28-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.11.2010


‘‘ప్రతి గంట 5 స్వరూపాల ఎక్సర్ సైజ్ చేసి మనసును శక్తిశాలిగా చేసుకోండి, బాబాయే మీ ప్రపంచమైనప్పుడు మరి సంస్కారాలు కూడా బాబా వలె తయారుచేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా ఒకే దేశానికి చెందిన పిల్లలందరినీ కలుసుకోవడానికి వచ్చారు. ఆ దేశము అందరి ఒరిజినల్ దేశము. ఆ ఒక్క దేశము ఎంత ప్రియమైనదో మీ అందరికీ తెలుసు కదా! బాప్ దాదా కూడా పిల్లలందరినీ కలుసుకోవడానికి ఆ దేశము నుండే వచ్చారు. పిల్లలకు బాబాను కలుసుకున్నామన్న సంతోషము ఉంది మరియు బాబాకు పిల్లలను కలుసుకున్నానన్న సంతోషము ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి స్వరూపాలను, విశేషముగా 5 స్వరూపాలను చూస్తున్నారు. అందుకే పంచముఖి బ్రహ్మా యొక్క గాయనము కూడా ఉంది. మరి మీ 5 రూపాలు గురించి తెలుసు కదా! మొదటిది, అందరిదీ జ్యోతి స్వరూపము. ఆ రూపము మీ ఎదురుగా వచ్చేసిందా! మెరుస్తూ ఉన్నటువంటి ఎంతటి ప్రియమైన రూపమది. రెండవది, దేవతా రూపము, ఆ రూపము కూడా ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది. మూడవ రూపము, మధ్యమములోని పూజ్యనీయ రూపము. నాల్గవ రూపము, బ్రాహ్మణ రూప సంగమవాసి, అది కూడా ఎంత గొప్పది మరియు ఐదవ రూపము, ఫరిశ్తా రూపము. ఈ 5 రూపాలు ఎంత ప్రియమైనవి. బాప్ దాదా ఈ రోజు పిల్లలకు మనసు యొక్క ఎక్సర్ సైజ్ ను నేర్పిస్తారు ఎందుకంటే మనసు అప్పుడప్పుడు పిల్లలను తన వైపుకు తీసుకువెళ్తుంది. కావున ఈ రోజు బాప్ దాదా మనసును ఏకరసంగా చేసుకునేందుకు ఎక్సర్ సైజ్ ను నేర్పిస్తున్నారు. రోజంతటిలో ఈ 5 రూపాల ఎక్సర్ సైజ్ ను చేయండి మరియు అనుభవం చేయండి. ఏ రూపాన్ని అయితే తలచుకుంటారో, ఆ రూపాన్ని మనసులో అనుభవం చేయండి. ఎలాగైతే ‘జ్యోతిర్బిందువు’ అని అనగానే మెరుస్తూ ఉన్న ఆ రూపము ఎదురుగా వచ్చింది కదా, అలాగే 5 రూపాలను ఎదురుగా తెచ్చుకోండి మరియు ఆ రూపాలను అనుభవం చేయండి. ప్రతి గంటలో 5 సెకండులు ఈ డ్రిల్ చేయండి. ఒకవేళ 5 సెకండులు కాకపోతే 5 నిమిషాలు చేయండి. ప్రతి రూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి, అనుభవం చేయండి. మనసును ఈ ఆత్మిక ఎక్సర్ సైజ్ లో బిజీ చేసినట్లయితే మనసు ఎక్సర్ సైజ్ తో చక్కగా ఉంటుంది. ఎలా అయితే శారీరక ఎక్సర్ సైజ్ లు శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుతాయో, అలా ఈ ఎక్సర్ సైజ్ మనసును శక్తిశాలిగా ఉంచుతుంది. ఒక్క సెకండు కోసమైనా మనసులో ఆ రూపాన్ని తెచ్చుకోండి. ఇది సహజమే అని అనిపిస్తుంది కదా లేక కష్టమనిపిస్తుందా? కష్టమనిపించదు ఎందుకంటే ఈ ఎక్సర్ సైజ్ ను మీరు అనేక సార్లు చేసారు. ప్రతి కల్పము చేసారు. మీ స్వరూపాన్నే మీ ఎదురుగా తెచ్చుకోవడమనేది కష్టంగా అనిపించదు. ఒక్కొక్క రూపము ఎదురుగా వస్తూ ఉంటే ప్రతి రూపము యొక్క విశేషత అనుభవమవుతుంది. ఒక్కొక్కసారి కొందరు పిల్లలు ఏమంటారంటే - మేము ఈ రూపాలనే అనుభవం చేయాలని అనుకుంటాము కానీ మనసు మరోవైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మనసును ఎంత సమయము ఎక్కడ ఉంచాలనుకుంటే అంత సమయము మనసు అలా ఉండటానికి బదులుగా వ్యర్థము, అయథార్థ సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనసులో నిర్లక్ష్యము కూడా వస్తూ ఉంటుంది. అందుకే బాప్ దాదా ప్రతి గంట 5 సెకండులు లేక 5 నిమిషాలు ఈ ఎక్సర్ సైజ్ తో అనుభవం చేయించాలని అనుకుంటున్నారు. 5 నిమిషాలు ఎక్సర్ సైజ్ చేసి మనసును ఈ వైపుకు నడిపించండి. ఇటు నడవడమైతే మంచిదే కదా! ఇక ఆ తర్వాత మీ పనిలో నిమగ్నమైపోండి ఎందుకంటే పనులైతే చేయాలి కదా! పనులేవీ చేయకుండా ఉండటమైతే వీలు కాదు. యజ్ఞ సేవను, విశ్వ సేవను అయితే అందరూ చేస్తూనే ఉన్నారు మరియు చేయాల్సిందే. ఈ 5 నిమిషాల డ్రిల్ చేసిన తర్వాత మళ్ళీ మీ పనిలో నిమగ్నమైపోండి. 5 సెకండులైనా వెచ్చించండి లేక 5 నిమిషాలైనా వెచ్చించండి, కానీ ఈ మాత్రం సమయము కూడా లభించని వారు ఎవరైనా ఉన్నారా! ఉన్నారా ఎవరైనా, చేతులెత్తండి. 5 నిమిషాలు కూడా లేనివారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఉన్నారా ఎవరైనా? అందరూ సమయాన్ని వెచ్చించగలరు. కావున పదే-పదే ఈ ఎక్సర్ సైజ్ ను చేయండి, అప్పుడు కార్యము చేస్తూ కూడా ఈ నషాలో ఉండగలరు, ఎందుకంటే బాబా మంత్రము - మన్మనాభవ. ఈ మంత్రమే మనసు యొక్క అనుభవముతో మాయాజీతులుగా అవ్వడానికి యంత్రమైపోతుంది, ఎందుకంటే బాప్ దాదా ఏం చెప్పారంటే - ఎంతగా సమయము ముందుకు వెళ్తూ ఉంటుందో, దాని అనుసారముగా ఒక్క సెకండులో స్టాప్ పెట్టవలసి ఉంటుంది. ఈ ఎక్సర్ సైజ్ చేయడము వలన మన్మనాభవగా అవ్వడానికి సహాయము లభిస్తుంది. ఎందుకంటే బాప్ దాదా ఏం చూసారంటే - ఏదైనా భాషణ ఇచ్చేటప్పుడు లేక ఎవరికైనా సందేశము ఇచ్చేటప్పుడు ఏమని అంటారు? మేము విశ్వాన్ని పరివర్తన చేసేవారము అని అంటారు కదా. మరి విశ్వాన్ని పరివర్తన చేయాలి అన్నప్పుడు ముందుగా మీ మనసును ఎంతగా శక్తిశాలిగా చేసుకోండి అంటే, ఏ సమయములో ఏ సంకల్పము చేయాలనుకుంటే ఆ సంకల్పమునే మనసు చేయగలగాలి. సెకండులో ఆర్డర్ చేయండి. ఎలా అయితే ఈ శరీరాన్ని మరియు కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తారు కదా, కిందకి, పైకి అని అంటే అవి అలానే చేస్తాయి కదా. అలాగే, మనసు వ్యర్థము నుండి మరియు అయథార్థము నుండి రక్షింపబడాలి. మనసుకు మీరు యజమానులు. నా మనసు అని అంటారు కదా! మరి నా మనసు అనేది అంతగా ఆర్డర్ లో ఉండాలి, దాని కోసం ఈ మనసు యొక్క ఎక్సర్ సైజ్ ను చెప్పడము జరిగింది.

బాప్ దాదా ఏమి చూసారంటే, ప్రతి బిడ్డ - నేను మన్ జీత్ జగజ్జీత్ గా అవ్వాలని కోరుకుంటారు, అందుకే రాబోయే సమయము కంటే ముందే మీ మనసును ఎక్కడ కావాలంటే అక్కడ సహజముగానే స్థితి చేయగలిగే అభ్యాసము ఉండాలి. ఈ రోజు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ప్రతి బిడ్డ ఎంతటి శక్తిశాలిగా అవ్వాలంటే, ఏయే సంకల్పాలైతే చేస్తారో, వాటి అనుసారముగానే మనసు, బుద్ధి, సంస్కారాలు ఆర్డరులో ఉండాలి. ఎవరికైతే ఈ అభ్యాసము ఉంటుందో, వారు జగజ్జీతులుగా తప్పకుండా అవుతారు. బాప్ దాదా పట్ల మరియు పరివారము పట్ల ప్రేమ అయితే అందరికీ ఉంది. ఎంతగా పిల్లలకు బాబాపై ప్రేమ ఉందో, అంతకంటే ఎక్కువ బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది. పిల్లలు చతురతను బాగా చూపించారు, నా బాబా, నా బాబా అని అంటూ తమవారిగా చేసేసుకున్నారు. ప్రతి బిడ్డ నిశ్చయముతో ఇదే అంటారు - ‘‘నా బాబా’’. మరియు బాబా కూడా ‘‘నా బిడ్డ’’ అని అంటారు. ఈ ‘‘నా’’ అన్న పదము అద్భుతము చేసింది. ‘‘నా బాబా, ప్రియమైన బాబా’’ అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయములో ఎంతగా ఉల్లాస-ఉత్సాహాలు కలుగుతాయి. మరియు బాబా కూడా పదే-పదే ‘‘నా పిల్లలు’’ అని అంటారు. మాయ ఎటువంటి దాడినైనా చేయవచ్చు, ఎందుకంటే అర్ధకల్పము మాయను మీ దానిగా చేసుకున్నారు కదా! కావున మాయకు కూడా మీపై ప్రేమ అయితే ఉంటుంది కదా! కనుక అది పదే-పదే మీ వద్దకు రావడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే మనస్ఫూర్తిగా ‘నా బాబా’ అని అంటారో, వారికి బాబా నుండి సహయోగము లభిస్తుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ‘నా బాబా’ అని అన్నట్లయితే వేయి సార్లు శక్తిశాలి సహయోగాన్ని అందించడానికి బాబా బంధింపబడి ఉన్నారు. అనుభవముంది కదా! కేవలం సమయానికి ఈ అనుభవాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకురండి.

బాప్ దాదా పిల్లల ఒక విషయాన్ని చూసి మనసులో పిల్లలపై నవ్వుకుంటారు. అది ఏ విషయమో తెలుసా? బాబాయే నా ప్రపంచము అని అందరూ అంటారు. బాబాయే నా ప్రపంచము అని అందరూ అంటారు కదా! బాబాయే నా ప్రపంచము అని ఎవరైతే అంటారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, బాబాయే మీ ప్రపంచము. మరే వేరే ఏ ప్రపంచము లేదు కదా! వేరే ప్రపంచము లేదు కానీ వేరే మరొకటి ఉంది, అది ఏమిటి? సంస్కారము. బాబాయే నా ప్రపంచము, మరో ప్రపంచమేదీ లేనే లేదు అన్నప్పుడు, మరి ప్రపంచము లేనప్పుడు సంస్కారము ఎలా ఉత్పన్నమవుతుంది? ఈ రోజుల్లో బాప్ దాదా సమయమనుసారముగా సంస్కారము అన్న పదాన్ని తొలగించాలని అనుకుంటున్నారు. అది తొలగించడము వీలవుతుందా? వీలవుతుందా? ఎవరైతే సంస్కారము విఘ్న రూపమవ్వదు అని భావిస్తున్నారో, ఎవరైతే ఈ దృఢ సంకల్పము చెయ్యగలరో, దృఢ పురుషార్థము ద్వారా ఈ రోజు కూడా సంస్కారాన్ని సమాప్తము చేయవలసిందే అన్న దృఢ పురుషార్థాన్ని చేస్తారో, చేద్దాములే, ఆలోచిద్దాములే, చూద్దాములే... ఇది వద్దు. చేయాల్సిందే. సంస్కారము పని రావడము మరియు పిల్లల పని సమాప్తము చేయాల్సిందే. ఉందా ధైర్యము? ఉందా ధైర్యము? ముందు కూడా చేతులెత్తారు కానీ చెక్ చేసుకోండి, ఏదైతే సంకల్పము చేసారో, అది జరుగుతూ ఉందా? లక్ష్యాన్ని ఇవ్వడము బాబా కార్యము మరియు పిల్లల కార్యము బాబా చెప్పినదాన్ని చేయాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో, వారు దీనికి కూడా ఒక డేట్ ను ఫిక్స్ చేసుకోండి. ఎలా అయితే భక్తులు డేట్ ను ఫిక్స్ చేసారు కదా, ఈ తారీఖున శివరాత్రి చేయాలి అని, అలాగే దీనికి కూడా డేట్ ను ఫిక్స్ చేయండి. అచ్ఛా, అందరిదీ ఒకే డేట్ కాకపోయినా కానీ ముందు ప్రతి ఒక్కరూ మీ కోసమైతే ఒక డేట్ ను ఫిక్స్ చేసుకోగలరు కదా! చేసుకోగలరు కదా! చేయగలము అని అనుకుంటే చేతులెత్తండి. మరి చేసుకున్నారా! చేయగలము అని అన్నప్పుడు చేసారా? డబుల్ విదేశీయులు డేట్ ఫిక్స్ చేసుకున్నారా? అచ్ఛా, ముందు కూర్చున్నవారు, ఫిక్స్ చేసుకున్నారా? ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారో దానిని బాప్ దాదాకు వ్రాసి ఇవ్వండి. బాప్ దాదా కూడా పిల్లలు పరీక్షలో పాస్ అయ్యేందుకు ధైర్యాన్ని అయితే ఇస్తారు కదా. ఆ తర్వాత - వాహ్ పిల్లలు వాహ్ అని పాటను పాడుతారు! సమారోహము జరుపుతాము. ఎవరైతే సంకల్పము చేసి దాని అనుసారముగానే ప్రాక్టికల్ గా చేస్తారో, వారికి సమారోహము జరుపుతాము ఎందుకంటే మార్పు అయితే వస్తూ ఉంటుంది కదా! ఏ డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారో, అందులో ముందుకు వెళ్ళేందుకు సమీపముగానైతే వస్తూ ఉంటారు కదా. మార్పు రావడము మొదలవుతుంది. కావున ఎవరైతే డేట్ అనుసారముగా సంపన్నమవుతారో వారికి బాప్ దాదా సమారోహాన్ని జరుపుతారు. లోపల ఏదైతే చేస్తారో దానిని చూసేవారు కూడా వెరిఫై చేస్తారు ఎందుకంటే సంపర్కములోకైతే వస్తారు కదా! సంస్కారాలు ఎవరో ఒకరి వలన బయటకు వస్తాయి కదా! ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే, పిల్లలు ప్రతి ఒక్కరికీ - నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న శుద్ధ నషా ఉంది. మీరు మాస్టరే కదా? సర్వశక్తివంతులు అన్నప్పుడు సంకల్పాన్ని పూర్తి చేయగలగడము కూడా శక్తియే కదా! అచ్ఛా.

ఎవరైతే ఈ రోజు మొదటిసారిగా వచ్చారో, వారు లేవండి. చూడండి, ఎంతమంది వచ్చారు. బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. మధుబన్ కు వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్ దాదా ఎంతైనా ఎలా భావిస్తున్నారంటే, టూ లేట్ బోర్డు పెట్టకముందే వచ్చేసారు, అందుకు పూర్తి పరివారానికి, బాప్ దాదాకైతే ఎలాగూ ఉంది, అలాగే మొత్తం పరివారానికి కూడా మీ అందరి పట్ల ఇదే శుభ ఆశ ఉంది, అదేమిటంటే - సదా డబుల్ పురుషార్థము చేసి లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్ గా వెళ్ళగలరు. ఉందా ధైర్యము! ఎవరైతే ఈ రోజు వచ్చారో, వారిలో ఈ ధైర్యముందా - లాస్ట్ వచ్చినప్పటికీ ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లోకి రండి. ఫస్ట్ నంబరులోకి. ఫస్ట్ క్లాసు మాత్రమే కాదు, ఫస్ట్ క్లాసులో కూడా ఫస్ట్ రండి, వీలవుతుందా! ఎవరైతే - మేము ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లోకి రాగలము అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. స్వయముపై నిశ్చయముందా? అచ్ఛా! వెనుకవారు చేతులు పెద్దగా ఎత్తండి, వీలవుతుంది అని అనుకుంటే! అచ్ఛా! కొద్దిమంది ఉన్నారు. అయినప్పటికీ పూర్తి పరివారము మరియు బాప్ దాదా మీకు సహయోగాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తున్నారు, అందుకే ఏ సెంటరు తరఫున వచ్చినా కానీ ఆ సెంటరులో మీరు చేసిన ఈ ప్రతిజ్ఞను పదే-పదే గుర్తుకు చేసుకోండి. వీలవుతుంది, అసంభవము కాదు, సంభవమే కానీ డబుల్ అటెన్షన్. ఒకవేళ లాస్ట్ కానీ ఫాస్ట్ గా వెళ్ళి చూపించినట్లయితే సెంటరులో మీ తీవ్ర పురుషార్థము యొక్క రోజును జరుపుతాము. ఫంక్షన్ చేస్తాము. త్వరత్వరగా బాబా సమానముగా అయ్యే చూపించాలి అని అందరి మనసులలో ఉల్లాసము ఉంది. బాప్ దాదా కూడా అమృతవేళలో పిల్లలు బాబాతో మాట్లాడుతున్నప్పుడు సంతోషిస్తారు. వాహ్ పిల్లలూ వాహ్! మరియు బాబా ప్రతి బిడ్డకు, వారు పాతవారైనా లేక కొత్తవారైనా, ప్రతి బిడ్డకు చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ఒక అడుగు మీది, వేయి అడుగుల తండ్రి సహాయముంది, ఎందుకంటే ఇప్పుడు సమయము యొక్క పరివర్తన వేగముగా జరుగుతుంది. అచ్ఛా!

సేవ టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది:- ఢిల్లీ మొదటి నుండి సేవలో కొత్త-కొత్త విషయాలను చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా విన్నారు. చేసారు కదా! ఢిల్లీ చేసింది. ఇప్పుడు సేవలో ఏదైనా కొత్త ఇన్వెన్షన్ ను ఆలోచించండి. భాషణ, ప్రోగ్రాములు కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే వాటితో వృద్ధి అవుతుంది మరియు సంబంధములోకి వస్తారు. ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో, అవి కూడా బాగున్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రాములు చాలా సమయము జరిగాయి. ఇప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని ఆలోచించండి, దాని ద్వారా సేవ చేసేవారిలో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము నిండాలి. చేస్తారు కదా! బాగుంది. అందరినీ ఉత్సాహములోకి తీసుకువచ్చి అందరినీ అందులో బిజీ చేయండి. ఇక్కడ ఏవైతే పెద్ద ప్రోగ్రాములు జరుగుతాయో, వాటిలో భాషణ ఇచ్చేవారైతే బిజీగా ఉంటారు, ఇతరులు కేవలం తోడుగా ఉంటారు. వారు కూడా తప్పకుండా కావాలి, కానీ ఇప్పుడు ఎటువంటి కార్యాన్ని ఆలోచించండంటే, అందులో ప్రతి ఒక్క క్వాలిటీవారు స్వయం బిజీగా ఉండాలి, ఎందుకంటే ఢిల్లీయే రాజధానిగా అవ్వనున్నది. కనుక ఢిల్లీవారు ఇటువంటి ఇన్వెన్షన్ ను ఏదైనా ఆలోచించండి. సరేనా! సరేనా, అందరూ చేస్తారా? చేతులెత్తండి. మంచిది. ఎవరైనా ఆలోచించవచ్చు. కొత్తవారైనా ఆలోచించవచ్చు. ఒకవేళ ఇంకెవరికైనా ఏదైనా ఆలోచన వచ్చినా కానీ, వారు తమ ఆలోచనను ఇక్కడ హెడ్ ఆఫీసుకు, మధుబన్ ఆఫీసుకు వ్రాయవచ్చు. అందరికీ ఛాన్సు ఉంది. అచ్ఛా. ఢిల్లీవారు పురుషార్థములో కూడా నంబరువన్ తీసుకోవాలి. బాప్ దాదా చాలాకాలంగా ఏమి చెప్తున్నారంటే, ఏ సెంటరైనా, దేశమైనా, విదేశీ సెంటరైనా మరియు వాటి కనెక్షన్ లోని సెంటరైనా, 6 మాసాలు నిర్విఘ్నముగా ఉండి చూపించాలి, ఎటువంటి విఘ్నము రాకూడదు. నిర్విఘ్నముగా ఉండాలి. ఇందులో ఒకవేళ నంబరువన్ గా అయినట్లయితే, దానికి కూడా నిర్విఘ్న భవ అన్న రోజును జరుపుతాము. ఇప్పుడు 6 మాసాలు అని చెప్తున్నాము, 6 నెలలు అభ్యాసము అయినప్పుడు మున్ముందు కూడా అలవాటు అయిపోతుంది. కానీ ప్రైజ్ తీసుకోవడానికి 6 నెలల సమయాన్ని ఇస్తున్నాము. మరి ఢిల్లీ ఏ నంబరును తీసుకుంటుంది? మొదటి నంబరు. బాప్ దాదాకు సంతోషముగా ఉంది. పూర్తి పరివారానికి కూడా సంతోషముగా ఉంది. సంతుష్టత ప్రసిద్ధి కావాలి. సేవలోనైనా లేక ఏవైతే నియమాలు తయారై ఉన్నాయో, ఆ నియమాలలోనైనా, మరి చూద్దాము. బాప్ దాదా అయితే చెప్పి ఉన్నారు కానీ ఇప్పటివరకు పేర్లు రాలేదు. జోన్ కాకపోయినా కానీ పెద్ద సెంటర్లు ఏవైతే ఉన్నాయో, కనెక్షన్ లో ఉన్న సెంటర్లు చేసినా కూడా బాప్ దాదా చూస్తారు. ఇప్పుడు త్వరత్వరగా అడుగులు ముందుకు వేయండి, ఎందుకని? అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. తారీఖు చెప్పడము జరగదు. అచ్ఛా!

ఆగ్రా సబ్ జోన్ వారితో:- ఆగ్రా ఎటువంటి కార్యాన్ని లేక సేవను చేయాలంటే ఎలా అయితే ప్రభుత్వము లిస్టులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉందో, అలాగే ఆగ్రావారు ఎటువంటి సేవను ఆలోచించండి అంటే, ఈ ఆల్మైటీ ప్రభుత్వములో కూడా ప్రసిద్ధమైపోవాలి. ఎలా అయితే ఆగ్రాలో కిరీటము ఉందో, అలాగే ఏదైనా చేయండి. ఉందా, నమ్మకముందా! నమ్మకము ఉన్నందుకు అభినందనలు. ఏమి చేస్తారు? కానీ ఎంత సమయములో చేస్తారు? (మేళా చేస్తాము, మెగా ప్రోగ్రామ్ చేస్తాము) మెగా ప్రోగ్రామైతే అందరూ చేస్తున్నారు. ఏ జోనూ చెయ్యని విధముగా ఏదైనా కొత్త ఇన్వెన్షన్ ను ఆలోచించండి. ఎందుకంటే ఆగ్రా అందరూ చూడదగ్గ స్థానము కావున అది ఈ నాటి ప్రభుత్వానికి కిరీటము వంటిది కదా. ఒకవేళ ప్రచారము జరిగితే అందులో ఆగ్రా ప్రసిద్ధి చెంది ఉంది కదా. ఇటువంటి కార్యమేదైనా చేయండి. ఆలోచించండి, అమృతవేళ కూర్చోండి మరియు ఆలోచించండి, అప్పుడు ఏదో ఒక టచింగ్ వచ్చేస్తుంది. సరేనా, టీచర్లు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి అద్భుతము చేయండి. ఇకపోతే బాప్ దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు, ఇప్పుడేదైనా నవీనతను చేయండి. సమయమనుసారముగా ఏదైతే జరుగుతుందో, అది నవీనతయే, కానీ ఇప్పుడు మరింత నవీనతను ఇన్వెన్షన్ చేయండి. ఏ జోన్ అయినా చేయండి, కానీ కొత్తగా చేయండి. ఇకపోతే ప్రతి బిడ్డ బాబాకు ప్రియమైనవారు, చాలా కాలం దూరమైన తర్వాత కలిసినవారు మరియు బాబా ఇదే కోరుకుంటున్నారు, పిల్లలు ఎగురుతూ ఉండాలి, ఎగిరిస్తూ ఉండాలి. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లలు బాబా హృదయానికి ప్రియమైన పిల్లలు. ప్రతి బిడ్డ ఇదే లక్ష్యాన్ని పదే-పదే స్మృతిలోకి తెచ్చుకుంటున్నారు మరియు తెచ్చుకోవాలి కూడా, అదేమిటంటే - నేను తీవ్ర పురుషార్థము చేసి బాబాను ప్రత్యక్షము చేయాలి, తద్వారా అందరి హృదయము ‘నా బాబా వచ్చేసారు’ అని అనాలి. ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలు ఈ రోజుల్లో బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస-ఉత్సాహాలు మెజారిటీ పిల్లల మనసులలోకి వచ్చాయి. బాప్ దాదా ఇదే ఆశిస్తున్నారు, ఇప్పుడు త్వరత్వరగా అందరికీ ఈ సందేశాన్ని అందించాలి, ఎవ్వరూ వంచితమవ్వకూడదు, ఏదో ఒక వారసత్వాన్ని తీసుకోవాలి. జీవన్ముక్తి వారసత్వము కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వాన్ని అయితే తీసుకోండి, ఎందుకంటే బాబా అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. ఎంతమందికి వారసత్వాన్ని ఇప్పిస్తారో, అంతగా మీకు కూడా మీ రాజ్యములో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వము లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న ప్రతి బిడ్డ బాప్ దాదా నుండి చాలా చాలా ప్రేమను మరియు ఆశీర్వాదాలను స్వీకరించగలరు. అచ్ఛా!

వరదానము:-
త్యాగము, తపస్య ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వుల కళ్యాణకారీ భవ

ఏ విధముగా స్థూలమైన అగ్ని దూరం నుండే తన శక్తిని అనుభవం చేయిస్తుందో, అలా మీ తపస్య మరియు త్యాగము యొక్క ప్రకాశము దూరం నుండే సర్వులను ఆకర్షితము చేయాలి. సేవాధారులతోపాటుగా త్యాగులుగా, తపస్వీమూర్తులుగా కూడా అవ్వండి, అప్పుడు సేవ యొక్క ప్రత్యక్షఫలం కనిపిస్తుంది. త్యాగులు అనగా ఎటువంటి పాత సంకల్పాలు మరియు సంస్కారాలు కనిపించకూడదు. తపస్వీ అనగా బుద్ధి యొక్క స్మృతి మరియు దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపము తప్ప ఇంకేమీ కనిపించకూడదు. ఏ సంకల్పాలు కలిగినా, అందులో ప్రతి ఆత్మ యొక్క కళ్యాణము ఇమిడి ఉండాలి, అప్పుడు సర్వుల కళ్యాణకారులు అని అంటారు.

స్లోగన్:-
దేహభానము నుండి అతీతముగా వెళ్ళేందుకు చిత్రాన్ని చూడకుండా చైతన్యమును మరియు చరిత్రను చూడండి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

మీరందరూ మాస్టర్ విశ్వ నిర్మాతలు. ఈ స్మృతి ద్వారా నిర్మానతా గుణము సహజముగా వచ్చేస్తుంది మరియు ఎక్కడైతే నిర్మానత అనగా సరళత నేచురల్ రూపములో ఉంటుందో, అక్కడికి ఇతర గుణాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కనుక సదా ఈ స్మృతి స్వరూపములో స్థితులై ఉంటూ ప్రతి సంకల్పాన్ని మరియు కర్మను చేయండి. అప్పుడిక ఈ చిన్న-చిన్న విషయాలేవైతే ఎదిరించేందుకు వస్తాయో, అవి ఎలా అనుభవమవుతాయంటే, ఎవరైనా వృద్ధాప్యములో ఉన్నవారి ముందు చిన్న-చిన్న పిల్లలు బాల్యపు ఆటలు ఆడినట్లుగా అనిపిస్తాయి. వారిపై వాటి ప్రభావమేమీ పడదు.