27-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ నావను తీరానికి చేర్చేందుకు నావికుడు వచ్చారు, మీరు తండ్రితో సత్యముగా ఉన్నట్లయితే నావ అటు-ఇటు ఊగిసలాడుతుంది కానీ మునగలేదు’’

ప్రశ్న:-
తండ్రి స్మృతి పిల్లలకు యథార్థముగా ఉండకపోవడానికి ముఖ్యమైన కారణము ఏమిటి?

జవాబు:-
సాకారములోకి వస్తూ-వస్తూ ఈ విషయాన్ని మర్చిపోయారు - ఆత్మనైన నేను నిరాకారిని మరియు నా తండ్రి కూడా నిరాకారియే అని, సాకారములో ఉన్న కారణముగా సాకారములో ఉన్నవారి స్మృతి సహజముగా కలుగుతుంది. దేహీ-అభిమానులుగా అయి స్వయాన్ని బిందువుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము - ఇందులోనే శ్రమ ఉంది.

ఓంశాంతి
శివ భగవానువాచ. ఇతని పేరు అయితే శివుడు కాదు కదా. ఇతని పేరు బ్రహ్మా మరియు ఇతని ద్వారా మాట్లాడుతున్నది శివ భగవానువాచ. మనుష్యులను లేక దేవతలను లేక సూక్ష్మవతన వాసులైన బ్రహ్మా-విష్ణు-శంకరులను భగవంతుడు అని అనరని, ఇంతకుముందు కూడా అనేక సార్లు అర్థం చేయించారు. ఎవరికైతే ఆకార రూపము లేక సాకార రూపము ఉంటుందో, వారిని భగవంతుడు అని అనలేరు. భగవంతుడు అని అనంతమైన తండ్రినే అంటారు. భగవంతుడు ఎవరు, ఇది ఎవరికీ తెలియదు. నేతి-నేతి అని అంటూ ఉంటారు, అనగా మాకు తెలియదు అని అర్థము. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసినవారు చాలా తక్కువమంది ఉన్నారు. ఆత్మ - ఓ భగవంతుడా అని అంటుంది. ఇప్పుడు ఆత్మ ఒక బిందువు. కావున తండ్రి కూడా బిందువుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా వద్ద ఎంతోమంది పిల్లలు ఎలా ఉన్నారంటే - వారు ఆత్మ అయిన మనము ఏ విధంగా బిందువుగా ఉన్నాము అనేది కూడా అర్థం చేసుకోరు. కొందరైతే బాగా అర్థం చేసుకుంటారు, తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి సత్యమైన వజ్రము. వజ్రాన్ని చాలా మంచి డబ్బాలో పొందుపరచడం జరుగుతుంది. ఎవరి వద్దనైనా మంచి వజ్రాలు ఉంటే, వాటిని ఇతరులకు చూపించాలంటే, వాటిని బంగారము లేక వెండితో తయారుచేసిన డబ్బాలో పెట్టి చూపిస్తారు. వజ్రాల గురించి రత్నాల వ్యాపారికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. నకిలీ వజ్రాన్ని చూపించినా ఎవరూ గుర్తించలేరు. అలా చాలామంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు. కానీ ప్రపంచములో అసత్యమైన వాళ్ళు ఎలా ఉన్నారంటే మనుష్యులకు అసలు ఏమీ తెలియటం లేదు. సత్యము యొక్క నావ అటు-ఇటూ ఊగిసలాడుతుంది కానీ మునగదు అని అంటూ ఉంటారు. అసత్యము యొక్క నావ ఊగిసలాడదు. కానీ సత్యము యొక్క నావను ఎంతగా కదిలించేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైతే ఇక్కడ ఈ నావలో కూర్చుని ఉన్నారో, వాళ్ళు కూడా ఈ నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు. వారిని ద్రోహులు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - నావికుడైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు తోట యజమాని కూడా. తండ్రి అర్థం చేయించారు, ఇది ముళ్ళ అడవి. అందరూ పతితులే కదా. ఎంత అసత్యము ఉంది. సత్యమైన తండ్రి గురించి ఏ ఒక్కరికో అరుదుగా తెలుసు. ఇక్కడి వారిలో కూడా ఎంతోమందికి పూర్తిగా తెలియదు, పూర్తి పరిచయము లేదు, ఎందుకంటే తండ్రి గుప్తము కదా. భగవంతుడినైతే అందరూ తలచుకుంటారు, వారు నిరాకారుడు అని కూడా తెలుసు. వారు పరంధామములో ఉంటారు. మనము కూడా నిరాకారీ ఆత్మలమే అన్న విషయము తెలియదు. సాకారములో కూర్చుని-కూర్చుని ఈ విషయాన్ని మర్చిపోయారు. సాకారములో ఉంటూ-ఉంటూ సాకారములో ఉన్నవారే గుర్తుకొస్తూ ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవుతున్నారు. భగవంతుడిని పరమపిత పరమాత్మ అని అంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడము చాలా సహజము. పరమపిత అనగా ఎంతో దూరముగా ఉండేటటువంటి పరమ ఆత్మ. మిమ్మల్ని ఆత్మ అని అంటారు. మిమ్మల్ని పరమ అని అనరు. మీరైతే పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వారు భగవంతుడిని కూడా సర్వవ్యాపి అని అంటారు. భక్తులు భగవంతుడిని వెతుక్కుంటూ పర్వతాల పైకి, తీర్థ యాత్రలకు, నదులకు కూడా వెళ్తుంటారు. నది పతిత-పావని అని, అందులో స్నానము చేసి మేము పావనముగా అయిపోతాము అని భావిస్తారు. అసలు తమకు కావలసింది ఏమిటి అనేది కూడా భక్తి మార్గములో ఎవరికీ తెలియదు! కేవలం ముక్తి కావాలి, మోక్షము కావాలి అని అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణముగా విసుగు చెంది ఉన్నారు. సత్యయుగములో ఎవరూ మోక్షమును, ముక్తిని అడగరు. అక్కడ భగవంతుడిని ఎవరూ పిలవరు, ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణముగా పిలుస్తారు. భక్తితో ఎవరి దుఃఖము హరించబడదు. ఒకవేళ ఎవరైనా రోజంతా కూర్చుని రామా-రామా అని జపించినా కానీ వారి దుఃఖాలు హరించబడవు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. ఇక్కడ దుఃఖము మెడకు చుట్టుకున్నట్లుగా ఉంది. దుఃఖములో అందరూ తలచుకుంటారు కానీ సుఖములో ఎవరూ తలచుకోరు అని గానము కూడా చేస్తూ ఉంటారు. దీని అర్థము - తప్పకుండా ఒకప్పుడు సుఖము ఉండేది, ఇప్పుడు దుఃఖము ఉంది అనే కదా. సుఖము సత్యయుగములో ఉండేది, దుఃఖము ఇప్పుడు కలియుగములో ఉంది, అందుకే దీనిని ముళ్ళ అడవి అని అంటారు. మొదటి నంబరు ముల్లు దేహాభిమానము, ఆ తర్వాత కామ వికారము యొక్క ముల్లు.

ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో అది వినాశనము కానున్నది. ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి. మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయండి. ఇంటి స్మృతితోపాటు తండ్రి స్మృతి కూడా తప్పనిసరి ఎందుకంటే ఇల్లు ఏమీ పతిత-పావని కాదు. మీరు పతిత-పావనా అని తండ్రిని అంటారు. కావున తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. వారు - నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. బాబా, మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని నన్నే పిలుస్తారు కదా. వారు జ్ఞానసాగరుడు కావున తప్పకుండా వచ్చి నోటి ద్వారా అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రేరణ అయితే ఇవ్వరు. ఒకవైపు శివజయంతిని కూడా జరుపుకుంటారు, మరొకవైపు నామ-రూపాలకు అతీతుడు అని అంటారు. వాస్తవానికి నామ-రూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. మళ్ళీ రాయి-రప్పలు, అన్నింటిలోనూ ఉన్నారు అని అనేస్తారు. ఇలా అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మిమ్మల్ని పంచ వికారాల రూపీ రావణుడు తుచ్ఛబుద్ధి కలవారిగా చేసేసాడు, అందుకే దేవతల ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. కొందరు నాస్తికులుగా ఉంటారు, వారు ఎవ్వరినీ నమ్మరు. ఇక్కడ తండ్రి వద్దకైతే బ్రాహ్మణులే వస్తారు, వారికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా అర్థం చేయించారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు అని వ్రాయబడి కూడా ఉంది కావున మీరు బ్రహ్మా సంతానము అయినట్లు. ప్రజాపిత బ్రహ్మా అయితే ప్రసిద్ధమైనవారు. తప్పకుండా బ్రాహ్మణ, బ్రాహ్మణీలు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు శూద్ర ధర్మము నుండి బయటకు వచ్చి బ్రాహ్మణ ధర్మములోకి వచ్చారు. వాస్తవానికి హిందువులుగా చెప్పుకుంటున్న వారికి తమ అసలు ధర్మము గురించి తెలియదు, అందుకే ఒకసారి ఒకరిని నమ్ముతారు, ఒకసారి ఒకరిని నమ్ముతారు. ఎంతోమంది వద్దకు వెళ్తూ ఉంటారు. క్రిస్టియన్లు ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్ళరు. భగవంతుడైన తండ్రి - నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని ఇప్పుడు మీరు నిరూపించి చెప్తారు. నన్ను స్మృతి చేయడము ద్వారానే మీరు పతితము నుండి పావనముగా అవుతారని స్వయంగా భగవంతుడే చెప్తున్నారని ఒకరోజు వార్తాపత్రికలలో కూడా వస్తుంది. వినాశనము దగ్గరకు వచ్చినప్పుడు వార్తాపత్రికల ద్వారా కూడా ఈ మాట చెవిలో పడుతుంది. వార్తాపత్రికలలోనైతే ఎక్కడెక్కడి నుండో సమాచారాలు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు కూడా వార్తాపత్రికలలో ఈ విధంగా వేయవచ్చు - భగవానువాచ, పరమపిత పరమాత్మ అయిన శివుడు చెప్తున్నారు - నేను పతిత-పావనుడిని, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. ఈ పతిత ప్రపంచము యొక్క వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. వినాశనము తప్పకుండా జరగనున్నది. ఈ విషయముపై కూడా అందరికీ నిశ్చయము ఏర్పడుతుంది. రిహార్సల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటివరకైతే రాజధాని స్థాపన అవ్వదో, అప్పటివరకూ వినాశనము జరగదని పిల్లలైన మీకు కూడా తెలుసు. భూకంపాలు మొదలైనవి కూడా జరగనున్నాయి కదా. ఒకవైపు బాంబులు పేలుతాయి, ఇంకొకవైపు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. ఆహారము మొదలైనవి దొరకవు, స్టీమర్లు రావు, కరువు ఏర్పడుతుంది, ఆకలితో అలమటిస్తూ, అలమటిస్తూ చనిపోతారు. నిరాహార దీక్షలు చేసేవారు, నీరు లేక తేనె మొదలైనవి తీసుకుంటూ ఉంటారు. వారు బరువు తగ్గిపోతారు. ఇక్కడైతే కూర్చుని-కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా భూకంపాలు వస్తాయి, చనిపోతారు. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. వినాశనము జరగనున్నది, అందుకే రామ-రామ అని తలచుకోండి అని సాధు-సన్యాసులు మొదలైనవారు ఇలా చెప్పరు. మనుష్యులకైతే భగవంతుని గురించే తెలియదు. భగవంతుని గురించి స్వయంగా భగవంతునికే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. ఇది వారు వచ్చే సమయము. వారు ఈ వృద్ధ తనువులోకి వచ్చి మొత్తము సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని పిల్లలైన మీకు తెలుసు. మనము శాంతిధామానికి వెళ్తాము, ఈ విషయములోనైతే సంతోషించాలి. మనుష్యులు శాంతినే కోరుకుంటారు కానీ శాంతిని ఎవరు ఇస్తారు? శాంతిదేవా అని అంటారు కదా... ఇప్పుడు దేవాదిదేవుడు అయితే ఒక్క ఉన్నతోన్నతుడైన తండ్రి మాత్రమే. వారు అంటారు, నేను మిమ్మల్నందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తాను. ఒక్కరిని కూడా వదలను. డ్రామానుసారముగా అందరూ వెళ్ళవలసిందే. దోమల గుంపులా ఆత్మలన్నీ వెళ్తాయని అంటూ ఉంటారు. సత్యయుగములో చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారని కూడా తెలుసు. ఇప్పుడు కలియుగ అంతిమములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు, మరి తర్వాత తక్కువమంది ఎలా ఉంటారు? ఇప్పుడు ఉన్నది సంగమము. మీరు సత్యయుగములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇది వినాశనమవుతుంది అని మీకు తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలు వెళ్తాయి. మొత్తము గుంపు అంతా వెళ్ళిపోతుంది. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారు.

తండ్రి అంటారు, ఏ దేహధారినీ స్మృతి చేయకండి, చూస్తూ కూడా మనము చూడము. మనము ఆత్మలము, మనము మన ఇంటికి వెళ్తాము. సంతోషముగా పాత శరీరాన్ని వదిలేయాలి. మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఇందులోనే శ్రమ ఉంది. కష్టపడకుండా ఉన్నత పదవి లభించదు. తండ్రి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారుచేయడానికే వస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఏ ప్రశాంతత లేదు. ప్రశాంతత అనేది శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంది. ఇక్కడైతే ఇంటి-ఇంటిలోనూ అశాంతి ఉంది, గొడవలు-కొట్లాటలు ఉన్నాయి. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ ఛీ-ఛీ ప్రపంచాన్ని మర్చిపోండి. మధురాతి మధురమైన పిల్లలూ, నేను మీ కోసము స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. ఈ నరకములో మీరు పతితముగా అయిపోయారు. ఇప్పుడు ఇక స్వర్గములోకి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయండి, తద్వారా అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఉంటుంది. వివాహాలు మొదలైన కార్యక్రమాలకు వెళ్తే వెళ్ళండి కానీ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఇంటిలో ఉండండి, పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, కానీ బుద్ధిలో - నన్ను స్మృతి చేయండి అన్న తండ్రి ఆజ్ఞను గుర్తుంచుకోండి. ఇంటిని వదలకూడదు. లేదంటే పిల్లలను ఎవరు సంభాళిస్తారు? భక్తులు ఇంటిలో ఉంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటారు, అయినా వారిని భక్తులు అని అంటారు ఎందుకంటే వారు భక్తి కూడా చేస్తారు, ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళిస్తారు. వారు వికారాలలోకి వెళ్ళినా గురువులు వారికి ఏమని చెప్తారంటే - శ్రీకృష్ణుడిని స్మృతి చేయండి, అప్పుడు అతని వంటి పిల్లవాడు పుడతాడు అని. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాల్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యయుగములోకి వెళ్ళే విషయాలను వినిపించడం జరుగుతుంది, ఇప్పుడు దాని స్థాపన జరుగుతుంది. వైకుంఠ స్థాపనను శ్రీకృష్ణుడు ఏమీ చేయరు, శ్రీకృష్ణుడు అయితే యజమానిగా అయ్యారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. సంగమ సమయములోనే గీతా భగవానుడు వస్తారు. గీతను వినిపించింది తండ్రి మరియు అది విన్నది కొడుకు. భక్తి మార్గములో తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసేసారు. తండ్రిని మర్చిపోయిన కారణముగా గీత కూడా ఖండితమైపోయింది. ఆ ఖండితమైన గీతను చదవడం వలన ఏమి జరుగుతుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారు, దాని ద్వారా శ్రీకృష్ణుడు సత్యయుగానికి యజమానిగా అయ్యారు. భక్తి మార్గములో సత్యనారాయణుడి కథను వినడము ద్వారా ఎవరైనా స్వర్గానికి యజమానులుగా అవుతారా? ఎవరూ ఈ భావనతో వినరు కూడా, కావున దాని వల్ల లాభమేమీ ఉండదు. సాధు-సన్యాసులు మొదలైనవారు తమ-తమ మంత్రాలను ఇస్తారు, తమ ఫోటోలను ఇస్తారు. ఇక్కడ అటువంటి విషయమేదీ లేదు. ఇతర సత్సంగాలలోకి వెళ్తే ఫలానా స్వామి కథ అని అంటారు. అది ఎవరి కథ? వేదాంతము యొక్క కథ, గీత యొక్క కథ, భాగవతము యొక్క కథ. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనల్ని చదివించేవారు ఏ దేహధారీ కాదు, అలాగే ఏ శాస్త్రాలు మొదలైనవి చదివినవారూ కాదు. శివబాబా ఏమైనా శాస్త్రాలను చదివారా! మనుష్యులే చదువుతారు. శివబాబా అంటున్నారు, నేను గీత మొదలైనవి ఏవీ చదవలేదు. నేను ఏ రథములోనైతే కూర్చుని ఉన్నానో, అతను చదివారు, నేను చదవలేదు. నాలో అయితే మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఇతను రోజూ గీతను చదువుతుండేవారు. చిలుకలా కంఠస్థము చేసేవారు. తండ్రి ఎప్పుడైతే ప్రవేశించారో, అప్పుడు వెంటనే గీతను వదిలేసారు ఎందుకంటే ఇది శివబాబా వినిపిస్తున్నారు అని బుద్ధిలోకి వచ్చింది.

తండ్రి అంటారు, నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాను కావున ఇప్పుడు పాత ప్రపంచము నుండి మమకారాన్ని తొలగించండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ కృషి చేయాలి. సత్యమైన ప్రేయసికి ఘడియ-ఘడియ ప్రియుడి స్మృతియే కలుగుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు తండ్రి స్మృతి కూడా ఆ విధంగా పక్కాగా ఉండాలి. పారలౌకిక తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గ వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో శబ్దము చేయవలసిన అవసరము కానీ చిడతలు (వాయిద్యము) మోగించాల్సిన అవసరము కానీ లేదు. పాటలు కూడా ఏవైనా మంచి-మంచివి వచ్చినప్పుడు వాటిని వినిపించడం జరుగుతుంది, వాటి అర్థము కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఆ పాటలు తయారుచేసేవారికి స్వయము ఏమీ తెలియదు. మీరా ఒక భక్తురాలు, మీరు ఇప్పుడు జ్ఞానీ. పిల్లల ద్వారా ఏదైనా పని సరిగ్గా జరగకపోతే బాబా అంటారు, మీరు భక్తుల వంటివారు. అప్పుడు వారికి బాబా మమ్మల్ని ఇలా ఎందుకు అన్నారు అనేది అర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి, సందేశకులుగా అవ్వండి, దూతలుగా అవ్వండి, అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఇప్పుడు ఇది తిరిగి ఇంటికి వెళ్ళే సమయము. భగవంతుడు ఒక్క నిరాకారుడే, వారికి తనదంటూ దేహము లేదు. తండ్రియే కూర్చుని తన పరిచయాన్ని ఇస్తారు. మన్మనాభవ మంత్రాన్ని ఇస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ - ఇప్పుడు వినాశనము జరగనున్నది, తండ్రిని స్మృతి చేయండి అని అనరు. తండ్రియే పిల్లలకు గుర్తు చేయిస్తారు. స్మృతి ద్వారా ఆరోగ్యము, చదువు ద్వారా సంపద లభిస్తాయి. మీరు కాలుడిపై విజయము పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. దేవతలు కాలుడిపై విజయము పొందారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ద్వారా భక్తుడు అన్న టైటిల్ లభించేలాంటి కర్మలేవీ చేయకూడదు. సందేశకులుగా అయి అందరికీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి అన్న సందేశాన్ని ఇవ్వాలి.

2. ఈ పాత ప్రపంచములో ఎటువంటి ప్రశాంతత లేదు, ఇది ఛీ-ఛీ ప్రపంచము, దీనిని మర్చిపోతూ వెళ్ళాలి. ఇంటిని స్మృతి చేయడముతో పాటు పావనముగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి.

వరదానము:-
ప్రవృత్తిలో ఉంటూ పర-వృత్తిలో ఉండే నిరంతర యోగీ భవ

నిరంతర యోగీగా అయ్యేందుకు సహజ సాధనము - ప్రవృత్తిలో ఉంటూ పర-వృత్తిలో ఉండడము. పర-వృత్తి అనగా ఆత్మిక రూపము. ఎవరైతే ఆత్మిక రూపములో స్థితులై ఉంటారో, వారు సదా అతీతముగా మరియు తండ్రికి ప్రియముగా అవుతారు. ఏమి చేసినా సరే వారికి ఎలా అనుభవమవుతుందంటే - మేము పని చేయలేదు కానీ ఆట ఆడాము. కావున ప్రవృత్తిలో ఉంటూ ఆత్మిక రూపములో ఉండటము ద్వారా అన్నీ ఆటలా సహజముగా అనుభవమవుతాయి. బంధనముగా అనిపించదు. కేవలం స్నేహము మరియు సహయోగముతోపాటు శక్తిని కూడా జోడించినట్లయితే హై జంప్ చేస్తారు.

స్లోగన్:-
బుద్ధి యొక్క సూక్ష్మత మరియు ఆత్మ యొక్క తేలికదనమే బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

శక్తులు ధైర్యము ఉంచితే సర్వశక్తివంతుని సహాయము లభిస్తుంది. సింహాలు ఎప్పుడూ ఎవరికీ భయపడవు, నిర్భయముగా ఉంటాయి. ఏమవుతుందో తెలియదు... అన్న భయము కూడా ఉండదు! సత్యత యొక్క శక్తి స్వరూపులుగా అయి నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మేము ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క అనుచరులము, ఈ స్మృతితో అయథార్థాన్ని యథార్థములోకి తీసుకురావాలి. సత్యాన్ని ప్రసిద్ధము చెయ్యాలి, దాచిపెట్టకూడదు, కానీ సత్యతతో కూడిన మాటలలో మధురత మరియు సభ్యత అవసరము.