27-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మొత్తం ప్రపంచములో మీ వంటి
అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు, మీరు రాజఋషులు, మీరు రాజ్యము కోసం రాజయోగాన్ని
నేర్చుకుంటున్నారు’’
ప్రశ్న:-
నిరాకార
తండ్రిలో ఉన్న ఏ సంస్కారాలను సంగమములో పిల్లలైన మీరు కూడా ధారణ చేస్తారు?
జవాబు:-
నిరాకార
తండ్రిలో జ్ఞానము యొక్క సంస్కారాలు ఉన్నాయి, వారు మీకు జ్ఞానాన్ని వినిపించి పతితుల
నుండి పావనులుగా చేస్తారు, అందుకే వారిని జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని అంటారు.
పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఆ సంస్కారాలను ధారణ చేస్తారు. మమ్మల్ని భగవంతుడు
చదివిస్తున్నారు, మేము వారి నుండి విని ఇతరులకు వినిపిస్తాము అని మీరు నషాతో అంటారు.
పాట:-
చివరికి ఆ రోజు
నేటికి వచ్చింది...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఈ మహిమ ఎవరిది? ఒక్క తండ్రిది. శివాయ నమః,
ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు కదా. వారు మా తండ్రి అని పిల్లలకు తెలుసు. మనమంతా
తండ్రులమని కాదు. మొత్తం ప్రపంచములో అంతా బ్రదర్ హుడ్ (సోదర భావము) ఉంటుందని అంటూ
ఉంటారు కూడా. సన్యాసులు లేక విద్వాంసులు చెప్పినదాని అనుసారముగా ఈశ్వరుడిని
సర్వవ్యాపి అని అన్నట్లయితే ఫాదర్ హుడ్ (పితృ భావము) అయిపోతుంది. సోదర భావము
ఉన్నట్లయితే తండ్రి అనేవారు ఋజువు అవుతారు, వారి నుండే వారసత్వము లభించనున్నది.
ఫాదర్ హుడ్ (పితృ భావము) ఉన్నట్లయితే ఇక వారసత్వము అన్న మాటే ఉండదు. ఆత్మలైన మనందరి
తండ్రి ఒక్కరేనని, వారినే వరల్డ్ గాడ్ ఫాదర్ అని అంటారని పిల్లలకు తెలుసు. వరల్డ్
లో ఎవరు ఉంటారు? అందరూ సోదరులు, ఆత్మలు. అందరి గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆ తండ్రిని అందరూ
ప్రార్థిస్తారు. నమస్కారము లేక పూజ అనేది ఒక్కరికే జరగాలి. అది సతోప్రధానమైన పూజ.
జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని కూడా అర్థం చేయించారు. తండ్రి సద్గతి కోసం
జ్ఞానాన్ని ఇస్తారు. సద్గతి అని జీవన్ముక్తిధామాన్ని అంటారు. ఈ విషయాన్ని ఆత్మ
బుద్ధిలో ధారణ చేయాలి. మన ఇల్లు శాంతిధామము, దానిని ముక్తిధామము, నిర్వాణధామము అని
కూడా అంటారు. అన్నింటికన్నా మంచి పేరు శాంతిధామము. ఇక్కడైతే ఇంద్రియాలు ఉన్న
కారణముగా ఆత్మ టాకీలో ఉంటుంది, మాట్లాడవలసి ఉంటుంది. సూక్ష్మవతనములో ఉన్నది మూవీ.
సైగల ద్వారా సంభాషణ జరుగుతుంది, శబ్దము ఉండదు. మూడు లోకాల గురించి కూడా మీరు
తెలుసుకున్నారు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - బుద్ధిలో ఇవి మంచి రీతిలో
కూర్చున్నాయి. ఈ సృష్టి ఒక చక్రము వలె తిరుగుతుందని మనుష్య సృష్టి గురించే గాయనము
చేయడము జరుగుతుంది. దానిని ప్రపంచ చరిత్ర-భౌగోళికాలని అంటారు. దాని గురించి
మనుష్యులే తెలుసుకుంటారు కదా. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలను వినిపిస్తారు.
ఉన్నతోన్నతమైనవారు తండ్రి. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది
వారికే తెలుసు. ఈ చక్రాన్ని తెలుసుకోవడము ద్వారానే, మీరు చక్రవర్తి రాజులుగా అయ్యారు.
దేవతలు సంపూర్ణ నిర్వికారులని పాడుతారు కూడా. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు ఉన్నాయి కదా.
వారు సంపూర్ణ నిర్వికారులు. మనుష్యులు తమను తాము సంపూర్ణ వికారులని అనుకుంటారు.
సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులు అనగా సంపూర్ణ పావనులు ఉంటారు. కలియుగములో సంపూర్ణ
వికారులు అనగా సంపూర్ణ పతితులు ఉంటారు. ఇది భారత్ యొక్క విషయమే. దీనిని తండ్రియే
వచ్చి బుద్ధిలో కూర్చోబెడతారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. వారైతే సత్యయుగానికి
ఎక్కువ వ్యవధిని చూపించారు. లక్షల సంవత్సరాల క్రితం సత్యయుగము ఉండేదని భావిస్తారు.
కనుక ఎవరి బుద్ధిలోకి ఈ విషయాలు అసలు రానే రావు.
మనము ఇప్పుడు సంపూర్ణ
వికారుల నుండి సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలకు తెలుసు.
సంపూర్ణ పతితుల నుండి సంపూర్ణ పావనులుగా అవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు -
ఆత్మలోనే మాలిన్యము చేరుకుంది, బంగారు యుగము నుండి ఇప్పుడు ఇనుపయుగముగా అయిపోయింది.
ఇక్కడ ఆత్మను ఇలా పోల్చడము జరుగుతుంది. ఇది మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. పిల్లలైన
మీరు చాలా అదృష్టవంతులు, మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మీరు
రాజయోగములో కూర్చున్నారు, మీరు రాజఋషులు. రాజ్యము కోసం ఎప్పుడైనా ఏదైనా చదువు
ఉంటుందా? బ్యారిస్టరుగా తయారుచేస్తారు కానీ విశ్వ మహారాజుగా ఎవరు తయారుచేస్తారు?
తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇక్కడ మహారాజులుగా ఎవ్వరూ లేరు. సత్యయుగము
కోసమైతే వారు తప్పకుండా కావాలి. అందుకే తప్పకుండా ఎవరో రావాల్సి ఉంటుంది. తండ్రి
అంటారు - ఎప్పుడైతే భక్తి పూర్తయ్యేది ఉంటుందో, అప్పుడు నేను వస్తాను. ఇప్పుడు భక్తి
పూర్తి అయ్యింది. ఇక దీని గురించి మాట్లాడటానికి ఏమీ లేనే లేదు. మమ్మల్ని తండ్రి
కూర్చుని చదివిస్తున్నారు - ఈ నషా ఉండాలి. ఆత్మలైన మనల్ని నిరాకార తండ్రి అయిన
పరమపిత పరమాత్మ శివుడు చదివిస్తున్నారు. శివుని గురించైతే అసలు ఎవరికీ తెలియనే
తెలియదు. బాబా మళ్ళీ స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు. మనము వారిని మహారాజ శ్రీ నారాయణ మరియు మహారాణి శ్రీ లక్ష్మి అని అంటాము.
భక్తి మార్గములో సత్యనారాయణుడి కథను వినిపిస్తారు. అమరకథను, మూడవ నేత్రము కథను
వినిపిస్తారు. తండ్రి మూడవ నేత్రాన్ని కూడా ఇస్తారు. నరుని నుండి నారాయణునిగా అయ్యే
కథను వినిపించడము జరుగుతుంది. ఏ విషయాలైతే గడిచిపోయాయో, అవే మళ్ళీ భక్తి మార్గములో
పనికివస్తాయి. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని, మనము
హక్కుదారులమని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భగవంతుడైతే స్వర్గ రచయిత
కదా. మనము భగవంతుని సంతానము అయినప్పుడు, మరి మనము స్వర్గములో ఎందుకు లేము!
కలియుగములో ఎందుకు ఉన్నాము? పరమపిత పరమాత్మ అయితే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. పాత
ప్రపంచాన్ని భగవంతుడు రచించరు. ముందు కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు, దాని తర్వాత
పాతదానిని పడగొడతారు. మనము సత్యయుగము కోసం రాజ్యము తీసుకుంటున్నామని మీకు తెలుసు.
సత్యయుగములో ఎవరు ఉంటారు? ఈ లక్ష్మీ-నారాయణుల వంశముంటుంది, ఇంకా వేరే రాజులు కూడా
కొందరు ఉంటారు కదా. వీరికి గుర్తుగానే విజయమాల ఉంది. ఇప్పుడు మనము విజయమాలలో
స్మరించబడేందుకు పురుషార్థము చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మాల ఎందుకు
పూజించబడుతుంది, పైనున్న పుష్పము ఎవరు అని ప్రపంచములో ఎవరికీ మాల యొక్క అర్థం
తెలియదు. మాలను తిప్పుతూ, తిప్పుతూ చివరిలో పుష్పానికి నమస్కరిస్తారు, మళ్ళీ మాలను
తిప్పడము మొదలుపెడతారు. ఆలోచనలు ఎక్కడా బయటకు వెళ్ళకూడదని కూర్చుని మాలను స్మరిస్తూ
ఉంటారు. వాయిద్యము మోగినట్లుగా, లోలోపల రామ-రామ అని జపిస్తూ ఉంటారు. చాలా సాధన
చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. అయితే, చాలా భక్తి చేసేవారు ఎటువంటి
వికర్మలు చేయరు. చాలా భక్తి చేసేవారి గురించి, వీరు సత్యవాదులై ఉంటారని భావిస్తారు.
మందిరములో మాల పెట్టి ఉంటుంది, మాలను తిప్పుతూ నోటితో రామ-రామ అని జపిస్తూ ఉంటారు.
భక్తిలో పాపం జరగదని చాలామంది మనుష్యులు భావిస్తారు. నవ విధ భక్తితో మనుష్యులు
ముక్తిని పొందుతారని అంటారు కానీ అలా ఏమీ జరగదు. ఇది ఒక నాటకము. ఇందులో సతోప్రధానము,
సతో, రజో, తమోలలోకి అందరూ రావాల్సిందే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు. పైన ఎలాగైతే
స్థలం ఖాళీ అయిపోతుందో, అలాగే ఇక్కడ కూడా చాలా స్థలం ఖాళీ అయిపోతుంది. ఢిల్లీ
చుట్టుపక్కల, మధురమైన నదీ తీరాలలో రాజధాని ఉంటుంది. సముద్రము వైపు ఉండదు. ఈ బొంబాయి
మొదలైనవి ఉండవు. అది పూర్వము చేపలు పట్టే స్థలంగా ఉండేది. చేపలు పట్టేవారు అక్కడ
ఉండేవారు. ఇప్పుడు సముద్రాన్ని ఎంతగా ఎండబెట్టారు. అయినప్పటికీ చేపలు పట్టేవారు
ఉంటారు. సత్యయుగములోనైతే బొంబాయి ఉండదు. అక్కడ పర్వతాలు మొదలైనవేవీ కూడా ఉండవు.
ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరము కూడా ఉండదు. ఇక్కడ మనుష్యులు అలసిపోయినప్పుడు విశ్రాంతి
తీసుకోవడానికి వెళ్తారు. సత్యయుగములో అలసిపోయేటువంటి కష్టమేమీ ఉండదు. మీరు
స్వర్గవాసులుగా అయిపోతారు. అక్కడ అంశమాత్రము కూడా కష్టముండదు. కనుక ఇప్పుడు పిల్లలు
తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి.
తండ్రి అంటారు -
మధురమైన ప్రియమైన పిల్లలూ, శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవైతే చేయాలి.
విద్యార్థులు స్కూల్లో చదువుకుని, మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటారు. ఇంటి పనులను
కూడా చేస్తారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ చదువులోనైతే మీకు ఎటువంటి కష్టము లేదు.
ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడైతే ఒకే చదువు మరియు ఒకే పాయింటు - ‘మన్మనాభవ’,
దీనితో మీ పాపాలు నాశనమవుతాయి. భగవానువాచ కదా. గీతను భగవంతుడు ద్వాపరములో
వినిపించారని వారు భావిస్తారు. కానీ ద్వాపరములో వినిపించి ఏమి చేస్తారు?
శ్రీకృష్ణుని చిత్రములో వ్రాయబడిన వాక్యాలు చాలా బాగున్నాయి. ఈ యుద్ధము కేవలం
నిమిత్తమాత్రముగా జరుగుతుంది. అందరూ మరణించినప్పుడే కదా తిరిగి
ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్తారు. అది కూడా కేవలం యుద్ధములోనే మరణించరు! అనేక రకాల
వైపరీత్యాలు సంభవిస్తాయి. పిల్లలకు ఎటువంటి దుఃఖము కలగకూడదు. మనుష్యులకు హార్ట్
ఫెయిల్ అయినప్పుడు వారికి ఎటువంటి దుఃఖము కలగదు. మృత్యువు అంటే అలా ఉండాలి. కూర్చుని
ఉండగానే హార్ట్ ఫెయిల్ అవుతుంది, అంతే, సమాప్తము. వైద్యుడు వచ్చేసరికి ఆత్మ
వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే అందరి మృత్యువు జరగనున్నది. చివరిలో హాస్పిటల్ గాని,
డాక్టరు గాని ఉండరు. అలానే, అంత్యక్రియలు చేసేవారు ఉండరు, ఏమీ ఉండదు. అందరి ప్రాణాలు
తనువు నుండి వెళ్ళిపోతాయి. కుండపోత వర్షాలు కురుస్తాయి. మృత్యువు వచ్చేందుకు సమయమేమీ
పట్టదు. మనుష్యులు వెంటనే మరణించే విధమైన బాంబులు తయారుచేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఇటువంటి బాంబులను తయారుచేస్తూ ఉంటారు. బాంబులను అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇది
డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది డ్రామాలో తయారై, తయారుచేయబడిన ఆట. కల్ప-కల్పము
వినాశనము జరుగుతుంది. సత్యయుగములో మీకు ఈ జ్ఞానము ఉండదు. తండ్రియే వచ్చి జ్ఞానాన్ని
ఇవ్వాలి. స్థాపన పూర్తి అయ్యిందంటే ఇక తర్వాత జ్ఞానము యొక్క విషయమే ఉండదు. మళ్ళీ
రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది.
ఇప్పుడు మీరు యోగబలముతో పావనముగా అవ్వాలి. పావనముగా అయినప్పుడే సుఖధామానికి,
శాంతిధామానికి వెళ్ళగలరు. చార్టు పెట్టాల్సి ఉంటుంది. మేము తండ్రిని స్మృతి చేసి
తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఇక్కడే అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఇలా ఏ
శాస్త్రాలు మొదలైనవాటిలో వ్రాసి లేదు. చివరికి ఆ రోజు నేటికి వచ్చింది... అనే పాటను
పిల్లలు విన్నారు. భారతవాసులు మళ్ళీ రాజులకే రాజులుగా అవుతారు. రాజులకే రాజులుగా
అనగా మహారాజులుగా అవుతారు. తర్వాత త్రేతాలో రాజా-రాణులు ఉంటారు. ఎవరైతే పూజ్య
మహారాజు-మహారాణులుగా ఉండేవారో, వారు ద్వాపరములో వామ మార్గములోకి వచ్చి పూజారులుగా
అవుతారు. తామే పూజ్యులుగా, తామే పూజారులుగా అవుతారు. తండ్రి అంటారు, నేను పూజారిగా
అవ్వను. దేవతలు పూజ్యులుగా ఉంటారు. నేను పూజ్యునిగానూ అవ్వను, పూజారిగానూ అవ్వను.
భారతవాసులు దేవీ-దేవతలకే మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. మొదటిలో పూజ్యులుగా
ఉన్న లక్ష్మీ-నారాయణులే మళ్ళీ భక్తి మార్గములో శివబాబాకు పూజారులుగా అవుతారు. ఏ
శివబాబా అయితే మహారాజు-మహారాణులుగా తయారుచేసారో, వారికి మందిరాలను నిర్మించి
పూజిస్తారు. ఎవరూ కూడా ఒక్కసారిగా వికారులుగా అవ్వరు, నెమ్మది-నెమ్మదిగా అవుతారు.
వామ మార్గములో దేవతలకు సంబంధించిన గుర్తులను కూడా చూపిస్తారు. ఎవరైతే పూజ్య
లక్ష్మీ-నారాయణులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. మొట్టమొదట శివుని
మందిరాన్ని నిర్మిస్తారు. ఆ సమయములోనైతే పూజ కోసమని వజ్రాలను కట్ చేయించి లింగాన్ని
తయారుచేస్తారు. పరమాత్మ అతి చిన్న బిందువని ఎవరికీ తెలియదు. వారు పెద్ద లింగము కాదని
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలనైతే చాలా నిర్మిస్తారు. రాజులను చూసి
ప్రజలు కూడా అలాగే చేస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుంది. దానిని అవ్యభిచారీ,
సతోప్రధాన పూజ అని అంటారు, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. మీరు రజో, తమోలలోకి
వచ్చారు కావున హిందువులని పేరు పెట్టుకున్నారు. వాస్తవానికి దేవీ-దేవతలుగా ఉండేవారు.
తండ్రి అంటారు, వాస్తవానికి మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. కానీ మీరు చాలా
పతితముగా అయిపోయారు. అందుకే మిమ్మల్ని మీరు దేవతలని చెప్పుకోలేరు ఎందుకంటే
అపవిత్రముగా ఉన్నారు. హిందు అనే పేరైతే చాలా కాలం తర్వాత పెడతారు.
మనమే పూజ్యులుగా
ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంగమయుగములో పూజ్యులుగానూ లేరు,
పూజారులుగానూ లేరు. మీరు ఏమి చేస్తున్నారు? శ్రీమతమనుసారముగా పూజ్యులుగా అవుతున్నారు,
ఇతరులను కూడా అలా తయారుచేస్తున్నారు. మీరు బ్రాహ్మణులు, మీ ఆత్మ పవిత్రముగా అవుతూ
ఉంటుంది. పూర్తిగా పవిత్రముగా అయినప్పుడు, ఈ పాత శరీరాన్ని వదలాల్సి ఉంటుంది. తండ్రి
అంటారు, ఇది చాలా సహజము. వృద్ధ మాతలకు ధారణ జరగదు. అందుకే తండ్రి అడుగుతారు - నేను
ఒక ఆత్మను అని అయితే భావిస్తున్నారా? ఆత్మలోనే మంచి మరియు చెడు సంస్కారాలు ఉంటాయి.
ఆత్మ ఏ కర్మలనైతే చేస్తుందో, వాటి ఫలాన్ని మరుసటి జన్మలో అనుభవించవలసి ఉంటుంది.
తండ్రి కూడా ఆత్మలతోనే మాట్లాడుతారు. తండ్రి అంటారు - ఓ పిల్లలూ, ఆత్మాభిమానులుగా
అవ్వండి. నిరాకార శివబాబా నిరాకారీ ఆత్మలను చదివిస్తారు. నిరాకార బాబాలో జ్ఞానము
యొక్క సంస్కారాలు ఉన్నాయి. వారికి శరీరమైతే లేదు. కనుక వారు జ్ఞాన సాగరుడు,
పతిత-పావనుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. తండ్రి అంటారు, నేను వచ్చి పిల్లలైన
మిమ్మల్ని పావనముగా తయారుచేస్తాను. ఈ యుక్తి ఎంత సహజమైనది. పదము కూడా ఒకటే - ‘మన్మనాభవ’,
నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనము
బ్రాహ్మణులమని కూడా మీకు తెలుసు. తర్వాత సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా, వైశ్య,
శూద్రవంశీయులుగా అవుతాము. మనమే ఈ 84 జన్మల చక్రములోకి వస్తాము. పై నుండి కిందకు
దిగుతాము, తర్వాత బాబా వస్తారు. తప్పకుండా ఈ సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ
సృష్టి పాతదిగా అవుతుంది, దీనిని కొత్తగా తయారుచేయడానికి మళ్ళీ బాబా వస్తారు. ఈ
విషయమైతే బుద్ధిలో కూర్చుంటుంది కదా. ఈ చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు
మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు, దీనితో చక్రవర్తీ రాజులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతము అనుసారముగా పూజ్యులుగా అవ్వాలి. ఆత్మలో ఏవైతే చెడు సంస్కారాలు
ఏర్పడ్డాయో, వాటిని జ్ఞాన-యోగాలతో సమాప్తము చేయాలి. సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి.
2. శరీర నిర్వహణార్థము కర్మలు చేస్తూ కూడా చదువును చదువుకోవాలి మరియు చదివించాలి.
యోగబలముతో పావనముగా అయి రాజ్య పదవిని తీసుకోవాలి.
వరదానము:-
తమ శ్రేష్ఠ స్థితి ద్వారా మాయను స్వయం ముందు వంగేలా చేసే
హైయ్యెస్ట్ (ఉన్నతోన్నతమైన) పదవి యొక్క అధికారీ భవ
ఏ విధముగా మహాన్ ఆత్మలు ఎప్పుడూ ఎవరి ముందూ వంగరో, వారి
ముందు అందరూ వంగుతారో, అదే విధముగా తండ్రి ద్వారా ఎన్నుకోబడిన సర్వ శ్రేష్ఠ ఆత్మలైన
మీరు ఎప్పుడూ, ఎటువంటి పరిస్థితిలోనూ లేక మాయ యొక్క భిన్న-భిన్న ఆకర్షించే రూపాలలో
స్వయాన్ని వంగేలా చేసుకోరు. ఎప్పుడైతే ఇప్పటినుండే సదా వంగేలా చేసేటువంటి స్థితిలో
స్థితులై ఉంటారో, అప్పుడే హైయ్యెస్ట్ పదవి యొక్క అధికారము ప్రాప్తిస్తుంది. ఇటువంటి
ఆత్మల ముందు సత్యయుగములోని ప్రజలు స్వమానముతో వంగుతారు మరియు ద్వాపరములో మీ
స్మృతిచిహ్నాల ముందు భక్తులు వంగుతూ ఉంటారు.
స్లోగన్:-
కర్మలు చేసే
సమయములో యోగము యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నట్లయితే కర్మయోగులు అని అంటారు.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
యోగములో
కూర్చున్నప్పుడు ఆత్మ-అభిమానిగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకువస్తుంది అని
కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు. కానీ అలా ఉండకూడదు ఎందుకంటే చివరి సమయములో ఒకవేళ
అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవా సంకల్పాలు నడిచినా సెకండు యొక్క పరీక్షలో ఫెయిల్
అయిపోతారు. ఆ సమయములో బాబా తప్ప, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - ఇవి తప్ప ఇంకేమీ
గుర్తుకురాకూడదు. సేవలో ఉన్నప్పుడు ఎంతైనా సాకారములోకి వస్తారు, అందుకే ఏ సమయములో ఏ
స్థితి ఉండాలో ఆ స్థితి లేకపోతే మోసపోతారు.