29-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు జ్ఞానముతో మంచి జాగృతి కలిగింది, మీకు మీ 84 జన్మల గురించి, నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి గురించి తెలుసు, మీ భ్రమించడము ఇక ఆగిపోయింది’’

ప్రశ్న:-
ఈశ్వరుడు ఇచ్చే గతి మరియు మతము అతీతమైనవి అని ఎందుకు అంటూ ఉంటారు?

జవాబు:-
1. ఎందుకంటే వారు ఎటువంటి మతాన్ని ఇస్తారంటే దాని ద్వారా బ్రాహ్మణులైన మీరు అందరికన్నా అతీతముగా అవుతారు. మీ అందరిదీ ఒకే మతము అవుతుంది. 2. ఈశ్వరుడే అందరికీ సద్గతిని ఇస్తారు. వారు పూజారుల నుండి పూజ్యులుగా చేస్తారు, అందుకే వారు ఇచ్చే గతి మరియు మతము అతీతమైనవి, దానిని పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు.

ఓంశాంతి
పిల్లల ఆరోగ్యము ఒకవేళ బాగోలేకపోతే, తండ్రి - ఇక్కడ పడుకోండి పర్వాలేదు అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. దీనికి అభ్యంతరమేమీ లేదు ఎందుకంటే మీరు చాలా కాలము దూరమై తర్వాత కలిసిన పిల్లలు అనగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరిని కలుసుకున్నారు? అనంతమైన తండ్రిని. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, తప్పకుండా మేము అనంతమైన తండ్రిని కలుసుకున్నాము అని మీకు నిశ్చయముంది ఎందుకంటే తండ్రులు ఇద్దరు ఉంటారు, ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. దుఃఖములో అందరూ అనంతమైన తండ్రినే తలచుకుంటారు. సత్యయుగములో ఒక్క లౌకిక తండ్రినే తలచుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్నదే సుఖధామము. ఈ లోకములో జన్మ ఇచ్చే తండ్రిని లౌకిక తండ్రి అని అంటారు. పారలౌకిక తండ్రి అయితే ఒకేసారి వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. మీరు ఉండడము కూడా తండ్రితో పాటు అమరలోకములో ఉంటారు - దానిని పరలోకము, పరంధామము అని అంటారు. అది అన్నింటికన్నా అతీతముగా, దూరముగా ఉన్న ధామము. స్వర్గాన్ని అతీతమైన, దూరముగా ఉన్న ధామము అని అనరు. స్వర్గము, నరకము ఇక్కడే ఉంటాయి. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని, పాత ప్రపంచాన్ని నరకము అని అంటారు. ఇప్పుడు ఉన్నది పతిత ప్రపంచము, అందుకే - ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. సత్యయుగములో ఇలా అనరు. ఎప్పటి నుండైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పటి నుండి పతితులుగా అవుతారు, దానిని పంచ వికారాల రాజ్యము అని అంటారు. సత్యయుగములో ఉన్నదే నిర్వికారీ రాజ్యము. భారత్ కు ఎంత గొప్ప మహిమ ఉంది. కానీ వికారులుగా అయిన కారణముగా భారత్ మహిమను గురించి తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసే సమయములో భారత్ సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు ఆ రాజ్యము లేదు. ఆ రాజ్యము ఏమైంది - ఇది రాతి బుద్ధి కలవారికి తెలియదు. మిగిలినవారందరికీ వారి-వారి ధర్మ స్థాపకుల గురించి తెలుసు, కేవలం భారతవాసులకు మాత్రమే తమ ధర్మము గురించి తెలియదు, తమ ధర్మ స్థాపకుని గురించి తెలియదు. ఇతర ధర్మాల వారికి తమ ధర్మము గురించి తెలుసు కానీ ఆ ధర్మాన్ని స్థాపన చేయడానికి మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఇది తెలియదు. సిక్కు ధర్మము వారికి కూడా - మా సిక్కు ధర్మము ఇంతకుముందు ఉండేది కాదు అన్న విషయము తెలియదు. గురునానక్ వచ్చి స్థాపన చేసారు అంటేనే ఆ ధర్మము తప్పకుండా సుఖధామములో ఉండదని అర్థము, అందుకే గురునానక్ వచ్చి మళ్ళీ స్థాపన చేస్తారు ఎందుకంటే ప్రపంచ చరిత్ర మరియు భూగోళము రిపీట్ అవుతాయి కదా. క్రిస్టియన్ ధర్మము కూడా ఇంతకుముందు లేదు, అది తర్వాత స్థాపన అయ్యింది. మొదటిలో కొత్త ప్రపంచము ఉండేది, ఒకే ధర్మము ఉండేది. కేవలం భారతవాసులైన మీరు మాత్రమే ఉండేవారు, ఒకే ధర్మము ఉండేది, మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఈ విషయాన్ని కూడా మర్చిపోయారు - ఒకప్పుడు మేమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే 84 జన్మలు తీసుకుంటాము అని. అందుకే తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు, వాటి గురించి నేను తెలియజేస్తాను. అర్ధకల్పము రామ రాజ్యము ఉండేది, ఆ తర్వాత రావణ రాజ్యము ఏర్పడింది. మొదట సూర్యవంశము ఉంటుంది, ఆ తర్వాత చంద్రవంశమైన రామ రాజ్యము ఉంటుంది. సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల వంశావళి యొక్క రాజ్యము ఉండేది, ఎవరైతే సూర్యవంశీయులైన లక్ష్మీ-నారాయణుల వంశము వారో, వారంతా 84 జన్మలు తీసుకుని ఇప్పుడు రావణుడి వంశము వారిగా అయ్యారు. ఇంతకుముందు పుణ్యాత్ముల వంశానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు పాపాత్ముల వంశానికి చెందినవారిగా అయ్యారు. 84 జన్మలు తీసుకున్నారు, వారేమో 84 లక్షల జన్మలు అని అంటారు. ఇప్పుడు 84 లక్షల జన్మల గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారు, అందుకే వాటి గురించి ఎవరికీ ఆలోచన నడవదు. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు, మీరు తండ్రి ఎదురుగా కూర్చున్నారు, నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి, ఇరువురూ భారత్ లో ప్రసిద్ధి చెందినవారు. ఇలా మహిమ పాడుతారు కానీ తండ్రి గురించి తెలియదు, అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. జ్ఞానము ద్వారా జాగృతి కలుగుతుంది. వెలుగులో మనుష్యులెప్పుడూ ఎదురుదెబ్బలు తినరు. చీకటిలోనే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భారతవాసులే పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. లక్ష్మీ-నారాయణులు పూజ్యులుగా ఉండేవారు కదా, వీరు ఎవరిని పూజిస్తారు. తమ చిత్రాలను తయారుచేసుకుని తమకు తామే పూజ చేసుకోరు కదా. అలా జరగదు. మనమే పూజ్యులుగా ఉండేవారమని, మళ్ళీ మనమే పూజారులుగా ఎలా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయాలను ఇంకెవరూ అర్థము చేసుకోలేరు. తండ్రియే అర్థము చేయిస్తారు, అందుకే ఈశ్వరుడు ఇచ్చే గతి, మతము అతీతమైనవి అని అంటారు కూడా.

ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - బాబా మొత్తము ప్రపంచమంతటితో పోలిస్తే మన గతిని, మతమును అతీతముగా చేసారు. మొత్తము ప్రపంచములో అనేక మత-మతాంతరాలు ఉన్నాయి, ఇక్కడ బ్రాహ్మణులైన మీది ఏకమతము. అదేమిటంటే, ఈశ్వరుని మతము మరియు వారు ఇచ్చే గతి. గతి అనగా సద్గతి. సద్గతిదాత ఒక్క తండ్రియే. సర్వుల సద్గతిదాత రాముడు అని గానము కూడా చేస్తారు. కానీ రామా అని ఎవరిని అంటారో తెలియదు. ఎక్కడ చూసినా రాముడే రాముడు ఉంటారని అంటారు, దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. అంధకారములో దుఃఖము ఉంది, ప్రకాశములో సుఖము ఉంది. అంధకారములోనే పిలుస్తారు కదా. ప్రార్థన చేయడము అనగా తండ్రిని పిలవడము, వారిని భిక్షము అడుగుతూ ఉంటారు కదా. దేవతల మందిరాలలోకి వెళ్ళి భిక్షము అడిగినట్లు అయ్యింది కదా. సత్యయుగములో భిక్షము అడగవలసిన అవసరము లేదు. బికారిని దివాలా తీసిన వ్యక్తి అని అంటారు. సత్యయుగములో మీరు ఎంత సంపన్నులుగా ఉండేవారు, దానిని సంపన్న ప్రపంచము అని అంటారు. భారత్ ఇప్పుడు దివాలా తీసింది. ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. కల్పము ఆయువును తప్పుగా వ్రాయడము వలన మనుష్యుల బుద్ధి మారిపోయింది. తండ్రి చాలా ప్రేమతో కూర్చుని అర్థము చేయిస్తారు. కల్పపూర్వము కూడా పిల్లలకు అర్థము చేయించారు - పతిత-పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనముగా అయిపోతారు. పతితులుగా ఎలా అయ్యారు, వికారాల మాలిన్యము చేరింది. మనుష్యులందరూ తుప్పు పట్టిపోయారు. ఇప్పుడు ఆ తుప్పు ఎలా వదులుతుంది? నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మొదట మీరు ఆత్మలు, ఆ తర్వాత శరీరాన్ని తీసుకుంటారు. ఆత్మ అమరమైనది, శరీరము మృత్యువు పొందుతుంది. సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు. కలియుగాన్ని మృత్యులోకము అని అంటారు. అమరలోకముగా ఉన్న ప్రపంచము తర్వాత మృత్యులోకముగా ఎలా అయ్యింది అన్న విషయము ప్రపంచములోని వారికెవరికీ తెలియదు. అమరలోకము అనగా అకాల మృత్యువు ఉండదు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రపంచమే పవిత్ర ప్రపంచము.

మీరు రాజఋషులు. ఋషి అని పవిత్రమైనవారిని అంటారు. మిమ్మల్ని పవిత్రముగా ఎవరు తయారుచేసారు? వారిని శంకరాచార్యులు తయారుచేస్తారు, మిమ్మల్ని శివాచార్యులు తయారుచేస్తున్నారు. వీరు ఏమీ చదవలేదు, వీరి ద్వారా శివబాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు. శంకరాచార్యులు అయితే గర్భము నుండి జన్మ తీసుకున్నారు, అంతేకానీ వారు పై నుండి ఏమీ అవతరించలేదు. తండ్రి అయితే వీరిలో ప్రవేశిస్తారు, వస్తారు, వెళ్తారు. వారు అధిపతి, వారు ఎవరిలోకి కావాలనుకుంటే వారిలోకి వెళ్ళగలరు. బాబా అర్థము చేయించారు, ఎవరి కళ్యాణమునైనా చేయవలసి ఉన్నప్పుడు, నేను ప్రవేశిస్తాను. రావడము కూడా పతిత తనువులోకే వస్తాను కదా. అనేకుల కళ్యాణము చేస్తాను. మాయ కూడా తక్కువేమీ కాదు అని పిల్లలకు అర్థము చేయించారు. అప్పుడప్పుడు ధ్యానములో మాయ ప్రవేశించి తప్పుడు మాటలు మాట్లాడిస్తుంది, అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరిలోకి ఎప్పుడైతే మాయ ప్రవేశిస్తుందో, అప్పుడు - నేను శివుడిని, నేను ఫలానాను అని అంటారు. మాయ పెద్ద సైతాను వంటిది. తెలివైన పిల్లలు ఎవరు ప్రవేశించారు అనేది మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. శివబాబాకు ఈ శరీరము నియమించబడింది కదా. కావున ఇతరులు చెప్పేది మనము ఎందుకు వినాలి! ఒకవేళ వింటే బాబాను అడగండి, ఈ విషయము సరైనదా, కాదా అని. తండ్రి వెంటనే అర్థము చేయిస్తారు. కొంతమంది బ్రాహ్మణీలు కూడా ఇదేమిటి అని ఈ విషయాన్ని అర్థము చేసుకోలేరు. కొందరిలోనైతే ఎటువంటి ఆత్మలు ప్రవేశిస్తాయంటే, అవి చెంపదెబ్బలు కూడా కొడతాయి, తిట్టడము కూడా మొదలుపెడతాయి. ఇప్పుడు తండ్రి అయితే తిట్టరు. ఈ విషయాలను కూడా చాలా మంది పిల్లలు అర్థము చేసుకోలేరు. ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా అప్పుడప్పుడూ మర్చిపోతారు. అన్ని విషయాలను అడగాలి ఎందుకంటే ఎంతోమందిలో మాయ ప్రవేశిస్తుంది, అప్పుడు వారు ధ్యానములోకి వెళ్ళి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయములో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి పూర్తి సమాచారము ఇవ్వాలి. ఫలానావారిలోకి మమ్మా వస్తారు, ఫలానావారిలోకి బాబా వస్తారు - ఈ విషయాలన్నింటినీ వదలండి. తండ్రి ఒకే ఆజ్ఞను ఇస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. రచయిత మరియు రచనలను స్మృతి చేసేవారి ముఖము సదా హర్షితముగా ఉంటుంది. స్మృతి చేయలేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కర్మబంధనాలు చాలా భారీగా ఉన్నాయి. వివేకము ఏం చెప్తుందంటే, అనంతమైన తండ్రి లభించినప్పుడు, వారు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నప్పుడు, మరి మనమెందుకు స్మృతి చేయకూడదు. ఏది జరిగినా తండ్రిని అడగండి. తండ్రి అర్థము చేయిస్తున్నారు - కర్మభోగము ఇప్పుడు ఇంకా మిగిలి ఉంది కదా. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక మీరు సదా హర్షితముగా ఉంటారు. అప్పటివరకూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. వేటగాడికి వేట మరియు వేటకు మృత్యువు అని కూడా తెలుసు. వినాశనము జరగనున్నది. మీరు ఫరిశ్తాలుగా అవుతారు. ఇంకా కొద్ది రోజులే ఈ ప్రపంచములో ఉంటారు, ఇక తర్వాత పిల్లలైన మీకు ఈ స్థూలవతనము నచ్చదు. సూక్ష్మవతనము మరియు మూలవతనము నచ్చుతాయి. సూక్ష్మవతనవాసులను ఫరిశ్తాలు అని అంటారు. ఫరిశ్తాలుగా చాలా కొద్ది సమయము మాత్రమే అవుతారు, అది కూడా మీరు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు అవుతారు. సూక్ష్మవతనములో మాంసము, ఎముకలు ఉండవు. మాంసము, ఎముకలు లేకపోతే మరి ఇంకేముంటుంది? కేవలము సూక్ష్మశరీరము మాత్రమే ఉంటుంది! నిరాకారీగా అయిపోతామని కాదు. అలా కాదు. సూక్ష్మ ఆకారము ఉంటుంది. అక్కడి భాష మూవీ. ఆత్మ శబ్దానికి అతీతముగా ఉంటుంది. దానిని సటల్ వరల్డ్ (సూక్ష్మలోకము) అని అంటారు. అక్కడ సూక్ష్మ శబ్దము ఉంటుంది. ఇక్కడ ఉన్నది టాకీ, ఆ తర్వాత మూవీ, ఆ తర్వాత సైలెన్స్. ఇక్కడ మాటలు నడుస్తూ ఉంటాయి. ఇది డ్రామాలో తయారై, తయారుచేయబడిన పాత్ర. అక్కడ ఉన్నది సైలెన్స్, ఆ తర్వాత మూవీ మరియు ఇక్కడ ఉన్నది టాకీ. ఈ మూడు లోకాలను కూడా స్మృతి చేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు కర్మయోగిగా అయ్యి కర్మలు చేయండి, ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోండి, ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేయండి. ఈ అభ్యాసము ద్వారానే మీరు పావనముగా అవుతారు. మీరు నిద్రపోతారు, అదేమీ తండ్రి స్మృతి కాదు. మేము ఎలాగూ బాబాకు పిల్లలమే కదా, ఇక వారిని ఏం స్మృతి చేయాలి అని కూడా భావించకండి. అలా కాదు. తండ్రి అంటారు, నన్ను అక్కడ స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఎప్పటివరకైతే యోగబలముతో మీరు పవిత్రముగా అవ్వరో అప్పటివరకూ ఇంటికి కూడా మీరు వెళ్ళలేరు. లేకపోతే శిక్షలు అనుభవించి వెళ్ళవలసి ఉంటుంది. సూక్ష్మవతనానికి, మూలవతనానికి కూడా వెళ్ళాలి, ఆ తర్వాత స్వర్గములోకి రావాలి. బాబా అర్థము చేయించారు - మున్ముందు వార్తాపత్రికలలో కూడా ఈ విషయాలు వస్తాయి. దానికి ప్రస్తుతము ఇంకా చాలా సమయము ఉంది. ఇంత పెద్ద రాజధాని స్థాపన అవుతోంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో భారత్ ఎంత విశాలముగా ఉంది. ఇప్పుడు వార్తాపత్రికల ద్వారానే శబ్దము వెలువడుతుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ఓ పతిత-పావనా, ముక్తిప్రదాత, మమ్మల్ని దుఃఖము నుండి విడిపించండి అని పిలుస్తారు కూడా. డ్రామా ప్లాన్ అనుసారముగా వినాశనము కూడా జరగనున్నది అని పిల్లలకు తెలుసు. ఈ యుద్ధము తర్వాత ఇక అంతా శాంతియే శాంతి ఉంటుంది, ప్రపంచము సుఖధామముగా అవుతుంది. మొత్తము అంతా అతలాకుతలము అవుతుంది. సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది. కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది ఎవరైనా అర్థము చేసుకోగలరు. అన్నింటికంటే ముందు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. సూర్యవంశీయులు ఉన్నప్పుడు చంద్రవంశీయులు లేరు, తర్వాత చంద్రవంశీయులు ఉంటారు. ఆ తర్వాత ఈ దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇతర ధర్మాల వారు వస్తారు. వారు కూడా ఎప్పటివరకైతే వారి సంస్థ వృద్ధి చెందదో, అప్పటివరకు వారి గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మెట్ల వరుస చిత్రములో కేవలము భారతవాసులను మాత్రమే ఎందుకు చూపించారు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఇలా చెప్పండి - ఈ ఆట భారత్ కు సంబంధించినది. అర్ధకల్పము వారి పాత్ర ఉంటుంది, ఆ తర్వాత ద్వాపర, కలియుగాలలో ఇతర ధర్మాలన్నీ వస్తాయి. సృష్టి చక్రములో ఈ జ్ఞానమంతా ఉంది. సృష్టి చక్రము చాలా ఫస్ట్ క్లాస్ అయినది. సత్య, త్రేతాయుగాలలో శ్రేష్ఠాచారీ ప్రపంచము ఉంది. ద్వాపర, కలియుగాలలో భ్రష్టాచారీ ప్రపంచము ఉంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఇవి జ్ఞాన విషయాలు. ఈ నాలుగు యుగాల చక్రము ఎలా తిరుగుతుంది - ఇది ఎవరికీ తెలియదు. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది. వీరికి కూడా - సత్యయుగము తర్వాత త్రేతా వస్తుందని, త్రేతా తర్వాత ద్వాపర, కలియుగాలు వస్తాయని తెలియదు. ఇక్కడ కూడా మనుష్యులకు ఏ మాత్రమూ తెలియదు. మాట వరసకు అయితే అంటారు కానీ చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అందుకే బాబా అర్థము చేయించారు - మొత్తము గీతకే ప్రాధాన్యతను ఇస్తూ దానిపైనే దృష్టి పెట్టండి. సత్యమైన గీతను వినడము ద్వారా స్వర్గవాసులుగా అవుతారు. ఇక్కడ శివబాబాయే స్వయముగా వినిపిస్తున్నారు, అక్కడ మనుష్యులు చదివి వినిపిస్తారు. గీత కూడా అందరికన్నా ముందు మీరు చదువుతారు. భక్తిలోకి కూడా మొట్టమొదట మీరే వెళ్తారు కదా. శివుని పూజారులుగా మొదట మీరు అవుతారు. మీరు మొట్టమొదట ఒక్క శివబాబాకు అవ్యభిచారీ పూజను చేయవలసి ఉంటుంది. సోమనాథ మందిరాన్ని తయారుచేసే శక్తి ఇంకెవరికీ లేదు. బోర్డుపై ఎన్ని రకాల విషయాలను వ్రాయవచ్చు. భారతవాసులు సత్యమైన గీతను వినడము ద్వారా సత్యఖండానికి యజమానులుగా అవుతారు అని కూడా వ్రాయవచ్చు.

మనము సత్యమైన గీతను వింటూ స్వర్గవాసులుగా అవుతున్నాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు అర్థము చేయించేటప్పుడు వాళ్ళు - అవును, ఇవన్నీ సత్యమే అని అంటారు, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత సమాప్తము, అక్కడి విషయాలు అక్కడే ఉండిపోతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రచయిత మరియు రచనల జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితముగా ఉండాలి. స్మృతియాత్ర ద్వారా తమ పాత కర్మబంధనాలన్నింటినీ కట్ చేసి కర్మాతీత అవస్థను తయారుచేసుకోవాలి.

2. ధ్యానము, సాక్షాత్కారాలలో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది, అందుకే సంభాళించాలి, తండ్రికి సమాచారాన్ని ఇచ్చి సలహాను తీసుకోవాలి, ఎటువంటి పొరపాటు చేయకూడదు.

వరదానము:-
తమ శుభ భావన ద్వారా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే సదా శక్తి స్వరూప భవ

సేవాధారీ పిల్లల విశేషమైన సేవ - స్వయం శక్తి స్వరూపులుగా ఉండడము మరియు సర్వులను శక్తి స్వరూపులుగా చేయడము అనగా నిర్బల ఆత్మలలో బలాన్ని నింపడము, దీని కొరకు సదా శుభ భావన మరియు శ్రేష్ఠ కామన స్వరూపులుగా అవ్వండి. శుభ భావన అంటే - ఎవరి పట్లనైనా భావన ఉంచుతూ-ఉంచుతూ వారి ప్రభావములోకి వెళ్ళిపోవడము కాదు. ఈ పొరపాటు చేయకండి. శుభభావన కూడా అనంతములో ఉండాలి. ఒక్కరి పట్లనే విశేషమైన భావన ఉండడము కూడా నష్టదాయకము, అందుకే అనంతములో స్థితులై నిర్బల ఆత్మలను మీకు ప్రాప్తించిన శక్తుల ఆధారముగా శక్తి స్వరూపులుగా తయారుచేయండి.

స్లోగన్:-
అలంకారాలు బ్రాహ్మణ జీవితము యొక్క అలంకరణ - అందుకే అలంకారులుగా అవ్వండి, దేహ-అహంకారులుగా కాదు.

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

కొంతమంది పిల్లలు ఏమంటారంటే - మామూలుగా అయితే కోపము రాదు కానీ ఎవరైనా అబద్ధము చెప్తే కోపము వచ్చేస్తుంది. వారు అబద్ధము చెప్పారు, మీరు క్రోధముతో మాట్లాడారు, మరి ఇరువురిలో రైట్ ఎవరు? కొందరు చతురతతో ఏమంటారంటే - మేము క్రోధము చేయము, మా గొంతే పెద్దది, మా గొంతే కటువుగా ఉంటుంది, కానీ మరి సైన్స్ సాధనాలతో శబ్దాన్ని చిన్నదిగా మరియు పెద్దదిగా చెయ్యగలిగినప్పుడు సైలెన్స్ శక్తితో మీ మాట వేగాన్ని నెమ్మదిగా లేక గట్టిగా చెయ్యలేరా?