28-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ పాడైనదానిని బాగు చేసేవారు అనగా భాగ్యాన్ని తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని భాగ్యవంతులుగా తయారుచేస్తారు’’

ప్రశ్న:-
పిల్లలైన మీ ఈ ఆత్మిక భట్టీలో ఉన్న ఒక నియమము ఏమిటి?

జవాబు:-
ఆత్మిక భట్టీలో అనగా స్మృతియాత్రలో కూర్చునేవారు ఎప్పుడూ కూడా వేరే ఆలోచనలు చేయకూడదు, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఒకవేళ బుద్ధి అటు-ఇటు భ్రమించినట్లయితే కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు, దానితో వాయుమండలము పాడవుతుంది. తమను తామే నష్టపరచుకుంటారు.

పాట:-
మనసు యొక్క ఆధారము తెగిపోకూడదు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని రెండు మాటలను విన్నారు. పిల్లలను సావధానపరచడము జరుగుతుంది. ఈ సమయములో బ్రాహ్మణులైన మీది తప్ప అందరి భాగ్యము పాడైపోయి ఉంది. ఇప్పుడు పాడైపోయిన మీ భాగ్యము బాగవుతుంది. తండ్రిని భాగ్యము తయారుచేసేవారు అని అంటారు. శివబాబా ఎంత మధురమైనవారు అనేది మీకు తెలుసు. ‘బాబా’ అనే పదము చాలా మధురమైనది. తండ్రి నుండి ఆత్మలందరికీ వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి కొడుకులకు వారసత్వము లభిస్తుంది, కూతురులకు కాదు. ఇక్కడ కొడుకులు మరియు కూతురులు, అందరూ వారసత్వానికి హక్కుదారులే. తండ్రి ఆత్మలను అనగా తమ పిల్లలను చదివిస్తారు. మేమంతా సోదరులమని ఆత్మ భావిస్తుంది. తప్పకుండా బ్రదర్ హుడ్ (సోదర భావము) అనే అంటారు కదా. ఆ ఒక్క భగవంతుని పిల్లలు అయినప్పుడు, మరి ఎందుకు ఇంతగా కొట్లాడుకుంటారు, గొడవపడతారు? అందరూ పరస్పరములో కొట్లాడుకుంటూనే ఉంటారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, రావణ రాజ్యములో కొట్లాటలే జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కామ వికారము గురించి కూడా ఎన్ని కొట్లాటలు-గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధముగా అనేకమంది రాజులు యుద్ధాలు చేసారు. కామము కోసం చాలా కొట్లాడుతారు, ఎంత సంతోషిస్తూ ఉంటారు. ఎవరి పట్లనైనా మనసు కలిగితే, ఆమె కోసం హత్యలు కూడా చేసేవారు. కామము మహాశత్రువు. క్రోధము ఉన్నవారినైతే క్రోధీ అని అంటారు. లోభము ఉన్నవారిని లోభి అని అంటారు. కానీ ఎవరైతే కాముకులు ఉంటారో, వారికి చాలా పేర్లు పెట్టారు, అందుకే - అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారని అంటారు. శాస్త్రాలలో అమృతమనే పేరును వ్రాసేసారు. సాగర మంథనము చేసినప్పుడు అమృతము వెలువడిందని, కలశాన్ని లక్ష్మికి ఇచ్చారని చూపిస్తారు. ఇలా ఎన్ని కథలు ఉన్నాయి. వాటిలో కూడా అన్నింటికన్నా పెద్ద విషయాలు - సర్వవ్యాపికి సంబంధించినది, గీతా భగవానుడు ఎవరు మరియు పతిత-పావనుడు ఎవరు? ప్రదర్శనీలలో ముఖ్యముగా ఈ చిత్రాలపైనే అర్థం చేయించడము జరుగుతుంది. జ్ఞాన సాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన గంగలు పతిత-పావనులా లేక నీటి నది మరియు నీటి సాగరమా? ఎన్ని మంచి-మంచి విషయాలను అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మిమ్మల్ని ఎవరు పావనముగా చేసారు? పాడైనదానిని బాగుచేసేవారు ఎవరు? ఆ పతిత-పావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట ఎలా తయారయ్యింది? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. తండ్రినే నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నులు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపుడు), పీస్ ఫుల్ (శాంతి స్వరూపుడు) అని అంటారు. పాడైనదానిని బాగుచేసేవారు ఒక్కరేనని అంటూ ఉంటారు కూడా. నిజంగా రావణుడే మనదంతా పాడుచేస్తాడని అర్థమవుతుంది కూడా. ఇది గెలుపు-ఓటముల ఆట. రావణుడి గురించి కూడా మీకు తెలుసు, అతడిని భారతవాసులు ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు. అతడు భారత్ యొక్క శత్రువు. భారత్ లోనే ప్రతి సంవత్సరము కాలుస్తారు. ఎప్పటినుండి కాలుస్తున్నారని వారిని అడగండి. ఎప్పటినుండైతే సృష్టి ప్రారంభమయ్యిందో, అప్పటినుండి ఇది అనాదిగా కొనసాగుతూ వస్తుందని అంటారు. శాస్త్రాలలో ఏదైతే చదివారో, దానిని సత్యము-సత్యము అని అంటూ వస్తారు. ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అనడమే ముఖ్యమైన పొరపాటు. బాబా దీనిని ఫలానావారి తప్పు అని అనరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయతో ఓడిపోతే ఓడినట్లు, మాయపై గెలుస్తే గెలిచినట్లు. మాయతో ఎలా ఓడిపోతారు అనేది కూడా అర్థం చేయించడము జరుగుతుంది. అర్ధకల్పము పూర్తిగా రావణ రాజ్యము నడుస్తుంది. ఒక్క సెకెండు కూడా తేడా ఉండదు. రామ రాజ్య స్థాపన మరియు రావణ రాజ్య వినాశనము, ఇవి వాటి సమయమనుసారముగా ఏక్యురేట్ గా జరుగుతాయి. సత్యయుగములోనైతే లంక ఉండదు. లంక బౌద్ధ ధర్మానికి చెందిన ఖండము. లండన్ ఇటు వైపు ఉంది, అమెరికా అటు వైపు ఉంది అని చదువుకున్నవారి బుద్ధిలో ఉంటుంది. చదువుతో బుద్ధి తాళము తెరుచుకుంటుంది, ప్రకాశము వస్తుంది. దీనిని జ్ఞానము యొక్క మూడవ నేత్రము అని అంటారు. వృద్ధ మాతలు చాలా విషయాలను అర్థం చేసుకోలేరు. వారు ఆ ఒక్క ముఖ్యమైన విషయాన్ని ధారణ చేయాలి, అదే అంతిమములో ఉపయోగపడుతుంది. మనుష్యులు శాస్త్రాలనైతే చాలా చదువుతారు, ఆఖరులో మళ్ళీ రామ-రామ అని అనమని చెప్తారు. అంతేకానీ శాస్త్రాలను వినిపించండి, వేదాలను వినిపించండి అని అనరు. ఆఖరులో రాముడిని స్మృతి చేయండి అని చెప్తారు. ఎవరైనా ఎక్కువ సమయము ఏ చింతనలో ఉంటారో, అంతిమములో కూడా అదే గుర్తుకువస్తుంది. ఇప్పుడు వినాశనమైతే అందరిదీ జరగనున్నది. అందరూ ఎవరిని స్మృతి చేస్తారు అనేది మీకు తెలుసు. కొందరు శ్రీకృష్ణుడిని, కొందరు తమ గురువులను గుర్తు చేస్తారు. కొందరు తమ దేహ సంబంధీకులను గుర్తు చేస్తారు. దేహాన్ని గుర్తు చేసారంటే ఇక ఆట సమాప్తము. ఇక్కడ మీకు ఒక్క విషయాన్నే అర్థం చేయించడము జరుగుతుంది - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మేము ఎంతగా స్మృతి చేస్తున్నాము అని చార్టు పెట్టండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పావనముగా అవుతూ ఉంటారు. అంతేకానీ, గంగలో స్నానము చేయడము వలన పావనముగా అవుతారని కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కదా. ఆత్మయే పతితముగా, ఆత్మయే పావనముగా అవుతుంది కదా. తండ్రి అర్థం చేయించారు - ఆత్మ ఒక నక్షత్రము వంటిది, బిందువు వంటిది, భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ ఒక నక్షత్రమని, అతి సూక్ష్మమైనదని అంటారు. పిల్లలైన మీరు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. వారు కల్పము అనే పదాన్ని వదిలి ప్రతి యుగములోనూ వస్తారు అని వ్రాశారు. కనుక మనుష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను - కల్ప-కల్పము సంగమయుగములో వస్తానని అన్నాను. ఘోర అంధకారము మరియు అత్యంత ప్రకాశముల సంగమములో వస్తాను. అంతేకానీ, ప్రతి యుగములోనూ రావాల్సిన అవసరమే లేదు. మెట్లు దిగుతూనే వస్తారు. ఎప్పుడైతే పూర్తి 84 జన్మల మెట్లు దిగుతారో, అప్పుడు తండ్రి వస్తారు. ఈ జ్ఞానము మొత్తం ప్రపంచము కోసం ఉంది. మన చిత్రాలన్నీ ఊహ అని సన్యాసులు మన చిత్రాల కోసం అంటుంటారు. కానీ ఇందులో ఊహ యొక్క విషయమేమీ లేదు. ఇది అందరికీ అర్థం చేయించడము జరుగుతుంది, లేదంటే మనుష్యులకు ఎలా తెలుస్తుంది, అందుకే ఈ చిత్రాలు తయారుచేయబడ్డాయి. ఈ ప్రదర్శనీలు అనేక దేశాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. భారతవాసీ పిల్లలు చాలామంది ఉన్నారని తండ్రి అంటారు. వాస్తవానికి అందరూ పిల్లలే కదా. ఇది అనేక ధర్మాల వృక్షము. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ అంతా కామచితిపై కూర్చుని కాలిపోయి మరణించారు. సత్యయుగములో ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారే మళ్ళీ ద్వాపరము నుండి మొదలుకుని మొట్టమొదట కామాగ్నిలో కాలిపోతారు. అందుకే నల్లగా అయిపోయారు. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. మీరు నిమిత్తమవుతారు. మీ వలన అందరి సద్గతి జరగనున్నది. తండ్రి ఎంత సహజ రీతిలో అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. ఆత్మయే దుర్గతి పొందింది. ఆత్మ పతితముగా అవ్వడముతో శరీరము కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మను పావనముగా చేసే యుక్తిని తండ్రి చాలా సహజముగా తెలియజేస్తారు.

త్రిమూర్తి చిత్రములో బ్రహ్మా చిత్రాన్ని చూసి మనుష్యులు గొడవ చేస్తారు. వీరిని బ్రహ్మా అని ఎందుకు అంటారు? బ్రహ్మా అయితే సూక్ష్మవతనవాసీ దేవత, ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చారు? ఈ దాదా అయితే ప్రసిద్ధి గాంచినవారు. వార్తాపత్రికలలో అన్ని చోట్ల వారి గురించి ముద్రించారు - ఒక రత్నాల వ్యాపారి, నేను శ్రీకృష్ణుడిని, నాకు 16,108 మంది రాణులు కావాలని అంటున్నారని వ్రాశారు. ఇలా ఎత్తుకుపోతున్నారని చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కరి వెనుక ఎవరు తల పాడు చేసుకుంటారు. ఎంతోమంది మనుష్యులు ఉన్నారు. ఎవరైనా ఆబూకు వస్తే, వారికి వెంటనే చెప్పేవారు - అరే, బ్రహ్మాకుమార-కుమారీల వద్దకు వెళ్తున్నారా, వారు ఇంద్రజాలం చేసేస్తారు, పతి-పత్నిని సోదరీ-సోదరులుగా చేసేస్తారు, ఈ విషయాలను పెద్దవిగా చేసి చెప్పి వారి తలను పాడు చేస్తారు. తండ్రి అంటారు - మీరు నన్ను జ్ఞాన సాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అనగా సర్వశక్తివాన్, సర్వ వేద-శాస్త్రాలు మొదలైనవి తెలిసినవారు. గొప్ప విద్వాంసులను కూడా అథారిటీ అని అంటారు, ఎందుకంటే వారు సర్వ వేద-శాస్త్రాలు మొదలైనవాటిని చదువుతారు, తర్వాత బెనారస్ కు వెళ్ళి బిరుదులను పొంది వస్తారు. మహా-మహోపాధ్యాయ, శ్రీ శ్రీ 108 సరస్వతి, ఈ బిరుదులన్నీ అక్కడే లభిస్తాయి. ఎవరైతే చాలా తెలివైనవారిగా ఉంటారో, వారికి పెద్ద బిరుదు లభిస్తుంది. శాస్త్రాలలో జనకుని గురించి వ్రాయబడి ఉంది. జనకుడు - నాకు ఎవరైనా సత్యమైన బ్రహ్మా జ్ఞానాన్ని వినిపించండి అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మా జ్ఞానమైతే లేదు. అన్ని విషయాలు ఇక్కడివే. కథలు పెద్దవిగా తయారుచేసేసారు. శంకర-పార్వతుల గురించి కూడా కథను వినిపించారు, ఇలా ఎన్ని కథలను తయారుచేసారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని వ్రాశారు, వాస్తవానికి శివుడు వినిపించారు, కానీ వారు శంకరుడు మరియు పార్వతి పేర్లను వ్రాసేసారు. భాగవతం మొదలైనవాటిలో ఉన్న విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. కానీ జనకుని కథలో ఏమని చెప్తారంటే, జనక మహారాజు వద్దకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని అష్టావక్రుడికి సంకల్పము వచ్చింది అని. రాజుల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. రాజులకు ఇలా చెప్పండి - మీరే సూర్య వంశీయులుగా ఉండేవారు, తర్వాత చంద్ర వంశీయులుగా, వైశ్య వంశీయులుగా, శూద్ర వంశీయులుగా అయ్యారు, మీ రాజధానియే సమాప్తమైపోయింది, ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలంటే పురుషార్థము చేయండి. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు, మీరు మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్దకు కూడా చాలా ఉత్తరాలు వెళ్తాయి, కానీ అవి వారి వరకు చేరవు. వారి ప్రైవేట్ సెక్రటరీ ఉత్తరాలను చూస్తారు. ఎన్ని ఉత్తరాలను పడేస్తారు. ఏ ఉత్తరములోనైనా ముఖ్యమైన విషయముంటే రాజుకు చూపిస్తారు. అష్టావక్రుడు జనకుడికి సెకెండులో జీవన్ముక్తిని సాక్షాత్కారము చేయించారని చెప్తారు. ఈ విషయము కూడా ఇప్పటిదే. ఇప్పుడు తండ్రి కూర్చుని ఎంత మంచి రీతిలో మీకు అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో, వారు అటూ-ఇటూ చూస్తూ ఉంటారు. అటువంటివారి బుద్ధిలో ఏమీ కూర్చోవడము లేదని తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. బాబా నలువైపులా గమనిస్తూ ఉంటారు కూడా - అందరూ బాగా వింటున్నారా, పిల్లల బుద్ధి ఎక్కడైనా భ్రమిస్తుందా అని? కొంతమంది ఆవలిస్తూ ఉంటారు. జ్ఞానము బుద్ధిలో కూర్చోకపోతే, కునికిపాట్లు పడుతూ ఉంటారు, నష్టము కలుగుతుంది. కరాచీలో ఈ పిల్లల భట్టి జరిగింది. ఎవరైనా కునికిపాట్లు పడితే వెంటనే బయటకు పంపించేసేవారు. మనవాళ్ళే కూర్చునేవారు. బయటివారు ఎవరూ వచ్చేవారు కాదు. ప్రారంభములో వారిది చాలా పెద్ద పాత్ర నడిచింది. చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రారంభములోనైతే కుమార్తెలు ధ్యానములోకి చాలా ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పటికీ దానిని ఇంద్రజాలమనే అంటూ ఉంటారు. పరమపిత పరమాత్ముడిని ఇంద్రజాలికుడు అని అంటారు కదా. ఫలానావారికి చాలా ప్రేమ ఉందని శివబాబా చూస్తారు, అలా వారిని చూడగానే వారు వెంటనే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. వైకుంఠమైతే భారతవాసులకు చాలా ప్రియమైనది. ఎవరైనా మరణించినా కూడా, వైకుంఠవాసులుగా అయ్యారని, స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. ఇప్పుడిది నరకము. అందరూ నరకవాసులే, అందుకే ఫలానావారు స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. కానీ స్వర్గానికైతే అసలెవరూ వెళ్ళరు. మేము స్వర్గవాసులుగా ఉండేవారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకుని నరకవాసులుగా అయ్యామని కేవలం మీరు మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్వర్గవాసులుగా చేస్తున్నారు. స్వర్గములో రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి. పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఈ మమ్మా-బాబా భవిష్యత్తులో లక్ష్మీ-నారాయణులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు వారు పురుషార్థము చేస్తూ ఉన్నారు, అందుకే ఫాలో మదర్-ఫాదర్ అని అంటారు. వారు ఎలాగైతే పురుషార్థము చేస్తున్నారో, మీరు కూడా అలా చేయండి. వారు కూడా స్మృతిలో ఉంటారు, స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, త్రికాలదర్శులుగా అవ్వండి. మీకు ఈ మొత్తము చక్రము యొక్క జ్ఞానమంతా ఉంది, ఇందులో నిమగ్నమై ఉండండి, ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. ఈ సేవలోనే నిమగ్నమై ఉన్నట్లయితే, ఇక ఇతర వ్యాపారాలు మొదలైనవేవీ గుర్తుకు రావు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యయుగములో ఉన్నత పదవిని పొందేందుకు తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. వారి సమానముగా పురుషార్థము చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదువును చదువుకోవాలి.

2. స్మృతి యొక్క సత్యాతి-సత్యమైన చార్టును పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మరియు దేహధారులను గుర్తు చేయకూడదు.

వరదానము:-
తమ హైయ్యెస్ట్ (ఉన్నతోన్నతమైన) పొజిషన్ లో స్థితులై ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేసే సంపూర్ణ నిర్వికారీ భవ

సంపూర్ణ నిర్వికారులు అనగా కొంత శాతములో కూడా ఏ వికారము వైపుకు ఆకర్షణ వెళ్ళకూడదు, ఎప్పుడూ వాటికి వశీభూతులవ్వకూడదు. హైయ్యెస్ట్ పొజిషన్ లో ఉండే ఆత్మలు సాధారణ సంకల్పాలను కూడా చేయలేరు. కావున ఏదైనా సంకల్పాన్ని లేక కర్మను చేసేటప్పుడు చెక్ చేసుకోండి - ఏ విధముగా ఉన్నతమైన పేరు ఉందో, అలా కర్మలు కూడా ఉన్నతముగా ఉన్నాయా? ఒకవేళ పేరు ఉన్నతముగా ఉండి, కర్మలు నీచముగా ఉన్నట్లయితే పేరును అప్రతిష్టపాలు చేస్తారు, అందుకే లక్ష్యము అనుసారముగా లక్షణాలను ధారణ చేయండి, అప్పుడే సంపూర్ణ నిర్వికారులు అనగా హోలియెస్ట్ (అత్యంత పవిత్రమైన) ఆత్మలు అని అంటారు.

స్లోగన్:-
కర్మలు చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ-చేయించే తండ్రి యొక్క స్మృతి ఉన్నట్లయితే స్వ పురుషార్థము మరియు యోగము యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

ఈ కలియుగీ తమోప్రధానమైన, శిథిలమైన వృక్షము యొక్క దుర్దశను చూస్తూ బ్రహ్మాబాబాకు ఈ సంకల్పము కలుగుతుంది - ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వీ రూపము ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మము చేయాలి అని. కానీ దాని కోసం సంగఠిత రూపములో ఫుల్ ఫోర్స్ ద్వారా యోగ జ్వాల ప్రజ్వలితము కావాలి. కావున బ్రహ్మాబాబా యొక్క ఈ సంకల్పాన్ని సాకారములోకి తీసుకురండి.