ఓంశాంతి
విచిత్రుడైన ఆత్మిక తండ్రి కూర్చుని విచిత్రులైన పిల్లలకు అర్థం చేయిస్తారు అనగా
దూరదేశములో ఉండేవారు, ఎవరినైతే పరమపిత పరమాత్మ అని అంటారో, వారు అర్థం చేయిస్తారు.
వారు చాలా, చాలా దూరదేశము నుండి వచ్చి ఈ శరీరము ద్వారా మిమ్మల్ని చదివిస్తారు.
ఇప్పుడు ఎవరైతే చదువుతారో వారు చదివించేవారితో ఆటోమేటిక్ గా యోగాన్ని పెట్టుకుంటారు.
వారికి, ఓ పిల్లలూ, టీచరుతో యోగాన్ని పెట్టుకోండి లేక వారిని స్మృతి చేయండి అని
చెప్పవలసిన అవసరం ఉండదు. అలా ఉండదు. ఇక్కడ తండ్రి అంటారు - ఓ ఆత్మిక పిల్లలూ, వీరు
మీ తండ్రి కూడా, టీచరు కూడా మరియు గురువు కూడా, వీరితో యోగాన్ని పెట్టుకోండి అనగా
తండ్రిని స్మృతి చేయండి. వీరు విచిత్రుడైన బాబా. మీరు ఘడియ-ఘడియ వీరిని మర్చిపోతారు,
అందుకే చెప్పవలసి వస్తుంది. చదివించేవారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు
భస్మమైపోతాయి. నన్నే చూడండి, అందులో ఎంతో లాభము ఉంది అని టీచర్ చెప్పడమనేది ‘లా’లో
లేదు. కేవలం నన్నే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఈ స్మృతి బలము ద్వారానే మీ
పాపాలు అంతమవ్వనున్నాయి, దీనినే స్మృతియాత్ర అని అంటారు. ఇప్పుడు విచిత్రుడైన
ఆత్మిక తండ్రి పిల్లలను చూస్తారు. పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
విచిత్రుడైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరైతే ఘడియ-ఘడియ శరీరములోకి వస్తారు. నేనైతే
మొత్తం కల్పమంతటిలోనూ శరీరములోకి రాను, కేవలం ఈ సంగమయుగములోనే పిల్లలైన మిమ్మల్ని
చదివించేందుకు చాలా దూరదేశము నుండి వస్తాను. దీనిని బాగా గుర్తుంచుకోవాలి. బాబా మనకు
తండ్రి, టీచరు మరియు సద్గురువు. వారు విచిత్రుడు. వారికి తన శరీరమంటూ లేదు, మరి వారు
ఎలా వస్తారు? వారు అంటారు, నేను ప్రకృతిని, నోటిని ఆధారముగా తీసుకోవలసి ఉంటుంది.
నేను అయితే విచిత్రుడిని, మీరందరూ చిత్రము కలిగినవారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి
కదా. గుర్రపు బండిలో అయితే రాను కదా. తండ్రి అంటారు, నేను ఈ తనువులోకి ప్రవేశిస్తాను,
ఎవరైతే నంబరు వన్ గా ఉన్నారో, వారే మళ్ళీ చివరి నంబరువారుగా అవుతారు. ఎవరైతే
సతోప్రధానముగా ఉండేవారో, వారే తమోప్రధానముగా అవుతారు. కావున మళ్ళీ వారినే
సతోప్రధానముగా తయారుచేయడానికి తండ్రి చదివిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ రావణ
రాజ్యములో పంచ వికారాలపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా పిల్లలైన మీరే తయారవ్వాలి.
పిల్లలూ, మిమ్మల్ని విచిత్రుడైన తండ్రి చదివిస్తున్నారు అని మీరు గుర్తుంచుకోవాలి.
తండ్రిని స్మృతి చేయకపోతే పాపాలు ఎలా భస్మమవుతాయి. ఈ విషయాలను కూడా కేవలం ఇప్పుడు ఈ
సంగమయుగములోనే వింటారు. ఒకసారి ఏదైతే జరుగుతుందో మళ్ళీ కల్పము తర్వాత అదే రిపీట్
అవుతుంది. ఇది ఎంత మంచి వివరణ. ఇందులో చాలా విశాలబుద్ధి కావాలి. ఇది సాధు-సన్యాసులు
మొదలైనవారి సత్సంగమేమీ కాదు. వారిని తండ్రి అని కూడా అంటారు, అలాగే కొడుకు అని కూడా
అంటారు. వీరు మాకు తండ్రి కూడా మరియు కొడుకు కూడా అని మీకు తెలుసు. మనము అంతా ఈ
కొడుకుకు వారసత్వముగా ఇచ్చి మళ్ళీ తండ్రి నుండి 21 జన్మల కొరకు వారసత్వాన్ని
తీసుకుంటాము. మనం చెత్తనంతటినీ ఇచ్చి మళ్ళీ తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని
తీసుకుంటాము. ఏమంటారంటే - బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీపై తనువు, మనస్సు, ధనముల
సహితముగా బలిహారమైపోతాము అని మేము భక్తి మార్గములో అన్నాము. లౌకిక తండ్రి కూడా
పిల్లలపై బలిహారమవుతారు కదా. ఇక్కడ మీకు ఎటువంటి విచిత్రుడైన తండ్రి లభించారు,
వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి మరియు మీరు మీ ఇంటికి
వెళ్ళిపోతారు. ఇది ఎంత పెద్ద యాత్ర. తండ్రి ఎక్కడకు వస్తారో చూడండి! పాత రావణ
రాజ్యములోకి వస్తారు. తండ్రి అంటారు, నా భాగ్యములో పావన శరీరము లభించడమనేదే లేదు,
నేను పతితులను పావనముగా తయారుచేయడానికి ఎలా రాను, నేనైతే పతిత ప్రపంచములోకే వచ్చి
అందరినీ పావనముగా తయారుచేయవలసి ఉంటుంది. మరి ఇటువంటి టీచరు పట్ల గౌరవాన్ని కూడా
ఉంచాలి కదా. వారికి గౌరవాన్ని ఇవ్వడము కూడా తెలియనివారు ఎందరో ఉన్నారు. ఇది కూడా
డ్రామాలో జరిగేదే ఉంది. రాజధానిలో అయితే నంబరువారుగా అందరూ కావాలి కదా. కావున
అన్నిరకాలవారూ ఇక్కడే తయారవుతారు. తక్కువ పదవి పొందేవారి పరిస్థితి ఇలా ఉంటుంది.
వారు చదవరు, అలాగే తండ్రి స్మృతిలోనూ ఉండరు. వీరు చాలా విచిత్రుడైన తండ్రి కదా, వీరి
నడవడిక కూడా అలౌకికముగా ఉంటుంది. వీరి పాత్ర ఇంకెవరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీకు
ఎంత ఉన్నతమైన చదువును చదివిస్తారు, కావున వారి పట్ల గౌరవాన్ని కూడా ఉంచాలి, వారి
శ్రీమతముపై నడుచుకోవాలి. కానీ మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది. మాయ ఎంత
శక్తివంతమైనదంటే అది మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. తండ్రి ఎంత ధనవంతులుగా
తయారుచేస్తారు కానీ మాయ పూర్తిగా ముఖాన్నే తిప్పేస్తుంది. మాయ నుండి సురక్షితముగా
ఉండాలనుకుంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రికి చెందినవారిగా అయి
మళ్ళీ మాయకు చెందినవారిగా అయిపోయే మంచి పిల్లలు కూడా ఎందరో ఉన్నారు, ఇక అడగకండి,
పూర్తి ద్రోహులుగా అయిపోతారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. ఏనుగును మొసలి
తిన్నట్లుగా వర్ణన కూడా ఉంది కదా. కానీ దాని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి
ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారు కూడా,
కానీ నంబరువారు పురుషార్థానుసారముగా. కొందరికైతే కొద్దిగా కూడా ధారణ జరగదు. ఇది చాలా
ఉన్నతమైన చదువు కదా, కావున దీనిని ధారణ చేయలేరు. ఇక వారి భాగ్యములో రాజ్యభాగ్యము
లేదు అని తండ్రి అంటారు. కొందరు జిల్లేడు పుష్పాల వలె ఉన్నారు, కొందరు సుగంధమయమైన
పుష్పాల వలె ఉన్నారు. ఇది వెరైటీ పూలతోట కదా. అటువంటివారు కూడా కావాలి కదా.
రాజధానిలో మీకు నౌకర్లు కూడా లభిస్తారు. లేకపోతే మరి నౌకర్లు ఎలా లభిస్తారు. రాజ్యము
ఇక్కడే తయారవుతుంది. నౌకర్లు, చండాలురు మొదలైనవారందరూ లభిస్తారు. ఇక్కడ రాజధాని
స్థాపన అవుతోంది. ఇది ఒక విచిత్రము. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు,
మరి అటువంటి తండ్రిని స్మృతి చేస్తూ, ఆ ప్రేమలో అశృవులు రావాలి.
మీరు మాలలోని మణులుగా అవుతారు కదా. ఏమంటారంటే, బాబా, మీరు ఎంత విచిత్రమైనవారు,
మీరు ఏ విధముగా వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా తయారుచేయడానికి చదివిస్తారు. భక్తి
మార్గములో శివుడిని పూజిస్తారు కానీ వారు పతిత-పావనుడు అని ఏమీ అర్థం చేసుకోరు,
అయినా కానీ - ఓ పతిత పావనా రండి, వచ్చి మమ్మల్ని పుష్పాల వలె దేవీ-దేవతలుగా
తయారుచేయండి అని పిలుస్తూనే ఉంటారు. పిల్లల ఆజ్ఞను తండ్రి స్వీకరిస్తారు మరియు వారు
ఎప్పుడైతే వస్తారో అప్పుడు అంటారు, పిల్లలూ, పవిత్రముగా అవ్వండి. ఈ విషయములోనే
హంగామాలు జరుగుతాయి. తండ్రి అద్భుతమైనవారు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు
అంతమవుతాయి అని పిల్లలకు చెప్తారు. నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను అని తండ్రికి
తెలుసు. అన్నీ ఆత్మయే చేస్తుంది, వికర్మలు కూడా ఆత్మయే చేస్తుంది. ఆత్మయే శరీరము
ద్వారా అనుభవిస్తుంది. మీ కోసమైతే న్యాయ సభ కూర్చుంటుంది. విశేషముగా ఏ పిల్లలైతే
సేవా యోగ్యులుగా అయి మళ్ళీ ద్రోహులుగా అయిపోతారో వారి కోసము కూర్చుంటుంది. మాయ ఏ
విధంగా మింగేస్తుంది అనేది తండ్రికే తెలుసు. బాబా, మేము ఓడిపోయాము, నల్ల ముఖము
చేసేసుకున్నాము... ఇప్పుడు క్షమించండి అని అంటారు. మీరు పడిపోయారు, మాయకు
చెందినవారిగా అయిపోయారు, ఇక అందులో క్షమించడమనేది ఏముంది? అటువంటివారికైతే ఇక చాలా,
చాలా కృషి చేయవలసి ఉంటుంది. మాయతో ఓడిపోయేవారు ఎందరో ఉన్నారు. తండ్రి అంటారు -
ఇక్కడ తండ్రి వద్ద దానమును ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి తీసుకోకూడదు, లేకపోతే అది
అంతమైపోతుంది. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానమునిచ్చిన తర్వాత ఇక చాలా
జాగ్రత్తగా ఉండాలి. దానిని మళ్ళీ తీసుకున్నట్లయితే 100 రెట్ల దండన పడుతుంది, అప్పుడు
చాలా చిన్న పదవిని పొందుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోందని పిల్లలకు తెలుసు. ఇతర
ధర్మాలను ఎవరైతే స్థాపన చేస్తారో, వారికి మొదట రాజ్యము ఉండదు. ఎప్పుడైతే 50-60
కోట్లమంది ఉంటారో అప్పుడే సైన్యము తయారవుతుంది, అప్పుడు రాజ్యము ఏర్పడగలదు.
ప్రారంభములో ఒకరిద్దరే వస్తారు, తర్వాత మెల్లగా వృద్ధి పొందుతారు. క్రైస్టు కూడా ఏదో
ఒక వేషములో వస్తారని మీకు తెలుసు. బికారి రూపములో ఉన్న మొదటి నంబరువారు మళ్ళీ
తప్పకుండా చివరి నంబరులో ఉంటారు. క్రైస్టు తప్పకుండా ఈ సమయములో బికారి రూపములో
ఉన్నారు అని క్రిస్టియన్లు కూడా వెంటనే అంటారు. పునర్జన్మలనైతే తీసుకోవలసిందే అని
అర్థం చేసుకుంటారు. తమోప్రధానముగా అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ అవ్వవలసిందే. ఈ
సమయములో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానముగా శిథిలావస్థలో ఉంది. ఈ పాత ప్రపంచ వినాశనము
తప్పకుండా జరగనున్నది. క్రిస్టియన్లు కూడా ఏమంటారంటే - క్రైస్టుకు 3000 సంవత్సరాల
క్రితం స్వర్గముండేది, అది మళ్ళీ తప్పకుండా ఇప్పుడు వస్తుంది. కానీ ఈ విషయాలను ఎవరు
అర్థం చేయించాలి. తండ్రి అంటారు, పిల్లలకు ఇప్పుడు ఆ అవస్థ ఎక్కడ ఉంది, మేము యోగములో
ఉండలేకపోతున్నాము అని పదే-పదే వ్రాస్తూ ఉంటారు. పిల్లల నడవడిక ద్వారా అర్థం
చేసుకుంటారు. తండ్రికి సమాచారాన్ని ఇవ్వడానికి కూడా భయపడతారు. తండ్రి అయితే పిల్లలను
ఎంతగా ప్రేమిస్తారు. ప్రేమతో నమస్కారము చేస్తారు. కానీ పిల్లలలో అహంకారము ఉంటుంది.
మంచి-మంచి పిల్లలను మాయ మరపింపజేస్తుంది. తండ్రి అర్థం చేసుకోగలరు. వారు అంటారు,
నేను జ్ఞాన సాగరుడిని. నేను అన్నీ తెలిసినవాడిని అంటే అందరి లోపలా ఏముందో తెలుసు అని
అర్థము కాదు. నేను చదివించేందుకు వచ్చాను, అంతేకానీ అందరి మనసులలో ఏముందో చదవడానికి
కాదు. నేను ఎవరి మనసులను చదవను, అలాగే ఈ సాకారుడు కూడా అలా చదవరు. ఇతను అన్నింటినీ
మర్చిపోవాలి కావున ఇక ఇతరుల మనసులను ఏం చదువుతారు. మీరు ఇక్కడ చదువుకునేందుకే
వస్తారు. భక్తి మార్గమే వేరు. మరి కింద పడిపోయేందుకు కూడా ఇలాంటి ఉపాయము కావాలి కదా.
ఈ విషయాల వల్లనే మీరు కింద పడిపోతారు. ఈ డ్రామా ఆట తయారై ఉంది. భక్తి మార్గములో
శాస్త్రాలను చదువుతూ, చదువుతూ మీరు కిందకు దిగుతూ తమోప్రధానముగా అవుతారు. ఇప్పుడు
మీరు ఈ ఛీ-ఛీ ప్రపంచములో అసలు ఏ మాత్రము ఉండేది లేదు. కలియుగము నుండి మళ్ళీ
సత్యయుగము రానున్నది. ఇప్పుడు ఇది సంగమయుగము. ఈ విషయాలన్నింటినీ ధారణ చేయాలి. తండ్రే
అర్థం చేయిస్తారు, మిగతా ప్రపంచంలోని వారందరి బుద్ధికి గోద్రేజ్ తాళం వేసి ఉంది.
వీరు దైవీ గుణాలు కలవారని, వీరే మళ్ళీ ఆసురీ గుణాలు కలవారిగా అయ్యారని మీరు అర్థం
చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడిక భక్తి మార్గపు విషయాలన్నింటినీ
మర్చిపోండి. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి, చెడును వినకండి...
ఇప్పుడు నా ఒక్కరి నుండే వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తీరాన్ని చేర్చేందుకు
వచ్చాను.
మీరు ఈశ్వరీయ సాంప్రదాయము వారు. మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖ కమలము నుండి
జన్మించారు కదా. ఇంతమంది దత్తత తీసుకోబడ్డ పిల్లలు ఉన్నారు. వారిని ఆదిదేవ్ అని
అంటారు. అలాగే మహావీర్ అని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులు కదా - మీరు
యోగబలముతో మాయపై విజయాన్ని పొందుతారు. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు.
జ్ఞానసాగరుడైన తండ్రి మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను పళ్ళాలు నింపుగా ఇస్తారు.
మిమ్మల్ని సుసంపన్నులుగా తయారుచేస్తారు. ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో వారు
ఉన్నత పదవిని పొందుతారు, ఎవరైతే ధారణ చేయరో వారు తప్పకుండా తక్కువ పదవిని పొందుతారు.
తండ్రి నుండి మీరు అపారమైన ఖజానాను పొందుతారు. అల్లా అవల్దీన్ కథ కూడా ఉంది కదా.
అక్కడ మనకు ఎటువంటి అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదని మీకు తెలుసు. 21 జన్మల కొరకు
తండ్రి వారసత్వాన్ని ఇచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.
హద్దులోని వారసత్వము లభించినా కూడా అనంతమైన తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు - ఓ
పరమాత్మా, దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు. వారు ఏమి దానము ఇవ్వనున్నారు
అనేది ఎవరికీ తెలియదు. బాబా అయితే మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారని ఇప్పుడు
మీరు అర్థం చేసుకుంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన అని చిత్రాలలో కూడా ఉంది, బ్రహ్మా
సాధారణ రీతిలో ఎదురుగా కూర్చొని ఉన్నారు. స్థాపన చేస్తే తప్పకుండా మరి వారినే
తయారుచేస్తారు కదా. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. మీరు పూర్తిగా అర్థం
చేయించలేరు. భక్తి మార్గములో శంకరుని ఎదురుగా వెళ్ళి మా జోలెను నింపండి అని అంటారు.
ఆత్మ అంటుంది - మేము నిరుపేదలుగా ఉన్నాము, మా జోలెను నింపండి, మమ్మల్ని ఈ విధంగా
తయారుచేయండి అని. ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు. మేమైతే నరుని నుండి
నారాయణునిగా అవ్వాలనుకుంటున్నాము అని అంటారు. ఈ చదువే నరుని నుండి నారాయణునిగా
తయారుచేసేటువంటిది. పాత ప్రపంచములోకి రావాలని ఎవరికి మనసు కలుగుతుంది! కానీ కొత్త
ప్రపంచములోకి అయితే అందరూ రారు. కొందరు 25 శాతం పాతగా అయ్యాక వస్తారు, ఎంతోకొంత
లోపమైతే ఏర్పడుతుంది కదా. మీరు కొద్దిగా అయినా ఇతరులకు సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే
మీరు స్వర్గానికి యజమానులుగా తప్పకుండా అవుతారు. ఇప్పుడు అందరూ నరకానికి యజమానులుగా
కూడా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. అక్కడ
డబుల్ కిరీటధారులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. ఈ రోజుల్లోనైతే ధర్మము
మొదలైనవాటిని ఎవరూ విశ్వసించరు. దేవీ-దేవతా ధర్మమే అంతమైపోయింది. రిలీజియన్ ఈజ్ మైట్
(ధర్మములో శక్తి ఉంది) అన్న గాయనము కూడా ఉంది. ధర్మాన్ని విశ్వసించని కారణముగా శక్తి
లేకుండా పోయింది. తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరే పూజ్యుల
నుండి పూజారులుగా అవుతారు. 84 జన్మలను తీసుకుంటారు కదా. బ్రాహ్మణులమైన మనమే మళ్ళీ
దేవతలుగా, క్షత్రియులుగా... అవుతాము. బుద్ధిలోకి ఈ చక్రమంతా వస్తుంది కదా. ఈ 84
జన్మల చక్రములో మనము తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి.
అక్కడకు పతితులు ఎవ్వరూ వెళ్ళలేరు. ఆత్మయే పతితముగా మరియు పావనముగా అవుతుంది.
బంగారములో మాలిన్యము కలుస్తుంది కదా. నగలో కలవదు. ఇది జ్ఞాన అగ్ని, దీని ద్వారా
మొత్తం మాలిన్యము అంతా తొలగిపోయి మీరు స్వచ్ఛమైన బంగారముగా అయిపోతారు, అప్పుడు నగ
కూడా మీకు మంచిది లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితముగా ఉంది కావున పావనమైనవారి ముందు
నమస్కారం చేస్తారు. చేసేది అయితే అంతా ఆత్మయే కదా. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు
- పిల్లలూ, కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది,
పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడిక ఎవరు ఎంత పురుషార్థం
చేస్తే అంత. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన
తండ్రి. స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు సంగమయుగములోనే తండ్రి వస్తారు. కావున
ఇటువంటి తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది కదా. విద్యార్థులు ఎప్పుడైనా టీచరును
మర్చిపోతారా! కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది
యుద్ధ మైదానము కదా. తండ్రి అంటారు, ఇప్పుడిక వికారాలలోకి వెళ్ళకండి, అశుద్ధముగా
అవ్వకండి. ఇప్పుడైతే స్వర్గములోకి వెళ్ళాలి. పవిత్రముగా అయ్యే పవిత్రమైన కొత్త
ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇదేమైనా
తక్కువ విషయమా. కేవలం ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి. ఇప్పుడు పవిత్రముగా అవ్వకపోతే
ఇక కింద పడిపోతారు. ప్రలోభాలు ఎంతగానో ఉన్నాయి. కామముపై విజయాన్ని పొందడం ద్వారా
మీరు జగత్తుకు యజమానులుగా అవుతారు. పరమపిత పరమాత్మయే జగత్ గురువు కావున వారు మొత్తం
జగత్తు అంతటికీ సద్గతిని ఇస్తారు అని మీరు స్పష్టముగా చెప్పవచ్చు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.