29-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో
మాట్లాడినట్లయితే పుష్పములో సుగంధము నిండుతూ ఉంటుంది, దేహాభిమానమనే దుర్గంధము
తొలగిపోతుంది’’
ప్రశ్న:-
తమ సుగంధాన్ని నలువైపులా వ్యాపింపజేసే సత్యమైన పుష్పాలు లేక దీపపు పురుగులు ఎవరు?
జవాబు:-
ఎవరైతే
అనేకులను తమ సమానముగా సుగంధభరితమైన పుష్పాలుగా తయారుచేస్తారో, వారే సత్యమైన పుష్పాలు.
శ్రీమతముపై నడుస్తూ దీపముపై బలిహారమై మరణించేటువంటి అనగా పూర్తిగా బలిహారమయ్యేటువంటి,
జీవిస్తూ మరణించేటువంటి సత్యమైన దీపపు పురుగుల సుగంధము లేక అటువంటి పుష్పాల సుగంధము
స్వతహాగానే నలువైపులా వ్యాపిస్తుంది.
పాట:-
సభలో దీపం
వెలిగింది...
ఓంశాంతి
దీపపు పురుగులు పాట విన్నారు. దీపపు పురుగులు అన్నా లేక పుష్పాలు అన్నా, విషయము
ఒక్కటే. మేము నిజంగా దీపపు పురుగులుగా అయ్యామా లేక కేవలం దీపం చుట్టూ తిరిగి
వెళ్ళిపోయి దీపాన్ని మర్చిపోయేవారిమా అనేది పిల్లలు అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ
తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము మరియు ఎంతవరకు
జ్ఞాన సుగంధాన్ని వ్యాపింపజేస్తున్నాము? ఎవరినైనా స్వయం వంటి పుష్పములా తయారుచేసామా?
జ్ఞాన సాగరుడు తండ్రి అని, వారి సుగంధము ఎంత ఉంటుంది అని పిల్లలకు తెలుసు. ఎవరైతే
మంచి పుష్పాలు లేక దీపపు పురుగులు ఉన్నారో, వారి నుండి తప్పకుండా మంచి సుగంధము
వస్తుంది. వారు సదా సంతోషముగా ఉంటారు, ఇతరులను కూడా తమ సమానముగా పుష్పాలుగా లేక
దీపపు పురుగులుగా తయారుచేస్తారు. పుష్పలుగా కాకపోతే మొగ్గలుగానైనా తయారుచేస్తారు.
ఎవరైతే జీవిస్తూ మరణిస్తారో, బలిహారమవుతారో అనగా ఈశ్వరీయ సంతానముగా అవుతారో, వారే
పూర్తి దీపపు పురుగులు. ఎవరైనా షావుకారు ఒక పేదవారి బిడ్డను దత్తత తీసుకుంటే, ఆ
షావుకారు ఒడిలోకి వచ్చిన తర్వాత ఇక ఆ బిడ్డకు షావుకారు తల్లిదండ్రులే గుర్తుకొస్తూ
ఉంటారు, పేద తల్లిదండ్రులను మర్చిపోతాడు. నా మునుపటి తల్లిదండ్రులు పేదవారని ఆ
బిడ్డకు తెలుసు కానీ గుర్తు చేయడమైతే షావుకారు తల్లిదండ్రులనే గుర్తు చేస్తాడు, వారి
నుండే ధనము లభిస్తుంది. సాధు-సన్యాసులు మొదలైనవారు ఉన్నారు, వారు ముక్తిధామానికి
వెళ్ళాలని సాధన చేస్తారు. అందరూ ముక్తి కోసమే పురుషార్థము చేస్తారు, కానీ ముక్తి
యొక్క అర్థం తెలియదు. కొంతమంది జ్యోతి జ్యోతిలో లీనమైపోతుందని అంటారు. కొంతమంది
నిర్వాణధామానికి వెళ్ళిపోతారని భావిస్తారు. నిర్వాణధామానికి వెళ్ళడాన్ని జ్యోతిలో
లీనమైపోవడమని లేక కలిసిపోవడమని అనరు. మేము దూరదేశ నివాసులమని మీరు భావిస్తారు. ఈ
అశుద్ధ ప్రపంచములో ఉండి ఏమి చేస్తారు? తండ్రి పిల్లలకు అర్థం చేయించారు - మీరు
ఎవరినైనా కలిసినప్పుడు, ఇది తయారై తయారుచేయబడిన డ్రామా అని అర్థం చేయించాల్సి
ఉంటుంది. సత్యయుగము, త్రేతా... అలా సంగమయుగము వస్తుంది. సత్యయుగానికి త్రేతాకు
మధ్యన సంగమము ఉంటుందని కూడా అర్థం చేయించారు. అది యుగము మారడము మరియు ఇది కల్పము
మారడము. మనుష్యులు భావించినట్లుగా బాబా ప్రతి యుగములోనూ రారు. బాబా అంటారు -
ఎప్పుడైతే అందరూ తమోప్రధానముగా అయిపోతారో, కలియుగము యొక్క అంతం వస్తుందో, అప్పుడు
కల్పము యొక్క ఆ సంగమములో వస్తాను. యుగము పూర్తి అయినప్పుడు కళలు తగ్గుతాయి. అయితే,
పూర్తి గ్రహణము పట్టినప్పుడు నేను వస్తాను. నేను ప్రతి యుగములోనూ రాను. ఈ విషయాలను
తండ్రి కూర్చుని దీపపు పురుగులకు అర్థం చేయిస్తారు. దీపపు పురుగులలో కూడా
నంబరువారుగా ఉన్నారు. కొన్ని బలిహారమై మరణిస్తాయి, కొన్ని చుట్టూ తిరిగి
వెళ్ళిపోతాయి. మీరు మాత్రమే శ్రీమతాన్ని అనుసరించగలరు. ఒకవేళ ఎక్కడైనా శ్రీమతాన్ని
అనుసరించకపోతే, మాయ కింద పడేస్తూ ఉంటుంది. శ్రీమతానికి చాలా మహిమ ఉంది. శ్రీమత్
భగవద్గీత అని అంటారు. ఎవరైతే తర్వాత కూర్చుని శాస్త్రాలను తయారుచేసారో, ఆ సమయములో
వారి బుద్ధి రజోగా ఉన్న కారణముగా శ్రీకృష్ణుడు ద్వాపరములో వచ్చారని అనుకున్నారు.
నేను రావడమే ఎప్పుడు వస్తానంటే, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయినప్పుడు.
అప్పటికి మిగిలిన ధర్మాలన్నీ ఉంటాయి. అలాగని దేవతా ధర్మానికి చెందిన మనుష్యులు
మాయమైపోతారని కాదు, కానీ వారు మేము దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని మర్చిపోతారు.
అప్పుడు తమది హిందూ ధర్మమని చెప్పుకుంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు
మర్చిపోయినప్పుడే కదా నేను మళ్ళీ వచ్చి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఒక్క
తండ్రి మాత్రమే వచ్చి, దుఃఖధామము నుండి సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారు.
ఇప్పుడు మేము నరకానికి యజమానులుగా ఉన్నామని మీరంటారు. ప్రపంచమైతే తమోప్రధానముగా
అవ్వాల్సిందే. అందరూ పతితముగా ఉన్నారు, కావుననే పావనముగా ఉన్నవారి ఎదురుగా వెళ్ళి
నమస్కరిస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - శ్రీమతాన్ని అనుసరించండి, జన్మజన్మల భారము
తలపై చాలా ఉంది, లేదంటే త్రాహి-త్రాహి అనవలసి ఉంటుంది (దుఃఖముతో రక్షించమని
అలమటిస్తారు). వారు ఆత్మ నిర్లేపి అని భావిస్తారు కానీ అది నిర్లేపి కాదు, ఆత్మయే
సుఖ-దుఃఖాలను అనుభవిస్తుంది. ఇది ఎవరూ అర్థం చేసుకోరు. బాబా పదే-పదే అర్థం
చేయిస్తారు, గమ్యము చాలా పెద్దది. ఈ సమయములో మీరు పురుషార్థము చేస్తారు ఎందుకంటే
మీరు దుఃఖితులుగా ఉన్నారు. సత్యయుగములో మీరు చాలా సుఖముగా ఉంటారని మీకు తెలుసు. మేము
మళ్ళీ దుఃఖధామానికి వెళ్ళాలి అన్న విషయము అక్కడ తెలియదు. మేము సుఖములోకి ఎలా వచ్చాము,
ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేదేమీ అక్కడ తెలియదు, కానీ ఇప్పుడు మీకు తెలుసు, కనుక
ఉన్నతమైనవారు ఎవరు? మీరు ఈశ్వరుని సంతానమైన కారణముగా, ఈశ్వరుడు ఎలాగైతే నాలెడ్జ్
ఫుల్ గా ఉన్నారో, అలాగే మీరు కూడా నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ
సంతానము కానీ నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చాలా ఆనందముగా ఉన్నారు, మేము బాబా
మతాన్ని అనుసరిస్తున్నామని భావిస్తారు. వారి మతాన్ని ఎంతగా అనుసరిస్తారో, అంత
శ్రేష్ఠముగా అవుతారు. తండ్రి సమ్ముఖముగా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు -
పిల్లలూ, దేహాభిమానాన్ని వదలండి, దేహీ-అభిమానులుగా అవ్వండి, నిరంతరం స్మృతి చేయండి.
తండ్రి అయితే సదా సుఖదాత. దుఃఖము కూడా తండ్రియే ఇస్తారని కాదు. తండ్రి ఎప్పుడూ
పిల్లలకు దుఃఖమునివ్వరు. పిల్లలు తమ తప్పుడు నడవడిక వలన దుఃఖము పొందుతారు. తండ్రి
దుఃఖము ఇవ్వలేరు. ఓ భగవంతుడా, కొడుకును ప్రసాదించండి, అప్పుడు మా కులం వృద్ధి
చెందుతుంది అని అంటారు. కొడుకులను చాలా ప్రేమిస్తారు. ఇకపోతే, దుఃఖమనేది తమ కర్మల
అనుసారముగానే పొందుతారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని చాలా సుఖమయముగా చేస్తారు.
శ్రీమతాన్ని అనుసరించండి అని చెప్తారు. ఆసురీ మతాన్ని అనుసరించడముతో మీరు దుఃఖము
పొందుతారు. పిల్లలు, తండ్రి లేక టీచరు లేక పెద్దల ఆజ్ఞను పాటించకపోవడముతో
దుఃఖితులుగా అవుతారు. స్వయం దుఃఖితులు అవుతారు, మాయకు చెందినవారిగా అయిపోతారు.
ఈశ్వరుని మతము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. ఈశ్వరీయ మతము యొక్క రిజల్టు 21
జన్మల వరకు కొనసాగుతుంది, తర్వాత అర్ధకల్పము మాయ మతముపై నడుస్తారు. ఈశ్వరుడు
ఒక్కసారి మాత్రమే వచ్చి మతాన్ని ఇస్తారు. మాయ అయితే అర్ధకల్పము నుండి మతాన్ని
ఇస్తూనే ఉంటుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే మతాన్ని ఇస్తారు. మాయ మతాన్ని అనుసరిస్తూ
100 శాతం దుర్భాగ్యశాలిగా అయిపోతారు.
మంచి-మంచి పుష్పాలు ఎవరైతే ఉంటారో, వారు ఆ సంతోషములోనే సదా ఆనందముగా నిమగ్నమై ఉంటారు.
నంబరువారుగా ఉన్నారు కదా. కొన్ని దీపపు పురుగులు తండ్రికి చెందినవారిగా అయ్యి
శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటారు. పేదవారే తమ లెక్కాపత్రాన్ని వ్రాస్తారు. షావుకారులకు,
ఇక్కడ మా ధనము ఏమైనా తీసేసుకుంటారేమోనని భయమనిపిస్తుంది. షావుకారులకు ఇది చాలా
కష్టము. తండ్రి అంటారు - నేను పేదల పెన్నిధిని. దానము కూడా సదా పేదలకే ఇవ్వడము
జరుగుతుంది. సుదాముని విషయముంది కదా - పిడికెడు బియ్యము తీసుకుని అతనికి మహల్
ఇచ్చారు. మీరు పేదవారు. ఎవరి వద్దనైనా 25-50 రూపాయలు ఉన్నాయనుకోండి, అందులో నుండి
20-25 పైసలు ఇస్తారు. షావుకారులు 50 వేలు ఇచ్చినా కూడా అది ఈ ధనానికి సమానమవుతుంది.
అందుకే పేదల పెన్నిధి అనే పేరు గాయనము చేయబడింది. షావుకారులు కూడా, మాకు తీరిక
లభించడము లేదని అంటారు ఎందుకంటే వారికి పూర్తి నిశ్చయము లేదు. మీరు పేదవారు.
పేదవారికి ధనము లభిస్తే సంతోషము కలుగుతుంది. బాబా అర్థం చేయించారు - ఇక్కడి పేదవారు
అక్కడ షావుకారులుగా అవుతారు మరియు ఇక్కడి షావుకారులు అక్కడ పేదవారిగా అవుతారు.
మేము యజ్ఞాన్ని చూసుకోవాలా లేక కుటుంబాన్ని చూసుకోవాలా అని కొంతమంది అడుగుతారు. బాబా
అంటారు - మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా చూసుకోండి. ఈ సమయములో మీరు పేదవారిగా
అవ్వడము మంచిదైంది. షావుకారులుగా అయ్యి ఉంటే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని
తీసుకోలేకపోయేవారు. సన్యాసులు ఇలా అనరు. వారు ధనము తీసుకుని తమ ఆస్తులను
తయారుచేసుకుంటారు. శివబాబా అలా తయారుచేసుకోరు. ఈ భవనాలు మొదలైనవన్నీ పిల్లలైన మీరు
మీ కోసం నిర్మించుకున్నారు. ఇవి ఎవరి ఆస్తి కాదు, ఇవి తాత్కాలికమైనవి ఎందుకంటే
అంతిమ సమయములో పిల్లలు ఇక్కడికి వచ్చి ఉండవలసి ఉంటుంది. మన స్మృతిచిహ్నము కూడా
ఇక్కడే ఉంది. కనుక చివరిలో ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఎవరైతే
యోగయుక్తులుగా ఉంటారో, వారే తండ్రి వద్దకు పరుగెత్తుకుని వస్తారు. వారికి సహాయము
కూడా లభిస్తుంది. తండ్రి నుండి చాలా సహాయము లభిస్తుంది. మీరు ఇక్కడ కూర్చుని
వినాశనాన్ని చూడవలసి ఉంటుంది. ఎలాగైతే ప్రారంభములో బాబా పిల్లలైన మిమ్మల్ని
ఆహ్లాదపరిచారో, అలా మళ్ళీ చివరిలో ఆహ్లాదపరచడము మొదలుపెడతారు. వారు చాలా
ప్రేమనిస్తారు. వైకుంఠములో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది, చాలా సమీపముగా వస్తూ
ఉంటారు. మేము యాత్రలో ఉన్నామని, కొద్ది సమయము తర్వాత వినాశనము జరుగుతుందని అర్థం
చేసుకుంటారు. మీరు చాలా సంతోషిస్తారు. ఇప్పుడిక మేము వెళ్ళి రాకుమారులుగా అవుతాము
అని భావిస్తారు. రకరకాల పుష్పాలు ఉన్నాయి. నేను జ్ఞాన సుగంధాన్ని ఎంత ఇస్తున్నాను,
ఎవరికైనా జ్ఞాన-యోగాల శిక్షణను ఇస్తున్నానా, అని పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం
చేసుకోవాలి. ఎవరైతే అలా చేస్తారో, వారు లోలోపల హర్షితముగా ఉంటారు. ఫలానావారు ఏ
అవస్థలో ఉంటున్నారు, వారు అవస్థలో ఎంతవరకు వేగముగా ముందుకు వెళ్ళగలరు అనేది బాబాకు
తెలుసు. ఎవరైతే దీపపు పురుగులుగా అయ్యి ఉంటారో, వారి అవస్థే వేగముగా ముందుకు
వెళ్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - మాయా తుఫానులైతే చాలా వస్తాయి, వాటి నుండి
స్వయాన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు ఈ రాజయోగాన్ని పరమపిత పరమాత్మ వచ్చి నేర్పిస్తారు.
పరమాత్మ వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎలాగైతే తండ్రి అయిన పరమాత్మ ఆత్మిక
పిల్లలైన మనకు అర్థం చేయిస్తున్నారో, అలాగే ఆత్మనైన నేను నా ఈ సోదరాత్మకు అర్థం
చేయిస్తున్నాను అనే జ్ఞానము ఆత్మకు ఉంది. నేను (బ్రహ్మా) కూడా ఆత్మనే. బాబా నాకు
నేర్పిస్తారు, నేను మళ్ళీ ఈ ఆత్మలకు అర్థం చేయిస్తాను. కానీ నేను ఆత్మ అనే నిశ్చయము
లేకపోతే స్వయాన్ని మనుష్యులుగా భావిస్తూ మనుష్యులకే అర్థం చేయిస్తారు. పరమ ఆత్మనైన
నేను ఆత్మలైన మీతో మాట్లాడుతున్నాను. మీరు ఆత్మలకు వినిపిస్తారు. ఈ విధముగా మీరు
దేహీ-అభిమానులుగా అయి ఎవరికైనా వినిపిస్తే బాణం వెంటనే తగులుతుంది. ఒకవేళ స్వయమే
దేహీ-అభిమానులుగా ఉండలేకపోతే ధారణ చేయించలేరు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. మేము ఈ
ఇంద్రియాల ద్వారా వింటున్నామనేది బుద్ధిలో ఉండాలి. తండ్రి అంటారు - నేను ఆత్మలతో (పిల్లలతో)
మాట్లాడుతున్నాను. బాబా ఆజ్ఞ ఏమిటంటే - అశరీరులుగా (వివస్త్రగా) అవ్వండి.
దేహాభిమానాన్ని విడిచిపెట్టండి, నన్ను స్మృతి చేయండి - ఈ విషయము బుద్ధిలోకి రావాలి.
నేను ఆత్మలతో మాట్లాడతాను, శరీరాలతో కాదు. ఫిమేల్ అయినా కూడా, వారి ఆత్మతోనే
మాట్లాడతాను.
మేము బాబాకు చెందినవారిగానైతే అయిపోయాము అని పిల్లలైన మీరు భావిస్తారు కానీ అలా కాదు,
ఇందులో బుద్ధి చాలా సూక్ష్మముగా నడుస్తుంది. నేను ఒక ఆత్మను, నేను వీరి ఆత్మకు అర్థం
చేయిస్తున్నాను. వీరు నా సోదరుడు, వీరికి మార్గాన్ని తెలియజేయాలి. ఆత్మ ఈ విషయాలను
అర్థం చేసుకుంటుంది. ఇలా భావించినప్పుడు ఆత్మకు బాణము తగులుతుంది. దేహాన్ని చూస్తూ
వినిపించినట్లయితే ఆత్మ వినదు. నేను ఆత్మతో మాట్లాడుతున్నాను అని ముందు ఈ వార్నింగ్
ఇచ్చుకోండి. ఆత్మను మేల్ లేక ఫిమేల్ అని అనరు. ఆత్మ అయితే అతీతమైనది. మేల్ లేక
ఫిమేల్ అనేది శరీరాల బట్టి పేర్లు ఉంటాయి. బ్రహ్మా-సరస్వతులను మేల్-ఫిమేల్ అని
అంటారు. శివబాబాను మేల్ లేక ఫిమేల్ అని అనరు. కనుక బాబా ఆత్మలకు అర్థం చేయిస్తారు.
ఇది పెద్ద గమ్యము. ఈ పాయింటు చాలా శక్తివంతమైనది. ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వాలి, అప్పుడు
దేహాభిమానము తొలగిపోతుంది. లేకపోతే సుగంధము రాదు, శక్తి ఉండదు. విషయము చాలా చిన్నది.
నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. తండ్రి అంటారు - మీరు తిరిగి వెళ్ళాలి, అందుకే
దేహీ-అభిమానులుగా అవ్వండి. మన్మనాభవ. అప్పుడు ఆటోమేటిక్ గా మధ్యాజీభవ వచ్చేస్తుంది.
ఇప్పుడు చాలా సూక్ష్మమైన బుద్ధి లభిస్తుంది. ఉదయాన్నే కూర్చుని విచార సాగర మంథనము
చేయాలి. పగలైతే సేవ చేయాలి ఎందుకంటే మీరు కర్మయోగులు. నిద్రను జయించేవారిగా అవ్వండి
అని వ్రాసి కూడా ఉంది. రాత్రుళ్ళు మేలుకొని సంపాదించండి. పగలైతే మాయ చాలా విస్తరించి
ఉంటుంది. అమృతవేళ వాయుమండలము బాగుంటుంది. ఫలానా సమయములో లేచి విచార సాగర మంథనము
చేస్తున్నానని బాబాకు వ్రాయరు. ఇందులో చాలా శ్రమ ఉంది. మీరు విశ్వానికి యజమానులుగా
అవుతారు. ఇక్కడైతే హద్దు యజమానులుగా ఉన్నారు. నీటి హద్దుల గురించి కూడా ఎన్ని గొడవలు
జరుగుతూ ఉంటాయి. శతృత్వము ఏర్పడి ఉంది. పరస్పరంలో ఒకరినొకరు సోదరులుగా భావించటం లేదు.
మేమంతా ఒక్కటేనని మాట వరుసకు అంటారు. కానీ ఒక్కటిగా అయితే అవ్వలేరు. అనేకమంది ఆత్మలు
ఉన్నారు, అందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయి. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కల్పక్రితం
కూడా కూర్చుని ఉంటారు. ఆకు కదిలింది అంటే అది డ్రామానుసారముగానే జరుగుతుంది.
అంతేకానీ ప్రతి ఆకును పరమాత్మ కదిలిస్తారని కాదు. ఇటువంటి విషయాలను అర్థం చేసుకుని,
ఆ తర్వాత అర్థం చేయించండి. ప్రతి ఒక్కరూ స్వయం గురించి అర్థం చేసుకోగలరు - మేము
దీపపు పురుగులుగా అయ్యామా, మేము బాబా మతాన్ని అనుసరిస్తూ ఉన్నామా, వ్యర్థమైన మాటలు
మాట్లాడటము లేదు కదా, మా ధనాన్ని పాపం వైపు పెట్టడము లేదు కదా? అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. దేహీ-అభిమానులుగా అయి
వినడము-వినిపించడముతో ధారణ బాగా జరుగుతుంది.
2. నిద్రను జయించేవారిగా అవ్వాలి, రాత్రుళ్ళు మేలుకొని సంపాదించుకోవాలి. విచార
సాగర మంథనము చేయాలి. ఎటువంటి వ్యర్థ విషయాలలోనూ తమ సమయాన్ని పోగొట్టుకోకూడదు.
వరదానము:-
తపస్య ద్వారా తమ వికర్మలను మరియు తమోగుణ సంస్కారాలను భస్మము
చేసే తపస్వీ మూర్త భవ
ఏ విధముగా ఇప్పుడు ఈశ్వరీయ పాలనా కర్తవ్యము నడుస్తుందో,
అదే విధముగా చివరిలో తపస్య ద్వారా మీ వికర్మలను మరియు ప్రతి ఆత్మ యొక్క తమోగుణీ
సంస్కారాలను మరియు ప్రకృతి యొక్క తమోగుణాన్ని భస్మము చేసే కర్తవ్యము నడవబోతుంది.
దీని కొరకు సదా ఏకరస స్థితి అనే ఆసనముపై స్థితులై మీ తపస్వీ స్వరూపాన్ని ప్రత్యక్షము
చేయండి. మీ ప్రతి కర్మేంద్రియము ద్వారా దేహాభిమానపు త్యాగము మరియు ఆత్మాభిమానిగా
అయ్యే తపస్య ప్రత్యక్ష రూపములో కనిపించాలి.
స్లోగన్:-
సంస్కారాల
ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలకులుగా మరియు యజమానులుగా అయ్యే బ్యాలెన్సును
ఉంచండి.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
బాబాను భోళానాథుడు అని
అంటారు, కానీ దాని అర్థం విషయాలను ఎదుర్కోలేనంత భోళానాథుడు అని కాదు. వారు
భోళానాథునితోపాటు ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) కూడా. మీరు కూడా మీ శక్తి
స్వరూపాన్ని మరచి కేవలం భోళాగా అవ్వకండి, లేదంటే మాయ బుల్లెట్ తగులుతుంది. మాయ
ఎదిరించే కంటే ముందే మీకు నమస్కారము చేసే విధముగా మీరు అంతటి శక్తి స్వరూపులుగా
అవ్వండి. చాలా సావధానులుగా, జాగ్రత్తగా, తెలివైనవారిగా ఉండండి.