27-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతి ద్వారా ఆత్మలోని చెత్తను తొలగించుకుంటూ వెళ్ళండి, ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా పావనముగా అవుతుందో, అప్పుడు ఇంటికి వెళ్ళగలదు’’

ప్రశ్న:-
ఈ అంతిమ జన్మలో తండ్రి యొక్క ఏ డైరెక్షన్ ను పాటించడములోనే పిల్లల కళ్యాణముంది?

జవాబు:-
బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయట భ్రమించనివ్వకండి, విషాన్ని వదిలి అమృతాన్ని తాగండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల అలవాట్లను సమాప్తము చేసుకోవాలి. అందుకే, రాత్రింబవళ్ళు కృషి చేసి దేహీ-అభిమానులుగా అవ్వండి.

ఓంశాంతి
శాంతిధామము విశ్రామపురి. ఈ ప్రపంచముతో అందరూ అలసిపోయి ఉన్నారు. మేము మా సుఖధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. ఈ ప్రపంచము బాగా అనిపించదు. స్వర్గాన్ని చూస్తున్నప్పుడు ఇక నరకము పట్ల మనసు ఎలా కలుగుతుంది. బాబా, త్వరగా చేయండి, ఈ దుఃఖధామము నుండి తీసుకువెళ్ళండి అని అంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు - ఇది ఛీ-ఛీ ప్రపంచము, దీని పేరే డెవిల్ వరల్డ్ (ఆసురీ ప్రపంచము), నరకము. ఇవేమైనా మంచి పేర్లా? దైవీ ప్రపంచమెక్కడ, ఆసురీ ప్రపంచమెక్కడ. ఈ ఆసురీ ప్రపంచముతో అందరూ విసుగు చెంది ఉన్నారు, కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. తమోప్రధానత యొక్క మాలిన్యము చేరింది. ఆ మాలిన్యము ఆత్మ నుండి తొలగిపోవాలి, దాని కోసం పురుషార్థము చేస్తున్నారు. ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో, వారికి అవస్థ చివరిలో మంచిగా ఉంటుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. ఇప్పుడిక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎప్పటివరకైతే తండ్రి వచ్చి తిరిగి తీసుకువెళ్ళరో, అప్పటివరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ప్రపంచములో దుఃఖముంది కదా. ఇళ్ళల్లో కూడా ఏదో ఒక దుఃఖము ఉంటుంది. బాబా ఇప్పుడు మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించేందుకు వచ్చారని పిల్లలైన మీ హృదయములో ఉంది. ఎవరైతే మంచి నిశ్చయబుద్ధి కలవారు ఉన్నారో, వారు తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోరు. తండ్రిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. వారిని పిల్లలు మాత్రమే గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తించినట్లయితే, ఇక ఇంతమంది మనుష్యులు వచ్చి ఎక్కడ కూర్చుంటారు, అలా జరగదు. అందుకే డ్రామాలో యుక్తి కూడా ఆ విధముగా రచించబడి ఉంది. ఎవరైతే శ్రీమతముపై నడుస్తారో, వారే ఉన్నత పదవిని పొందగలరు. అది కరక్టు. శిక్షలు అనుభవించినా సరే శాంతిధామానికి లేక పావన ప్రపంచములోకి వెళ్తారు. కానీ ఉన్నత పదవిని పొందేందుకైతే పురుషార్థము చేయవలసి ఉంటుంది కదా. రెండవ విషయమేమిటంటే, పావనముగా అవ్వకుండా పావన ప్రపంచములోకి ఎవరూ వెళ్ళలేరు. ఫలానావారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని, తిరిగి వెళ్ళిపోయారని... ఏదైతే అంటారో, అది అలా జరగదు. ఎవరైతే మొట్టమొదట సృష్టిపైకి వచ్చారో, అనగా లక్ష్మీ-నారాయణులు, వారు కూడా తిరిగి వెళ్ళలేరు అన్నప్పుడు ఇక ఇతరులు ఎలా వెళ్ళగలరు. వారికి కూడా ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళేందుకు తపస్య చేస్తున్నారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్ దుఃఖహర్త-సుఖకర్త. కృష్ణుడు మొదలైనవారెవరినీ అలా పిలవరు. క్రిస్టియన్లు అయినా, ముసల్మానులు అయినా, అందరూ ఓ గాడ్ ఫాదర్ అని అంటూ పిలుస్తారు. ఆత్మ తన ఫాదర్ ను పిలుస్తుంది. నేను ఒక ఆత్మను, అని అర్థం చేసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మ కూడా ఒక వస్తువే కదా. ఆత్మ పెద్ద వస్తువేమీ కాదు, అది ఒక నక్షత్రము వంటిది మరియు అతి సూక్ష్మమైనది. బాబా ఎలా ఉంటారో, ఆత్మ స్వరూపము కూడా అలాగే ఉంటుంది. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని ఇప్పుడు మీరు తండ్రి మహిమను చేస్తారు. మీ ఆత్మ కూడా వారి సమానముగా తయారవుతుంది. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము వచ్చేసింది. ఇతర మనుష్యమాత్రులెవ్వరిలోనూ ఈ జ్ఞానము లేదు. మొత్తం భారత్ ను, మొత్తం విదేశాలను వెతకండి, ఎవ్వరికీ కూడా ఈ జ్ఞానము తెలియదు. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. 84 లక్షల జన్మలైతే అసంభవము. 84 లక్షల జన్మల గురించైతే ఎవరూ వర్ణించలేరు కూడా. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను వినిపిస్తాను. ఇదంతా వింటూ కూడా రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు - 84 లక్షల జన్మలే గనక ఉంటే, వాటి గురించి ఎవరైనా ఎలా వినిపించగలరు అని.

మనము బ్రాహ్మణులమని, మనము 84 జన్మలు తీసుకున్నామని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా కూడా 84 జన్మలు తీసుకున్నారు, విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మాయే విష్ణువు, విష్ణువే బ్రహ్మా. లక్ష్మీ-నారాయణులే 84 జన్మలు తీసుకుని మళ్ళీ బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. తండ్రి అంటారు, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి అర్థం చేయిస్తాను. ఇది 5 వేల సంవత్సరాల చక్రము. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు. హమ్ సో అర్థాన్ని కూడా తెలుసుకున్నారు - ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాము, తర్వాత మనమే క్షత్రియులుగా, మనమే వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇన్ని-ఇన్ని జన్మలు తీసుకుంటాము, తర్వాత మనమే బ్రాహ్మణులుగా అవుతాము. బ్రాహ్మణులది ఈ ఒక్క జన్మ. ఇది ఉన్నదే మీ వజ్రతుల్యమైన జన్మ.

తండ్రి అంటారు - ఇది మీ ఉత్తమ శరీరము, దీనితో మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు, అందుకే ఇప్పుడు ఇంకెటువైపుకు భ్రమించకండి. జ్ఞానామృతాన్ని తాగండి. తప్పకుండా 84 జన్మలు తీసుకుంటామని కూడా మీకు అర్థమయ్యింది. మీరు మొదట సత్యయుగములో సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత సతోగా అయ్యారు, తర్వాత వెండి యొక్క మాలిన్యము చేరింది, పూర్తి లెక్కను తెలియజేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది - బంగారములో మాలిన్యాన్ని కలపండి, 14 క్యారట్ల బంగారాన్ని ధరించండి అని. బంగారములో మాలిన్యము కలపడాన్ని భారతవాసులు అపశకునముగా భావిస్తారు. వివాహము చేయించేటప్పుడు, పూర్తిగా సత్యమైన బంగారాన్ని ధరిస్తారు. బంగారము పట్ల కూడా భారతవాసులకు చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకని? భారత్ గురించైతే ఇక అడగకండి. సత్యయుగములోనైతే బంగారు మహళ్ళు ఉండేవి, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఎలాగైతే ఇటుకలు పేర్చి ఉంటాయో, అక్కడ బంగారం-వెండి అలా పేర్చి ఉంటాయి. మాయా మశ్చీంద్రుని ఆటను చూపిస్తారు. అతడు బంగారు ఇటుకలను చూస్తాడు, వీటిని తీసుకువెళ్తాను అని అనుకుంటాడు, కిందకు దిగి చూస్తే ఏమీ ఉండదు. దీని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ స్వర్గములోకి వెళ్తామని కుమార్తెలు భావిస్తారు, ఒకవేళ పతి మొదలైనవారు విసిగిస్తే, పాపం లోలోపల ఏడుస్తారు. మేమెప్పుడు సుఖధామానికి వెళ్తాము, బాబా, ఇప్పుడు త్వరగా చేయండి అని అంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, త్వరగా ఎలా చేయను, ముందు మీరు యోగబలముతో మీలోని చెత్తనైతే తొలగించుకోండి. యోగము యొక్క యాత్రలో ఉండండి. తండ్రి ఓదార్పును ఇస్తారు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు కూడా. సర్వుల సద్గతిదాత ఒక్కరేనని పాడుతారు కూడా. ఇది ఇక్కడి విషయమే. అకాసురుడు, బకాసురుడు - ఈ విషయాలన్నీ ఈ సంగమ సమయానికి చెందినవే. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను, ఎప్పుడైతే మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుందో, అప్పుడు వస్తాను.

సత్యయుగములో ప్రతి వస్తువు సతోప్రధానముగా ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ఇన్ని పక్షులు, జంతువులు మొదలైనవేవైతో ఉన్నాయో, ఇవన్నీ ఇంత ఎక్కువ అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద మంచి స్వచ్ఛత ఉంటుంది. వారు నివసించే స్థానము, ఫర్నీచర్ మొదలైనవి చాలా బాగుంటాయి. మీరు కూడా అంతటి ఉన్నతమైన దేవతలుగా అవుతారు. అక్కడ, ఇక్కడుండేటువంటి ఛీ-ఛీ వస్తువులేవీ ఉండవు. ఇక్కడైతే దోమలు మొదలైనవి ఉంటాయి, అనేక రకాల అనారోగ్యాలు ఉంటాయి, ఎంతటి అశుద్ధత ఉంటుంది. పల్లెల్లో ఇంతటి అశుద్ధత ఉండదు. పెద్ద-పెద్ద పట్టణాలలో చాలా అశుద్ధత ఉంటుంది ఎందుకంటే ఎక్కువమంది మనుష్యులైపోయారు, అందరూ ఉండటానికి స్థలమే లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఒక్క సెకండులో శివబాబా బ్రహ్మా తనువులో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు, ఒక్క సెకండులో బ్రహ్మాయే విష్ణువుగా మారుతారు, ఒక్క సెకండులో 9 లక్షలమంది ప్రజలు తయారవుతారు... అని మనుష్యులు పాడుతారు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. విష్ణువుతో పాటు సితారలు కూడా ఉన్నారు. సత్యయుగములో వీరు దేవతలుగా అవుతారు, అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వృక్షము ముందు చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. సత్యయుగములోనైతే చాలా కొద్దిమందే ఉంటారు. మధురమైన నదుల తీరాలలో ఉంటారు. ఇక్కడ నదుల నుండి అనేక కాలువలు వెలువడతాయి. అక్కడ కాలువలు మొదలైనవి ఉండవు. గుప్పెడు మంది మనుష్యులు ఉంటారు. అంతమంది కోసం గంగా, యమునా అయితే ఎలాగూ ఉంటాయి. ఆ నదుల చుట్టుప్రక్కలే నివసిస్తారు. 5 తత్వాలు కూడా దేవతలకు బానిసలుగా ఉంటాయి. ఎప్పుడూ కూడా అకాల వర్షాలు కురవవు. ఎప్పుడూ నదులు ఉప్పొంగవు. దాని పేరే స్వర్గము, మరి ఇంకేమి ఉండాలి? స్వర్గము ఆయువు ఇన్ని లక్షల సంవత్సరాలని అంటారు. అచ్ఛా, మరి అక్కడ ఎవరు రాజ్యము చేసేవారో చెప్పండి అని అడగండి. ఎన్ని అసత్యమైన మాటలు చెప్తూ ఉంటారు.

మనము కల్పక్రితం వలె ఈ పాత్రను అభినయిస్తున్నామని మీకు తెలుసు. రుద్ర జ్ఞాన యజ్ఞములో అనేక రకాల అసురుల విఘ్నాలు కలుగుతాయి. అసురులు పై నుండి చెత్త, పేడ మొదలైనవి వేసేవారని మనుష్యులు అనుకుంటారు కానీ అలా జరగలేదు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి అనేది మీరు చూస్తున్నారు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి, అప్పుడే పాపపు కుండ నిండుతుంది. తండ్రి అంటారు - కొద్దిగా సహనము చేయవలసి ఉంటుంది. మీరు మీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తినే సమయములో కూడా బుద్ధిలో శివబాబాను స్మృతి చేయండి. మీకైతే బుద్ధిలో జ్ఞానముంది. ఎవరినైనా ఉరి తీసేటప్పుడు, గాడ్ ఫాదర్ ను గుర్తు చేయండి అని ఫాదర్లు అంటారు. క్రైస్టును గుర్తు చేయండి అని అనరు. గాడ్ వైపే సూచిస్తారు. వారు ఎంత ప్రియమైనవారంటే, అందరూ వారినే పిలుస్తారు. ఆత్మయే పిలుస్తుంది. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహాభిమానములో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే అర్ధకల్పపు ఆ అలవాటును తొలగించుకోవాలి. దేహీ-అభిమానులుగా అవ్వడము ద్వారా మనము స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది ఎంత ఉన్నతమైన ప్రాప్తి. కనుక రాత్రింబవళ్ళు ఇదే ప్రయత్నము చేయాల్సి ఉంటుంది. మనుష్యులు వ్యాపారాలు మొదలైనవాటి కోసం కూడా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుష్యులకు ఎప్పుడూ కునికిపాట్లు గాని, ఆవలింతలు గాని రావు ఎందుకంటే అది సంపాదన. ధనము యొక్క సంతోషముంటుంది. అలసిపోవడమనే మాటే ఉండదు. బాబా కూడా అనుభవజ్ఞులు కదా. రాత్రి సమయములో స్టీమర్లు వచ్చేటప్పుడు, మనుష్యులు వచ్చి సామాను కొనుక్కునేవారు. కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేయనంత వరకు వారిని వదిలేవారు కాదు. బాబా కూడా పూర్తి అనుభవజ్ఞుడినే రథముగా తీసుకున్నారు. వీరు అన్నీ అనుభవం చేసారు. పల్లెటూరి పిల్లవాడిగా కూడా ఉండేవారు. 10 అణాలకు సుమారుగా 40 కిలోల ధాన్యాన్ని అమ్మేవారు. ఇప్పుడు చూడండి, విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఒకప్పుడు పూర్తిగా పల్లెటూరి పిల్లవాడిలా ఉండేవారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత, పూర్తిగా వజ్రాల వ్యాపారములో నిమగ్నమైపోయారు. కేవలం వజ్రాల విషయాలే ఉండేవి. ఇవైతే సత్యమైన వజ్రాలు. ఇది రాయల్ వ్యాపారము. బాబా చాలా అనుభవజ్ఞులు. వైస్రాయ్ మొదలైనవారి ఇళ్ళకు, బాబా తన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్ళేవారు. వీటిని అవినాశీ జ్ఞాన రత్నాలని అంటారు. ఎంతగా వీటిని బుద్ధిలో ధారణ చేస్తారో, అంతగా మీరు పదమపతులుగా అవుతారు. శివబాబాను వ్యాపారస్థుడు, రత్నాకరుడు అని అంటారు. వారి మహిమను కూడా పాడుతారు, మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. మహిమతో పాటు అంత నింద కూడా చేస్తారు. భక్తి మార్గము యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది. తండ్రి అంటారు - భక్తి పూర్తి అయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు అనేది కూడా ఋజువవుతుంది. అందరికన్నా ఎక్కువ భక్తిని మీరే చేస్తారు. వారే ఇక్కడకు వచ్చి, మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు మరియు తండ్రి నుండి మళ్ళీ పూజ్యులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేసాడు, తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవానువాచ. భగవంతుడు ఒక్కరే. 2-3 భగవంతులు ఉండరు. గీత అనేది భగవంతుడు వినిపించినది. శివ భగవానువాచకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసారు కనుక ఎంత తేడా ఏర్పడింది. అయినా డ్రామానుసారముగా, గీతలో పేరు ఈ విధముగా మారాల్సిందే. మళ్ళీ ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు. తండ్రి పావనముగా చేస్తారు, రావణుడు పతితముగా చేస్తాడు. అర్థం చేసుకునేందుకు ఎంత బుద్ధి కావాలి. శ్రీమతమనేది ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. ఈ లక్ష్మీ-నారాయణులు తండ్రి మతముతోనే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమానపు అలవాట్లను తొలగించుకునే శ్రమను చేయాలి. దేహీ-అభిమానులుగా అయి స్వర్గానికి యజమానులుగా అవ్వాలి.

2. ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో ఈ బుద్ధిని భ్రమించనివ్వకూడదు, సతోప్రధానముగా అవ్వాలి. అత్యాచారాలను సహించి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:-
సాకార బాబా సమానముగా తమ ప్రతి కర్మను స్మృతిచిహ్నముగా చేసుకునే ఆధారమూర్త మరియు ఉద్ధారమూర్త భావ

ఏ విధముగా సాకార బాబా తమ ప్రతి కర్మను స్మృతిచిహ్నముగా తయారుచేసుకున్నారో, అలా మీ ప్రతి కర్మ స్మృతిచిహ్నముగా ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడైతే స్వయాన్ని ఆధారమూర్తులుగా మరియు ఉద్ధారమూర్తులుగా భావిస్తూ నడుచుకుంటారో అప్పుడు. ఎవరైతే స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తులుగా భావిస్తారో, వారి ప్రతి కర్మ ఉన్నతముగా ఉంటుంది మరియు ఎప్పుడైతే వృత్తి-దృష్టిలో సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంటుందో, అప్పుడు ప్రతి కర్మ శ్రేష్ఠముగా అయిపోతుంది. ఇటువంటి శ్రేష్ఠ కర్మలే స్మృతిచిహ్నాలుగా అవుతాయి.

స్లోగన్:-
సత్యత యొక్క శక్తిని ధారణ చేయడానికి సహనశీలురుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ఈ సహజయోగీ జీవితములో ఒకవేళ కష్టాలు అనుభవమైనట్లయితే ఇక సహజముగా ఎలా రాజ్యము చేస్తారు. ఇక్కడి సంస్కారాలనే అక్కడికి తీసుకువెళ్తారు. చూడండి, మీ స్మృతిచిహ్నముగా దేవతల చిత్రాలనేవైతే తయారుచేస్తారో వారి ముఖములో సరళతను తప్పకుండా చూపిస్తారు. కనుక ఎవరు ఎంత సహజ పురుషార్థులుగా ఉంటారో, అంతగానే వారు మనసాలో కూడా సరళముగా, వాచాలో కూడా సరళముగా, కర్మలలో కూడా సరళముగా ఉంటారు. వారినే ఫరిశ్తా అని అంటారు.