27-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నాజూకుతనము కూడా దేహాభిమానమే, అలగడము, ఏడ్వడము, ఈ ఆసురీ సంస్కారాలన్నీ పిల్లలైన మీలో ఉండకూడదు, దుఃఖము-సుఖము, మానావమానాలు, అన్నిటినీ సహనము చేయాలి’’

ప్రశ్న:-
సేవలో ఢీలాతనము రావడానికి ముఖ్యమైన కారణమేమిటి?

జవాబు:-
దేహాభిమానము కారణముగా ఒకరి బలహీనతలను ఒకరు చూడడం మొదలుపెట్టినప్పుడు సేవలో ఢీలాతనము వస్తుంది. పరస్పరం మనస్పర్థలు ఉండడము కూడా దేహాభిమానమే. నేను ఫలానావారితో నడవలేను, నేను ఇక్కడ ఉండలేను... ఇదంతా నాజూకుతనము. ఇటువంటి మాటలు నోటి నుండి రావడము అనగా ముల్లుగా అవ్వడము, ఆజ్ఞను ఉల్లంఘించేవారిగా అవ్వడము. మీరు ఆత్మిక మిలటరీ కనుక ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి, ఏ విషయాన్ని పెడచెవిన పెట్టకండి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని పిల్లలకు మొట్టమొదట ఈ శిక్షణ లభిస్తుంది. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. నేను ఒక ఆత్మను, దేహీ-అభిమానిగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలను. అది అజ్ఞాన కాలము. ఇది జ్ఞాన కాలము. సర్వులకూ సద్గతినిచ్చే ఆ తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తారు. మరియు వారు నిరాకారుడు అనగా వారికి మనుష్య ఆకారమేమీ లేదు. ఎవరికైతే మనుష్య ఆకారము ఉంటుందో, వారిని భగవంతుడని అనలేము. ఇప్పుడు ఆత్మలన్నీ అయితే నిరాకారీ అయినవే. కానీ దేహాభిమానములోకి రావడముతో స్వయాన్ని ఆత్మ అని మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు తిరిగి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు. ఆత్మయే పతితముగా, ఆత్మయే పావనముగా అవుతుంది. తండ్రి అర్థం చేయించారు, పావన ఆత్మలు సత్య, త్రేతాయుగాలలో ఉన్నాయి. పతిత ఆత్మలుగా తర్వాత రావణ రాజ్యములో అవుతారు. ఎవరైతే పావనముగా ఉండేవారో, వారు పతితముగా అయ్యారని మెట్ల వరుస చిత్రములో కూడా అర్థం చేయించారు. 5 వేల సంవత్సరాల క్రితం ఆత్మలైన మీరందరూ శాంతిధామములో పావనముగా ఉండేవారు. దానిని నిర్వాణధామము అని అంటారు. ఆ తర్వాత కలియుగములో పతితముగా అయినప్పుడు - ఓ పతిత పావనా రండి అని ఆర్తనాదాలు చేస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, పతితము నుండి పావనముగా అయ్యేందుకు నేను మీకు ఏ జ్ఞానమునైతే ఇస్తున్నానో, అది కేవలం నేను మాత్రమే ఇస్తాను, అది తర్వాత కనుమరుగైపోతుంది. తండ్రి మాత్రమే వచ్చి వినిపించవలసి ఉంటుంది. ఇక్కడ మనుష్యులు అనేక శాస్త్రాలను తయారుచేసారు. సత్యయుగములో శాస్త్రాలేవీ ఉండవు. అక్కడ భక్తి మార్గము అంశమాత్రము కూడా ఉండదు.

ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు నా ద్వారా మాత్రమే పతితము నుండి పావనముగా అవ్వగలరు. పావన ప్రపంచము తప్పకుండా తయారయ్యేదే ఉంది. నేనైతే పిల్లలకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. అలగడం, ఏడ్వడం, ఇదంతా ఆసురీ స్వభావము. తండ్రి చెప్తున్నారు, పిల్లలు దుఃఖము-సుఖము, మానావమానాలు అన్నిటినీ సహనము చేయాలి, నాజూకుతనము ఉండకూడదు. నేను ఫలానా స్థానములో ఉండలేను, ఇది కూడా నాజూకుతనమే. వీరి స్వభావము ఇలా ఉంది, వీరు ఇలాంటివారు, అలాంటివారు, అసలు ఇవేవీ ఉండకూడదు. నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి. ముళ్ళు వెలువడకూడదు. ఎంతోమంది పిల్లల నోటి నుండి చాలా ముళ్ళు వెలువడుతూ ఉంటాయి. ఎవరిపైనైనా కోపం చేయడం కూడా ముల్లు వంటిదే. పిల్లలకు పరస్పరములో చాలా మనస్పర్థలు ఉంటాయి. దేహాభిమానము ఉన్న కారణముగా ఇతరుల లోపాలను చూస్తూ, స్వయములోనే అనేక రకాల లోపాలు ఉండిపోతాయి, అందుకే సేవ ఢీలా అయిపోతుంది. ఇది కూడా డ్రామానుసారముగా జరుగుతుందని బాబా భావిస్తారు. కానీ పరివర్తన కూడా అవ్వాలి కదా. మిలటరీవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి పనే శత్రువులతో యుద్ధము చేయడము. వరదలు వచ్చినా లేక ఏవైనా గొడవలు జరిగినా కూడా మిలటరీవారినే పిలుస్తారు. అప్పుడు మిలటరీవారు కూలీలు మొదలైనవారు చేసే పనులు కూడా చేయడం మొదలుపెడతారు. గవర్నమెంట్ మిలటరీవారికి - ఈ మట్టినంతా నింపండి అని ఆర్డర్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆ పని చేసేందుకు రాకపోతే తుపాకీతో కాల్చేస్తారు. గవర్నమెంట్ ఆర్డర్ ను స్వీకరించవలసిందే. తండ్రి అంటున్నారు, మీరు కూడా సేవ చేసేందుకు బంధింపబడి ఉన్నారు. తండ్రి సేవ కోసం ఎక్కడికి వెళ్ళమని చెప్పినా, వెంటనే హాజరవ్వాలి. చెప్పిన మాట వినకపోతే వారిని మిలటరీ అని అనరు. అటువంటివారు బాబా హృదయాన్ని అధిరోహించరు. అందరికీ సందేశాన్ని ఇవ్వడములో మీరు తండ్రికి సహాయకులు. ఒకవేళ ఎక్కడైనా పెద్ద మ్యూజియంను తెరిస్తే, అది 10 మైళ్ళ దూరము కదా అని అంటారు, కానీ సేవ కోసమైతే వెళ్ళాలి కదా. ఖర్చు గురించి ఆలోచించకూడదు. అతి గొప్ప గవర్నమెంట్ అయిన అనంతమైన తండ్రి నుండి ఆర్డర్ లభిస్తుంది, వారి రైట్ హ్యాండ్ ధర్మరాజు. వారి శ్రీమతముపై నడవకపోతే పడిపోతారు. మీ కళ్ళను పవిత్రముగా చేసుకోండి అని శ్రీమతము చెప్తుంది. కామముపై విజయము పొందే ధైర్యాన్ని ఉంచాలి. ఇది బాబా ఆజ్ఞ. ఒకవేళ మనం పాటించకపోతే పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతాము, 21 జన్మల రాజ్యములో నష్టము వాటిల్లుతుంది. తండ్రి అంటున్నారు, నన్ను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ తెలుసుకోలేరు. కల్పక్రితమువారే నెమ్మది-నెమ్మదిగా వెలువడుతూ ఉంటారు. ఇవి పూర్తిగా కొత్త-కొత్త విషయాలు. ఇది గీతా యుగము. కానీ శాస్త్రాలలో ఈ సంగమయుగము యొక్క వర్ణన లేదు. గీతనే ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. కానీ రాజయోగము నేర్పించినప్పుడు తప్పకుండా సంగమయుగమే ఉంటుంది కదా. కానీ ఎవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క నషా ఎక్కి ఉంది. మనుష్యులకు భక్తి మార్గము యొక్క నషా ఉంది. భగవంతుడు వచ్చినా కూడా మేము భక్తిని వదలము అని అంటారు. ఉన్నతి మరియు పతనము యొక్క ఈ మెట్ల వరుస చిత్రము చాలా బాగుంది, అయినా కానీ మనుష్యుల కళ్ళు తెరుచుకోవు. మాయ నషాలో పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోయారు. జ్ఞానము యొక్క నషా చాలా ఆలస్యముగా ఎక్కుతుంది. మొదటైతే దైవీ గుణాలు కూడా కావాలి. తండ్రి ఏదైనా ఆర్డర్ చేస్తే దానిని పెడచెవిన పెట్టకూడదు. ఇది నేను చేయలేను అని ఇలా అనేవారిని ఆజ్ఞను ఉల్లంఘించేవారు అని అంటారు. ఇలా-ఇలా చేయాలి అని శ్రీమతము లభిస్తున్నప్పుడు దానిని శివబాబా యొక్క శ్రేష్ఠ మతముగా భావించాలి. వారు ఉన్నదే సద్గతిదాత. దాత ఎప్పుడూ తప్పుడు మతాన్ని ఇవ్వరు. తండ్రి అంటున్నారు, నేను వీరి అనేక జన్మల అంతిమములో ప్రవేశిస్తాను. వీరి కన్నా లక్ష్మి ఉన్నతముగా వెళ్ళిపోతారు చూడండి. స్త్రీలను ముందు పెట్టడం జరుగుతుందని గాయనము కూడా ఉంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు, యథా రాజా రాణి తథా ప్రజా ఉంటారు. మీరు కూడా ఈ విధముగా శ్రేష్ఠముగా తయారవ్వాలి. ఈ సమయములోనైతే మొత్తము ప్రపంచములో రావణ రాజ్యము ఉంది. అందరూ రామ రాజ్యము కావాలని అంటారు. ఇప్పుడు ఇది సంగమము. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు రావణ రాజ్యము లేదు, ఆ తర్వాత మార్పు ఏ విధముగా జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. అందరూ ఘోర అంధకారములో ఉన్నారు. కలియుగము ఇంకా బాల్యములో ఉందని, అంబాడుతూ ఉందని భావిస్తారు. కావున మనుష్యులు ఇంకా నిద్రలో నిద్రపోతున్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రియే ఆత్మలకు ఇస్తారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. శ్రీకృష్ణుడిని ఆత్మిక తండ్రి అని అనరు. వారు ఈ విధముగా - ఓ ఆత్మిక పిల్లలూ అని అనరు. నాలెడ్జ్ ఫుల్ అయిన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు ఇస్తున్నారని కూడా వ్రాయాలి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, ప్రపంచములోని మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఆత్మను అన్నది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు, ఏ ఆత్మ కూడా లీనమవ్వదు. ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటి, దీపావళి అంటే ఏమిటి అనేది అర్థం చేయించడం జరుగుతుంది. మనుష్యులు చేసే పూజలు మొదలైనవన్నీ అంధ విశ్వాసముతో కూడినవి, వాటిని బొమ్మల పూజ అని అంటారు, రాతి పూజ అని అంటారు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు కావున రాతి పూజ చేయకూడదు. చిత్రాల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు కూడా. జ్ఞానము అర్ధకల్పము నడిచింది, ఆ తర్వాత భక్తి ప్రారంభమయ్యింది. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది కావున భక్తిపై వైరాగ్యము కలుగుతుంది. ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది. కలియుగములో భక్తి ఉంది. సత్యయుగములో భక్తి ఉండదు. అక్కడ ఉండేదే పూజ్యులు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు ఎందుకు తల వంచి నమస్కరిస్తారు, అర్ధకల్పముగా మీరు నుదురు కూడా అరిగిపోయేలా చేసుకున్నారు, ధనాన్ని కూడా పోగొట్టుకున్నారు, కానీ ఏమీ లభించలేదు. మాయ మీ తలను పూర్తిగా తిప్పేసింది. నిరుపేదగా చేసేసింది. మళ్ళీ తండ్రి వచ్చి అందరి తలలను సరి చేస్తారు. ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా కొంతమంది యూరోపియన్లు కూడా అర్థం చేసుకుంటారు. బాబా అర్థం చేయించారు, ఈ భారతవాసులైతే పూర్తిగా తమోగుణీగా అయిపోయారు. ఇతర ధర్మాలవారు ఇంకా వెనుక వస్తారు కావున వారికి సుఖము కూడా కొద్దిగా, దుఃఖము కూడా కొద్దిగానే లభిస్తుంది. భారతవాసులకు సుఖము కూడా ఎక్కువే, దుఃఖము కూడా ఎక్కువే ఉంటుంది. ప్రారంభములోనే ఎంతమంది ధనవంతులుగా, పూర్తిగా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇతర ధర్మాలవారెవ్వరూ ప్రారంభములోనే ధనవంతులుగా అవ్వరు. వారు తర్వాత వృద్ధి చెందుతూ-చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అందరికన్నా బికారిగా కూడా భారత్ యే అయ్యింది. అంధ విశ్వాసము కలది కూడా భారత్ యే. ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. తండ్రి అంటారు, నేను దేనినైతే స్వర్గముగా తయారుచేసానో, అది నరకముగా అయిపోయింది. మనుష్యులు కోతిబుద్ధి కలవారిగా అయిపోయారు, నేను వచ్చి వారిని మందిరయోగ్యులుగా చేస్తాను. వికారాలు చాలా కఠినముగా ఉంటాయి. క్రోధము ఎంత ఉంది. మీలో ఏ క్రోధము ఉండకూడదు. పూర్తిగా మధురముగా, శాంతిగా, అతి మధురముగా అవ్వండి. రాజ్య పదవిని పొందేవారు కోట్లలో ఏ ఒక్కరో మాత్రమే వెలువడుతారని కూడా మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా చేసేందుకు వచ్చాను. అందులో కూడా అష్ట రత్నాలు ముఖ్యమైనవారు అని అంటూ ఉంటారు. అష్ట రత్నాలు మరియు మధ్యలో తండ్రి ఉన్నారు. 8 మంది పాస్ విత్ ఆనర్స్ అవుతారు, అది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అవుతారు. దేహాభిమానాన్ని తొలగించుకోవడానికి చాలా కృషి చేయవలసి ఉంటుంది. దేహ భానము పూర్తిగా తొలగిపోవాలి. కొంతమంది పక్కా బ్రహ్మ జ్ఞానుల విషయములో కూడా ఇలాగే జరుగుతుంది. వారు కూర్చుని-కూర్చునే దేహాన్ని త్యజిస్తారు. వారు కూర్చుని-కూర్చునే అలా శరీరాన్ని విడిచిపెడతారు, వాయుమండలము పూర్తిగా శాంతిగా అయిపోతుంది మరియు చాలావరకు శుద్ధమైన ప్రభాత సమయములో శరీరాన్ని విడిచిపెడతారు. రాత్రివేళ మనుష్యులు చాలా అశుద్ధముగా ఉంటారు, ఉదయము స్నానము చేసి భగవంతుడా-భగవంతుడా అని అనడం మొదలుపెడతారు, పూజలు చేస్తారు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రదర్శినీ మొదలైనవాటిలో కూడా మొట్టమొదట మీరు భగవంతుడి పరిచయాన్ని ఇవ్వండి. మొదట భగవంతుడు, ఆ తర్వాత రాజ్యాధికార వారసత్వము. ఆ నిరాకారుడు ఒక్కరే తండ్రి. రచయిత అయిన తండ్రియే కూర్చుని రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. ఆ తండ్రే చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహ సంబంధాలను విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు తండ్రి పరిచయాన్ని ఇస్తే ఇక ఎవ్వరికీ ప్రశ్నలు అడిగే ధైర్యము ఉండదు. మొదట తండ్రిపై నిశ్చయము పక్కా అవ్వాలి, ఆ తర్వాత 84 జన్మలు ఈ విధముగా తీసుకోవడం జరుగుతుందని చెప్పండి. చక్రాన్ని అర్థం చేసుకుంటే, తండ్రిని అర్థం చేసుకుంటే ఇక ఏ ప్రశ్నలు రావు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా మీరు మిగిలిన విషయాలు ఎన్ని చెప్పినా సరే, అందులో మీ సమయము చాలా వృధా అవుతుంది. గొంతే ఎండిపోతుంది. మొట్టమొదట భగవంతుడి గురించి చెప్పండి. మిగతా విషయాలను ఎక్కువగా మాట్లాడడం వలన ఏమీ అర్థం చేసుకోలేరు. పూర్తిగా సింపుల్ గా మరియు నెమ్మదిగా కూర్చుని అర్థం చేయించాలి, ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేయించగలరు. పెద్ద-పెద్ద మ్యూజియంలలో బాగా అర్థం చేయించగలిగేవారు సహాయాన్ని అందించవలసి ఉంటుంది. కొన్ని రోజులు మీ సెంటర్లను వదిలి సహాయము అందించడానికి రావాలి. మీ వెనుక సెంటరును సంభాళించడానికి ఎవరినైనా కూర్చోబెట్టండి. ఒకవేళ ఎవరినీ తమ సమానముగా గద్దెను సంభాళించేందుకు యోగ్యముగా తయారుచేయకపోతే, ఇక దేనికీ పనికి రారని, సేవ చేయలేదని బాబా భావిస్తారు. సేవను వదిలి ఎలా వెళ్ళాలి అని బాబాకు వ్రాస్తారు. అరే, ఫలానా స్థానములో ప్రదర్శినీ ఉంది, సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు. ఒకవేళ ఎవరినీ గద్దెకు యోగ్యులుగా చేయకపోతే మీరు దేనికి పనికొస్తారు. బాబా ఆజ్ఞాపించారు - వెంటనే పరుగెత్తాలి. అటువంటివారిని మహారథీ బ్రాహ్మణీ అని అంటారు. మిగిలినవారంతా గుర్రపు స్వారీ వారు, పాదచారులు. అందరూ సేవలో సహాయము చేయాలి. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎవరినీ మీ సమానముగా తయారుచేయలేదంటే మీరు ఏమి చేస్తూ ఉన్నారు. ఇంత కాలము సెంటరును సంభాళించే సందేశకులను తయారుచేయలేదా. రకరకాల మనుష్యులు వస్తారు - వారితో మాట్లాడే తెలివి కూడా ఉండాలి. మురళిని కూడా తప్పకుండా రోజూ చదవాలి లేదా వినాలి. మురళిని చదవలేదంటే ఆబ్సెంట్ పడినట్లే. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని చుట్టుముట్టాలి. మీరు మొత్తం విశ్వానికి సేవ చేస్తారు కదా. పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేయడము, ఇది చుట్టుముట్టడము కదా. అందరికీ ముక్తి-జీవన్ముక్తి ధామాల మార్గాన్ని తెలియజేయాలి, దుఃఖము నుండి విడిపించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చాలా మధురముగా, శాంతిగా, అతి మధురమైన స్వభావము కలవారిగా అవ్వాలి. ఎప్పుడూ కూడా క్రోధము చేయకూడదు. మీ కళ్ళను చాలా-చాలా పవిత్రముగా తయారుచేసుకోవాలి.

2. బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే పాటించాలి. మొత్తం విశ్వాన్ని పతితము నుండి పావనముగా తయారుచేసే సేవను చేయాలి అనగా చుట్టుముట్టాలి.

వరదానము:-
తండ్రి స్మృతి ద్వారా అసంతుష్టతతో కూడిన పరిస్థితులలో సదా సుఖాన్ని మరియు సంతుష్టతను అనుభూతి చేసే మహావీర్ భవ

సదా తండ్రి స్మృతిలో ఉండేవారు ప్రతి పరిస్థితిలోనూ సదా సంతుష్టముగా ఉంటారు ఎందుకంటే జ్ఞానమనే శక్తి యొక్క ఆధారముతో పర్వతములాంటి పరిస్థితి కూడా ఆవగింజలా అనుభవమవుతుంది, ఆవగింజ అంటే అసలు ఏమీ లేనట్లే. పరిస్థితి అసంతుష్టతతో కూడినది అయినా, దుఃఖపు ఘటన జరిగినా కానీ, దుఃఖపు పరిస్థితిలో కూడా సుఖపు స్థితి ఉండాలి, అప్పుడు మహావీర్ అని అంటారు. ఏది ఏమైనా కానీ, నథింగ్ న్యూ అనగా కొత్త ఏమీ కాదు అన్న భావనతోపాటుగా తండ్రి స్మృతి ద్వారా సదా ఏకరస స్థితి ఉండగలదు, అప్పుడిక దుఃఖము, అశాంతి యొక్క అల కూడా రాదు.

స్లోగన్:-
మీ దైవీ స్వరూపము సదా స్మృతిలో ఉన్నట్లయితే ఎవ్వరికీ మీ వైపు వ్యర్థమైన దృష్టి కలగదు.


అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చేయండి

సైన్స్శక్తి యొక్క ప్రయోగము లైట్(విద్యుత్తు) ఆధారముగా జరుగుతుంది. కంప్యూటర్పని చేసినా కానీ కంప్యూటర్మైట్కానీ దాని ఆధారము లైట్. అలా మీ సైలెన్స్శక్తికి కూడా ఆధారము లైట్. ప్రకృతిలోని ఆ లైట్అనేక రకాల ప్రయోగాలను ప్రాక్టికల్ లో చేసి చూపించినప్పుడు మరి మీది అవినాశీ పరమాత్మ లైట్, ఆత్మిక లైట్మరియు అలాగే ప్రాక్టికల్స్థితి కూడా లైట్, కావున దీనితో సాధ్యము కానీ ప్రయోగమంటూ ఏముంటుంది!