేపు కృష్ణపురిలో ఉంటారు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండరు కదా, శ్రీకృష్ణుడు జన్మ తీసుకునేది సత్యయుగములోనే. వారు మొదటి రాకుమారుడు. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తారు, ఆ తర్వాత పెద్దవారయ్యాక సింహాసనానికి యజమానిగా అవుతారు. అయితే, ఈ రాసలీల మొదలైనవేమిటంటే పరస్పరము సంతోషముగా జరుపుకోవడము. ఇకపోతే, శ్రీకృష్ణుడు కూర్చుని ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడము అనేది ఎలా జరుగుతుంది. మొత్తము మహిమంతా ఒక్క శివబాబాదే, వారు పతితులను పావనముగా చేస్తారు. మీరు ఎవరైనా పెద్ద ఆఫీసర్లకు అర్థం చేయించినప్పుడు, మీరు రైట్ చెప్తున్నారని వారంటారు, కానీ వారు ఇంకెవ్వరికీ వినిపించలేరు, వారి మాటను ఎవరూ వినరు. వారు బి.కె.లుగా అయ్యారంటే, వారికి గారడి జరిగిందని అందరూ అనుకుంటారు. బి.కె.ల పేరు వింటే చాలు, వీరు గారడి చేస్తారని అనుకుంటారు. ఎవరికైనా కొద్దిగా జ్ఞానము ఇచ్చినా, ఈ బి.కె.లు గారడి చేస్తారని అనేస్తారు. వీరు తమ దాదాను తప్ప ఇంకెవ్వరినీ నమ్మరు, భక్తి మొదలైనవి ఏమీ చేయరు అని అంటారు. బాబా అయితే అంటారు - భక్తి చేయవద్దు అని ఎవరినీ ఆపకండి, వారంతట వారే ఆపేస్తారు. మీరు భక్తిని వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు అని దీని గురించే హంగామాలు జరుగుతాయి.

తండ్రి అన్నారు, నేను రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులో ఆసురీ సాంప్రదాయము వారి విఘ్నాలు కలుగుతాయి. ఇది శివబాబా యొక్క అనంతమైన యజ్ఞము, ఇందులో మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యిందని అంటూ ఉంటారు కూడా. ఎప్పుడైతే పాత ప్రపంచము వినాశనమవుతుందో, అప్పుడు మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. మనుష్యులు అంటారు - మేము శాంతి ఏర్పడాలని అంటాము కానీ ఈ బి.కె.లు వినాశనము జరగాలని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహా అయిపోతుంది. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశనమైతే జరగాల్సిందే. మనుష్యులందరూ ఆవగింజల వలె నలిగిపోయి అంతమైపోతారు, ఇకపోతే ఆత్మలు మిగులుతాయి. ఆత్మ అవినాశీ అని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది, అందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలు పవిత్రముగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వస్తువులు శుద్ధమవుతాయి కదా, శుద్ధత కోసమే హోమము చేస్తారు. అవన్నీ భౌతిక విషయాలు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. వినాశనానికి ముందే తప్పకుండా స్థాపన జరగాలి. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు, మొదట స్థాపన, ఆ తర్వాత వినాశనము జరుగుతుందని చెప్పండి. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ప్రజాపిత అయితే ప్రసిద్ధమైనవారు కదా. ఆదిదేవ్ మరియు ఆదిదేవి. జగదంబకు కూడా లక్షలాది మందిరాలు ఉన్నాయి, ఎన్ని మేళాలు జరుగుతాయి. మీరు జగదంబ పిల్లలు, ఇప్పుడు జ్ఞానజ్ఞానేశ్వరులుగా, ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు, ఆ తర్వాత భక్తి మార్గములో దీపావళి నాడు లక్ష్మి నుండి వినాశీ ధనాన్ని కోరుకుంటారు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. మన ఆయువు 150 సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, ఎంతగా యోగాన్ని జోడిస్తారో, అంతగా ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది. మీరు ఈశ్వరునితో యోగాన్ని జోడించి యోగేశ్వరులుగా అవుతారు. మనుష్యులైతే భోగేశ్వరులు. భగవంతుడిని వికారీ మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేస్తారు... అని అంటారు కూడా. తండ్రి అంటారు - నన్ను చాకలి అని కూడా అంటారు, నేను వచ్చి ఆత్మలందరినీ శుభ్రము చేస్తాను, ఆ తర్వాత శరీరము కూడా కొత్తది మరియు శుద్ధమైనది లభిస్తుంది. తండ్రి అంటారు, నేను క్షణములో మొత్తం ప్రపంచములోని వస్త్రాలను (ఆత్మలను) శుభ్రము చేస్తాను. కేవలం మన్మనాభవగా అయినట్లయితే, ఆత్మ మరియు శరీరము పవిత్రముగా అవుతాయి. ఇది మంత్రము కదా. క్షణములో జీవన్ముక్తి. ఇది ఎంత సహజమైన ఉపాయము. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. నడుస్తూ-తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి, నేను మీకు కొద్దిగా కూడా వేరే ఏ కష్టము ఇవ్వను. కేవలం స్మృతి చేయాలి. ఇప్పుడు మీకు ఒక్కొక్క క్షణములోనూ ఎక్కే కళ జరుగుతుంది.

తండ్రి అంటారు - నేను పిల్లలైన మీకు సేవకుడినై వచ్చాను. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని మీరే పిలిచారు. సరే పిల్లలూ, అని వచ్చేసాను అంటే నేను సేవకుడిని అయినట్లే కదా. ఎప్పుడైతే మీరు చాలా పతితముగా అయ్యారో, అప్పుడే తీవ్రముగా ఆర్తనాదాలు చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు ఈ మంత్రము ఇస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. మన్మనాభవకు అర్థం కూడా ఇదే. మన్మనాభవ, మధ్యాజీభవ అనగా తండ్రిని స్మృతి చేసినట్లయితే విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు వచ్చిందే విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికి. రావణపురి తర్వాత విష్ణుపురి ఉంటుంది. కంసపురి తర్వాత కృష్ణపురి ఉంటుంది. ఎంత సహజముగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు మనము 84 జన్మలు పూర్తి చేసాము. ఈ పాత శరీరాన్ని వదిలి మనము కొత్త ప్రపంచములోకి వెళ్తాము. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. అంతటి ధైర్యము చేయాలి. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని తలచుకుంటారు. బ్రహ్మతత్వములో లీనమైపోతామని భావిస్తారు. కానీ బ్రహ్మతత్వము అనేది నివసించే స్థానము. వాళ్ళు తపస్యలో కూర్చుండిపోతారు. మేము బ్రహ్మతత్వములోకి వెళ్ళి లీనమైపోతాము అని భావిస్తారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. బ్రహ్మతత్వముతో యోగాన్ని జోడించినంత మాత్రాన పావనముగా అవ్వరు. అక్కడికి ఒక్కరు కూడా వెళ్ళలేరు. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. తండ్రి వచ్చి సత్యాన్ని తెలియజేస్తారు. సత్యఖండాన్ని సత్యమైన బాబా స్థాపన చేస్తారు. రావణుడు వచ్చి అసత్య ఖండాన్ని తయారుచేస్తాడు. ఇప్పుడిది సంగమయుగము, ఇందులో మీరు ఉత్తమోత్తములుగా అవుతారు, అందుకే దీనిని పురుషోత్తమ యుగమని అంటారు. మీరు గవ్వ నుండి వజ్రము వలె అవుతారు. ఇది అనంతమైన విషయము. ఉత్తమోత్తమమైన మనుష్యులు దేవతలు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేసేది ఉన్నతోన్నతమైన తండ్రి. వారు ఉన్నతోన్నతమైన స్వర్గ వారసత్వాన్ని మీకు ఇస్తారు, మరి మీరు ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. పిల్లలంటారు - బాబా, మేము మర్చిపోకుండా ఉండే విధముగా మాపై కృప చూపించండి. ఇది ఎలా సాధ్యము! బాబా డైరెక్షన్ పై నడుచుకోవాలి కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా అవుతారు. సలహాపై నడుచుకోండి కదా. అంతేకానీ, ఏమని ఆశీర్వదించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్రము వలె తయారుచేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ స్వయము యొక్క వస్త్రాలను (ఆత్మను) స్వచ్ఛముగా తయారుచేసుకోవాలి.

2. ఇప్పుడు కొత్త ఇంటిలోకి వెళ్ళాలి, అందుకే ఈ పాత ఇంటి పట్ల అనంతమైన వైరాగ్యము కలిగి ఉండాలి. ఈ పాత శ్మశానవాటికపై మనము పరిస్తాన్ ను తయారుచేస్తామనే నషా ఉండాలి.

వరదానము:-
దయా దృష్టి ద్వారా ద్వేష దృష్టిని సమాప్తము చేసే నాలెడ్జ్ ఫుల్ భవ

ఏ పిల్లలైతే ఇతరుల సంస్కారాలను తెలుసుకుని సంస్కార పరివర్తన చేసుకోవాలనే తపనలో ఉంటారో, ‘వీరు ఇంతే’ అని ఎప్పుడూ అనుకోరో, వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటారు మరియు నిర్విఘ్నముగా ఉంటారు. వారి సంస్కారాలు బాబా సమానముగా దయార్ద్ర హృదయము కలిగి ఉంటాయి. దయా దృష్టి అనేది ద్వేష దృష్టిని సమాప్తము చేసేస్తుంది. ఇటువంటి దయార్ద్ర హృదయులైన పిల్లలు ఎప్పుడూ పరస్పరము ఘర్షణ పడరు. వారు సుపుత్రులుగా అయి ఋజువును చూపిస్తారు.

స్లోగన్:-
సదా పరమాత్మ చింతన చేసేవారే నిశ్చింత చక్రవర్తులు, వారికి ఏ విధమైన చింత కలగదు.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి, రెండింటిలోనూ ఒకరు చెప్పారు మరియు ఇంకొకరు హాజీ (సరేనండి) అన్నారు అన్నట్లు ఉండాలి, ఈ విధముగా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధముగా దాదీల ఏకత మరియు దృఢతతో కూడిన సంగఠన పక్కాగా ఉందో, అదే విధముగా రత్నాలైన మీ సంగఠన కూడా పక్కాగా ఉండాలి, అప్పుడు సంగఠనా శక్తి ఏది కావాలంటే అది చేయగలుగుతుంది. సంగఠనకు స్మృతిచిహ్నము పంచ పాండవులు.