28-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.20


‘‘పొదుపు ఖాతాను జమ చేసుకుని అఖండ మహాదానులుగా అవ్వండి’’

ఈ రోజు నవ యుగ రచయిత తమ నవ యుగ అధికారీ పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు పాత యుగములో సాధారణమైనవారు మరియు రేపు కొత్త యుగములో రాజ్య అధికారీ పూజ్యులు. ఈ రోజు మరియు రేపు యొక్క ఆట ఇది. ఈ రోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు! అనన్యులైన జ్ఞానీ ఆత్మలైన పిల్లలెవరైతే ఉన్నారో, వారి ఎదురుగా రాబోయే రేపు కూడా ఈ రోజు ఎంత స్పష్టంగా ఉందో అంత స్పష్టంగా ఉంటుంది. మీరందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కానీ బాప్ దాదా కొత్త యుగాన్ని చూస్తున్నారు. కొత్త సంవత్సరములోనైతే ప్రతి ఒక్కరూ తమ-తమ కొత్త ప్లాన్లు తయారుచేసుకునే ఉంటారు. ఈ రోజు పాత సంవత్సరము యొక్క సమాప్తి, సమాప్తిలో మొత్తము సంవత్సరము యొక్క రిజల్టును చూడటం జరుగుతుంది. కనుక ఈ రోజు బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరము యొక్క రిజల్టును చూసారు. బాప్ దాదాకు చూడటానికి సమయమైతే పట్టదు. కనుక ఈ రోజు విశేషంగా పిల్లలందరి జమ ఖాతాను చూసారు. పురుషార్థమునైతే పిల్లలందరూ చేసారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేసారు, సంబంధ-సంపర్కములో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు, కానీ ఈ మూడు విషయాలలోనూ జమ ఖాతా ఎంత అయ్యింది?

ఈ రోజు వతనములో బాప్ దాదా జగదంబ తల్లిని ఇమర్జ్ చేసారు. (దగ్గు వచ్చింది) ఈ రోజు వాయిద్యం కొంచెం పాడైంది, అయినా కానీ మ్రోగించాలి కదా. బాప్ దాదా మరియు మమ్మా కలిసి అందరి పొదుపు ఖాతాను చూసారు. పొదుపు చేసి ఎంత జమ చేసారు! మరి ఏం చూసారు? అందరూ నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు కానీ ఎంత జమ ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా ఉంది. అప్పుడు జగదంబ తల్లి ప్రశ్న అడిగారు - స్మృతి సబ్జెక్టులో చాలామంది పిల్లలది లక్ష్యము కూడా మంచిగా ఉంది, పురుషార్థము కూడా మంచిగా ఉంది, మరి జమ ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువగా ఎందుకు ఉంది? ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తరువాత ఫలితము ఏం వచ్చిందంటే యోగాభ్యాసమైతే చేస్తున్నారు కానీ యోగ స్థితి యొక్క పర్సెంటేజ్ సాధారణంగా ఉన్న కారణంగా జమ ఖాతా కూడా సాధారణంగానే ఉంది. యోగము యొక్క లక్ష్యము మంచిగా ఉంది కానీ యోగము యొక్క రిజల్టు ఏమిటంటే - యోగయుక్తమైన మరియు యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక. ఇందులో లోపం ఉన్న కారణంగా యోగము చేసే సమయములో యోగములో మంచిగా ఉంటున్నారు కానీ యోగీ అంటే యోగము యొక్క ప్రభావము జీవితములో ఉండాలి. అందుకే జమ ఖాతా కొన్ని-కొన్ని సమయాలలోనే జమ అవుతుంది కానీ మొత్తము సమయము జమ అవ్వటం లేదు. నడుస్తూ-నడుస్తూ స్మృతి యొక్క పర్సెంటేజ్ సాధారణమైపోతుంది. అందులో చాలా తక్కువ జమ ఖాతా తయారవుతుంది.

రెండవది - సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తారు, రాత్రింబవళ్ళు బిజీగా కూడా ఉంటారు. ప్లాన్లు కూడా చాలా మంచి-మంచివి తయారుచేస్తారు మరియు సేవలో వృద్ధి కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. అయినా కానీ మెజారిటీ యొక్క జమ ఖాతా తక్కువగా ఎందుకు ఉంది? ఆత్మిక సంభాషణలో ఏం తేలిందంటే సేవనైతే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీ పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు, మరి కారణమేమిటి? కారణం ఏం తేలిందంటే, సేవ యొక్క బలము కూడా లభిస్తుంది, ఫలము కూడా లభిస్తుంది. బలము అనేది స్వయము యొక్క హృదయములో సంతుష్టత మరియు ఫలము అనేది సర్వుల సంతుష్టత. ఒకవేళ సేవ చేసారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వెచ్చించారు అంటే సేవ ద్వారా హృదయము యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి, అది మీతోపాటు ఉన్న సహచరులకైనా లేక ఎవరికైతే సేవ చేసారో వారికైనా హృదయములో సంతుష్టత అనుభవం అవ్వాలి, అంతేకానీ చాలా బాగుంది, చాలా బాగుంది అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి హృదయములో సంతుష్టత యొక్క అల అనుభవం అవ్వాలి. ఏదో లభించింది అన్నట్లు అనుభవమవ్వాలి. చాలా బాగా విన్నారు అన్నది వేరే విషయము కానీ ఏదో లభించింది, ఏదో పొందాము అని వారికి అనుభవమవ్వాలి. దీని గురించి బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఒకటేమో, బుద్ధి వరకు బాణం తగలటము, ఇంకొకటి హృదయానికి బాణం తగలటము. ఒకవేళ సేవ చేసారు మరియు అది స్వయానికి సంతుష్టతను ఇచ్చిందంటే, అది మిమ్మల్ని మీరు సంతోషపరచుకునే సంతుష్టత కాదు, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క మరియు సర్వుల యొక్క హృదయము అంగీకరించాలి. మరొక విషయం ఏమిటంటే సేవ చేసారు మరియు దాని ఫలితాన్ని మీరు స్వీకరించారంటే అనగా నేను కష్టపడ్డాను, నేను చేసాను, నేను చేసాను అని స్వీకరించారంటే సేవ ఫలాన్ని తినేసినట్లే. జమ అవ్వలేదు. బాప్ దాదా చేయించారు అని అంటే బాప్ దాదా వైపుకు అటెన్షన్ ఇప్పించినట్లు, అంతేకానీ స్వయము వైపుకు కాదు. ఈ అక్కయ్య చాలా మంచివారు, ఈ అన్నయ్య చాలా మంచివారు అని అనిపించటం కాదు. వీరి బాప్ దాదా చాలా మంచివారు అని అనుభవము చేయించటము - ఇదే జమ ఖాతాను పెంచుకోవటము. అందుకే మొత్తము రిజల్టులో చూస్తే శ్రమ ఎక్కువ, సమయము, శక్తి ఎక్కువ మరియు కొంచెం-కొంచెం షో ఎక్కువ, అందుకే జమ ఖాతా తక్కువైపోతుంది. జమ ఖాతా యొక్క తాళంచెవి చాలా సహజమైనది, అది వజ్రపు తాళంచెవి, బంగారు తాళపుచెవిని పెడతారు కానీ జమ యొక్క డైమండ్ తాళంచెవి ఏమిటంటే - ‘‘నిమిత్త భావము మరియు నిర్మాన భావము’’. ఒకవేళ ప్రతి ఆత్మ పట్ల, అది సహచరుల పట్లనైనా లేక ఏ ఆత్మ సేవనైతే చేస్తారో వారి పట్లనైనా, ఇరువురి పట్ల సేవ చేసే సమయములో, ముందు-తరువాత కాదు, సేవ చేసే సమయములో నిమిత్త భావము, నిర్మాన భావము, నిస్వార్థ శుభ భావన మరియు శుభ స్నేహము ఇమర్జ్ అయి ఉన్నట్లయితే జమ ఖాతా పెరుగుతూ ఉంటుంది.

ఈ విధి ద్వారా సేవ చేసేవారి జమ ఖాతా ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది బాప్ దాదా జగదాంబ తల్లికి చూపించారు. కేవలం ఒక్క క్షణములో అనేక గంటల జమ ఖాతా జమ అయిపోతుంది. టిక్-టిక్-టిక్ అంటూ వేగంగా త్వరత్వరగా చెయ్యండి, ఇటువంటి మెషిన్ నడుస్తుంది. కనుక జమ ఖాతాలో జమ చేసుకోవటము చాలా సహజమని జగదంబ తల్లి చాలా సంతోషపడుతున్నారు. బాప్ దాదా మరియు జగదంబ, ఇద్దరి సలహా ఏమిటంటే ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక జమ ఖాతాను చెక్ చేసుకోండి - రోజంతటిలో పొరపాట్లనైతే చెయ్యలేదు కానీ సమయము, సంకల్పాలు, సేవ, సంబంధ-సంపర్కములో స్నేహము, సంతుష్టత, వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు? చాలామంది పిల్లలు ఈ రోజు చెడు ఏమీ జరగలేదు, ఎవరికీ దుఃఖము ఇవ్వలేదు అని ఇంతమాత్రమే చెక్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇది చెక్ చేసుకోండి - మొత్తము రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవ ఖాతా ఎంత జమ అయ్యింది? ఎంతమంది ఆత్మలకు ఏ కార్యము ద్వారానైనా సుఖాన్ని ఇచ్చాను? యోగము చేసాను కానీ యోగము యొక్క పర్సెంటేజ్ ఎలా ఉంది? ఈ రోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను?

ఈ కొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి? ఏం చేస్తున్నా సరే, మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా ద్వారానైనా, సమయమనుసారంగా మనసులో ఈ ధ్యాసే ఉండాలి - నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానిగా అవ్వాలి, కేవలం మహాదాని కాదు, అఖండ మహాదాని. మనసా ద్వారా శక్తుల దానము, వాచా ద్వారా జ్ఞాన దానము మరియు తమ కర్మల ద్వారా గుణ దానము. ఈ రోజుల్లో ప్రపంచములో, అది బ్రాహ్మణ పరివారపు ప్రపంచములోనైనా లేక అజ్ఞానుల ప్రపంచములోనైనా వినటం కన్నా చూడాలని కోరుకుంటున్నారు. చూసి చెయ్యాలని కోరుకుంటున్నారు. మీకు ఎందుకు సహజమైంది? బ్రహ్మాబాబాను కర్మలలో గుణ దాన మూర్తిగా చూసారు. జ్ఞాన దానమునైతే చేస్తూనే ఉంటారు కానీ ఈ సంవత్సరము విశేషముగా ఈ ధ్యాసను పెట్టుకోండి - ప్రతి ఆత్మకు గుణ దానమును ఇవ్వాలి అనగా తమ జీవితములోని గుణాల ద్వారా సహయోగాన్ని ఇవ్వాలి. బ్రాహ్మణులకు దానమునైతే ఇవ్వరు కదా, సహయోగాన్ని ఇవ్వండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణధారులైనా కానీ, నేను నా జీవితము ద్వారా, కర్మల ద్వారా, సంపర్కము ద్వారా గుణ దానమును ఇవ్వాలి అనగా సహయోగిగా అవ్వాలి. ఇందులో ఇతరులను చూడకండి, వీరు చెయ్యకపోతే నేను ఎలా చేస్తాను, వీరు కూడా ఇలాగే ఉన్నారు కదా అని అనుకోకండి. బ్రహ్మాబాబా కేవలం శివబాబానే చూసారు. పిల్లలైన మీరు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మాబాబానే చూడండి. ఇందులో ఇతరులను చూడకుండా ఈ లక్ష్యము పెట్టుకోండి - ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటారో వారే అర్జునులు అనగా ఎవరైతే స్వయాన్ని నిమిత్తముగా చేసుకుంటారో, వారే నంబరు వన్ అర్జునుడిగా అవుతారు. బ్రహ్మాబాబా నంబరు వన్ అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరులను చూసి చేస్తే నంబరు వాన్ గా అవ్వరు. నంబరువారులోకి వస్తారు, నంబరు వన్ గా అవ్వరు. చేతులు ఎత్తించినప్పుడు అందరూ నంబరువారులో చేతులెత్తుతారా లేక నంబరు వన్ లో చేతులెత్తుతారా? మరి ఏం లక్ష్యము పెట్టుకుంటారు? అఖండ గుణదాని, అచంచలము, ఎవరు ఎంతగా చలింపజేసినా కానీ చలించకండి. అందరూ ఇలాగే ఉన్నారు, నిన్ను నువ్వు చంపుకోవటం ఎందుకు, నువ్వు కూడా అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా బలహీనం చేసే సహచరులు ఎంతోమంది దొరుకుతారు. కానీ బాప్ దాదాకు ధైర్యాన్ని, ఉల్లాసాన్నీ పెంచే సహచరులు కావాలి. మరి ఏం చెయ్యాలో అర్థమైందా? సేవ చెయ్యండి కానీ జమ ఖాతాను పెంచుకుంటూ చెయ్యండి, బాగా సేవ చెయ్యండి. మొదట స్వయం యొక్క సేవ, ఆ తర్వాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాప్ దాదా గమనించారు, వినిపించమంటారా?

ఈ రోజు చంద్రుడు మరియు సూర్యుడి మిలనం కదా! జగదంబ తల్లి అన్నారు - ఎడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురుచూడాలి? ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎడ్వాన్స్ స్థితిలోకి వెళ్తారో, అప్పుడు ఎడ్వాన్స్ పార్టీ వారి కార్యం పూర్తవుతుంది. కావున జగదంబ తల్లి ఈ రోజు బాప్ దాదాకు చాలా నెమ్మదిగా, చాలా పద్ధతిపూర్వకముగా ఒక విషయాన్ని వినిపించారు, ఏ విషయాన్ని వినిపించారు? బాప్ దాదాకైతే తెలుసు, కానీ ఈ రోజు ఆత్మిక సంభాషణ జరిగింది కదా! జగదంబ ఏమన్నారంటే - నేను కూడా తిరిగి చూస్తూ ఉంటాను, మధుబన్ లో కూడా తిరుగుతాను, సెంటర్లు కూడా తిరుగుతాను. నవ్వుతూ నవ్వుతూ చెప్పారు. వారు నవ్వుతూ-నవ్వుతూనే సూచనల ద్వారా చెప్తారు, డైరెక్టుగా చెప్పరు అని ఎవరైతే జగదంబను చూసారో వారికి ఈ విషయము తెలుసు. నవ్వుతూ నవ్వుతూ ఏమన్నారంటే, ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది, ఏ విశేషత? ఈ రోజుల్లో నిర్లక్ష్యము అనేక రకాలుగా వచ్చేసింది. ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన నిర్లక్ష్యము ఉంది. అయిపోతుందిలే, చేసేస్తాములే... వేరే వారు ఇంకా చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాములే... ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది... నిర్లక్ష్యము యొక్క ఈ భాష సంకల్పాలలోనైతే ఉండనే ఉంది కానీ అది మాటలలో కూడా ఉంది. అప్పుడు బాప్ దాదా - దీని కోసం ఈ కొత్త సంవత్సరములో మీరు పిల్లలకు ఏదైనా యుక్తిని వినిపించండి అని జగదంబతో అన్నారు. జగదంబ తల్లిది సదా ఒక ధారణా యుక్తమైన స్లోగన్ ఉండేదని మీ అందరికీ తెలుసు, గుర్తుందా? ఎవరికి గుర్తుంది? (హుకుమీ హుకుమ్ చలాయే రహే - ఆజ్ఞాపించేవారు నన్ను నడిపిస్తున్నారు) అప్పుడు జగదంబ అన్నారు - మమ్మల్ని బాప్ దాదా నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞానుసారముగా ప్రతి అడుగు వేస్తున్నాము అన్న ఈ ధారణను అందరూ చేసినట్లయితే, మమ్మల్ని నడిపించేవారు డైరెక్ట్ బాబా అన్న ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడకు వెళ్తుంది? నడిచేవారి దృష్టి నడిపించేవారి వైపుకే వెళ్తుంది, వేరే వైపుకు వెళ్ళదు. కనుక ఈ చేయించేవారు నిమిత్తులుగా చేసి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యత చేయించేవారిది. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది సదా తేలికగా ఉంటుంది, ఆత్మిక గులాబీ వలె ఉంటారు. ఏం చెయ్యాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. అచ్ఛా.

కొత్త సంవత్సరాన్ని జరుపుకోవటానికి అందరూ పరుగు-పరుగున చేరుకున్నారు. హౌస్ ఫుల్ అయిపోయింది, మంచిది. అచ్ఛా, నీరైతే లభించింది కదా! లభించిందా నీరు? నీటి కోసం కష్టపడుతున్నవారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటమంటే, రెండు-నాలుగు బకెట్ల నీరైతే కాదు కదా! ఇక రేపటి నుండైతే తిరుగు ప్రయాణము యొక్క మేళా ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా! తుఫాను కాస్త పరీక్ష పెట్టింది. కొంత తీవ్రమైన గాలులు వీచాయి. అందరూ బాగానే ఉన్నారా? పాండవులు బాగానే ఉన్నారా? మంచిది. కుంభమేళా కంటే బాగానే ఉంది కదా! అచ్ఛా, మూడు అడుగుల నేలైతే లభించింది కదా. మంచము లభించకపోయినా కానీ మూడు అడుగుల నేల అయితే లభించింది కదా!

కొత్త సంవత్సరములో నలువైపుల ఉన్న పిల్లలు కూడా, విదేశాలలో కూడా మరియు దేశములో కూడా కొత్త సంవత్సర మహోత్సవాన్ని బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. మధుబన్ లో కూడా చూస్తున్నారు. మధుబన్ వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయ్యి సేవ పాత్రను పోషించారు, చాలా మంచిది. బాప్ దాదా దేశ-విదేశాలవారితోపాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసులకు కూడా అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా. ఇకపోతే కార్డులైతే ఎన్నో వచ్చాయి. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, చాలా కార్డులు వచ్చాయి. కార్డులు పంపటమనేది పెద్ద విషయమేమీ కాదు కానీ వాటిలో హృదయపూర్వకమైన స్నేహము దాగి ఉంది. బాప్ దాదా కార్డు యొక్క అందము చూడరు కానీ ఎంత విలువైన హృదయపూర్వకమైన స్నేహము నిండి ఉందో అది చూస్తారు, కనుక అందరూ తమ-తమ హృదయపూర్వకమైన స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహీ ఆత్మలకు విశేషముగా, ఒక్కొక్కరి పేరైతే తీసుకోరు కదా, కానీ బాప్ దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహముతో నిండిన గౌరవాన్ని ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈ-మెయిల్, ఈ సాధనాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఆ సాధనాలన్నింటి కంటే కూడా ముందుగా సంకల్పము ద్వారానే బాప్ దాదా వద్దకు చేరుకుంటాయి, ఆ తరువాత మీ కంప్యూటర్, ఈ-మెయిల్ లో వస్తాయి. పిల్లల స్నేహము బాప్ దాదా వద్దకు ప్రతి సమయము చేరుకుంటూనే ఉంటుంది. కానీ ఈ రోజు విశేషంగా కొత్త సంవత్సరానికి సంబంధించి కొంతమంది ప్లాన్లు కూడా వ్రాసారు, ప్రతిజ్ఞలు కూడా చేసారు, గతం గతః గా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాప్ దాదా అందరికీ చాలా చాలా శభాష్ పిల్లలూ, శభాష్ అని అంటున్నారు, శభాష్.

మీరందరూ సంతోషపడుతున్నారు కదా! కావున వారు కూడా సంతోషపడుతున్నారు. ఇప్పుడు బాప్ దాదా యొక్క మనసులోని ఆశ ఏమిటంటే - ‘‘దాత పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి’’. ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని యాచించకండి. దాతగా అవ్వండి, ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్ళడంలో విశాల హృదయులుగా అవ్వండి. మాకు పెద్దవారి ప్రేమ కావాలి అని చిన్నవారు బాప్ దాదాతో అంటారు, అప్పుడు బాబా, పెద్దవారి పట్ల గౌరవం ఉంచినట్లయితే ప్రేమ లభిస్తుంది అని చిన్నవారికి చెప్తారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటము. గౌరవము ఊరికే అలా లభించదు. ఇవ్వటమే తీసుకోవటము. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా. దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థము. దేవి అంటేనే ఇచ్చేవారు అని అర్థము. కనుక చైతన్య దేవీ-దేవతలైన మీరు దాతగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చే దాతలుగా అయినట్లయితే ఇక తీసుకునేవారు సమాప్తమైపోతారు కదా! అప్పుడిక నలువైపుల సంతుష్టత యొక్క, ఆత్మిక గులాబి యొక్క సుగంధము వ్యాపిస్తుంది. విన్నారా!

కనుక కొత్త సంవత్సరములో పాత భాష మాట్లాడకూడదు. కొందరు పాత భాష మాట్లాడుతుంటారు, అది మంచిగా అనిపించదు, కనుక పాత మాటలకు, పాత నడవడికకు, ఏదైనా పాత అలవాటుకు వశమవ్వకండి. ప్రతీ విషయములోనూ కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి! ఏమి కొత్తగా చేసారు? ఇప్పుడు కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవాలి. 21 జన్మల వారసత్వాన్ని సంపూర్ణముగా 21వ శతాబ్దములో పొందాల్సిందే. పొందాలి కదా! అచ్ఛా.

నలువైపుల ఉన్న నవయుగ అధికారీ శ్రేష్ఠ ఆత్మలకు, పిల్లలందరికీ, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునే ఆత్మలకు, సదా స్వయం బ్రహ్మాబాబా సమానంగా సర్వుల ఎదురుగా శ్యాంపుల్ గా అయ్యి అందరికీ సింపుల్ చేసే ఆత్మలకు, సదా తమ జీవితములో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరులను గుణవంతులుగా చేసేవారికి, సదా అఖండ మహాదానులకు, మహా సహయోగీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఈ సమయము పాత మరియు కొత్త సంవత్సరాల సంగమ సమయము. సంగమ సమయము అనగా పాతది సమాప్తమవ్వటము మరియు కొత్తది ఆరంభమవ్వటము. ఎలా అయితే అనంతమైన సంగమయుగములో బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులయ్యారో, అలా నేటి ఈ పాత మరియు కొత్తల సంవత్సరాల సంగమములో కూడా స్వపరివర్తన యొక్క దృఢ సంకల్పాన్ని చేసారు మరియు చెయ్యాల్సిందే. ప్రతి క్షణము అచంచలమైన, అఖండ మహాదానిగా అవ్వాలి. దాత పిల్లలు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతోపాటు పాత ప్రపంచము యొక్క ఆకర్షణలకు మరియు పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి కొత్త శ్రేష్ఠ సంస్కారాలను ఆహ్వానించాలి. అందరికీ కోటానుకోట్ల సార్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.

వరదానము:-

ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్నచిత్త భవ

ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడూ ఏ విషయములోనూ ప్రశ్న ఉండదు. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నతా పర్సనాలిటీ కనిపిస్తుంది, దీనినే సంతుష్టత అని అంటారు. ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణము ప్రాప్తి తక్కువవ్వడము మరియు ప్రాప్తి తక్కువవ్వడానికి కారణము ఏదో ఒక కోరిక. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు ఆకర్షిస్తాయి, అందుకే అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి, అప్పుడు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు.

స్లోగన్:-

పరమాత్మ ప్రేమలో లవలీనులై ఉన్నట్లయితే మాయ ఆకర్షణ సమాప్తమైపోతుంది.