‘‘లక్ష్యాన్ని మరియు
లక్షణాలను సమానంగా తయారుచేసుకోండి, సర్వ ఖజానాలలో సంపన్నులుగా
అవ్వండి’’
ఈ రోజు సర్వ ఖజానాల యజమాని, ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ
పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో
సంపన్నంగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారి గుర్తు
ఏమిటంటే - వారు సదా ప్రాప్తి స్వరూపులుగా, తృప్త ఆత్మలుగా
కనిపిస్తారు. వారు సదా సంతోషంగా కనిపిస్తారు ఎందుకంటే నిండుగా
ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, మా వద్ద
ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి? ఈ అవినాశీ ఖజానాలు ఇప్పుడు కూడా
ప్రాప్తించాయి మరియు భవిష్యత్తులో అనేక జన్మలు తోడుగా ఉంటాయి.
ఈ ఖజానాలు అంతమయ్యేవి కావు. అన్నింటికంటే మొదటి ఖజానా - జ్ఞాన
ఖజానా, ఈ జ్ఞాన ఖజానా ఆధారంగా ఈ సమయములో కూడా మీరందరూ ముక్తిని
మరియు జీవన్ముక్తిని అనుభవం చేస్తున్నారు. జీవితములో ఉంటూ, పాత
ప్రపంచములో ఉంటూ, తమోగుణీ వాయుమండలములో ఉంటూ జ్ఞాన ఖజానా
ఆధారముతో ఈ వాయుమండలము, వైబ్రేషన్లు, ఈ అన్నింటి నుండి అతీతముగా
ముక్తులై ఉన్నారు. కమలపుష్ప సమానముగా అతీతముగా ముక్తులుగా ఉన్న
ఆత్మలైన మీరు దుఃఖము నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులై
ఉన్నారు. జీవితములో ఉంటూ చెడు విషయాల బంధనాల నుండి ముక్తులుగా
ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి ముక్తులుగా ఉన్నారు.
ముక్తులుగా ఉన్నారా? అందరూ చేతులూపుతున్నారు.
కనుక ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి ఈ జ్ఞాన ఖజానా యొక్క
ఫలము, ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు రావటానికి ప్రయత్నిస్తూ
ఉంటాయి, నెగెటివ్ కూడా వస్తుంది, కానీ మీకు ఈ జ్ఞానము అనగా
వివేకము ఉంది, అదేమిటంటే - వ్యర్థ సంకల్పాలు మరియు నెగెటివ్
యొక్క పని రావటము మరియు జ్ఞాన స్వరూప ఆత్మలైన మీ పని వాటి నుండి
ముక్తులుగా, అతీతులుగా మరియు బాబాకు ప్రియమైనవారిగా ఉండటము.
కనుక చెక్ చేసుకోండి, జ్ఞాన ఖజానా ప్రాప్తించిందా? నిండుగా ఉందా?
ఖజానా సంపన్నంగా ఉందా లేక తక్కువ ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే
దానిని జమ చేసుకోండి, ఖాళీ ఉండనివ్వకండి.
అలాగే యోగము యొక్క ఖజానా - దీని ద్వారా సర్వ శక్తుల ప్రాప్తి
కలుగుతుంది. కనుక మిమ్మల్ని మీరు చూసుకోండి, యోగము యొక్క ఖజానా
ద్వారా సర్వ శక్తులు జమ అయ్యాయా? సర్వ శక్తులూనా? ఒక్క శక్తి
అయినా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయములో మోసగిస్తుంది. మీ అందరి
టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్, శక్తివాన్ కాదు, సర్వశక్తివాన్.
మరి సర్వ శక్తుల ఖజానా యోగబలము ద్వారా జమ అయ్యిందా? నిండుగా
ఉందా, ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకని?
ఇప్పుడు మీరు ఆ లోటును భర్తీ చేయగలరు. ఇప్పుడు అవకాశము ఉంది.
తర్వాత సంపన్నంగా చేసుకునే సమయము సమాప్తమైపోతే లోటు అలాగే
ఉండిపోతుంది. చెక్ చేసుకోండి - ఒక్కొక్క శక్తినీ ఎదురుగా
తెచ్చుకోండి మరియు మొత్తము రోజంతటి దినచర్యలో చెక్ చేసుకోండి -
ఒకవేళ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా సరే ఫుల్ పాస్ అని అనరు
ఎందుకంటే మీ అందరికీ లక్ష్యము ఉంది. ఫుల్ పాస్ అవ్వాలా లేక హాఫ్
పాస్ అవ్వాలా అని పిల్లల్లో ఎవరిని అడిగినా, అందరూ - మేమైతే
సూర్యవంశీయులుగానే అవుతాము, చంద్రవంశీయులుగా అవ్వము అని అంటారు.
చంద్రవంశీయులుగా అవుతారా? బాప్ దాదా చాలా మంచి సింహాసనాన్ని
ఇస్తారు, అలా అయితే చంద్రవంశీయులుగా అవుతారా? భారత్ వారు
సూర్యవంశీయులుగా అవుతారు, విదేశీయులు చంద్రవంశీయులుగా అవుతారు
అంటే, మరి అలా అవుతారా? అలా అవ్వరా? సూర్యవంశీయులుగానే అవ్వాలా?
అవ్వాల్సిందే. బాప్ దాదా చిట్-చాట్ చేస్తున్నారు. మరి
సూర్యవంశీయులుగా అవ్వాల్సిందే అని అన్నప్పుడు, దృఢ నిశ్చయము
ఉంది అని అన్నప్పుడు, బాబాతో మరియు స్వయముతో ప్రతిజ్ఞను చేసారు
అని అన్నప్పుడు, ఇక ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క పర్సెంటేజ్
తక్కువ అవ్వకూడదు. పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా
పర్సెంటేజ్ తక్కువగా ఉండిపోయింది అని చెప్పారంటే, మరి 14 కళల
వారిగా అవుతారు, అందుకే ఈ రోజుల్లో బాప్ దాదా నలువైపులా ఉన్న
పిల్లలందరి లెక్కాపత్రాన్ని, రిజిస్టర్ ను చెక్ చేస్తున్నారు.
బాప్ దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి రిజిస్టర్ ఉంది ఎందుకంటే
సమయమనుసారంగా ముందుగానే బాప్ దాదా పిల్లలకు వినిపిస్తున్నారు -
సమయము యొక్క వేగము అనుసారంగా ఇప్పుడిక ‘ఎప్పుడో’ అని అనకండి,
‘ఇప్పుడు’ అని అనండి. ఎప్పుడో అవుతుందిలే, చేస్తాములే...
అవ్వవలసిందే... అని ఇలా ఆలోచించకండి. అవ్వవలసిందే అని కాదు,
ఇప్పుటికిప్పుడే చెయ్యవలసిందే. సమయము యొక్క వేగం తీవ్రమవుతూ
ఉంది, అందుకే బాబా సమానంగా అయ్యే, ఫుల్ పాస్ అయ్యే, 16 కళల
సంపన్నంగా అయ్యే లక్ష్యమునేదైతే పెట్టుకున్నారో, బాప్ దాదా కూడా
ఇదే కోరుకుంటున్నారు - లక్ష్యము మరియు ప్రాక్టికల్ గా లక్షణాలు
సమానంగా ఉండాలి. లక్ష్యము మరియు లక్షణాలు రెండూ సమానంగా
అయినప్పుడే బాబా సమానంగా సహజంగా అవుతారు. కావున చెక్ చేసుకోండి
- అయిపోతుందిలే, తప్పకుండా తయారైపోతాములే... ఇలా అనుకోవటము
నిర్లక్ష్యము. ఏదైతే చెయ్యాలో, ఎలాగైతే తయారవ్వాలో, ఏ
లక్ష్యమైతే ఉందో, అది ఇప్పటి నుండే చెయ్యాలి, తయారవ్వాలి.
‘ఎప్పుడో’ అన్న పదాన్ని ఉపయోగించకండి, ఇప్పటికిప్పుడే.
జ్ఞాన ఖజానా, యోగ ఖజానా, అంతేకాక ధారణల ఖజానా ఉంది. వీటి
ద్వారా (ధారణల ద్వారా) గుణాల ఖజానా జమ అవుతుంది. ఏ విధంగా సర్వ
శక్తులూ ఉన్నాయో, అలాగే గుణాలలో కూడా సర్వ గుణాలూ ఉన్నాయి.
కేవలం గుణాలు కాదు, సర్వ గుణాలు. మరి సర్వ గుణాలు ఉన్నాయా లేక
ఒకటి, రెండు గుణాలు తక్కువైతే ఏమైందిలే అని అనుకుంటున్నారా, అలా
నడుస్తుందా? నడవదు. మరి సర్వ గుణాల ఖజానా జమ అయ్యిందా? ఏ
గుణములో లోటు ఉందో, దానిని చెక్ చేసుకుని నిండుగా అవ్వండి.
నాల్గవ విషయము - సేవ. సేవ ద్వారా అందరికీ ఈ అనుభవము ఉంది,
ఎప్పుడెప్పుడైతే మనసా సేవ లేక వాణి ద్వారా లేక కర్మ ద్వారా సేవ
చేస్తారో, దానికి ప్రాప్తిగా ఆత్మిక సంతోషము లభిస్తుంది. కనుక
చెక్ చేసుకోండి - సేవ ద్వారా సంతోషము యొక్క అనుభూతిని ఎంతవరకు
చేసారు? ఒకవేళ సేవ చేసారు కానీ సంతోషము లభించలేదంటే, ఆ సేవ
యథార్థ సేవ కాదు, ఆ సేవలో ఏదో ఒక లోపము ఉంది, అందుకే సంతోషము
లభించదు. సేవ అంటే అర్థము, ఆత్మ తనను తాను సంతోషముగా,
వికసించిన ఆత్మిక గులాబీలా, సంతోషపు ఊయలలో ఊగుతున్నట్లుగా
అనుభవం చేస్తుంది. కనుక చెక్ చేసుకోండి - మొత్తము రోజంతా సేవ
చేసారు, కానీ మొత్తము రోజంతా చేసిన సేవతో పోలిస్తే అంత కంతా
సంతోషము కలిగిందా లేక ఇది కాదు అది, అది కాదు ఇది... అని ఇలా
ఆలోచనలే నడుస్తూ ఉన్నాయా? అంతేకాక మీ సంతోషము యొక్క ప్రభావము,
ఒకటేమో సేవా స్థానముపై, రెండవది సేవా సహచరులపై, మూడవది ఏ
ఆత్మలకైతే సేవ చేసారో ఆ ఆత్మలపై పడాలి, వాయుమండలము కూడా
సంతోషంగా అయిపోవాలి. సేవ యొక్క ఖజానా ఈ సంతోషము.
ఇంకొక విషయము - నాలుగు సబ్జెక్టులైతే వచ్చేసాయి. మరొకటి
సంబంధ-సంపర్కాలు, ఇది కూడా చాలా అవసరము, ఎందుకు? చాలామంది
పిల్లలు ఏమనుకుంటారంటే - బాప్ దాదాతో అయితే సంబంధము ఉండనే ఉంది,
పరివారముతో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి (ఏం ఫర్వాలేదు), బీజముతో
అయితే సంబంధము ఉండనే ఉంది కదా. కానీ మీరు విశ్వ రాజ్యము
చెయ్యాలి కదా! మరి రాజ్యములో ఉన్నప్పుడు సంబంధములోకి
రావాల్సిందే. అందుకే సంబంధ-సంపర్కాలలోకి రావాల్సిందే.
సంబంధ-సంపర్కాలలో యథార్థ ఖజానా లభిస్తుంది, అదేమిటంటే -
ఆశీర్వాదాలు. సంబంధ-సంపర్కాలు లేకుండా మీ వద్ద ఆశీర్వాదాల ఖాతా
జమ అవ్వదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలైతే ఉన్నాయి కానీ
సంబంధ-సంపర్కాలలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ
ఆశీర్వాదాలు లభించకపోతే, ఆ ఫీలింగ్ రాకపోతే, సంబంధ-సంపర్కాలలో
ఏదో లోపము ఉంది అని అర్థం చేసుకోండి. ఒకవేళ సంబంధ-సంపర్కాలు
యథార్థ రీతిలో ఉంటే ఆశీర్వాదాల అనుభూతి కలగాలి. ఆశీర్వాదాల
అనుభూతి ఎలా ఉంటుంది? అనుభవీలే కదా! ఒకవేళ సేవ ద్వారా
ఆశీర్వాదాలు లభించినట్లయితే, ఆ ఆశీర్వాదాలు లభించినందుకు అనుభవం
ఎలా ఉంటుందంటే, స్వయం కూడా సంబంధములోకి వస్తారు, కార్యము చేస్తూ
డబల్ లైట్ గా (తేలికగా) ఉంటారు, భారము అనిపించదు మరియు ఎవరి
సేవనైతే చేసారో, ఎవరి సంబంధ-సంపర్కములోకైతే వచ్చారో, వారు కూడా
డబల్ లైట్ గా ఫీల్ అవుతారు. ఈ సంబంధములో సదా తేలికగా ఉంటుంది
అనగా ఈజీగా ఉంటుంది, భారము అనిపించదు అని అనుభవం చేస్తారు.
సంబంధములోకి వచ్చినా, రాకపోయినా కానీ, ఆశీర్వాదాలు లభించిన
కారణంగా రెండు వైపుల నియమ ప్రమాణంగా ఉంటారు. అలాగని అంత ఈజీగా
ఉండటం కూడా కాదు, బాగా తీపి ఉన్న చోట చీమలు చాలా చేరుతాయి అని
సామెత ఉంది కదా, కనుక అంత ఈజీ కూడా కాదు, కానీ డబుల్ లైట్ గా
ఉంటారు. కనుక బాప్ దాదా చెప్తున్నారు - మీ ఖజానాలను చెక్
చేసుకోండి. సమయాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు ఇంకా సమాప్తి బోర్డు
పెట్టలేదు. అందుకే చెక్ చేసుకోండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి.
బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా! అందుకే బాప్ దాదా
పిల్లలెవరూ వెనుక ఉండిపోకూడదు అని అనుకుంటారు. పిల్లలు ప్రతి
ఒక్కరూ ఇంకా, ఇంకా ముందుకు వెళ్ళాలి. నడుస్తూ-నడుస్తూ ఉండగా
దేహాభిమానము వచ్చేస్తుంది. స్వమానము మరియు దేహాభిమానము.
దేహాభిమానానికి కారణము ఏమిటంటే, స్వమానములో లోటు ఏర్పడటము.
కనుక దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు చాలా సహజ సాధనము ఏమిటంటే
- దేహాభిమానము వచ్చేందుకు కారణము ఒకటే మాట, ఒకటే పదము, అది మీకు
తెలుసు కూడా. దేహాభిమానానికి సంబంధించిన ఆ ఒక్క మాట ఏమిటి? (నేను).
అచ్ఛా, మరి ఎన్ని సార్లు నేను-నేను అని అంటారు? మొత్తము
రోజంతటిలో ఎన్ని సార్లు ‘‘నేను’’ అని అంటారో ఎప్పుడైనా నోట్
చేసుకున్నారా? అచ్ఛా, ఒక రోజు నోట్ చేసుకోండి. పదే-పదే నేను అనే
పదమైతే వస్తుంది. కానీ నేను ఎవరిని? మొదటి పాఠము - నేను ఎవరు?
దేహాభిమానములో నేను అని అంటారు కానీ వాస్తవానికి నేను ఎవరిని?
ఆత్మనా లేక దేహాన్నా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా లేక దేహము
ఆత్మను ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మ దేహాన్ని ధారణ చేసింది.
ఇది కరెక్టు కదా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందంటే, మరి నేను
ఎవరిని? ఆత్మను కదా! కనుక సహజ సాధనమేమిటంటే, ‘నేను’ అనే మాటను
ఎప్పుడు మాట్లాడినా, నేను ఎటువంటి ఆత్మను? అన్నది గుర్తు
చేసుకోండి. ఆత్మ నిరాకారీ, దేహము సాకారీ. నిరాకార ఆత్మ సాకార
దేహాన్ని ధారణ చేసింది. కనుక ఎన్ని సార్లు నేను, నేను అన్న
పదాన్ని ఉపయోగించినా, అంత సమయమూ ఇది గుర్తుంచుకోండి - నిరాకార
ఆత్మనైన నేను సాకార శరీరములో ప్రవేశించాను. నిరాకార స్థితి
గుర్తున్నట్లయితే నిరహంకారులుగా స్వతహాగానే అయిపోతారు. దేహ
భానము సమాప్తమైపోతుంది. అదే మొదటి పాఠము, నేను ఎవరిని? నేను
ఎటువంటి ఆత్మను అన్నదానిని స్మృతిలో పెట్టుకుని ఆత్మను గుర్తు
చేసుకుంటే నిరాకారీ స్థితి పక్కా అయిపోతుంది. ఎక్కడైతే నిరాకారీ
స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారులుగా, నిర్వికారులుగా స్వతహాగా
అయిపోతారు. కనుక రేపటి నుండి నోట్ చేసుకోండి - నేను అన్న మాట
పలికినప్పుడు ఏం గుర్తుకొస్తుంది? మరియు ఎన్ని సార్లు అయితే
నేను అన్న మాటను ఉపయోగిస్తారో అన్ని సార్లు నిరాకారిగా,
నిరహంకారిగా, నిర్వికారిగా స్వతహాగానే అయిపోతారు. అచ్ఛా!
ఈ రోజు యూత్ (యువ) గ్రూప్ వచ్చింది. యూత్ చాలామంది ఉన్నారు.
బాప్ దాదా యూత్ గ్రూప్ కు వరదానము ఇస్తున్నారు - సదా సంపన్నంగా
ఉండండి. ఒక్క ఖజానాను కూడా వ్యర్థం చేయకండి, సంపన్నంగా ఉండండి,
సంపన్నంగా చేయండి. లౌకిక గురువులు - ఆయుష్మాన్ భవ అని
ఆశీర్వదిస్తారు. బాప్ దాదా అంటారు - శరీర ఆయువు అయితే ఎంత ఉందో
అంతే ఉంటుంది, అందుకే శరీర ఆయువు లెక్కలో ఆయుష్మాన్ భవ అన్న
వరదానాన్ని ఇవ్వటం లేదు, కానీ ఈ బ్రాహ్మణ జీవితములో సదా
ఆయుష్మాన్ భవ. ఎందుకని? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు
కనుక ఆయుష్మంతులుగా అయితే ఉంటారు కదా! యూత్ లో ఒక విశేషత ఉంది.
యూత్ అయిన మీకు మీ విశేషత గురించి తెలుసా? ఏ విశేషత ఉంటుందో
తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? (ఏది అనుకుంటే అది చెయ్యగలము)
అచ్ఛా - చెయ్యగలరా? మంచిది. ప్రపంచములోని వారి లెక్కలో యూత్
చాలా మొండిగా ఉంటారు, ఏది అనుకుంటే అదే చేస్తారు, చూపిస్తారు.
వారు ఆ మాటను నెగెటివ్ అర్థంలో అంటారు కానీ ఇక్కడి బ్రాహ్మణ
యూత్ మొండిగా ఉండేవారు కారు, కానీ తాము చేసిన ప్రతిజ్ఞపై దృఢంగా
ఉండేవారు. ప్రతిజ్ఞ నుండి పక్కకు తప్పుకునేవారు కారు. మరి యూత్
ఇలానే ఉన్నారా? చెయ్యి ఎత్తటమైతే చాలా సహజము. బాప్ దాదా
సంతోషిస్తున్నారు - చేతులు ఎత్తటము కూడా ధైర్యమే కదా. కానీ రోజూ
అమృతవేళ బాబాకు ఏదైతే ప్రతిజ్ఞను చేసారో - మేము ఈ బ్రాహ్మణ
జీవితము యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పములో
కూడా పక్కకు వెళ్ళము అని, ఈ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను ప్రతి రోజూ
రిపీట్ చేసుకోండి మరియు పదే, పదే చెక్ చేసుకోండి - ఏ ధైర్యాన్ని
అయితే పెట్టారో, సంకల్పాన్ని అయితే చేసారో, అది ప్రాక్టికల్ లో
జరుగుతుందా?
గవర్నమెంటు అంటుంది - రెండు, నాలుగు లక్షలమంది యూత్ తయారైనా
మంచిదే అని. బాప్ దాదా అంటారు - ఇక్కడ బ్రాహ్మణ యూత్ ఒక్కొక్కరూ
ఒక లక్షమందితో సమానము. అంత దృఢమైనవారు. అంతేనా? చూడండి, ఇంటికి
వెళ్ళిన తరువాత మళ్ళీ బాబా, మాయ వచ్చేసింది, సంస్కారము
వచ్చేసింది, సమస్య వచ్చేసింది అని వ్రాయకూడదు. సమస్యలకు సమాధాన
స్వరూపులుగా అవ్వండి. సమస్యలైతే వస్తాయి, కానీ నేను ఎవరిని? అని
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధాన స్వరూపుడినా లేక
సమస్యల కారణంగా ఓడిపోయేవాడినా? మీ అందరి టైటిల్ ఏమిటి - విజయీ
రత్నమా లేక ఓడిపోయే రత్నమా? విజయీ రత్నము. బ్రాహ్మణ జన్మ
లభించటముతోనే బాప్ దాదా బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి మస్తకముపై
విజయ తిలకాన్ని అమరంగా పెట్టారు. కనుక మీరు అమర భవ అన్న వరదానము
కలవారు. ఇప్పుడు మీతో మీరు ఈ ప్రతిజ్ఞను చేసుకోండి, ఒకవేళ
ప్రతిజ్ఞను చేయిస్తే అందరూ చేస్తారు కానీ మీ మనసులో మీకు మీరు
ప్రతిజ్ఞ చేసుకోండి - ఎప్పుడూ సంస్కారాలకు వశమవ్వను, బాబా
సంస్కారాలేవైతే ఉన్నాయో, అవే బ్రాహ్మణ ఆత్మనైన నా సంస్కారాలు.
ద్వాపర, కలియుగ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అవి నా సంస్కారాలు
కావు ఎందుకంటే అవి బాబా సంస్కారాలు కావు. ఈ తమోగుణీ సంస్కారాలు
బ్రాహ్మణుల సంస్కారాలా? కాదు కదా! మరి మీరు ఎవరు? బ్రాహ్మణులు
కదా!
బాప్ దాదాకు కూడా యూత్ గ్రూపును చూస్తే గర్వంగా ఉంది. చూడండి,
దాదీలకు కూడా యూత్ ను చూస్తే గర్వంగా ఉంది. యూత్ అంటే దాదీకి
ప్రేమ కదా. ఎక్స్ ట్రా ప్రేమ ఉంది. కుమారులు మంచి కుమారులు.
మీరు కుమారులు కారు, మంచి కుమారులు. ఒక్కొక్క కుమార్
విశ్వములోని కుమారులను పరివర్తన చేసి చూపించేవారు. అచ్ఛా,
కుమారులకు పని ఇమ్మంటారా? ధైర్యము ఉందా? చెయ్యాల్సి వస్తుంది.
కుమారీలు చేస్తారా?
మరి పని ఇస్తున్నాము, శ్రద్ధగా వినండి. రాబోయే సీజన్ ఉంటుంది
కదా, రోబోయే సీజన్ లో కూడా కుమారులకు ఇలాగే స్పెషల్ ప్రోగ్రాం
పెడతాము, కానీ... కానీ అనేది కూడా ఉంది. ఎక్కువ పని ఇవ్వటం లేదు.
ఒకొక్క కుమార్ 10-10 మంది కుమారులను తయారుచేసి తీసుకురావాలి
అనగా చేతికి చిన్న కంకణాన్ని (కుమారుల గ్రూప్ ను) తయారుచేసి
తీసుకురావాలి. చేతికి కంకణం ధరిస్తారు కదా. బ్రహ్మాబాబాకు సదా
చేతికి పూల కంకణాన్ని పెడతారు. మరి ఒక్కొక్క కుమార్,
కచ్చా-కచ్చా వారిని తీసుకురాకండి, పక్కా-పక్కా వారిని
తీసుకురండి. మధుబన్ కైతే వస్తారు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి
మారిపోతారు అన్నట్లు కాదు! అలాంటివారు కాదు. వారిని ఎలా పక్కాగా
చేసి తీసుకురావాలంటే, బాప్ దాదా వారిని చూస్తూ-చూస్తూ - వాహ్
కుమార్, వాహ్ అని అనాలి! ఇలా చేయటానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా
చేస్తారా? కొద్దిగా ఆలోచించుకోండి. ఊరికే చేతులెత్తకండి.
చేయవలసి ఉంటుంది. తయారుచేయవలసి ఉంటుంది. డబుల్ విదేశీయులు కూడా
చేస్తారా? డబుల్ విదేశీయులలో కుమారులు చేతులెత్తండి. మరి మీరు
కూడా 10 మందిని తీసుకువస్తారు కదా? విదేశీయులు కూడా
తీసుకువస్తారు, భారత్ వారు కూడా తీసుకువస్తారు. ఎవరైతే ఫస్ట్
క్లాస్ క్వాలిటీని తీసుకువస్తారో, వారికి బహుమతిని ఇస్తాము.
గొప్ప బహుమతిని ఇస్తాము, చౌకది ఇవ్వము. కుమారులంటే ప్రేమ కదా!
ఒకవేళ గవర్నమెంట్ కు ఎక్కువలో ఎక్కువమంది కుమారులు పాజిటివ్
కర్మలు చేసేవారు దొరికినట్లయితే గవర్నమెంట్ ఎంత సంతోషిస్తుంది.
ఒకవేళ మీరు ఒక్కొక్కరూ 10-10 మంది కుమారులను తీసుకువస్తే మొత్తం
హాల్ అంతా కుమారులతో నిండిపోతుంది, అప్పుడు గవర్నమెంటువారిని
పిలుస్తాము - ఈ కుమారులను చూడండి అని. కానీ తీసుకురావాల్సి
ఉంటుంది, తయారుచెయ్యాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్థితిని, లక్ష్యము
మరియు లక్షణాలను సమానంగా ఉంచుకున్నట్లయితే ఇక సేవలో సఫలత
లభిస్తుందా, లభించదా అన్న సంకల్పము కూడా తలెత్తలేదు. సఫలత
తప్పకుండా లభించి తీరుతుంది. కేవలం మీరు నిమిత్తులుగా అవ్వవలసి
ఉంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అద్భుతమైతే
చెయ్యాల్సిందే. అచ్ఛా!
(మురళి వినిపించేటప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఇద్దరు
కుమారులు బాప్ దాదా ఎదురుగా స్టేజ్ పైకి వచ్చేసారు, వారిని
అక్కడి నుండి పంపేసారు)
అచ్ఛా! ఇప్పుడు ఆటలో ఆట చూసారు కదా. ఇప్పుడు బాప్ దాదా
అంటున్నారు - సాక్షీగా అయ్యి ఆటను చూసారు, ఎంజాయ్ చేసారు,
ఇప్పుడు ఒక్క క్షణములో పూర్తిగా దేహము నుండి అతీతమై శక్తిశాలీ
ఆత్మిక రూపములో స్థితులవ్వగలరా? ఫుల్ స్టాప్.
(బాప్ దాదా చాలా శక్తిశాలీ డ్రిల్ ను చేయించారు) అచ్ఛా - ఈ
అభ్యాసాన్నే అన్నివేళలా మధ్యమధ్యలో చేస్తూ ఉండాలి.
ఇప్పుడిప్పుడే కార్యములోకి రావాలి, ఇప్పుడిప్పుడే కార్యము నుండి
అతీతం అవ్వాలి, సాకారీ నుండి నిరాకారీ స్థితిలో స్థితులైపోవాలి.
ఇది కూడా ఒక అనుభవములా చూసారు కదా. ఏదైనా సమస్య వచ్చినా కూడా
ఇలాగే ఒక్క క్షణములో సాక్షీ ద్రష్టాగా అయ్యి, సమస్యను ఒక సైడ్
సీన్ (మార్గమధ్యంలో వచ్చే దృశ్యము)గా భావించి, తుఫానును ఒక
కానుకగా భావించి దానిని దాటి వేయాలి. అభ్యాసము ఉంది కదా?
మున్ముందు అయితే ఇటువంటి అభ్యాసము చాలా అవసరము ఉంటుంది. ఫుల్
స్టాప్. ఇది ఎందుకైంది, ఎలా అయ్యింది అని ప్రశ్నార్థకము
ఉండకూడదు. అది అయిపోయింది. ఇక ఫుల్ స్టాప్ మరియు మీ ఫుల్
శక్తిశాలీ స్థితిలో స్థితులైపోండి. సమస్య కింద ఉండిపోతుంది,
మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటూ సమస్య రూపీ సైడ్ సీన్ ను చూస్తూ
ఉంటారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు, సదా
అన్నివేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ, చిరునవ్వు నవ్వుతూ
హర్షితంగా ఉండే ఆత్మలకు, సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితములో
ప్రత్యక్షము చేసే జ్ఞాన స్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలైన
పిల్లలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా చేసుకునే
బాబా సమానమైన ఆత్మలకు, సదా అన్నివేళలా సర్వ ఖజానాల స్టాక్ ను
ఉంచుకునే మరియు స్టాప్ ను పెట్టే తీవ్ర పురుషార్థీ శ్రేష్ఠ
ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనోభిరాముని
మనస్ఫూర్వకమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.