ఓంశాంతి
డబుల్ ఓం శాంతి, ఎందుకంటే, ఒకటేమో తండ్రిది, ఇంకొకటి దాదాది. ఇరువురి ఆత్మలూ ఉన్నాయి
కదా. వారు పరమాత్మ, వీరు ఆత్మ. వారు కూడా - మనం పరంధామ నివాసులము అని లక్ష్యాన్ని
తెలియజేస్తారు, ఇద్దరూ ఇలా చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, అలాగే వీరు
కూడా ఓం శాంతి అని అంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు, అనగా ఆత్మలమైన మేము
శాంతిధామ నివాసులము. ఇక్కడ వేర్వేరుగా కూర్చోవాలి. ఒకరి శరీరాంగము మరొకరికి తగలకూడదు
ఎందుకంటే ప్రతి ఒక్కరి అవస్థకు మరియు యోగానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది.
కొందరు చాలా బాగా స్మృతి చేస్తారు, కొందరు ఏమాత్రమూ స్మృతి చేయరు. కావున ఎవరైతే
ఏమాత్రమూ స్మృతి చేయరో వారు పాపాత్ములు, తమోప్రధానులు మరియు ఎవరైతే స్మృతి చేస్తారో
వారు పుణ్యాత్ములు, సతోప్రధానులు. ఎంతో తేడా ఉంది కదా. ఇంట్లో కలిసే ఉంటున్నా కానీ
తేడా అయితే ఉంటుంది కదా, అందుకే భాగవతములో ఆసురీ పేర్లు ఉన్నాయి, అది ఈ సమయము యొక్క
విషయమే. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు - ఇది ఈశ్వరీయ చరిత్ర, దీనినే
భక్తి మార్గములో గానం చేస్తారు. సత్యయుగములో ఏదీ గుర్తుండదు, అన్నీ మర్చిపోతారు.
తండ్రి ఇప్పుడే శిక్షణను ఇస్తారు. సత్యయుగములో వీటిని పూర్తిగా మర్చిపోతారు, మళ్ళీ
ద్వాపరములో శాస్త్రాలు మొదలైనవాటిని తయారుచేస్తారు మరియు రాజయోగాన్ని నేర్పించేందుకు
ప్రయత్నిస్తారు, కానీ రాజయోగాన్ని అయితే నేర్పించలేరు. దానిని తండ్రి ఎప్పుడైతే
సమ్ముఖముగా వస్తారో అప్పుడే నేర్పిస్తారు. తండ్రి ఏ విధముగా రాజయోగాన్ని
నేర్పిస్తారు అనేది మీకు తెలుసు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి - మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలూ అని ఇలాగే చెప్తారు. ఈ విధంగా మనుష్యులు మనుష్యులను ఎప్పుడూ
అనలేరు. అలాగే దేవతలు దేవతలను కూడా అనలేరు. ఇలా ఆత్మిక తండ్రే ఆత్మిక పిల్లలతో
అంటారు. ఒకసారి పాత్రను అభినయించిన తర్వాత మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పాత్రను
అభినయిస్తారు ఎందుకంటే మీరు మళ్ళీ మెట్లు దిగుతారు కదా. మీ బుద్ధిలో ఇప్పుడు
ఆదిమధ్యాంతాల రహస్యము ఉంది. అది శాంతిధామము లేక పరంధామము అని మీకు తెలుసు. భిన్న,
భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలమైన మనందరమూ నంబరువారుగా అక్కడ నిరాకారీ లోకములో ఉంటాము.
ఆకాశములో నక్షత్రాలు ఎలా నిలిచి ఉన్నాయో చూస్తారు కదా, ఆధారమేమీ కనిపించదు, ఆ పైన
ఇంకే వస్తువూ లేదు, బ్రహ్మతత్వము ఉంది. ఇక్కడ మీరు భూమిపై నిలబడి ఉన్నారు, ఇది
కర్మక్షేత్రము. ఇక్కడకు వచ్చి శరీరము తీసుకుని కర్మలు చేస్తారు. తండ్రి అర్థం
చేయించారు - మీరు ఎప్పుడైతే నా నుండి వారసత్వాన్ని పొందుతారో అప్పుడు 21 జన్మలు మీ
కర్మలు అకర్మలుగా అయిపోతాయి ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అది ఈశ్వరీయ రాజ్యము,
దానిని ఇప్పుడు ఈశ్వరుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే
స్వర్గాధిపతులుగా అవుతారు అని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. స్వర్గాన్ని శివబాబా
స్థాపించారు కదా. కావున శివబాబాను మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. మొట్టమొదట
శాంతిధామాన్ని స్మృతి చేయండి, తద్వారా చక్రము కూడా గుర్తుకువస్తుంది. పిల్లలు
మర్చిపోతారు, అందుకే ఘడియ, ఘడియ గుర్తుచేయించవలసి వస్తుంది. ఓ మధురాతి మధురమైన
పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, తద్వారా మీ
పాపాలు భస్మమైపోతాయి. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను - మీరు స్మృతి చేసినట్లయితే
మిమ్మల్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తాను. తండ్రే పతిత-పావనుడు, సర్వశక్తివంతుడు,
అథారిటీ, వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వారికి మొత్తం సృష్టి యొక్క
ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. వారికి వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నింటి గురించి
తెలుసు, అందుకే వారు చెప్తున్నారు - వాటిలో సారమేమీ లేదు, గీతలో కూడా సారమేమీ లేదు
అని. అదే సర్వశాస్త్రమయి శిరోమణి, అన్నింటికీ తల్లీ, తండ్రి వంటిది, మిగిలినవన్నీ
దాని పిల్లలు. ఏ విధముగా మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మా ఉన్నారో, మిగిలినవారంతా వారి
పిల్లలో, అదీ అంతే. ప్రజాపిత బ్రహ్మాను ఆదమ్ అని అంటారు. ఆదమ్ అనగా ఆద్మీ (మనిషి).
వారు మనిషి కదా, కావున వారిని దేవత అని అనరు. ఏడమ్ ను ఆదమ్ అని అంటారు. భక్తులైతే
బ్రహ్మా ఏడమ్ ను దేవత అని అనేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఏడమ్
అనగా మనిషి, అతను దేవతా కాదు, భగవంతుడూ కాదు. లక్ష్మీ-నారాయణులు దేవతలు. దేవీ-దేవతా
ధర్మము స్వర్గములో ఉంది. అది కొత్త ప్రపంచము కదా. అది ప్రపంచ అద్భుతము. మిగిలినవన్నీ
అయితే మాయ అద్భుతాలే. ద్వాపరము తర్వాత మాయ అద్భుతాలు ఉంటాయి. ఈశ్వరీయ అద్భుతము -
హెవెన్, స్వర్గము, దానిని తండ్రే స్థాపన చేస్తారు. ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఈ
దిల్వాడా మందిరమేదైతే ఉందో, దీని విలువల గురించి ఎవరికీ తెలియదు. మనుష్యులు యాత్రలు
చేయడానికి వెళ్తారు, అన్నింటికన్నా మంచి తీర్థస్థానము ఇదే. మీరు బ్రహ్మాకుమారీ
ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, ఆబూ పర్వతము అని వ్రాస్తారు కదా. అలాగే బ్రాకెట్లో - (సర్వోత్తమ
తీర్థ స్థానము) అని కూడా వ్రాయాలి. ఎందుకంటే సర్వుల సద్గతి ఇక్కడి నుండే జరుగుతుంది
అని మీకు తెలుసు. ఇది ఎవరికీ తెలియదు. ఏ విధంగా గీత సర్వశాస్త్రమయి శిరోమణియో, అలాగే
సర్వ తీర్థాలలో కల్లా శ్రేష్ఠమైన తీర్థము ఆబూ. మనుష్యులు ఇది చదివితే అటువైపుకు వారి
ధ్యాస వెళ్తుంది. మొత్తం ప్రపంచంలోని తీర్థాలలో కల్లా ఇది అన్నింటికన్నా పెద్ద
తీర్థము, ఇక్కడ తండ్రి కూర్చుని సర్వుల సద్గతిని చేస్తారు. తీర్థాలైతే ఎన్నో
తయారయ్యాయి, గాంధీ సమాధిని కూడా తీర్థముగా భావిస్తారు. అందరూ అక్కడకు వెళ్ళి
పుష్పాలు మొదలైనవి అర్పిస్తారు, వారికేమీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు -
కావున మీకు ఇక్కడ కూర్చునే, మేము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము అని మీ హృదయంలో
ఎంతో సంతోషము కలుగుతూ ఉండాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ నన్ను స్మృతి చేయండి. చదువు కూడా చాలా సహజమైనది. ఇందులో ఏ ఖర్చూ లేదు. మీ
మమ్మాకు ఒక పైస అయినా ఖర్చు అయ్యిందా? నయా పైసా కూడా ఖర్చు లేకుండా చదువుకుని ఎంత
చురుకైనవారిగా, నంబర్ వన్ గా అయిపోయారు. రాజయోగినిగా అయ్యారు కదా. మమ్మా లాంటివారు
ఇంకెవ్వరూ వెలువడలేదు.
చూడండి, తండ్రి కూర్చుని ఆత్మలనే చదివిస్తారు, ఆత్మలకే రాజ్యం లభిస్తుంది, ఆత్మయే
రాజ్యాన్ని పోగొట్టుకుంది. ఇంత చిన్నని ఆత్మ ఎంత పని చేస్తుంది. అన్నింటికన్నా
చెడ్డ పని వికారాలలోకి వెళ్ళడం. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. చిన్న ఆత్మలో
ఎంతటి శక్తి ఉంది! మొత్తం విశ్వంపై రాజ్యం చేస్తుంది. ఈ దేవతల ఆత్మలో ఎంతటి శక్తి
ఉంది. ప్రతి ఒక్క ధర్మములోనూ వారి, వారి శక్తి ఉంటుంది కదా. క్రిస్టియన్ ధర్మములో
ఎంతటి శక్తి ఉంది. ఆత్మలో శక్తి ఉంది, అది శరీరము ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మయే
ఇక్కడకు వచ్చి ఈ కర్మక్షేత్రములో కర్మ చేస్తుంది. అక్కడ చెడు కర్తవ్యమేదీ జరగదు.
ఎప్పుడైతే రావణ రాజ్యము ఉంటుందో అప్పుడే ఆత్మ వికారీ మార్గములోకి వెళ్తుంది.
మనుష్యులైతే వికారాలు సదా ఉన్నాయి కదా అని అంటారు. మీరు అర్థం చేయించవచ్చు - అక్కడ
అసలు రావణ రాజ్యమే ఉండదు అన్నప్పుడు మరి వికారాలు ఎలా ఉంటాయి? అక్కడ ఉన్నది యోగబలము.
భారత్ యొక్క రాజయోగము ప్రసిద్ధమైనది. చాలామంది నేర్చుకోవాలనుకుంటారు కానీ మీరు
నేర్పించినప్పుడే నేర్చుకోగలుగుతారు. ఇంకెవ్వరూ దానిని నేర్పించలేరు. మహర్షి
ఉండేవారు, అతను యోగాన్ని నేర్పించేందుకు ఎంతగా కష్టపడేవారు. కానీ ఈ హఠయోగి
రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు అన్న విషయము ప్రపంచానికి తెలియదు. చిన్మయానంద వద్దకు
ఎంతమంది వెళ్తారు. నిజంగా భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని బి.కె.లు తప్ప ఇంకెవ్వరూ
అర్థం చేయించలేరు అని అతను ఒక్కసారి అంటే ఇక చాలు, కానీ ప్రస్తుతం ఆ శబ్దం
వ్యాపించడమనేది నియమములో లేదు. అందరూ అర్థం చేసుకోరు. ఎంతో కష్టం ఉంటుంది, మహిమ కూడా
చివరిలో వెలువడుతుంది. ఓహో ప్రభూ, ఓహో శివబాబా, మీ లీల అద్భుతము అని చివరిలో అంటారు
కదా. మీరు తప్ప ఇంకెవ్వరూ తండ్రిని సుప్రీమ్ తండ్రిగా, సుప్రీమ్ టీచరుగా, సుప్రీమ్
సద్గురువుగా భావించరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నడుస్తూ, నడుస్తూ మాయ
హైరానా పరచడంతో పూర్తి బుద్ధిహీనులుగా అయిపోయేవారు ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు. ఇది
చాలా పెద్ద గమ్యము. ఇది యుద్ధ మైదానము, ఇందులో మాయ ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది.
వారైతే వినాశనం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఇక్కడ పంచ వికారాలను జయించేందుకు
పురుషార్థం చేస్తున్నారు. మీరు విజయం కోసము మరియు వారు వినాశనం కోసము పురుషార్థం
చేస్తున్నారు. రెండు పనులూ కలిసే జరుగుతాయి కదా. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. మన రాజ్య
స్థాపన ఇంకా జరగలేదు కదా. రాజులు, ప్రజలు ఇప్పుడు అందరూ తయారవ్వనున్నారు. మీరు
అర్ధకల్పము కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇకపోతే మోక్షమైతే ఎవరికీ
లభించదు. ఫలానావారు మోక్షాన్ని పొందారు అని వారు అంటారు కానీ మరణించిన తర్వాత వారు
ఎక్కడకు వెళ్ళారు అన్నది వారికేమైనా తెలుసా. ఏదో అలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు.
ఎవరైతే శరీరాన్ని వదులుతారో వారు మళ్ళీ ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారని
మీకు తెలుసు. మోక్షాన్ని పొందలేరు. నీటిబుడగ నీటిలో లీనమైపోతుంది అని కాదు. తండ్రి
అంటారు - ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. పిల్లలైన మీరు
సమ్ముఖముగా వింటారు, వేడి-వేడి హల్వా తింటారు. అందరికన్నా ఎక్కువ వేడి హల్వాను ఎవరు
తింటారు? (బ్రహ్మా). వీరైతే పూర్తిగా వారికి పక్కనే కూర్చుని ఉన్నారు. వెంటనే
వింటారు మరియు ధారణ చేస్తారు, వీరే మళ్ళీ ఉన్నత పదవిని పొందుతారు. సూక్ష్మవతనములో,
వైకుంఠములో ఇతని సాక్షాత్కారాన్నే పొందుతారు. ఇక్కడ కూడా ఈ కనులతో వీరినే చూస్తారు.
తండ్రి అయితే అందరినీ చదివిస్తారు. ఇక మిగిలింది స్మృతి యొక్క పురుషార్థము. ఏ విధంగా
స్మృతిలో ఉండడం మీకు కష్టమనిపిస్తుందో, అలాగే ఇతనికి కూడా అనిపిస్తుంది. ఇందులో కృప
చూపించే విషయమేమీ లేదు. తండ్రి అంటారు - నేను అద్దెకు తీసుకున్నాను, దాని లెక్క చూసి
ఇచ్చేస్తాను. ఇకపోతే స్మృతి యొక్క పురుషార్థమునైతే ఇతను కూడా చేయవలసి ఉంటుంది. నా
పక్కన కూర్చున్నారని కూడా భావిస్తాను. తండ్రిని నేను స్మృతి చేస్తాను, అయినా మళ్ళీ
మర్చిపోతాను. అందరికంటే ఎక్కువ కృషి వీరే చేయవలసి ఉంటుంది. యుద్ధ మైదానములో మహారథులు,
పహిల్వానులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు హనుమంతుడు ఉన్నారు కదా, అతడినే మాయ
పరీక్షించింది, ఎందుకంటే అతను మహావీర్. ఎంత ఎక్కువ పహిల్వానులుగా ఉంటారో, అంత
ఎక్కువ మాయ పరీక్ష తీసుకుంటుంది, తుఫానులు ఎక్కువ వస్తాయి. బాబా, మాకు ఇలా-ఇలా
అవుతోంది అని పిల్లలు వ్రాస్తారు. బాబా అంటారు, ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి.
జాగ్రత్తగా ఉండండి అని తండ్రి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మాయ ఎన్నో
తుఫానులను తీసుకువస్తోంది అని వ్రాస్తారు. కొందరు దేహాభిమానులుగా ఉంటే వారు తండ్రికి
తెలియజేయరు. మీరు ఇప్పుడు చాలా తెలివైనవారిగా అవుతారు. ఆత్మ పవిత్రముగా అవ్వడంతో ఇక
శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అవుతుంది. ముందైతే పేదవారే
తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిధి అని మహిమ చేయబడతారు. ఇకపోతే
మిగిలినవారు ఆలస్యంగా వస్తారు. ఎప్పటివరకైతే సోదరీ, సోదరులుగా అవ్వరో అప్పటివరకూ
పరస్పరం సోదరులుగా ఎలా అవ్వగలరు? అని మీరు భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మా సంతానము
కావున సోదరీ, సోదరులవుతారు కదా. తండ్రి మళ్ళీ పరస్పరం సోదరులుగా భావించండి అని అర్థం
చేయిస్తారు. ఇది చివరి సమయములోని సంబంధము, మళ్ళీ పైకి వెళ్ళి సోదరులను కలుసుకుంటారు.
మళ్ళీ సత్యయుగములో కొత్త సంబంధము ప్రారంభమవుతుంది. అక్కడ బావమరిది, చిన్నాన్న,
మామయ్య మొదలైన అనేక సంబంధాలు ఉండవు. చాలా కొద్ది సంబంధాలే ఉంటాయి, ఆ తర్వాత పెరుగుతూ
ఉంటాయి. ఇప్పుడైతే తండ్రి అంటారు - సోదరీ, సోదరులుగా కూడా కాదు, పరస్పరం సోదరులుగా
భావించాలి. నామ-రూపాల నుండి కూడా దూరమైపోవాలి. తండ్రి సోదరులనే (ఆత్మలనే)
చదివిస్తారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కాబట్టే సోదరీ, సోదరులవుతారు కదా.
శ్రీకృష్ణుడైతే తాను స్వయమే ఒక చిన్న పిల్లవాడు, అతను సోదరులుగా ఎలా చేయగలరు? గీతలో
కూడా ఈ విషయాలు లేవు. ఇది పూర్తిగా అతీతమైన జ్ఞానము. డ్రామాలో అంతా రచింపబడి ఉంది.
ఒక్క క్షణము యొక్క పాత్ర ఇంకొక క్షణముతో కలవదు. ఎన్ని నెలలు, ఎన్ని గంటలు, ఎన్ని
రోజులు గతించేది ఉంది, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే గడుస్తాయి. తక్కువ బుద్ధి
కలవారు అంతగా ధారణ చేయలేరు, అందుకే తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావించండి,
అనంతమైన తండ్రిని స్మృతి చేయండి, ఇదైతే చాలా సహజము. పాత ప్రపంచము యొక్క వినాశనం కూడా
జరుగనున్నది. తండ్రి అంటారు, ఎప్పుడైతే సంగమం వస్తుందో అప్పుడే నేను వస్తాను. మీరే
దేవీ-దేవతలుగా ఉండేవారు. ఎప్పుడైతే వీరి రాజ్యము ఉండేదో, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది
కాదని మీకు తెలుసు. ఇప్పుడు వీరి రాజ్యము లేదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.