27-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ దుఃఖపు రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి, మీరు ఇప్పుడు ఎటువంటి ప్రపంచములోకి వెళ్తున్నారంటే అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు’’

ప్రశ్న:-
ఏ రెండు పదాల రహస్యము మీ బుద్ధిలో ఉన్న కారణముగా పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము కలుగుతుంది?

జవాబు:-
దిగే కళ మరియు ఎక్కే కళ యొక్క రహస్యము మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పము మనము దిగుతూనే వచ్చాము, ఇప్పుడు ఇది ఎక్కే సమయము అని మీకు తెలుసు. తండ్రి నరుని నుండి నారాయణునిగా తయారుచేసే సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారు. మన కొరకు ఇప్పుడు కలియుగము పూర్తయిపోయింది, కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే దీని పట్ల అనంతమైన వైరాగ్యము ఉంది.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - పురుషోత్తమ సంగమయుగము ఇదొక్కటే, కల్ప-కల్పము ఈ సమయములోనే తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. మానవా అనగా ఆత్మ, ఓ ఆత్మ ఓర్పు వహించు అని తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు. వారు ఆత్మలతో మాట్లాడుతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. ఆత్మ అంటుంది - నేను అవినాశీ ఆత్మను, నా ఈ శరీరము వినాశీ అయినది. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను కల్పము యొక్క సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వచ్చి - ఇప్పుడు సుఖమయమైన రోజులు రాబోతున్నాయి అని పిల్లలైన మీకు ఓదార్పును ఇస్తాను. ఇప్పుడు మీరు దుఃఖధామములో, రౌరవ నరకములో ఉన్నారు. కేవలం మీరు మాత్రమే కాదు, పూర్తి ప్రపంచమంతా రౌరవ నరకములోనే ఉంది. నా పిల్లలుగా అయిన మీరు, రౌరవ నరకము నుండి బయట పడి స్వర్గములోకి వెళ్తున్నారు. సత్య, త్రేతా, ద్వాపరయుగాలు గడిచిపోయాయి. మీ కొరకు కలియుగము కూడా గడిచిపోయింది. మీ కోసం ఇది పురుషోత్తమ సంగమయుగము, ఈ సమయములో మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఆత్మ ఎప్పుడైతే సతోప్రధానముగా అయిపోతుందో, అప్పుడిక ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది. సతోప్రధాన ఆత్మకు సత్యయుగములో కొత్త శరీరము కావాలి. అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామములోకి వెళ్ళాలి, దాని కోసం పురుషార్థము చేయాలి. సుఖధామములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన జ్ఞానము. భక్తి మార్గములో ప్రతి పౌర్ణమి నాడు కథ వింటూ వచ్చారు, కానీ అది ఉన్నదే భక్తి మార్గము. దానిని సత్యమైన మార్గమని అనరు, జ్ఞాన మార్గము సత్యమైన మార్గము. మీరు మెట్లు దిగుతూ-దిగుతూ అసత్య ఖండములోకి వస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, మనము సత్యమైన తండ్రి నుండి ఈ జ్ఞానము పొంది 21 జన్మల కొరకు దేవీ-దేవతలుగా అవుతాము. ఒకప్పుడు మనము అలానే ఉండేవారము, ఆ తర్వాత మెట్లు దిగుతూ వచ్చాము. దిగే కళ మరియు ఎక్కే కళ యొక్క రహస్యము మీ బుద్ధిలో ఉంది. ఓ బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. ఒక్క తండ్రియే పావనముగా తయారుచేసేవారు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు సత్యయుగములో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖముగా ఉండేవారు. ఇప్పుడు ఇంకా కొంచెం సమయమే మిగిలి ఉంది. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. కొత్త ప్రపంచములో ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఇప్పుడు ఎన్ని ద్వైతములు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. ఎలాగైతే మనుష్యుల వృక్షము పెరుగుతూ ఉంటుందో, అలా భాషల వృక్షము కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి అని గాయనముంది కదా. ఇది మనుష్యుల బుద్ధిలో కూర్చోదు. తండ్రియే దుఃఖము యొక్క పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి సుఖము యొక్క కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా దైవీ ధర్మ స్థాపన అని వ్రాయబడి ఉంది. ఇది రాజయోగము యొక్క చదువు. గీతలో ఏ జ్ఞానమైతే వ్రాయబడి ఉందో, తండ్రి దానిని సమ్ముఖములో వినిపించారు, దానిని మళ్ళీ మనుష్యులు కూర్చుని భక్తి మార్గము కోసం వ్రాసారు, దాని ద్వారా మీరు దిగిపోతూ వచ్చారు. ఇప్పుడు మీరు పైకి ఎక్కడం కోసం భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. భక్తిని దిగే కళ యొక్క మార్గము అనే అంటారు. జ్ఞానము ఎక్కే కళ యొక్క మార్గము. ఇది అర్థం చేయించడానికి మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థం చేసుకోని కారణముగా విరోధించేవారు కూడా ఉంటారు, శాస్త్ర వాదన చేస్తారు. కానీ మీరు ఎవరితోనూ కూడా శాస్త్ర వాదన చేయకూడదు. మీరు ఈ విధముగా చెప్పండి - శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు చదవడము లేక గంగా స్నానాలు చేయడం, తీర్థ స్థానాలకు వెళ్ళడము మొదలైనవన్నీ భక్తి కాండము. భారత్ లో రావణుడు కూడా తప్పకుండా ఉన్నాడు, అతని దిష్టిబొమ్మను కాలుస్తారు. మామూలుగా కూడా శత్రువుల దిష్టిబొమ్మను కాలుస్తారు కానీ అల్పకాలము కొరకు కాలుస్తారు. ఈ ఒక్క రావణుడి దిష్టిబొమ్మను మాత్రం ప్రతి సంవత్సరము కాలుస్తూనే ఉంటారు. తండ్రి అంటారు, మీరు బంగారుయుగ బుద్ధి నుండి ఇనుపయుగ బుద్ధి కలవారిగా అయిపోయారు. మీరు ఎంత సుఖముగా ఉండేవారు. తండ్రి వచ్చేదే సుఖధామాన్ని స్థాపన చేయడానికి. ఆ తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గము మొదలవుతుందో, అప్పుడు దుఃఖితులుగా అవుతారు. అప్పుడు సుఖదాతను స్మృతి చేస్తారు, అది కూడా నామమాత్రముగా చేస్తారు ఎందుకంటే వారి గురించి తెలియదు. గీతలో పేరు మార్చేసారు. మొట్టమొదట మీరు అర్థం చేయించండి - ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే, స్మృతి కూడా వారినే చేయాలి. ఒక్కరినే స్మృతి చేయాలి, దానినే అవ్యభిచారి స్మృతి, అవ్యభిచారి జ్ఞానమని అంటారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కనుక భక్తి చేయరు. మీకు జ్ఞానము ఉంది. తండ్రి చదివిస్తారు, దాని ద్వారా మనము ఈ విధముగా దేవతలుగా అవుతాము. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అందుకే బాబా అంటారు, మీరు చార్టు పెట్టండి, అప్పుడు నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా అన్నది తెలుస్తుంది. దేహాభిమానము మొదటి అవగుణము, ఆ తర్వాత శత్రువు కామము. కామముపై విజయము పొందినట్లయితేనే మీరు జగత్ జీతులుగా అవుతారు. మీ ఉద్దేశ్యమే ఇది, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యములో అనేక ధర్మాలేవీ ఉండేవి కావు. సత్యయుగములో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుష్యులు కలియుగములో ఉంటారు. దేవతలు కూడా మనుష్యులే కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఈ సమయములోనే మనుష్యులందరూ ఆసురీ గుణాలు కలవారు. సత్యయుగములో కామము అనే మహాశత్రువు ఉండదు. తండ్రి అంటారు, ఈ కామము అనే మహాశత్రువుపై విజయాన్ని పొందడము ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. అక్కడ రావణుడు ఉండడు. ఇది కూడా మనుష్యులు అర్థం చేసుకోలేరు. బంగారుయుగము నుండి దిగిపోతూ-దిగిపోతూ తమోప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. దాని కోసం ఒకే మందు లభిస్తుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయని తండ్రి చెప్తున్నారు. మీరు పాపాలను భస్మము చేసుకునేందుకు కూర్చున్నారు కావున ఇక మున్ముందు పాపాలు చేయకూడదు. లేదంటే అది వంద రెట్లు అయిపోతుంది. వికారాలలోకి వెళ్తే 100 రెట్లు శిక్ష లభిస్తుంది, అప్పుడు వారు కష్టం మీద మళ్ళీ ఎక్కగలరు. మొదటి నంబరు శత్రువు ఈ కామము. 5 అంతస్థుల నుండి పడిపోతే ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి. మరణించవచ్చు కూడా. పై నుండి పడిపోతే పూర్తిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. తండ్రికి చేసిన ప్రతిజ్ఞను ఉల్లంఘించి నల్ల ముఖము చేసుకున్నారంటే ఆసురీ ప్రపంచములోకి వెళ్ళిపోయినట్లే. ఇక్కడ నుండి మరణించినట్లు అవుతుంది. వారిని బ్రాహ్మణులని కూడా కాదు, శూద్రులని అంటారు.

తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. ముందు ఆ నషా ఉండాలి. ఒకవేళ శ్రీకృష్ణ భగవానువాచ అనుకున్నా కూడా, వారైనా సరే తప్పకుండా చదివించి తన సమానముగా తయారుచేస్తారు కదా. కానీ శ్రీకృష్ణుడు అయితే భగవంతుడు కాలేరు. వారు పునర్జన్మలలోకి వస్తారు. తండ్రి అంటారు, నేను మాత్రమే పునర్జన్మ రహితుడను. రాధా-కృష్ణులు అన్నా, లక్ష్మీ-నారాయణులు అన్నా లేక విష్ణువు అన్నా, విషయము ఒక్కటే. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు మరియు లక్ష్మీ-నారాయణులే బాల్యములో రాధా-కృష్ణులు. బ్రహ్మా గురించిన రహస్యాన్ని కూడా అర్థం చేయించారు - బ్రహ్మా-సరస్వతులే లక్ష్మీ-నారాయణులు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు. వీరికి చివరిలో బ్రహ్మా అన్న పేరు పెట్టారు. ఇకపోతే ఈ బ్రహ్మాను చూడండి, పూర్తిగా ఇనుపయుగములో నిలబడి ఉన్నారు. వీరే మళ్ళీ తపస్య చేసి శ్రీకృష్ణునిగా లేక శ్రీనారాయణునిగా అవుతారు. విష్ణువు అని అనడముతో అందులో ఇద్దరూ వచ్చేస్తారు. బ్రహ్మా పుత్రిక సరస్వతి. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. నాలుగు భుజాలను బ్రహ్మాకు కూడా చూపిస్తారు ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము కదా. నివృత్తి మార్గము వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తాము పదండి అని విదేశాల నుండి చాలామందిని నమ్మించి తీసుకువస్తారు. వాస్తవానికి సన్యాసులైతే రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చారు, మీరు ఇప్పుడు వారి పిల్లలుగా, ఈశ్వరీయ సాంప్రదాయులుగా అయ్యారు. ఈశ్వరుడు మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారు అయితే నిరాకారుడు. బ్రహ్మా ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. వారిని మీరు బాబా-బాబా అని అంటారు, బ్రహ్మా అయితే మధ్యలో అనువాదము చేసేవారు. వీరు భాగ్యశాలి రథము. వీరి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. మీరు కూడా పతితుల నుండి పావనులుగా అవుతారు. తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, ఆసురీ సాంప్రదాయము కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు, పావనముగా అవుతున్నారు. సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే తండ్రి అంటారు, స్త్రీ-పురుషులు ఇరువురూ ఇంటిలో కలిసే ఉండండి, స్త్రీ నాగిని కావున మేము వేరైపోతే విముక్తులైపోతాము అని భావించకూడదు. మీరు పారిపోకూడదు. అలా పారిపోవడమనేది హద్దు యొక్క సన్యాసము, మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కానీ మీకు ఈ వికారీ ప్రపంచము పట్ల వైరాగ్యముంది. ఈ విషయాలన్నింటినీ మీరు మంచి రీతిలో ధారణ చేయాలి, నోట్ చేసుకోవాలి మరియు పథ్యము కూడా పాటించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. శ్రీకృష్ణుని గుణాలు గాయనము చేయబడతాయి కదా. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. బాబా అలా తయారవ్వరు, మిమ్మల్ని అలా తయారుచేస్తారు. మళ్ళీ అర్ధకల్పము తర్వాత మీరు కిందకు దిగుతారు, తమోప్రధానముగా అవుతారు. నేను అలా తయారవ్వను, ఇతను తయారవుతారు. 84 జన్మలు కూడా వీరే తీసుకున్నారు. వీరు కూడా ఇప్పుడు సతోప్రధానముగా అవ్వాలి, వీరు పురుషార్థీ. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోలోకి వస్తుంది. చిన్న పిల్లలను కూడా మహాత్ములని అంటారు ఎందుకంటే వారిలో వికారాలు ఉండవు, అందుకే వారిని పుష్పాలని అంటారు. సన్యాసుల కంటే చిన్న పిల్లలను ఉత్తములని అంటారు ఎందుకంటే సన్యాసులైతే ఎంతైనా కొంత జీవితాన్ని గడిపి వస్తారు కదా. వారికి పంచ వికారాల అనుభవముంది. పిల్లలకైతే అవి తెలియనే తెలియవు, అందుకే పిల్లలను చూస్తే సంతోషము కలుగుతుంది, వారు చైతన్య పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గము.

ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. అమరలోకములోకి వెళ్ళేందుకు మీరందరూ పురుషార్థము చేస్తారు, మృత్యులోకము నుండి ట్రాన్స్ఫర్ అవుతారు. దేవతలుగా అవ్వాలంటే దాని కోసం ఇప్పుడు కృషి చేయవలసి ఉంటుంది, ప్రజాపిత బ్రహ్మా పిల్లలు పరస్పరము సోదరీ-సోదరులు అవుతారు. సోదరీ-సోదరులుగానే ఉండేవారు కదా. ప్రజాపిత బ్రహ్మా యొక్క పిల్లలు పరస్పరములో ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మా అని అంటూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా అవ్వనంతవరకు, సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మాకు అందరూ ఆత్మిక పిల్లలే. ఆ బ్రాహ్మణులు దైహిక యాత్రలు చేస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తారు. వారు పతితులు, మీరు పావనమైనవారు. వారేమీ ప్రజాపితకు సంతానము కారు, ఇది మీరు అర్థం చేసుకుంటారు. సోదరీ-సోదరులుగా భావించినప్పుడే వికారాలలోకి వెళ్ళకుండా ఉంటారు. తండ్రి కూడా అంటారు, అప్రమత్తముగా ఉండండి, నా పిల్లలుగా అయి వికారీ పనులేవీ చేయకండి, లేదంటే రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇంద్రసభ యొక్క కథ కూడా ఉంది. శూద్రుడిని తీసుకుని రాగానే ఇంద్రసభలో అతని దుర్వాసన రావడము మొదలైంది. అప్పుడు పతితుడిని ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావని అడిగారు. ఇక ఆమెకు శాపము ఇచ్చారు. వాస్తవానికి ఈ సభలోకి కూడా పతితులెవ్వరూ రాకూడదు. తండ్రికి తెలిసినా, తెలియకపోయినా సరే, తమను తామే నష్టపరచుకుంటారు, ఇంకా 100 రెట్ల శిక్ష పడుతుంది. పతితులకు అనుమతి లేదు. వారికి విజిటింగ్ రూమ్ సరిపోతుంది. ఎప్పుడైతే పావనముగా అవుతామని గ్యారెంటీ ఇస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో, అప్పుడు అనుమతించబడతారు. దైవీ గుణాలను ధారణ చేయడానికి సమయము పడుతుంది. పావనముగా అయ్యే ప్రతిజ్ఞ ఒకటే ఉంది.

దేవతల మహిమ మరియు పరమాత్ముని మహిమ వేర్వేరు అని కూడా అర్థం చేయించారు. పతిత-పావనుడు, ముక్తిదాత, మార్గదర్శకుడు తండ్రి మాత్రమే. అన్ని దుఃఖాల నుండి విముక్తులను చేసి తమ శాంతిధామానికి తీసుకువెళ్తారు. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము, ఇది కూడా చక్రమే. ఇప్పుడు దుఃఖధామాన్ని మర్చిపోవాలి. నంబరువారుగా పాస్ అయినవారే శాంతిధామము నుండి సుఖధామములోకి వస్తారు, వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి, అందరి పాత్ర నంబరువారుగా ఉంది. వెళ్ళడము కూడా నంబరువారుగానే వెళ్తారు. దానిని శివబాబా వంశవృక్షము లేక రుద్రమాల అని అంటారు. నంబరువారుగా వెళ్తారు, మళ్ళీ నంబరువారుగానే వస్తారు. ఇతర ధర్మాలవారి విషయములో కూడా ఇలాగే జరుగుతుంది. పిల్లలకు రోజూ అర్థం చేయించడము జరుగుతుంది, స్కూలులో రోజూ చదువుకోకపోతే, మురళి వినకపోతే, ఆబ్సెంట్ అయిపోతారు. చదువు యొక్క లిఫ్ట్ అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో ఆబ్సెంట్ అవ్వకూడదు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది, దీనితో మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడైతే ధాన్యమంతా ఉచితముగా లభిస్తుంది, ఖర్చు అవ్వదు. ఇప్పుడైతే ఎంత ధర ఉంది. 100 సంవత్సరాలలో ధర ఎంతగా పెరిగిపోయింది. కష్టాలు వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అది ఉన్నదే సుఖధామము. మీరు ఇప్పుడు అక్కడి కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. షావుకారులు తమను తాము బికారులుగా భావించరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంపూర్ణ పావనముగా అవుతామని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానిని తెంచకూడదు. చాలా-చాలా పథ్యమును ఉంచాలి. నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా అని తమ చార్టును చూసుకోవాలి.

2. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి యజమానులుగా అయ్యే ఉన్నతమైన చదువును ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. మురళిని ప్రతిరోజూ తప్పనిసరిగా వినాలి.

వరదానము:-
ప్రతి క్షణము, ప్రతి సంకల్పము యొక్క మహత్వాన్ని తెలుసుకుని పుణ్యము యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పదమాపదమపతి భవ

పుణ్యాత్ములైన మీ సంకల్పాలలో ఎంతటి విశేషమైన శక్తి ఉందంటే, ఆ శక్తి ద్వారా మీరు అసంభవాన్ని కూడా సంభవము చేయగలరు. ఏ విధముగా ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారి వంటి భూములను కూడా పచ్చదనముతో నిండుగా చేస్తున్నారో, పర్వతాలపై కూడా పుష్పాలను పూయిస్తున్నారో, అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరుత్సాహులను ఉత్సాహవంతులుగా చేయగలరు. కేవలం ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము యొక్క విలువను తెలుసుకుని సంకల్పాలను మరియు క్షణములను ఉపయోగించి పుణ్యము రూపీ మూలధనాన్ని జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైనదంటే ఒక్క సంకల్పము కూడా పదమాపదమపతులుగా చేస్తుంది.

స్లోగన్:-
ప్రతి కర్మను అధికారీతనపు నిశ్చయము మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

కర్మాతీత స్థితిని పొందేందుకు విశేషముగా స్వయములో సర్దుబాటు శక్తిని మరియు ఇముడ్చుకునే శక్తిని ధారణ చెయ్యటము తప్పనిసరి. కర్మ బంధనము కల ఆత్మలు ఎక్కడ ఉంటే అక్కడే కార్యము చెయ్యగలరు, కానీ కర్మాతీత ఆత్మలు ఒకే సమయములో నలువైపులా తమ సేవా పాత్రను అభినయించగలరు ఎందుకంటే వారు కర్మాతీతులు. వారి స్పీడ్ చాలా వేగవంతముగా ఉంటుంది, క్షణములో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు, కావున ఈ అనుభూతిని పెంచండి.