27-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి సమానంగా దయార్ద్ర హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి, ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెకింగ్ ను చేయగలుగుతారు, మీ పురుషార్థము ఏమిటి?

జవాబు:-
చదువు ద్వారా మీరు ఏ చెకింగ్ ను చేయగలుగుతారంటే - మేము ఉత్తమ పాత్రను అభినయిస్తున్నామా లేక మధ్యమ పాత్రను అభినయిస్తున్నామా లేక కనిష్ఠ పాత్రను అభినయిస్తున్నామా. అందరికంటే ఉత్తమ పాత్ర అని ఎవరిది అంటారంటే - ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారుచేస్తారో అనగా సేవ చేసి బ్రాహ్మణుల వృద్ధిని చేస్తారో వారిది. మీ పురుషార్థము ఏమిటంటే - పాత చెప్పును తీసి కొత్త చెప్పును వేసుకోవటము. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి కొత్త పవిత్ర చెప్పు (శరీరము) లభిస్తుంది.

ఓంశాంతి
పిల్లలు రెండు వైపుల నుండీ సంపాదన చేసుకుంటున్నారు. ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా సంపాదన మరియు ఇంకొకవైపు 84 జన్మల చక్రము యొక్క జ్ఞానాన్ని స్మరించడం ద్వారా సంపాదన. దీనిని డబుల్ సంపాదన అని అంటారు మరియు అజ్ఞానకాలములో క్షణ భంగురమైన సింగిల్ సంపాదన ఉంటుంది. మీ ఈ స్మృతి యాత్ర యొక్క సంపాదన చాలా ఉన్నతమైనది. దీని ద్వారా ఆయుష్షు కూడా పెరుగుతుంది, పవిత్రముగా కూడా అవుతారు, అన్ని దుఃఖాల నుండి విముక్తులవుతారు. ఇది చాలా పెద్ద సంపాదన. సత్యయుగములో ఆయుష్షు కూడా పెరుగుతుంది. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు ఎందుకంటే అక్కడ రావణరాజ్యమే ఉండదు. అజ్ఞానకాలములో చదువు ద్వారా అల్పకాలికమైన సుఖము లభిస్తుంది, అలాగే శాస్త్రాలను చదివేవారికి కూడా చదువు ద్వారా సుఖము లభిస్తుంది. వారి ద్వారా అనుచరులకు ఏ లాభమూ ఉండదు. వాస్తవానికి వారు అనుచరులు కూడా కారు, ఎందుకంటే వారు వస్త్రాలు మొదలైనవి మార్చరు, అలాగే తమ ఇళ్ళు-వాకిళ్ళను కూడా వదలరు, కావున వారిని అనుచరులు అని ఎలా అనగలరు! అక్కడైతే శాంతి, పవిత్రత అన్నీ ఉన్నాయి. ఇక్కడ అపవిత్రత కారణంగా ప్రతి ఇంటిలోనూ ఎంతటి అశాంతి ఉంటుంది. మీకు ఈశ్వరుని మతము లభిస్తుంది. ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఈశ్వరీయ గవర్నమెంట్ గా భావించండి. కానీ మీరు గుప్తమైనవారు. మీ హృదయములో ఎంతటి సంతోషము ఉండాలి. ఇప్పుడు మనం శ్రీమతంపై నడుస్తున్నాము. వారి శక్తితో సతోప్రధానముగా అవుతున్నాము. ఇక్కడ రాజ్యభాగాన్ని ఏమీ తీసుకునేది లేదు. మన రాజ్యభాగము కొత్త ప్రపంచములోనే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి తెలిసింది. ఈ లక్ష్మీ-నారాయణుల 84 జన్మల కథను గురించి మీరు చెప్పవచ్చు. ఏ మనుష్యమాత్రులైనా, వారు ఎలా చదివించేవారైనా కానీ, ఒక్కరు కూడా - రండి, మేము మీకు వీరి 84 జన్మల కథను వినిపిస్తాము అని చెప్పలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి ఉంటుంది, విచార సాగర మంథనం కూడా చేస్తారు.

ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీయులు. మళ్ళీ సత్యయుగములో విష్ణు వంశీయులు అని పిలవబడతారు. జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు... ఈ సమయములో మీకు జ్ఞానం లభిస్తోంది కదా. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తోంది. అర్ధకల్పం జ్ఞానం కొనసాగుతుంది, మళ్ళీ అర్ధకల్పం అజ్ఞానం కొనసాగుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మీరు ఇప్పుడు వివేకవంతులుగా అయ్యారు. ఎంతెంతగా మీరు వివేకవంతులుగా అవుతారో అంతంతగా ఇతరులను కూడా మీ సమానంగా తయారుచేసే పురుషార్థాన్ని చేస్తారు. మీ తండ్రి దయార్ద్ర హృదయులు, కళ్యాణకారి కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారులుగా అవ్వకపోతే వారిని ఏమంటారు? ‘‘పిల్లలు ధైర్యమును ఉంచితే తండ్రి సహాయం చేస్తారు’’ అన్న గాయనం కూడా ఉంది కదా, ఇది కూడా తప్పకుండా కావాలి. లేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతారు. సేవ అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు, మీరు ఈశ్వరీయ మిషన్ కదా. ఏ విధంగా క్రిస్టియన్ మిషన్, ఇస్లామీ మిషన్ ఉంటాయో, వారు ఏ విధంగానైతే తమ ధర్మాన్ని వ్యాపింపజేస్తారో అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వ్యాపింపజేస్తారు. డ్రామా అనుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహాయకులుగా అవుతారు. కల్పపూర్వం ఏ పాత్రనైతే అభినయించారో దానిని తప్పకుండా అభినయిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ, మధ్యమ, కనిష్ట పాత్రను అభినయించడాన్ని మీరు చూస్తున్నారు. ఎవరైతే ఉత్తములుగా తయారుచేస్తారో, వారే అందరికన్నా ఉత్తమమైన పాత్రను అభినయిస్తారు. కావున అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మరియు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఋషులు, మునులు మొదలైనవారు కూడా మాకు తెలియదు, తెలియదు అని అంటూ వెళ్ళారు మరియు ఇంకొకవైపు వారు సర్వవ్యాపి అని అంటారు, వారికి ఇంకేదీ తెలియదు. డ్రామా అనుసారంగా ఆత్మ బుద్ధి కూడా తమోప్రధానంగా అయిపోతుంది. శరీరము యొక్క బుద్ధి అనరు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఇవి బాగా అర్థం చేసుకొని పిల్లలు మళ్ళీ చింతన చేయాలి, ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. వారు శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్ని దుకాణాలు తెరిచి కూర్చున్నారు. మీది కూడా దుకాణము. పెద్ద-పెద్ద నగరాలలో పెద్ద దుకాణాలు కావాలి. చురుకైన పిల్లలెవరైతే ఉంటారో, వారి వద్ద చాలా ఖజానా ఉంటుంది. అంత ఖజానా లేకపోతే ఎవరికీ ఇవ్వలేరు కూడా! ధారణ నంబరువారుగా జరుగుతుంది. ఇతరులెవరికైనా అర్థం చేయించగలిగే విధంగా పిల్లలు బాగా ధారణ చేయాలి. విషయము పెద్దదేమీ కాదు, ఇది ఒక్క క్షణము యొక్క విషయము - తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున అనంతమైన యజమానులుగా అయ్యారు. యజమానులు కూడా నంబరువారుగా ఉంటారు. రాజులు కూడా యజమానులే, అలాగే ప్రజలు కూడా, మేమూ యజమానులమే అని అంటారు. ఇక్కడ కూడా అందరూ మా భారత్ అని అంటారు కదా. మీరు కూడా శ్రీమతముపై మేము మా స్వర్గ స్థాపనను చేసుకుంటున్నాము అని అంటారు, ఆ స్వర్గములో కూడా రాజధాని ఉంటుంది, అనేక రకాల పదవులు ఉన్నాయి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి అంటారు, ఎంతగా ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని పొందుతారో అదే మళ్ళీ కల్ప-కల్పాంతరాలూ జరుగుతుంది. పరీక్షల్లో ఎవరికైనా తక్కువ మార్కులు వస్తే హార్ట్ ఫెయిల్ కూడా అయిపోతారు. ఇక్కడైతే ఇది అనంతమైన విషయము. పూర్తి పురుషార్థం చేయకపోతే నిరుత్సాహపడతారు కూడా, శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ సమయములో ఏం చేయగలుగుతారు. ఏమీ చేయలేరు. ఆత్మ ఏం చేస్తుంది! వారైతే ఆత్మహత్య చేసుకుంటారు, నీటిలో దూకి చనిపోతారు. కానీ ఇక్కడ హత్య యొక్క విషయమే లేదు. ఆత్మ యొక్క హత్య అయితే జరగదు, అది అవినాశీ. ఇకపోతే శరీరము యొక్క హత్య జరుగుతుంది, దాని ద్వారానే మీరు పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు ఇక ఈ పాత చెప్పును తీసి వేసి మేము కొత్త దైవీ చెప్పును తీసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. ఇలా ఎవరంటారు? ఆత్మ. మాకు కొత్త బట్టలు ఇవ్వండి అని పిల్లలు అంటారు కదా, అలా ఆత్మలైన మనకు కూడా కొత్త వస్త్రము కావాలి. తండ్రి అంటారు, మీ ఆత్మ కొత్తగా అయితే శరీరము కూడా కొత్తది కావాలి, అప్పుడే శోభ ఉంటుంది. ఆత్మ పవిత్రముగా అవ్వడముతో పంచ తత్త్వాలు కూడా కొత్తగా అవుతాయి. పంచ తత్వాలతోనే శరీరము తయారవుతుంది. ఆత్మ సతోప్రధానముగా ఉన్నప్పుడు శరీరము కూడా సతోప్రధానమైనదే లభిస్తుంది. ఆత్మ తమోప్రధానముగా ఉంటే శరీరము కూడా తమోప్రధానముగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటిలోని శరీరాలు తమోప్రధానముగా ఉన్నాయి, రోజురోజుకు ప్రపంచము పాతబడుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. కొత్త నుండి పాతగానైతే ప్రతి వస్తువూ అవుతుంది. పాతబడిపోయి ఇక వినాశనమైపోతుంది, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇకపోతే ఈ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ పాత ప్రపంచము మారనున్నదని మీకే తెలుసు.

ఇప్పుడు అనంతమైన తండ్రి ఎవరైతే తండ్రి, టీచర్, గురువుగా ఉన్నారో వారు పావనముగా అవ్వండి అని ఆజ్ఞను ఇచ్చారు. మహాశత్రువైన కామముపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవ్వండి. జగత్ జీతులుగా అనగా విష్ణువంశీయులుగా అవ్వండి. విషయం ఒక్కటే. ఈ పదాల అర్థము గురించి మీకు తెలుసు. మమ్మల్ని చదివించేవారు తండ్రి అని పిల్లలకు తెలుసు. మొదట ఈ పక్కా నిశ్చయముండాలి. కొడుకు పెద్దయితే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత టీచరును, ఆ తర్వాత గురువును స్మృతి చేయవలసి ఉంటుంది. భిన్న-భిన్న సమయాలలో ముగ్గురినీ తలచుకుంటారు. ఇక్కడైతే మీకు ముగ్గురూ కలిపి ఒకే సమయములో లభించారు. తండ్రి, టీచర్, గురువు ఒక్కరే. వారైతే వానప్రస్థము అన్న పదము యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. వానప్రస్థములోకి వెళ్ళాలి కావున గురువును ఆశ్రయించాలి అని భావిస్తారు. 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ నియమము ఇప్పుడే వెలువడింది. తండ్రి అంటారు - వీరి అనేక జన్మల అంతిమములో వానప్రస్థావస్థలో నేను వీరికి గురువుగా అవుతాను. 60 సంవత్సరాల తర్వాత నిర్వాణధామానికి వెళ్ళాల్సిన సమయములో సద్గురువును ఆశ్రయించాను అని ఈ బాబా కూడా అంటారు. అందరి నిర్వాణధామములోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వస్తారు. ముక్తిధామానికి వెళ్ళి మళ్ళీ పాత్రను అభినయించడానికి రావాలి. వానప్రస్థావస్థ అయితే ఎంతోమందికి వస్తుంది, అప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లోనైతే చిన్న పిల్లవాడు పుడితే, అతడిని కూడా గురువు వద్దకు తీసుకువెళ్తారు, అప్పుడు ఆ గురువుకు దక్షిణ లభిస్తుంది. క్రైస్తవులైతే క్రిస్టియనైజ్ చేయడానికి వారి ఒడిలోకి ఇస్తారు. కానీ వారెవ్వరూ నిర్వాణధామములోకి వెళ్ళరు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు, ఈశ్వరుని అంతు (పరిధి) ఏమిటి అనేది ఈశ్వరుడే తెలియజేస్తారు. ప్రారంభము నుండీ మొదలుకుని తెలియజేస్తూనే వచ్చారు. తమ అంతు ఏమిటి అనేది చెప్తారు మరియు సృష్టి జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఈశ్వరుడు స్వయమే వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారు, దీనికి భారత్ అన్న పేరే కొనసాగుతూ వస్తుంది. గీతలో కేవలం శ్రీకృష్ణుని పేరును వేసి ఎంత గందరగోళం చేసారు. ఇది కూడా డ్రామాయే, ఇది గెలుపు-ఓటముల ఆట. ఇందులో గెలుపు-ఓటములు ఎలా జరుగుతాయి అనేది తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. తాము మళ్ళీ ఓడిపోయేది ఉంది అని ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా తెలియదు. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు, శూద్రులకు కూడా తెలియదు. తండ్రే వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. హంసో అన్న పదానికి అర్థం పూర్తిగా వేరు. ఓం అర్థం వేరు. మనుష్యులు అర్థం లేకుండా ఏది తోస్తే అది అనేస్తారు. కిందకు ఏ విధంగా పడతారు, మళ్ళీ పైకి ఎలా ఎక్కుతారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. డ్రామానుసారంగా మళ్ళీ కల్పము తర్వాత తండ్రే వచ్చి తెలియజేస్తారు. ధర్మస్థాపకులెవరైతే ఉన్నారో వారు వచ్చి మళ్ళీ తమ ధర్మాలను తమ సమయమనుసారంగా స్థాపన చేస్తారు. ఈ విషయములో నంబరువారు పురుషార్థానుసారంగా అని అనరు. నంబరువారు సమయమనుసారంగా వచ్చి తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. తాను ఏ విధంగా బ్రాహ్మణ ధర్మాన్ని, ఆ తర్వాత సూర్యవంశ, చంద్రవంశ రాజ్యాలను స్థాపన చేస్తారు అనేది ఈ తండ్రి ఒక్కరే తెలియజేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యవంశీయులు, మళ్ళీ మీరే విష్ణు వంశీయులుగా అవుతారు. పదాలను చాలా జాగ్రత్తగా, ఎవరూ పొరపాటు ఎంచలేని విధంగా వ్రాయవలసి ఉంటుంది.

ఈ జ్ఞానము యొక్క ఒక్కొక్క మహావాక్యము రత్నము వంటిది, వజ్రము వంటిది అని మీకు తెలుసు. పిల్లలలో అర్థం చేయించే విషయములో చాలా రిఫైన్ నెస్ (మెరుగుదనము) కావాలి. ఏ పదమైనా పొరపాటుగా వచ్చేస్తే దానిని వెంటనే సరిచేసుకొని అర్థం చేయించాలి. అన్నింటికన్నా కఠినమైన పొరపాటు తండ్రిని మర్చిపోవడము. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞను ఇస్తారు. దీనిని మర్చిపోకూడదు. తండ్రి అంటారు, మీరు చాలా పాత ప్రేయసులు, ప్రేయసులైన మీ అందరికీ ప్రియుడు ఒక్కరే. ఆ ప్రేయసీ-ప్రియులైతే ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకొని ప్రేయసీ-ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే. ఆ ఒక్క ప్రియుడూ ఎంతమంది ప్రేయసులను స్మృతి చేస్తారు. అనేకులు ఒక్కరిని స్మృతి చేయటమైతే సహజమే, ఒక్కరు అనేకులను ఎలా స్మృతి చేస్తారు! బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము, మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా అని బాబాను అడుగుతారు. అరే, పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు స్మృతి మీరు చేయాలి, స్మృతి చేయడానికి నేనేమైనా పతితముగా ఉన్నానా? స్మృతి చేయడం మీ పని ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. ఎవరు ఎంత స్మృతి చేస్తారో మరియు సేవ కూడా బాగా చేస్తారో వారికి ధారణ జరుగుతుంది. స్మృతి యాత్ర చాలా కష్టమైనది, ఇందులోనే యుద్ధము జరుగుతుంది. 84 జన్మల చక్రాన్ని మీరు మర్చిపోతారు అనైతే కాదు. ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి. ఎంతగా మీరు స్మృతి చేస్తారో అంత ధారణ బాగా జరుగుతుంది, ఇందులో శక్తి ఉంటుంది, కావుననే స్మృతి యొక్క పదును కావాలి అని అంటారు. జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా నంబరువారుగా సర్వ శక్తులూ లభిస్తాయి. ఖడ్గాలలో కూడా పదునులో నంబరువారు తేడా ఉంటుంది. అవి స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయముగా తండ్రి ఒకటే చెప్తున్నారు - అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయండి. ప్రపంచపు వినాశనం కొరకు ఈ ఒక్క ఆటమిక్ బాంబు ఉంటుంది, ఇంకేమీ ఉండవు, దానికి సైన్యమూ అవసరం లేదు, కెప్టెన్లూ అవసరం లేదు. ఈ రోజుల్లో అక్కడ కూర్చొని ఉండగానే బాంబులు వేసే విధంగా తయారుచేసారు. మీరు ఇక్కడ కూర్చుంటూ-కూర్చుంటూ రాజ్యాన్ని తీసుకుంటారు, వారు అక్కడ కూర్చుంటూనే అందరి వినాశనమూ చేస్తారు. మీ జ్ఞాన-యోగాలు, వారి మృత్యు సామాన్లు సమానమైపోతాయి. ఇది కూడా ఆటయే. అందరూ పాత్రధారులే కదా. భక్తి మార్గము పూర్తయ్యింది, తండ్రే వచ్చి తమ మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు వ్యర్థ విషయాలను వినకండి, అందుకే చెడు వినకండి... అన్ని చిత్రాన్ని తయారుచేసారు. ఇంతకుముందు కోతులతో తయారుచేసేవారు, ఇప్పుడు మనుష్యులది తయారుచేస్తారు ఎందుకంటే ముఖము మనుష్యులది కానీ బుద్ధి కోతి వలె ఉంది, అందుకే వాటితో పోలుస్తారు. ఇప్పుడు మీరు ఎవరి సైన్యము? శివబాబా సైన్యము. వారు మిమ్మల్ని కోతుల నుండి మందిర యోగ్యులుగా తయారుచేస్తున్నారు. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు. కోతులు ఏమైనా వంతెనను నిర్మించగలవా? ఇవన్నీ కట్టుకథలు. మీరు శాస్త్రాలను నమ్ముతారా అని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే, మీరు వారితో ఇలా చెప్పండి - ఓహో, శాస్త్రాలను నమ్మనివారు ఎవరైనా ఉంటారా? మేము అందరికన్నా ఎక్కువగా నమ్మాము, మేము చదివినంతగా వాటిని మీరు కూడా చదివి ఉండరు, అర్ధకల్పము మేము వాటిని చదివాము. స్వర్గములో శాస్త్రాలు, భక్తి యొక్క ఏ విషయాలూ ఉండవు. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. అయినా కానీ తమ సమానంగా తయారుచేయలేరు. పిల్లలు మొదలైనవారి బంధనాల కారణముగా ఎక్కడకూ వెళ్ళలేరు. దీనిని కూడా డ్రామా అనే అంటారు. తండ్రి అంటారు, వారం రోజులు, 15 రోజులు కోర్సు తీసుకొని ఇక తమ సమానంగా తయారుచేయడం మొదలుపెట్టాలి. పెద్ద-పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో, అందులో రాజధాని నగరాలను చుట్టుముట్టాలి, అప్పుడు అక్కడి నుండి శబ్దం వెలువడుతుంది. గొప్ప వ్యక్తుల ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా శబ్దము వ్యాపించదు. తీవ్రముగా చుట్టుముట్టినట్లయితే అప్పుడిక ఎంతోమంది వస్తారు. తండ్రి డైరెక్షన్లు లభిస్తాయి కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానము మరియు యోగము ద్వారా మీ బుద్ధిని రిఫైన్ గా చేసుకోవాలి. తండ్రిని మర్చిపోయే పొరపాటును ఎప్పుడూ చేయకూడదు. ప్రేయసిగా అయి ప్రియుడిని స్మృతి చేయాలి.

2. బంధనముక్తులుగా అయి మీ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేయాలి. పురుషార్థములో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు.

వరదానము:-

ఒక్క నిమిషము యొక్క ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలీ అనుభవాన్ని చేసే, చేయించే ఏకాంతవాసీ భవ

ఏకాంతవాసిగా అవ్వటము అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితిలో స్థితులవ్వటము. బీజ రూప స్థితిలోనైనా స్థితులవ్వండి, లైట్-మైట్ హౌస్ స్థితిలోనైనా స్థితులై విశ్వానికి లైట్-మైట్ ను ఇవ్వండి, ఫరిశ్తాతనపు స్థితి ద్వారానైనా ఇతరులకు అవ్యక్త స్థితి యొక్క అనుభవము చేయించండి. ఒక్క క్షణమైనా లేక ఒక్క నిముషమైనా సరే, ఒకవేళ ఈ స్థితిలో ఏకాగ్రులై స్థితులైనట్లయితే స్వయానికి మరియు ఇతర ఆత్మలకు చాలా లాభాన్ని ఇవ్వగలరు. కేవలము దీని అభ్యాసము అవసరము.

స్లోగన్:-

ప్రతి సంకల్పములో, ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రతా వైబ్రేషన్లు నిండి ఉంటాయో వారే బ్రహ్మాచారి.