28-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.02.2007


‘‘నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పటము అనే నిద్ర నుండి మేల్కోవటమే శివరాత్రి యొక్క సత్యమైన జాగరణ’’

ఈ రోజు బాప్ దాదా విశేషముగా నలువైపులా ఉన్న తమ అతి ప్రియమైన, చాలా కాలం క్రితం దూరమై తర్వాత కలిసిన, పరమాత్మ ప్రేమకు పాత్రులైన పిల్లలను కలుసుకునేందుకు మరియు విచిత్రుడైన తండ్రి తన పిల్లల జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరందరూ కూడా ఈ రోజు విశేషముగా విచిత్ర జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా! ఇటువంటి జన్మదినము మొత్తం కల్పమంతటిలోనూ ఎవ్వరికీ ఉండదు. తండ్రి మరియు పిల్లల జన్మదినము ఒకే రోజున ఉండటమనేది ఎప్పుడూ కూడా విని ఉండరు. కావున మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరపడానికి వచ్చారా లేక పిల్లల జన్మదినాన్ని కూడా జరుపుకునేందుకు వచ్చారా? ఎందుకంటే కల్పమంతటిలో పరమాత్మ అయిన తండ్రికి మరియు పరమాత్ముని పిల్లలకు మధ్యన ఎంతటి అపారమైన ప్రేమ ఉంది అంటే, వారి జన్మ కూడా కలిసే జరుగుతుంది. విశ్వ పరివర్తనా కార్యాన్ని తండ్రి ఒంటరిగా చేయరు, పిల్లలతో కలిసే చేస్తారు. ఇలా తోడుగా ఉండే అలౌకిక ప్రేమను, సహచరునిగా అయ్యే ప్రేమను ఈ సంగమములోనే అనుభవం చేస్తారు. తండ్రి మరియు పిల్లల మధ్యన ఎంతటి గాఢమైన ప్రేమ ఉంది అంటే వారి జన్మ కూడా కలిసే జరుగుతుంది, అంతేకాక ఉండడము కూడా ఎక్కడ ఉంటారు? ఒంటరిగా ఉంటారా లేక తోడుగా ఉంటారా? మేము తండ్రితోపాటు కంబైండుగా ఉన్నాము అని పిల్లలు ప్రతి ఒక్కరూ ఉల్లాస-ఉత్సాహాలతో అంటారు. కంబైండుగా ఉంటారు కదా! ఒంటరిగా అయితే ఉండటము లేదు కదా! కలిసే జన్మించారు, కలిసే ఉంటారు మరియు ఇక మున్ముందు కోసము కూడా ప్రతిజ్ఞ ఏమిటి? కలిసే ఉన్నాము, కలిసే ఉంటాము, తమ మధురమైన ఇంటికి కలిసే వెళ్తాము. ఇంతటి ప్రేమను ఇతర ఏ తండ్రికి, పిల్లలకు మధ్యన ఉండటాన్ని చూసారా? పిల్లలు ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, తోడుగానే ఉన్నారు మరియు తోడుగానే వెళ్ళనున్నారు. కావున ఇటువంటి ఈ విచిత్రమైన మరియు ప్రియాతి ప్రియమైన జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. సమ్ముఖముగా జరుపుకుంటున్నా సరే, దేశ-విదేశాలలో జరుపుకుంటున్నా సరే, నలువైపులా ఒకే సమయములో కలిసి జరుపుకుంటున్నారు.

పిల్లలందరూ ఉల్లాస-ఉత్సాహాలతో, మనసులో లోలోపల - వాహ్ బాబా! వాహ్ బాబా! వాహ్ జన్మదినోత్సవము! అని ఎలా పాటలు పాడుకుంటున్నారు అనేది బాప్ దాదా నలువైపులా చూస్తున్నారు. ఒకవేళ స్విచ్ ఆన్ చేస్తే నలువైపులా యొక్క ధ్వని, హృదయములోని ధ్వని, ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన ధ్వని బాప్ దాదా చెవులకు వినిపిస్తూ ఉంది. బాప్ దాదా పిల్లలందరి ఉత్సాహాన్ని చూసి పిల్లలకు కూడా తమ దివ్య జన్మకు పదమాల, పదమాల, పదమాల రెట్లు అభినందనలను తెలుపుతున్నారు. వాస్తవానికి ఉత్సవము యొక్క అర్థమే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండటము. కనుక మీరందరూ ఉత్సాహముతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. పేరు కూడా భక్తులు శివరాత్రి అని పెట్టారు.

ఈ రోజు బాప్ దాదా ఏ భక్తాత్మలైతే మీ ఈ విచిత్ర జన్మదినాన్ని జరుపుకోవడాన్ని కాపీ చాలా బాగా చేసారో, ఆ భక్తాత్మలకు అభినందనలు తెలుపుతున్నారు. మీరు జ్ఞానము మరియు ప్రేమ రూపములో జరుపుకుంటారు మరియు ఆ భక్తాత్మలు భావన మరియు శ్రద్ధ రూపములో మీరు జరుపుకోవడాన్ని కాపీ చేసారు. కావున కాపీ చేయటములో మంచి పాత్రను అభినయించారు అని ఈ రోజు ఆ పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. చూడండి, ప్రతి విషయాన్ని కాపీ చేసారు. కాపీ చేయడానికి కూడా తెలివి కావాలి కదా! ముఖ్యమైన విషయమేమిటంటే - ఈ రోజున భక్తులు కూడా వ్రతము పెట్టుకుంటారు, వారు ఆహార పానీయాల విషయములో వ్రతము పెట్టుకుంటారు, వృత్తిని శ్రేష్ఠముగా తయారుచేసుకునేందుకు భావనతో వ్రతము పెట్టుకుంటారు, వారు ప్రతి సంవత్సరము వ్రతము పెట్టుకోవలసి ఉంటుంది మరియు మీరు ఏ వ్రతము చేపట్టారు? మీరు ఒక్కసారే వ్రతము చేపడతారు, ప్రతి సంవత్సరము చేపట్టరు. మీరు పవిత్రత యొక్క వ్రతాన్ని ఒకేసారి చేపట్టారు. అందరూ పవిత్రత యొక్క వ్రతాన్ని చేపట్టారా, పక్కాగా చేపట్టారా? ఎవరైతే పక్కాగా చేపట్టారో వారు చేతులెత్తండి, పక్కానా, కొంచెము కూడా కచ్చాగా (అపరిపక్వముగా) లేరా. పక్కానా? అచ్ఛా. మరొక ప్రశ్న కూడా ఉంది, అచ్ఛా, వ్రతమైతే చేపట్టారు, దానికి అభినందనలు. కానీ అపవిత్రతకు సంబంధించి అయిదుగురు ముఖ్యమైన సహచరులు ఉన్నారు, అంతే కదా! తల ఊపండి. అచ్ఛా, అయిదింటి యొక్క వ్రతాన్ని చేపట్టారా? లేక రెండు లేదా మూడింటి విషయములో చేపట్టారా? ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ ఒకవేళ అంశమాత్రమైనా సరే అపవిత్రత ఉంటే, మరి సంపూర్ణ పవిత్ర ఆత్మ అని పిలవబడతారా? మరియు బ్రాహ్మణాత్మలైన మీకైతే పవిత్రత అనేది బ్రాహ్మణ జన్మ యొక్క ప్రాపర్టీ, పర్సనాలిటీ, రాయల్టీ. కనుక చెక్ చేసుకోండి - ముఖ్యమైన పవిత్రత పైన అయితే అటెన్షన్ ఉంది కానీ సంపూర్ణ పవిత్రత కోసము, మిగిలిన సహచరుల ఏవైతే ఉన్నాయో, వాటిని తేలికగా అయితే వదిలేయలేదు కదా? చిన్నవాటిపై ప్రేమను పెట్టుకున్నారు మరియు పెద్దవాటిని సరి చేసుకున్నారు. మరి మిగిలిన నాలుగు ఏవైతే ఉన్నాయో, వాటిని సహచరులుగా చేసుకున్నా పర్వాలేదు అని బాబా ఏమైనా అనుమతిని ఇచ్చారా? పవిత్రత అని కేవలం బ్రహ్మచర్యాన్నే అనడం జరగదు, కానీ బ్రహ్మచర్యముతోపాటుగా బ్రహ్మాచారిగా అవ్వటము అనగా పవిత్రత యొక్క వ్రతాన్ని పాలన చేయటము. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో అంటుంటారు, ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తుంటారు కదా, అప్పుడు చాలా మధురాతి-మధురమైన విషయాలను మాట్లాడుతారు. ఏమంటారంటే, బాబా, ముఖ్యమైనది అయితే బాగానే ఉంది కదా, మిగిలిన చిన్న-చిన్నవి అలా అప్పుడప్పుడు మనసులో సంకల్పాలలో వస్తుంటాయి. మనసులోకి వస్తాయి, వాచాలోకి రావు మరియు మనసునైతే ఎవరూ చూడరు. మరికొంతమంది ఏమంటారంటే, చిన్న-చిన్న పిల్లలపైనైతే ప్రేమ ఉంటుంది కదా, అలా ఈ నాలుగింటిపై కూడా ప్రేమ ఏర్పడుతుంది. క్రోధము వచ్చేస్తుంది, మోహము వచ్చేస్తుంది, అవి రావాలని కోరుకోము కానీ అవి వచ్చేస్తాయి. బాప్ దాదా అంటారు, ఏవైనా వస్తున్నాయంటే మీరు తలుపు తెరిచారు కావుననే వస్తున్నాయి కదా! మరి తలుపునెందుకు తెరిచారు? బలహీనత అనే తలుపును తెరిచారు, మరి బలహీనత అనే తలుపును తెరవడము అంటే ఆహ్వానించడము.

ఈ రోజున తండ్రి యొక్క మరియు మీ యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కానీ జన్మించగానే వ్రతం గురించి ప్రతిజ్ఞ చేసారు. మొట్టమొదటి వరదానము బాప్ దాదా ఏమిచ్చారో గుర్తుందా? జన్మదినము యొక్క వరదానము గుర్తుందా? ఏ వరదానము ఇచ్చారు? పవిత్ర భవ, యోగి భవ. అందరికీ ఈ వరదానము గుర్తుంది కదా? గుర్తుందా, మర్చిపోలేదు కదా? పవిత్ర భవ అనే వరదానము కేవలం ఒక్కదానికి సంబంధించే ఇవ్వలేదు, అయిదింటికి సంబంధించి ఇచ్చారు. కనుక ఈ రోజు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు, తండ్రి యొక్క జన్మదినాన్ని కూడా జరిపేందుకు వచ్చారు కదా. శివరాత్రిని జరుపుకునేందుకు వచ్చారు, మరి జన్మదినము యొక్క కానుకను తీసుకువచ్చారా లేక ఖాళీ చేతులతో వచ్చారా? స్థాపన జరిగి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి, గుర్తుంది కదా! 70 సంవత్సరాలు, ఆలోచించండి. మీరు తర్వాత వచ్చినా కానీ స్థాపన జరిగైతే 70 సంవత్సరాలు అయ్యాయి కదా! మీరు ఇప్పుడే వచ్చినా కానీ స్థాపన యొక్క కర్తవ్యములో మీరందరూ సహచరులే కదా? సహచరులే కదా! ఈ రోజే మొదటిసారిగా వచ్చి ఉండవచ్చు, మొదటిసారి మధుబన్ కు వచ్చినవారు చేతులెత్తండి, బాగా పైకి ఎత్తండి. అచ్ఛా. మీరందరూ వచ్చి ఒక సంవత్సరమై ఉండవచ్చు లేక రెండు సంవత్సరాలై ఉండవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఏమని చెప్పుకుంటారు? బ్రహ్మాకుమారి, బ్రహ్మాకుమారులు అనా లేక పురుషార్థ కుమారులు, కుమారీలు అనా? ఏమని చెప్పుకుంటారు? ఎవరైనా తమను తాము పురుషార్థీ కుమారులుగా చెప్పుకుంటారా ఏమిటి? బ్రహ్మాకుమార్ అని సంతకము పెడతారు కదా! అందరు బి.కె. (బ్రహ్మాకుమార్) అని వ్రాస్తారా లేక పి.కె. (పురుషార్థీ కుమార్) అని వ్రాస్తారా? మీ ప్రతిజ్ఞ ఏమిటి? సహచరులుగా ఉంటాము, కలిసే వెళ్తాము, కంబైండుగా ఉంటాము అని, మరి అయితే కంబైండుగా ఉండాలంటే సమానత కావాలి కదా!

ఈ 70 సంవత్సరాల ఉత్సవాన్ని అయితే జరుపుతూ ఉన్నారు. బాప్ దాదా చూసారు, ఏయే జోన్ వారైతే సేవా టర్న్ లో వస్తారో వారు 70 సంవత్సరాల సన్మాన సమారోహాన్ని జరుపుకుంటున్నారు. అందరూ జరుపుకుంటున్నారు కదా! చిన్న-చిన్న కానుకలు ఇచ్చుకుంటారు, అంతే. కానీ ఈ రోజు ఒకటేమో జన్మదినము, దానిని జరుపుకోవడానికి వచ్చారు కదా, పక్కా కదా? మరియు ఇంకొకటి 70 సంవత్సరాలు పూర్తి అయ్యాయి, కావున సన్మాన సమారోహాన్ని కూడా జరుపుకుంటున్నారు, జన్మదినాన్ని కూడా జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భముగా ఏ కానుకను ఇస్తారు? ట్రే ఇస్తారా, దుప్పటి ఇస్తారా? ఏం కానుకను తీసుకువచ్చారు? పోనీ వెండి గ్లాసు ఇస్తారా! కానీ ఈ రోజున బాప్ దాదాకు తన ఆశా దీపాలైన పిల్లల పట్ల శుభ ఆశ ఉంది. ఆ శుభ ఆశ ఏమిటో చెప్పమంటారా? అది చెప్పటము మరియు మీరు వినటము అంటే ఏమిటి? ఒక చెవితో వినటము మరియు హృదయములో ఇముడ్చుకోవటమా, అలానా? విని వదిలేయరు కదా, అలా చేయరు కానీ హృదయములోనే ఇముడ్చుకుంటారు. మరి ఈ రోజు ఆ శుభ ఆశ ఏమిటో చెప్పమంటారా, మొదటి వరుసలోని వారు చెప్పండి, తల ఊపండి, టీచర్లు తల ఊపండి. అచ్ఛా, జెండా ఊపుతున్నారు. డబుల్ విదేశీయులూ, చెప్పమంటారా? మరి మీరు కట్టుబడి ఉండవలసి ఉంటుంది, అలా అయితేనే అవును అని చెప్పండి, ఊరికే అలా అవును అని అనకండి, ఎందుకంటే ఈ 70 సంవత్సరాలైతే బాప్ దాదా కూడా నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పే ఆటను చూసారు. పోనీ 70 సంవత్సరాలు కాకపోతే 50, 40, 30, 20 సంవత్సరాలు అనుకోండి, కానీ ఇంత సమయమైతే పిల్లల యొక్క ఈ మూడింటి ఆటను బాగా చూసారు. ఈ రోజున భక్తులు జాగరణ చేస్తారు, నిద్రపోరు, మరి పిల్లలైన మీ జాగరణ ఏమిటి? ఏ నిద్రలో మీరు ఘడియ-ఘడియ నిద్రపోతున్నారు? నిర్లక్ష్యము, సోమరితనము మరియు సాకులు చెప్పే నిద్రలో విశ్రాంతిగా నిద్రపోతున్నారు. కనుక ఈ రోజు బాప్ దాదా ఈ మూడు విషయాలకు సంబంధించిన జాగరణను ప్రతి సమయము చూడాలనుకుంటున్నారు. ఎప్పుడైనా క్రోధము వస్తుంది, అభిమానము వస్తుంది, లోభము వస్తుంది, అప్పుడు కారణమేమి చెప్తారు? బాప్ దాదాకు ఒక ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది. ఏదైనా విషయము జరుగుతుంది కదా, అప్పుడు ఏమంటారు? ఇది అయితే ఇలా నడుస్తూనే ఉంటుంది... అసలు ఇలా ఎవరు మొదలుపెట్టారో తెలియదు. కానీ అలానే మాట్లాడుతూ ఉంటారు - ఇదైతే అవుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇదేమైనా కొత్త విషయమా, ఇది అవుతూనే ఉంటుంది... అని అంటారు. ఇలా అనటమంటే ఏమిటి? ఇది నిర్లక్ష్యము కాదా? మరి వారు కూడా ఇలా చేస్తారు కదా అని అంటారు. మెజారిటీ క్రోధము నుండి రక్షించుకునేందుకు ఎలా మాట్లాడుతారంటే - వీరు ఇలా చేసారు, అందుకే ఇలా అయ్యింది. నేను తప్పు చేసాను అని అనరు. వీరు ఇలా చేసారు కదా, ఇది జరిగింది కదా, అందుకే ఇలా అయ్యింది అని అంటారు. ఇతరులపై దోషము మోపడం చాలా సహజము. వీరు అలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు అని అంటారు. మరి బాబా ఏదైతే చెప్పారో, అది జరగదా. వారు అలా చేస్తే ఇలా జరుగుతుంది అని అంటారే, మరి బాబా ఇచ్చిన శ్రీమతమనుసారముగా క్రోధాన్ని సమాప్తము చేయలేరా? ఈ రోజుల్లో క్రోధము యొక్క సంతానము ఆవేశము. ఆవేశము కూడా రకరకాలుగా ఉంటుంది. మరి ఈ రోజు మిగిలిన నాలిగింటి యొక్క వ్రతము కూడా చేపడతారా? ఏ విధముగా మొదటి విషయము గురించి మెజారిటీ ధృఢ సంకల్పము చేసారో, అదే విధముగా మిగిలిన నాలిగింటి గురించి కూడా సంకల్పము చేస్తారా! వీరు ఇలా చేసారు కావుననే నేను ఇలా చేయవలసి వచ్చింది అని సాకులు చెప్పకండి. బాబా ఏదైతే పదే-పదే చెప్తున్నారో అది గుర్తుండటము లేదు కానీ వారు చేసింది మాత్రము గుర్తుకొస్తుంది అంటే, మరి అది సాకులు చెప్పటమే కదా! కావున ఈ రోజు బాప్ దాదా పుట్టినరోజు కానుకగా ఈ మూడు విషయాలను కోరుకుంటున్నారు, ఈ మూడు విషయాలే మిగిలిన నాలుగింటిని తేలిక చేసేస్తున్నాయి. సంస్కారాలను అయితే ఎదుర్కోవలసే ఉంటుంది. సంస్కారాలను ఎదుర్కోవటము కాదు, వాస్తవానికి ఇది ఒక పరీక్ష. ఒక్క జన్మ యొక్క చదువు మరియు దానికి ప్రతిఫలముగా మొత్తం కల్పమంతటి ప్రాప్తి, అర్ధకల్పము రాజ్యభాగ్యము, అర్ధకల్పము పూజ్యులుగా అవుతారు. ఒక్క జన్మలోనే మొత్తం కల్పమంతటి కొరకు ప్రాప్తి. అది కూడా చిన్న జన్మ, అందులోనూ జన్మ అంతా కూడా కాదు, చిన్న జన్మ. మరి ధైర్యము ఉందా? తప్పకుండా ధైర్యము పెడతాము అని ఎవరైతే అంటారో... పురుషార్థము చేస్తాము, అటెన్షన్ పెడతాము... ఇలా చేస్తాము, పెడతాము అని అనటము కాదు. మీరేమీ చిన్న పిల్లలు కారు, 70 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నాయి. మూడు, నాలుగు నెలల పిల్లలు అలా చేస్తాము, చేస్తాము అని మాట్లాడుతారు. మీరు బాబాకు సహచరులు కదా! మీరు విశ్వ కళ్యాణకారులు. మీకు 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. బాప్ దాదా ఇప్పుడు చేతులు ఎత్తించరు, ఎందుకంటే బాప్ దాదా చూసారు, చేతులు ఎత్తి కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యులుగా అయిపోతున్నారు. మరి ఏమనుకుంటున్నారు, ఏదేమైనా కానీ, పర్వతము వంటి పరీక్ష వచ్చినా కానీ, పర్వతాన్ని కూడా దూదిలా చేసేస్తాము అని భావిస్తున్నారా? ఇటువంటి దృఢ సంకల్పము చేసే ధైర్యము ఉందా! ఎందుకంటే సంకల్పాలు చాలా బాగా చేస్తున్నారు, మీరు సంకల్పాలు చేసే సమయములో బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. కానీ విషయమేమిటంటే, 70 సంవత్సరాలు తేలికగా వదిలేసారు కానీ బాప్ దాదా చూస్తున్నారు, సమయముపై ఎటువంటి నమ్మకము లేదు, అంతేకాక ఈ జ్ఞానము ఆధారముగా పురుషార్థానికి సంబంధించిన ప్రతి విషయములోనూ బహుకాలపు లెక్క ఉంటుంది. అచ్ఛా, ఇప్పుడిప్పుడే చేసేస్తాము అని అనడానికి లేదు, ఇక్కడ బహుకాలపు లెక్క ఉంటుంది, ఎందుకంటే ప్రాప్తి కూడా ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చేతులెత్తిస్తాను, సీతగా, రాముడిగా ఎవరైనా అవుతారా? సీతగా, రాముడిగా అవ్వాలనుకునేవారు చేతులెత్తండి, రాజ్యమైతే లభిస్తుంది. సీతా-రాములుగా అవుతాము అని ఎవరైనా చేతులు ఎత్తుతున్నారా? లక్ష్మీ-నారాయణులుగా అవ్వరా? డబుల్ విదేశీయులలో ఎవరైనా చేతులు ఎత్తుతున్నారా? (ఎవ్వరూ లేరు) మరి బహుకాలపు భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటున్నారు. లక్ష్మీ-నారాయణులుగా అవ్వటము అనగా బహుకాలపు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవటము. మరి బహుకాలపు ప్రాప్తి అన్నప్పుడు ప్రతి విషయములోనూ బహుకాలము ఉండాలి కదా! ఇప్పుడు 63 జన్మల బహుకాలపు సంస్కారాలు ఉన్నందుకు - మా భావము అది కాదు, మా భావన అది కాదు, 63 జన్మల సంస్కారము అని అంటారు కదా! మరి బహుకాలపు లెక్క అయ్యింది కదా. అందుకే బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే, సంకల్పాలలో దృఢత ఉండాలి. దృఢతయే లోపిస్తుంది. అయిపోతుందిలే... నడుస్తుందిలే, నడవనివ్వండి, ఎవరు తయారయ్యారని... ఇలా అనుకుంటారు. మరొక మంచి విషయము అందరికీ వస్తుంది, బాప్ దాదా అన్ని విషయాలను నోట్ చేసారు. ఒకవేళ తమలో ధైర్యము లేకపోతే - మహారథులు కూడా ఇలా చేస్తారు, మేము చేస్తే ఏమైంది అని అంటారు. కానీ బాప్ దాదా అడుగుతున్నారు, ఏ సమయములోనైతే మహారథి తప్పు చేస్తారో, ఆ సమయములో వారు మహారథినా? మహారథి అన్న పేరును ఎందుకు పాడు చేస్తారు? ఆ సమయములో వారు మహారథి కానే కాదు, కావున మహారథి పేరును ఉపయోగించుకుంటూ స్వయాన్ని బలహీనము చేసుకోవటమంటే, అది స్వయాన్ని మోసము చేసుకోవటమే. ఇతరులను చూడటము సహజమనిపిస్తుంది, స్వయాన్ని చూసుకోవటానికి కొంచెము ధైర్యము కావాలి. ఈ రోజు బాప్ దాదా లెక్కల ఖాతాను సమాప్తము చేయించే కానుకను తీసుకోవడానికి వచ్చారు. బలహీనతలు మరియు సాకులు చెప్పటము యొక్క ఖాతా పుస్తకము చాలా పెద్దది, దానిని సమాప్తము చేయాలి. కావున ఎవరెవరైతే - మేము చేసి చూపిస్తాము, చేయవలసిందే, వంగవలసిందే, మారవలసిందే, పరివర్తనా మహోత్సవాన్ని జరుపుకోవలసిందే అని సంకల్పము చేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. దృఢ సంకల్పమా లేక నామమాత్రపు సంకల్పమా? నామమాత్రపు సంకల్పము కూడా ఉంటుంది మరియు దృఢ సంకల్పము కూడా ఉంటుంది. మరి మీరందరూ దృఢ సంకల్పము చేసారా? దృఢ సంకల్పము చేసారా? మధుబన్ వారు చేతులెత్తండి, బాగా పైకి ఎత్తండి. ఇక్కడ ఎదురుగా మధుబన్ వారు కూర్చుంటారు, వారికి చాలా సమీపముగా కూర్చునే అవకాశము ఉంది. మొదటి సీట్ మధుబన్ వారికి లభిస్తుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ముందు కూర్చున్నారు, ముందే ఉండండి.

ఈ నాటి కానుక చాలా గొప్పగా ఉంది కదా! బాప్ దాదాకు కూడా సంతోషముగా ఉంది, ఎందుకంటే మీరు ఒక్కొక్కరు ఒక్కరు కాదు. మీ వెనుక మీ రాజధానిలో మీ రాయల్ ఫ్యామిలీ, మీ రాయల్ ప్రజలు, మళ్ళీ ద్వాపరము నుండి మీ భక్తులు, సతో, రజో, తమోగుణీ, మూడు రకాల భక్తులు, ఇలా మీ వెనుక పెద్ద లైన్ ఉంది. మీరు ఏదైతే చేస్తారో అదే మీ వెనుకవారు చేస్తారు. మీరు సాకులు చెప్తుంటే మీ భక్తులు కూడా చాలా సాకులు చెప్తారు. ఇప్పుడు బ్రాహ్మణ పరివారము కూడా మిమ్మల్ని చూసి, తప్పును కాపీ చేయటములో తెలివైనవారిగా ఉంటారు కదా. కనుక ఇప్పుడు దృఢ సంకల్పము చేయండి - సంస్కారాల ఘర్షణ ఉన్నా, స్వభావాలలో అభిప్రాయ బేధాలు ఉన్నా దృఢ సంకల్పము చేయండి. మూడో విషయము బలహీనమైనవారిలో ఉంటుంది, అదేమిటంటే, ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా అసత్యమైన విషయము చెప్తే, మాకు అబద్దము చెప్తే చాలా కోపము వస్తుంది అని కొందరు పిల్లలు అంటారు. కానీ మీరు సత్యమైన తండ్రితో వెరిఫై చేయించారు, సత్యమైన తండ్రి మీతోపాటు ఉన్నారు, కావున మొత్తం అసత్యమైన ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా ఒక్క బాబా మీతోపాటు ఉన్నారు, కావున మీ విజయము నిశ్చితము. ఎవ్వరూ మిమ్మల్ని కదల్చలేరు, ఎందుకంటే బాబా మీతోపాటు ఉన్నారు. అసత్యము చెప్తున్నారు అని అంటున్నారే, మరి అసత్యాన్ని అసత్యముగానే వదిలేయండి కదా, దానిని ఎందుకు పెంచుతున్నారు! ఇది అయ్యింది, అది అయ్యింది, ఇది అయ్యింది... ఈ సాకులు చెప్పటము బాబాకు ఇష్టమనిపించదు. ఇది, అది అనే పాటలు ఇప్పుడు సమాప్తమవ్వాలి. మంచే జరిగింది, మంచే జరుగుతుంది, మంచిగా ఉంటారు, అందరినీ మంచిగా చేస్తారు. మంచి-మంచి-మంచి అన్న పాటను పాడండి. మరి ఇష్టమేనా? ఇష్టమేనా? సాకులు చెప్పటాన్ని సమాప్తము చేస్తారా? చేస్తారా? రెండు చేతులు ఎత్తండి. ఆ, బాగా ఊపండి. అచ్ఛా, చూస్తున్నవారు కూడా చేతులు ఊపుతున్నారు. ఎక్కడి నుండి చూస్తున్నా కానీ చేతులు ఊపండి. మీరైతే ఊపుతున్నారు. అచ్ఛా, ఇప్పుడు దించండి, ఇప్పుడు మీ పరివర్తన యొక్క చప్పట్లు కొట్టండి. (అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు) అచ్ఛా.

అచ్ఛా - ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషము కోసము దృఢ సంకల్ప స్వరూపములో కూర్చోండి - సాకులు చెప్పటాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రతి సమయము దృఢ సంకల్పము ద్వారా సమాప్తము చేసి బహుకాలపు లెక్కను జమ చేసుకోవలసిందే. ఏదేమైనా కానీ, ఏమీ చూడవద్దు, బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా అవ్వవలసిందే, విశ్వము యొక్క సింహాసనాధికారులుగా అవ్వవలసిందే. ఈ దృఢ సంకల్ప స్వరూపములో అందరూ కూర్చోండి. అచ్ఛా.

నలువైపులా సదా ఉల్లాస-ఉత్సాహాల అనుభవములో ఉండేవారికి, సదా సఫలతకు తాళంచెవి అయిన దృఢతను కార్యములో ఉపయోగించేవారికి, సదా బాబాతోపాటుగా ఉంటూ, ప్రతి కార్యములోనూ సహచరునిగా అయ్యి ఉండేవారికి, సదా ఏక్ నామీ మరియు ఎకానమీగా ఉండేవారికి, ఏకాగ్రత స్వరూపములో ఇంకా, ఇంకా ముందుకు ఎగురుతూ ఉండేవారికి, బాప్ దాదా యొక్క అతి ప్రియమైన, చాలా కాలము దూరమై తర్వాత కలిసినవారికి, విశేషమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
హద్దులోని సర్వ కోరికలను త్యాగము చేసే సత్యమైన తపస్వీ మూర్త భవ

హద్దు కోరికలను త్యాగము చేసి సత్యాతి-సత్యమైన తపస్వీ మూర్తులుగా అవ్వండి. తపస్వీ మూర్తులు అనగా హద్దులోని కోరికలంటే ఏమిటో తెలియనివారు. ఎవరైతే తీసుకోవాలి అన్న సంకల్పము చేస్తారో వారు అల్పకాలికముగా తీసుకుంటారు కానీ సదాకాలము కొరకు పోగొట్టుకుంటారు. తపస్వీలుగా అవ్వడములో విశేషమైన విఘ్నరూపము - ఈ అల్పకాలికమైన కోరికలే, అందుకే ఇప్పుడు తపస్వీ మూర్తులుగా అయ్యే ఋజువును చూపించండి అనగా హద్దులోని గౌరవ-ప్రతిష్టలను అందుకోవాలి అన్నదానిని త్యాగము చేసి విధాతలుగా అవ్వండి. ఎప్పుడైతే విధాతా స్వరూపపు సంస్కారాలు ఇమర్జ్ అవుతాయో అప్పుడు ఇతర సంస్కారాలన్నీ స్వతహాగానే అణిగిపోతాయి.

స్లోగన్:-
కర్మల ఫలము లభించాలి అన్న సూక్ష్మ కామనను పెట్టుకోవడము కూడా ఫలాన్ని ముగ్గేకంటే ముందే తినేయడం వంటిది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

పాప కటేశ్వరులుగా లేక పాపాలను హరించేవారిగా ఎప్పుడు అవ్వగలరంటే స్మృతి జ్వాలా స్వరూపముగా ఉన్నప్పుడు. ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మల నిర్బలత దూరమవుతుంది, దీని కొరకు ప్రతి క్షణము, ప్రతి శ్వాసలోనూ బాబా మరియు మీరు కంబైండ్గా ఉండండి. ఏ సమయములోనూ సాధారణ స్మృతి ఉండకూడదు. స్నేహము మరియు శక్తి, రెండు రూపాలు కంబైండ్గా ఉండాలి.