29-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని
ఇచ్చేందుకు తండ్రి వచ్చారు, దీని ద్వారా మీరు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను
తెలుసుకుంటారు’’
ప్రశ్న:-
సింహంవంటి శక్తులు మాత్రమే ఏ విషయాన్ని ధైర్యంగా అర్థము చేయించగలరు?
జవాబు:-
ఇతర ధర్మాల
వారికి ఈ విషయాన్ని అర్థం చేయించాలి - తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా
భావించండి, పరమాత్మగా కాదు. ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి మరియు మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. పరమాత్మగా భావించినట్లయితే
మీ వికర్మలు వినాశనమవ్వవు. ఈ విషయాన్ని చాలా ధైర్యంగా సింహంవంటి శక్తులు మాత్రమే
అర్థము చేయించగలరు. అర్థము చేయించే అభ్యాసము కూడా కావాలి.
పాట:-
నయనహీనులకు
మార్గాన్ని చూపించండి...
ఓంశాంతి
ఆత్మిక స్మృతి యాత్రలో ఇబ్బందులు ఉన్నట్లు పిల్లలు అనుభవము చేస్తున్నారు. భక్తి
మార్గములో ప్రతి ద్వారం వద్ద ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది. అనేక రకాల
జప-తపాలు-యజ్ఞాలు చేస్తారు, శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, దీని కారణంగానే బ్రహ్మా
రాత్రి అని అంటారు. అర్ధకల్పము రాత్రి, అర్ధకల్పము పగలు. బ్రహ్మా ఒక్కరే అయితే ఉండరు
కదా. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు అంటే తప్పకుండా వారి పిల్లలైన
బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలు కూడా ఉంటారు. కానీ మనుష్యులకు ఈ విషయం తెలియదు.
తండ్రియే పిల్లలకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా మీకు సృష్టి
యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించింది. మీరు కల్పక్రితము కూడా బ్రాహ్మణులుగా
ఉండేవారు మరియు దేవతలుగా అయ్యారు, ఎవరైతే దేవతలుగా అయ్యారో వారే మళ్ళీ తయారవుతారు.
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు మీరే. మీరే పూజ్యులుగా మరియు పూజారులుగా
అవుతారు. ఇంగ్లీషులో పూజ్యులను వర్షిప్ వర్థీ అని మరియు పూజారులను వర్షిప్పర్ అని
అంటారు. భారత్ యే అర్ధకల్పము పూజారిగా అవుతుంది. మేము పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ
మేమే పూజారులుగా అయ్యామని ఆత్మ అంగీకరిస్తుంది. పూజ్యుల నుండి పూజారులుగా, మళ్ళీ
పూజ్యులుగా అవుతారు. తండ్రి అయితే పూజ్యునిగా, పూజారిగా అవ్వరు. మీరంటారు - మేము
పూజ్యులుగా, పావన దేవీ-దేవతలుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మల తర్వాత పూర్తిగా
పతితులుగా, పూజారులుగా అవుతాము. ఇప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన
భారతవాసులు ఎవరైతే ఉన్నారో, వారికి తమ ధర్మము గురించి ఏమీ తెలియదు. మీ ఈ విషయాలను
అన్ని ధర్మాల వారేమీ అర్థము చేసుకోరు, ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే కన్వర్ట్ అయి
ఉంటారో వారే వస్తారు. ఈ విధంగా చాలా మంది కన్వర్ట్ అయ్యారు. తండ్రి అంటారు - శివుని
పూజారులు మరియు దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, వారికి ఇది సహజము. ఇతర ధర్మాలకు
చెందినవారైతే అలా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, కానీ కన్వర్ట్ అయినవారు ఈ ధర్మానికి
చెందినవారైతే మాత్రం వారికి టచ్ అవుతుంది. వారు ఇక్కడకు వచ్చి అర్థము చేసుకోవడానికి
ప్రయత్నిస్తారు. లేకపోతే అంగీకరించరు. ఆర్య సమాజము నుండి కూడా చాలామంది వచ్చారు.
సిక్కులు కూడా వచ్చారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో,
వారు తమ ధర్మములోకి తప్పకుండా రావలసి ఉంటుంది. వృక్షములో కూడా వేర్వేరు సెక్షన్లు
ఉంటాయి. మళ్ళీ రావడము కూడా నంబరువారుగా వస్తారు. కొమ్మలు-రెమ్మలు వెలువడుతూ ఉంటాయి.
వారు పవిత్రంగా ఉన్న కారణంగా వారి ప్రభావము బాగా వెలువడుతుంది. ఈ సమయంలో దేవీ-దేవతా
ధర్మము యొక్క పునాది లేదు, ఆ పునాదిని మళ్ళీ వేయవలసి వస్తుంది. సోదరీ-సోదరులుగా
తయారుచేయవలసి ఉంటుంది. ఒక్క తండ్రి పిల్లలమైన మనమందరమూ ఆత్మలము, పరస్పరము సోదరులము,
ఆ తర్వాత సోదరీ-సోదరులుగా అవుతాము. ఇప్పుడు కొత్త సృష్టి స్థాపనవుతుంది, అందులో
మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కొత్త సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మా అయితే
తప్పకుండా కావాలి. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. దీనిని రుద్ర జ్ఞాన
యజ్ఞము అని కూడా అంటారు, ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మా
యొక్క సంతానం తప్పకుండా కావాలి. వారు గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. బ్రాహ్మణులు
మొదటి నంబరులో పిలక వంటి వారు. ఆదమ్ బీబీ, ఆడమ్ ఈవ్ ను కూడా అంగీకరిస్తారు. ఈ సమయంలో
మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మీ యొక్క అన్నింటికన్నా మంచి
స్మృతిచిహ్న మందిరము దిల్వాడా మందిరము. కింద తపస్యలో కూర్చున్నారు, పైన రాజ్యముంది
మరియు ఇక్కడ మీరు చైతన్యంలో కూర్చుని ఉన్నారు. ఈ మందిరాలు సమాప్తమైపోతాయి, మళ్ళీ
భక్తి మార్గములో తయారవుతాయి.
మీకు తెలుసు ఇప్పుడు మనము రాజయోగము నేర్చుకుంటున్నాము, మళ్ళీ కొత్త ప్రపంచములోకి
వెళ్తాము. అది జడమైన మందిరము, మీరు చైతన్యంలో కూర్చుని ఉన్నారు. ముఖ్యమైన ఈ మందిరము
సరైన రీతిలో నిర్మించబడి ఉంది. లేకపోతే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి, అందుకే
స్వర్గాన్ని పైకప్పులో చూపించారు. దీని గురించి చాలా బాగా అర్థము చేయించవచ్చు. ఈ
విధంగా చెప్పండి - భారత్ యే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ భారత్ నరకంగా ఉంది అని.
ఈ ధర్మము వారు వెంటనే అర్థము చేసుకుంటారు. హిందువులలో కూడా చూసినట్లయితే, వారు అనేక
రకాల ధర్మాలలోకి వెళ్ళిపోయారు. వారిని వెలికితీయడానికి మీరు చాలా శ్రమించాల్సి
వస్తుంది. బాబా అర్థం చేయించారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి
చేయండి, అంతే, అసలు ఇంకేమీ మాట్లాడనే మాట్లాడవద్దు. ఎవరికైతే అభ్యాసము లేదో, వారు
అసలు మాట్లాడవద్దు కూడా. లేకపోతే బి.కె.ల పేరును పాడు చేస్తారు. ఒకవేళ ఇతర ధర్మాల
వారైతే, ఈ విధంగా అర్థం చేయించాలి - ఒకవేళ మీరు ముక్తిధామానికి వెళ్ళాలనుకుంటే
స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని పరమాత్మగా
భావించకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ
జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి మరియు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీ కోసం ఈ
మన్మనాభవ మంత్రమే సరిపోతుంది. కానీ మాట్లాడే ధైర్యము కావాలి. సింహంవంటి శక్తులు
మాత్రమే సేవ చేయగలరు. మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాము, పదండి అని సన్యాసులు
బయటకు వెళ్ళి విదేశీయులను తీసుకొస్తారు. ఇప్పుడు వారికి తండ్రి గురించైతే తెలియదు.
బ్రహ్మ తత్వాన్ని భగవంతునిగా భావించి, దానిని స్మృతి చేయండి అని చెప్తారు. కేవలం ఈ
మంత్రాన్ని ఇస్తారు, ఒక పక్షిని తన పంజరములో బంధించినట్లుగా బంధిస్తారు. ఈ విధంగా
అర్థము చేయించడానికి కూడా సమయం పడుతుంది. బాబా అన్నారు - ప్రతి ఒక్క చిత్రముపైన శివ
భగవానువాచ అని రాసి ఉండాలి.
ఈ ప్రపంచములో నాథుడు లేరు కావున అందరూ అనాథలేనని మీకు తెలుసు. నీవే
తల్లివి-తండ్రివి... అని పిలుస్తారు. అచ్ఛా, దీని అర్థమేమిటి? మీ కృపతో అపారమైన
సుఖము లభిస్తుంది అని ఊరికే అలా అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి మీకు స్వర్గ సుఖాల కోసం
చదివిస్తున్నారు, దీని కోసమే మీరు పురుషార్థము చేస్తున్నారు. ఎవరు చేస్తారో, వారే
పొందుతారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పావన ప్రపంచము ఒక్క స్వర్గమే, ఇక్కడ
ఎవ్వరూ సతోప్రధానంగా ఉండరు. సత్యయుగములో ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో, వారే
తమోప్రధానంగా, పతితులుగా అవుతారు. క్రైస్టు వెనుక వారి ధర్మానికి చెందినవారు ఎవరైతే
వస్తారో, వారు మొదట సతోప్రధానంగా ఉంటారు కదా. లక్షల సంఖ్యకు చేరుకున్నప్పుడు యుద్ధము
చేసి రాజ్యాన్ని తీసుకోవడానికి సైన్యము తయారవుతుంది. వారికి సుఖమూ తక్కువే, దుఃఖము
కూడా తక్కువే ఉంటుంది. మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరికీ లభించదు. మీరిప్పుడు
సుఖధామములోకి వచ్చేందుకు తయారవుతున్నారు. మిగిలిన ధర్మాల వారెవ్వరూ స్వర్గములోకి
రారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు, అటువంటి పావన ఖండము మరొకటి ఉండదు. ఎప్పుడైతే
తండ్రి వస్తారో, అప్పుడే ఈశ్వరీయ రాజ్యము స్థాపనవుతుంది. అక్కడ యుద్ధము మొదలైన
విషయాలేవీ ఉండవు. గొడవపడడము-కొట్లాడటము చాలా కాలము తర్వాత మొదలవుతాయి. భారతవాసులు
అంతగా గొడవపడలేదు. వారు పరస్పరములో కొంత కొట్లాడుకుని వేరైపోయారు. ద్వాపర యుగములో
ఒకరిపై ఒకరు దండయాత్ర చేస్తారు. ఈ చిత్రాలు మొదలైనవి తయారుచేసేందుకు కూడా విశాల
బుద్ధి కావాలి. ఈ విధంగా కూడా వ్రాయాలి - భారత్ ఏదైతే స్వర్గంగా ఉండేదో, అది మళ్ళీ
నరకంగా ఎలా అయ్యిందో వచ్చి అర్థం చేసుకోండి. భారత్ సద్గతిలో ఉండేది, ఇప్పుడు
దుర్గతిలో ఉంది. ఇప్పుడు సద్గతిని పొందేందుకు తండ్రి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తారు.
మనుష్యులకు ఈ ఆత్మిక జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము పరమపిత పరమాత్మలో ఉంటుంది. తండ్రి
ఆత్మలకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. మిగిలిన మనుష్యులందరూ, మనుష్యులకే ఇస్తారు.
శాస్త్రాలు కూడా మనుష్యులే వ్రాశారు, మనుష్యులే చదివారు. ఇక్కడ మిమ్మల్ని ఆత్మిక
తండ్రి చదివిస్తున్నారు మరియు ఆత్మ చదువుకుంటుంది. చదువుకునేది అయితే ఆత్మయే కదా.
అక్కడ చదివేది మరియు వ్రాసేది మనుష్యులే. పరమాత్మకైతే శాస్త్రాలు మొదలైనవి చదివే
అవసరము లేదు. తండ్రి అంటారు - ఈ శాస్త్రాలు మొదలైనవాటితో ఎవ్వరికీ సద్గతి లభించదు.
నేనే వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ప్రపంచములో కోట్లాది మంది
మనుష్యులున్నారు. సత్యయుగంలో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు, అక్కడ 9 లక్షల
మంది ఉంటారు. చాలా చిన్న వృక్షము ఉంటుంది. మరి ఆలోచించండి, ఇంతమంది ఆత్మలు ఎక్కడికి
వెళ్ళారు? బ్రహ్మ తత్వములో లేక నీటిలో లీనమవ్వలేదు కదా. ఆత్మలన్నీ ముక్తిధామములో
నివసిస్తాయి. ప్రతి ఆత్మ అవినాశీ. ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది, అది ఎప్పటికీ
వినాశనమవ్వదు. ఆత్మ వినాశనమవ్వదు. ఆత్మ ఒక బిందువు. ఇకపోతే నిర్వాణం మొదలైనవాటిలోకి
ఎవరూ వెళ్ళరు, అందరూ పాత్రను అభినయించాల్సిందే. ఎప్పుడైతే ఆత్మలన్నీ వచ్చేస్తాయో,
అప్పుడు నేను వచ్చి అందరినీ తీసుకువెళ్తాను. తండ్రి పాత్ర చివరిలో ఉంటుంది. కొత్త
ప్రపంచ స్థాపన, తర్వాత పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై
ఉంది. మీరు ఆర్య సమాజము వారి గుంపుకు అర్థము చేయించినట్లయితే, అందులో ఎవరైనా ఈ దేవతా
ధర్మానికి చెందినవారు ఉంటే వారికి టచ్ అవుతుంది. ఈ విషయమైతే తప్పకుండా రైట్,
పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు. భగవంతుడు తండ్రి, వారి నుండి వారసత్వము లభిస్తుంది.
కొంతమంది ఆర్య సమాజము వారు కూడా మీ వద్దకు వస్తారు కదా. వారినే సాప్లింగ్ (అంటు) అని
అంటారు. మీరు అర్థము చేయిస్తూ ఉండండి, అప్పుడు మీ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో,
వారు వచ్చేస్తారు. భగవంతుడైన తండ్రి మాత్రమే పావనంగా అయ్యే యుక్తులను తెలియజేస్తారు.
భగవానువాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను పతిత-పావనుడను, నన్ను స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు ముక్తిధామంలోకి వచ్చేస్తారు. ఈ
సందేశము అన్ని ధర్మాల వారి కోసం ఉంది. వారికి చెప్పండి - తండ్రి చెప్తున్నారు, దేహ
ధర్మాలన్నింటినీ వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానంగా అవుతారు. నేను గుజరాతీని, నేను ఫలానా - ఇవన్నీ వదిలేయండి. స్వయాన్ని
ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇది యోగాగ్ని. సంభాళించుకొని
అడుగులు వేయాలి. అందరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు - పతిత-పావనుడను నేనే, మీరందరూ
పతితులుగా ఉన్నారు, పావనంగా అవ్వకుండా నిర్వాణధామములోకి రాలేరు. రచన యొక్క
ఆదిమధ్యాంతాల గురించి కూడా అర్థము చేసుకోవాలి. పూర్తిగా అర్థము చేసుకుంటేనే ఉన్నత
పదవిని పొందుతారు. కొంత భక్తి చేసి ఉంటే కొంత జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎక్కువ
భక్తి చేసి ఉంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో,
దానిని ధారణ చేయాలి. వానప్రస్థులకైతే ఇది ఇంకా సహజము. గృహస్థ వ్యవహారము నుండి పక్కకు
వచ్చేస్తారు. వానప్రస్థావస్థ 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. గురువులను కూడా అప్పుడే
ఆశ్రయిస్తారు. ఈ రోజుల్లో చిన్నతనము నుండే గురువులను ఆశ్రయిస్తున్నారు. లేకపోతే
మొదట తండ్రి, తర్వాత టీచర్, 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత గురువులను ఆశ్రయించడం
జరుగుతుంది. సద్గతిదాత ఒక్క తండ్రియే, ఈ అనేకమంది గురువులేమీ కారు. ఇవన్నీ ధనము
సంపాదించడానికి యుక్తులు, అందరికీ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే. తండ్రి
అంటారు - నేను మీకు అన్ని వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇదంతా భక్తి
మార్గపు సామగ్రి. మెట్లు దిగడం జరుగుతుంది. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత భక్తి పట్ల
వైరాగ్యము. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో, అప్పుడే భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది.
ఈ పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యము కలుగుతుంది. ఇకపోతే, ప్రపంచాన్ని వదిలి ఎక్కడకు
వెళ్తారు? మీకు తెలుసు - ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది, అందుకే ఇప్పుడు అనంతమైన
ప్రపంచాన్ని సన్యసించాలి. పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు. పవిత్రంగా
అయ్యేందుకు స్మృతి యాత్ర కావాలి. భారత్ లో రక్తపు నదులు ప్రవహించిన తర్వాత, మళ్ళీ
పాల నదులు ప్రవహిస్తాయి. విష్ణువును కూడా క్షీర సాగరములో చూపిస్తారు. ఈ యుద్ధము
ద్వారా ముక్తి-జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయని అర్థము చేయించడం
జరుగుతుంది. పిల్లలైన మీరు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగానే శబ్దము వెలువడుతూ
ఉంటుంది. ఇప్పుడిక యుద్ధము మొదలవ్వబోతుంది. ఒక్క నిప్పురవ్వతో ఇంతకుముందు ఏమి
జరిగిందో చూడండి. తప్పకుండా యుద్ధము చేస్తారని వారు అర్థం చేసుకుంటారు. యుద్ధము
కొనసాగుతూనే ఉంటుంది. ఒకరికొకరు సహాయకులుగా అవుతూ ఉంటారు. మీకు కొత్త ప్రపంచము
కావాలి, కావున పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవ్వాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది, అందుకే ఈ ప్రపంచాన్ని సన్యసించాలి.
ప్రపంచాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు, కానీ దీనిని బుద్ధితో మర్చిపోవాలి.
2. నిర్వాణధామంలోకి వెళ్ళేందుకు పూర్తిగా పావనముగా అవ్వాలి. రచన యొక్క
ఆదిమధ్యాంతాలను పూర్తిగా అర్థం చేసుకొని కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందాలి.
వరదానము:-
ఏ ఆత్మకైనా ప్రాప్తుల అనుభూతిని కలిగించే యథార్థ సేవాధారీ భవ
యథార్థ సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన,
శ్రేష్ఠ కామనతో కూడిన భావము. సేవా భావము అనగా ప్రతి ఆత్మకు భావన అనుసారంగా ఫలాన్ని
ఇవ్వడము. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తుల ఫలాన్ని అనుభవం చేయించడము. ఇటువంటి సేవలో
తపస్య కూడా దానితోపాటుగా ఉంటుంది. ఎక్కడైతే యథార్థ సేవా భావము ఉంటుందో, అక్కడ తపస్యా
భావము వేరుగా ఉండదు. ఏ సేవలోనైతే త్యాగము, తపస్య ఉండదో, అది నామమాత్రపు సేవ, అందుకే
త్యాగము, తపస్య మరియు సేవ యొక్క కంబైండ్ రూపము ద్వారా సత్యమైన యథార్థ సేవాధారులుగా
అవ్వండి.
స్లోగన్:-
నమ్రత
మరియు ఓర్పు అనే గుణాలను ధారణ చేసినట్లయితే క్రోధాగ్ని కూడా శాంతిస్తుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
ఇప్పుడు నిర్భయులుగా,
జ్వాలాముఖులుగా అయి ప్రకృతిలో మరియు ఆత్మలలో ఏదైతే తమోగుణము ఉందో, దానిని భస్మము
చేయండి. తపస్య అనగా జ్వాలా స్వరూపపు స్మృతి. ఈ స్మృతి ద్వారానే మాయ మరియు ప్రకృతి
యొక్క వికరాల రూపము శీతలమైపోతుంది. మీ మూడవ నేత్రము, జ్వాలాముఖీ నేత్రము మాయను
శక్తిహీనముగా చేసేస్తుంది.
| | |