‘‘స్మృతి స్వరూపులుగా, అనుభవీ మూర్తులుగా అయ్యి
క్షణము యొక్క తీవ్రగతితో పరివర్తన చేసి పాస్ విత్ ఆనర్ గా
అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలలో మూడు విశేష భాగ్య
రేఖలను మస్తకములో మెరుస్తున్నట్లు చూస్తున్నారు. అందరి
మస్తకములు భాగ్యరేఖలతో మెరుస్తూ ఉన్నాయి. ఒకటి - పరమాత్మ పాలన
యొక్క భాగ్య రేఖ. రెండవది - శ్రేష్ఠమైన శిక్షకుని ద్వారా
శిక్షణ యొక్క భాగ్య రేఖ. మూడవది - సద్గురువు ద్వారా శ్రీమతమనే
భాగ్య రేఖ. ఆ మాటకొస్తే మీ భాగ్యము అపారమైనది, అయినా కూడా ఈ
రోజు విశేషముగా ఈ మూడు రేఖలను చూస్తున్నారు. మీరు కూడా మీ
మస్తకములో మెరుస్తూ ఉన్న రేఖలను అనుభవము చేస్తున్నారు కదా!
అన్నింటికన్నా శ్రేష్ఠమైనది పరమాత్మ ప్రేమ యొక్క పాలనా రేఖ. ఏ
విధంగా బాబా ఉన్నతోన్నతమైనవారో అలాగే పరమాత్మ పాలన కూడా
ఉన్నతోన్నతమైనది. ఈ పాలన ఎంత కొద్దిమందికి ప్రాప్తిస్తుంది,
కానీ మీరందరూ ఈ పాలనకు పాత్రులుగా అయ్యారు. ఈ పాలన మొత్తము
కల్పములో పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే ప్రాప్తిస్తుంది.
ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ ప్రాప్తించదు. ఈ పరమాత్మ పాలన,
పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తులు కోట్లలో కొద్దిమంది ఆత్మలకు
మాత్రమే అనుభవమవుతాయి. మీరందరూ అనుభవజ్ఞులే కదా! అనుభవముందా?
పాలన యొక్క అనుభవము కూడా ఉందా? చదువు మరియు శ్రీమతము యొక్క
అనుభవము కూడా ఉందా? అనుభవీ మూర్తులేనా? మరి సదా మీ మస్తకములో ఈ
భాగ్య సితార మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుందా? సదా మెరుస్తూ
ఉన్నట్లు కనిపిస్తుందా? లేదా అప్పుడప్పుడు మెరుస్తున్న సితార
డల్ గా కూడా అయిపోతుందా? ఢీలాగా అవ్వకూడదు. ఒకవేళ మెరుస్తూ
ఉన్న సితార ఢీలాగా అవుతుందంటే దానికి కారణమేమిటి? తెలుసా?
బాప్ దాదా చూసారు, కారణమేమిటంటే - స్మృతి స్వరూపులుగా
అవ్వలేదు. నేను ఆత్మను అని ఆలోచిస్తారు, అలా ఆలోచనా స్వరూపులుగా
అవుతారు కానీ స్మృతి స్వరూపులుగా తక్కువగా అవుతారు.
ఎప్పటివరకైతే స్మృతి స్వరూపులుగా సదా అవ్వరో అప్పటివరకు సమర్థత
రాదు. స్మృతియే సమర్థతను అందిస్తుంది. స్మృతి స్వరూపులే సమర్థ
స్వరూపులు. అది లేని కారణముగానే భాగ్య సితార తక్కువగా
మెరుస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - ఎక్కువ సమయము
ఆలోచనా స్వరూపముగా అవుతున్నానా లేక స్మృతి స్వరూపముగా
అవుతున్నానా? ఆలోచనా స్వరూపముగా అవ్వటము ద్వారా - నేను అది,
నేను ఇది, నేను అది... అని చాలా బాగా ఆలోచిస్తారు, కానీ స్మృతి
స్వరూపులుగా లేని కారణముగా బాగా ఆలోచించినా కూడా వాటిలో వ్యర్థ
సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కలిసిపోతాయి. వాస్తవానికి
చూసినట్లయితే మీ అనాది స్వరూపము - స్మృతి సో సమర్థ స్వరూపమే,
అంతేకానీ ఆలోచనా స్వరూపము కాదు. అలాగే ఆదిలో కూడా ఈ సమయములోని
స్మృతి స్వరూపము యొక్క ప్రారబ్ధము ప్రాప్తిస్తుంది. కనుక అనాది
మరియు ఆదిలో స్మృతి స్వరూపులుగా ఉన్నారు మరియు ఈ సమయములో
అంతిమములో సంగమ సమయములో కూడా స్మృతి స్వరూపులుగా అవుతారు. కనుక
ఆది, అనాది మరియు అంతిమము, మూడు కాలాలలోనూ స్మృతి స్వరూపులుగా
ఉన్నారు. ఆలోచనా స్వరూపులుగా కాదు. అందుకే బాప్ దాదా ఇంతకుముందు
కూడా చెప్పారు - వర్తమాన సమయములో అనుభవీ మూర్తులుగా అవ్వటమే
శ్రేష్ఠమైన స్టేజ్. నేను ఆత్మను, పరమాత్మ ప్రాప్తి ఉంది అని
ఆలోచిస్తారు, కానీ తెలుసుకోవటానికి మరియు అనుభవము చెయ్యటానికి
మధ్యన చాలా తేడా ఉంది. అనుభవీ మూర్తులు ఎప్పుడూ కూడా మాయతో
మోసపోలేరు, అలాగే వారు దుఃఖము యొక్క అనుభూతిని కూడా చేయలేరు.
మధ్యమధ్యలో ఈ మాయ ఆటలేవైతే చూస్తూ ఉంటారో, లేక ఆడుతూ ఉంటారో,
వాటికి కారణమేమిటంటే - అనుభవీ మూర్తులుగా అవ్వటములో లోపము.
అనుభవమనే అథారిటీ అన్నింటికంటే శ్రేష్ఠమైనది. బాప్ దాదా చూసారు
- చాలామంది పిల్లలు ఆలోచిస్తారు కానీ ఆ స్వరూపము యొక్క అనుభూతి
తక్కువగా ఉంటుంది.
నేటి ప్రపంచములో మెజారిటీ ఆత్మలు చూడటములో, వినటములో
అలసిపోయి ఉన్నారు, వారు అనుభవము ద్వారా ప్రాప్తి చేసుకోవాలని
కోరుకుంటున్నారు. మరి అనుభవము చేయించటమంటే అది అనుభవీలే
చేయించగలరు. అంతేకాక అనుభవీ ఆత్మ సదా ముందుకు వెళ్తూ ఉంటుంది,
ఎగురుతూ ఉంటుంది, ఎందుకంటే అనుభవీ ఆత్మలో ఉల్లాస-ఉత్సాహాలు సదా
ఇమర్జ్ రూపములో ఉంటాయి. కనుక చెక్ చేసుకోండి - ప్రతి పాయింట్
యొక్క అనుభవీ మూర్తులుగా అయ్యారా? అనుభవము యొక్క అథారిటీ మీ
ప్రతి కర్మలోనూ కనిపిస్తుందా? ప్రతి మాట, ప్రతి సంకల్పము
అనుభవము యొక్క అథారిటీతో ఉన్నాయా లేక కేవలం అర్థం చేసుకున్న
ఆధారముపైనే ఉన్నాయా? ఒకటి అర్థం చేసుకోవటము, మరొకటి అనుభవము
చెయ్యటము. ప్రతి సబ్జెక్టులోనూ అనుభవీమూర్తులుగా అవ్వాలి.
జ్ఞానము యొక్క పాయింట్లను వర్ణించే విషయములోనైతే బయటి
ఉపన్యాసకులు కూడా చాలా బాగా ఉపన్యాసమిస్తారు, కానీ ప్రతి
పాయింట్ యొక్క అనుభవీ స్వరూపులుగా అవ్వాలి, వారే జ్ఞాన స్వరూప
ఆత్మలు. అలాగే యోగాన్ని జోడించేవారు చాలామంది ఉన్నారు, యోగములో
కూర్చునేవారు చాలామంది ఉన్నారు, కానీ యోగాన్ని అనుభవము చెయ్యటము
అనగా శక్తి స్వరూపులుగా అవ్వటము. శక్తి స్వరూపులుగా ఉన్నారు
అన్నదానికి గుర్తు ఏమిటంటే - ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరము
ఉంటుందో, ఆ సమయములో ఆ శక్తిని ఆహ్వానించి నిర్విఘ్న స్వరూపులుగా
అవ్వాలి. ఒకవేళ ఒక్క శక్తి తక్కువగా ఉన్నా కూడా, దానిని వర్ణన
చేస్తున్నారు కానీ స్వరూపులుగా అవ్వటము లేదంటే మరి అవసరమైన
సమయములో మోసపోగలరు. ఉదాహరణకు అక్కడ అవసరమైనది సహనశక్తి కానీ ఆ
సమయములో మీరు ఎదుర్కొనే శక్తిని ఉపయోగిస్తే, వారిని యోగయుక్త
అనుభవీ స్వరూపులు అని అనరు. నాలుగు సబ్జెక్టులలోనూ స్మృతి
స్వరూపులు మరియు అనుభవీ స్వరూపుల యొక్క గుర్తులు ఏముంటాయి?
స్థితిలో నిమిత్త భావము, వృత్తిలో సదా శుభ భావము, ఆత్మిక భావము,
నిస్వార్థ భావము. వాయుమండలములో మరియు సంబంధ-సంపర్కాలలో సదా
నిర్మాన భావము, వాణిలో సదా నిర్మల వాణి. అనుభవీ మూర్తులకు ఈ
విశేషతలు అన్ని వేళలా నేచురల్ నేచర్ గా ఉంటాయి. నేచురల్ నేచర్
(సహజ స్వభావము). ఇప్పుడు కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు ఏమంటూ
ఉంటారంటే - నేను ఇలా చెయ్యాలని అనుకోలేదు, కానీ అది నా పాత
నేచర్ (స్వభావము). స్వభావము ఏదైతే ఉంటుందో అదే సహజముగా పని
చేస్తుంది. ఆలోచించాల్సిన అవసరముండదు, కానీ స్వభావమనేది
సహజముగానే పని చేస్తుంది. మరి స్వయాన్ని చెక్ చేసుకోండి - నా
న్యాచురల్ నేచర్ (సహజ స్వభావము) ఏమిటి. ఒకవేళ ఏదైనా పాత
స్వభావము అంశమాత్రము ఉన్నా కూడా ప్రతి సమయము అదే కార్యములోకి
వస్తూ-వస్తూ పక్కా సంస్కారముగా అయిపోతుంది. ఆ పాత నేచర్ ను,
పాత స్వభావాన్ని, పాత సంస్కారాలను సమాప్తము చేయాలని కూడా
కోరుకుంటారు కానీ చేయలేకపోతారు, దానికి కారణమేమిటి? నాలెడ్జ్
ఫుల్ గా అయితే అన్ని విషయాలలోనూ అయ్యారు, కానీ ఏదైతే జరగకూడదు
అని అనుకుంటున్నారో అది జరిగిపోతుంది, మరి దానికి కారణమేమిటి?
పరివర్తన చేసే శక్తి తక్కువగా ఉంది. మెజారిటీలో ఏం
కనిపిస్తుందంటే - పరివర్తనా శక్తిని అర్థం చేసుకుంటారు కూడా,
వర్ణన కూడా చేస్తారు, ఒకవేళ అందరినీ పరివర్తన శక్తి అన్న టాపిక్
పై వ్రాయమని చెప్తే లేక ఉపన్యాసమివ్వమని చెప్తే, బాప్ దాదాకు
తెలుసు, అందరూ చాలా తెలివైనవారు, చాలా బాగా ఉపన్యాసము కూడా
ఇవ్వగలరు, వ్రాయగలరు కూడా మరియు ఇతరులు ఎవరైనా వస్తే వారికి -
ఏం ఫర్వాలేదు, పరివర్తన చేసుకోండి అని చాలా బాగా అర్థం కూడా
చేయిస్తారు. కానీ స్వయంలో పరివర్తన చేసుకునే శక్తి ఎంతవరకు ఉంది!
వర్తమాన సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని ఇక పరివర్తన
అవ్వటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించకూడదు. క్షణములో పరివర్తనా
శక్తి ఉపయోగపడాలి. ఎందుకంటే - ఇది ఇలా జరగకూడదు అని
అర్థమవుతున్నప్పుడు, మరి అర్థమైనా కూడా ఒకవేళ పరివర్తన
చేసుకోలేకపోతున్నారంటే, దానికి కారణమేమిటి? ఆలోచిస్తారు, కానీ
స్వరూపులుగా అవ్వలేదు. మొత్తము రోజంతటిలో ఆలోచనా స్వరూపులుగా
ఎక్కువగా ఉంటారు, స్మృతి సో సమర్థ స్వరూపులుగా ఉండటములో
చాలావరకు తక్కువగా ఉన్నారు.
ఇప్పుడు ఇది తీవ్రగతి యొక్క సమయము, తీవ్ర పురుషార్థము యొక్క
సమయము, ఇది సాధారణ పురుషార్థము యొక్క సమయము కాదు. క్షణములో
పరివర్తన అవ్వటము అంటే అర్థము - స్మృతి స్వరూపము ద్వారా ఒక్క
క్షణములో నిర్వికల్పముగా అవ్వాలి, వ్యర్థ సంకల్పాలు
సమాప్తమైపోవాలి, ఎందుకని? సమయ సమాప్తిని సమీపముగా
తీసుకువచ్చేందుకు మీరు నిమిత్తులు. కనుక ఇప్పటి సమయము యొక్క
మహత్వము అనుసారముగా, ప్రతి అడుగులోనూ పదమాలు ఇమిడి ఉన్నాయి
అన్నది తెలుసు కూడా, కావున వాటిని పెంచుకోవాలి అన్నదైతే
బుద్ధిలో పెట్టుకుంటున్నారు కానీ వాటిని పోగొట్టుకునే విషయాన్ని
కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఒకవేళ అడుగులో పదమాలు జమ
అవుతున్నాయి అన్నప్పుడు మరి అడుగులో పదమాలను పోగొట్టుకుంటారు
కూడా కదా! అవునా, కాదా? కనుక ఇప్పుడు ‘ఒక్క నిమిషము’ అన్న సమయము
కూడా గడిచిపోయింది. ఒక్క నిమిషము సైలెన్స్ లో ఉండండి అని
ఇతరులకు చెప్తుంటారు, కానీ మీ కొరకైతే క్షణము యొక్క విషయముగా
అవ్వాలి. ఉదాహరణకు అవునా లేక కాదా అన్నది ఆలోచించటానికి ఎంత
సమయము పడుతుంది? ఒక్క క్షణము. అలా పరివర్తన శక్తి అంత వేగము
కలదిగా ఉండాలి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని అర్థమవుతుంది,
అప్పుడు మంచిది కాదు అంటే బిందువు పెట్టాలి మరియు మంచిది అంటే
ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. ఇప్పుడు బిందువు యొక్క
మహత్వాన్ని కార్యములో ఉపయోగించండి. మూడు బిందువుల గురించైతే
తెలుసు కదా! కానీ ఈ బిందువులను అవసరమైన సమయములో కార్యములో
ఉపయోగించండి. ఏ విధంగా సైన్స్ వారు అన్ని విషయాలను తీవ్రగతితో
చేస్తున్నారో మరియు పరివర్తనా శక్తిని కూడా కార్యములో ఎక్కువగా
ఉపయోగిస్తున్నారో, అలాగే సైలెన్స్ శక్తి కలవారు ఇప్పుడు
లక్ష్యము పెట్టుకోండి - ఒకవేళ పరివర్తన చేయాలి అంటే, నాలెడ్జ్
ఫుల్ గా అవ్వాలి అంటే, ఇప్పుడు క్షణము యొక్క వేగముతో పవర్ ఫుల్
గా (శక్తిశాలిగా) అవ్వండి. చేస్తున్నాము, అయిపోతుంది...
చేసేస్తాము... అని అనకూడదు. ఇది వీలవుతుందా లేక కష్టమా?
ఎందుకంటే చివరి సమయములో క్షణము యొక్క పరీక్ష వస్తుంది, నిమిషము
యొక్క పరీక్ష కాదు, కనుక క్షణము యొక్క అభ్యాసము బహుకాలము ఉంటే,
అప్పుడే క్షణములో పాస్ విత్ ఆనర్ గా అవుతారు కదా! పరమాత్ముని
విద్యార్థులు, పరమాత్ముని చదువును చదువుతున్నారు, మరి పాస్ విత్
ఆనర్ గా అవ్వాల్సిందే కదా! పాస్ మార్కులు తీసుకుంటే ఏమవుతుంది!
పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. ఏ లక్ష్యము పెట్టుకున్నారు? పాస్
విత్ ఆనర్ గా అవ్వాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు
చేతులెత్తండి, పాస్ విత్ ఆనర్ నా? ఆనర్ అన్న పదాన్ని అండర్ లైన్
చేయండి. అచ్ఛా. మరి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? మినిట్ మోటర్
(నిమిషములో తయారవ్వటము) అనేది మామూలు విషయమే, ఇప్పటిది క్షణము
యొక్క విషయము.
అవును, పంజాబ్ వారూ, చెప్పండి. ఇప్పుడు ఇది క్షణము యొక్క
విషయము. ఇందులో నంబర్ వన్ ఎవరు అవుతారు? పంజాబ్. ఇదేమంత పెద్ద
విషయము - అని ఎంత శుద్ధ గర్వముతో అంటారు, చాలా బాగా అంటారు,
నషాతో అంటారు. ఇది బాప్ దాదా విన్నప్పుడు చాలా సంతోషిస్తారు.
‘ఇదేమంత పెద్ద విషయము, బాప్ దాదా తోడుగా ఉన్నారు’ అని అంటారు.
తోడుగా అయితే అథారిటీ అయినవారు ఉన్నారు, మరి ఇప్పుడు ఏం
చెయ్యాలి? ఇప్పుడు తీవ్రతను పెంచాలి. సేవనైతే చేస్తున్నారు,
అయినా సేవ లేకపోతే ఇంకేమి చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? సేవ
అయితే బ్రాహ్మణాత్మల ధర్మము, కర్మ. కానీ ఇప్పుడు సేవతోపాటుగా
సమర్థ స్వరూపులుగా అవ్వాలి. సేవ పట్ల ఎంతైతే ఉల్లాస-ఉత్సాహాలను
చూపించారో, బాప్ దాదా సంతోషిస్తున్నారు, అందుకు అభినందనలు కూడా
ఇస్తున్నారు. కానీ ఎలా అయితే సేవా కిరీటము లభించిందో (యువ
పాదయాత్రికులు కిరీటము ధరించి కూర్చుని ఉన్నారు) కిరీటము ధరించి
ఉన్నారు, ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, ఇప్పుడు స్మృతి
స్వరూపులుగా అయ్యే కిరీటాన్ని ధరించి చూపించండి. యూత్ గ్రూప్
కదా! మరి ఏ అద్భుతము చేస్తారు? సేవలో కూడా నంబర్ వన్ మరియు
సమర్థ స్వరూపములో కూడా నంబర్ వన్ గా అవ్వాలి. సందేశము ఇవ్వటము
కూడా బ్రాహ్మణ జీవితము యొక్క ధర్మము మరియు కర్మనే, కానీ ఇప్పుడు
బాప్ దాదా సూచన ఇస్తున్నారు - పరివర్తనా మెషినరీని తీవ్రతరం
చెయ్యండి. లేదంటే పాస్ విత్ ఆనర్ గా అవ్వటము కష్టమైపోతుంది.
బహుకాలపు అభ్యాసము కావాలి. ఆలోచించారు మరియు చేసేసారు అన్నట్లు
ఉండాలి. కేవలం ఆలోచనా స్వరూపులుగా అవ్వకండి, సమర్థ స్మృతి నుండి
సమర్థ స్వరూపులుగా అవ్వండి. వ్యర్థాన్ని తీవ్రగతితో సమాప్తము
చెయ్యండి. వ్యర్థ సంకల్పాలను, వ్యర్థ మాటలను, వ్యర్థ కర్మలను,
వ్యర్థ సమయాన్ని మరియు సంబంధ-సంపర్కాలలో కూడా వ్యర్థ విధిని,
రీతిని అన్నింటినీ సమాప్తము చేయండి. ఎప్పుడైతే బ్రాహ్మణ ఆత్మలు
తీవ్రగతితో స్వయానికి సంబంధించిన ఈ వ్యర్థాన్ని సమాప్తము
చేస్తారో, అప్పుడు ఆత్మల నుండి ఆశీర్వాదాలను మరియు తమ పుణ్య
ఖాతాను తీవ్రగతితో జమ చేసుకుంటారు.
బాప్ దాదా మూడు ఖాతాలను చెక్ చేస్తారు అని బాప్ దాదా
ఇంతకుముందు కూడా వినిపించారు. పురుషార్థపు గతి యొక్క ఖాతా,
ఆశీర్వాదాల ఖాతా, పుణ్య ఖాతా. కానీ మెజారిటీ యొక్క ఖాతాలో
ఇప్పుడు నిండుతనము తక్కువగా ఉంది. అందుకే బాప్ దాదా ఈ రోజు ఇదే
స్లోగన్ ను గుర్తు చేయిస్తున్నారు - ఇప్పుడు తీవ్రతను పెంచండి,
తీవ్ర పురుషార్థీగా అవ్వండి, తీవ్రగతితో సమాప్తి చేసేవారిగా
అవ్వండి, తీవ్రగతితో మనసా ద్వారా వాయుమండలాన్ని పరివర్తన
చేసేవారిగా అవ్వండి.
బాప్ దాదా ఒక విషయములో పిల్లలందరినీ చూసి చాలా
సంతోషిస్తున్నారు కూడా. ఏ విషయములో? బాబాపై అందరికీ చాలా
గాఢమైన ప్రేమ ఉంది. ఇందుకు అభినందనలు. కానీ ఏం చెయ్యాలో
చెప్పమంటారా! ఈ సీజన్ యొక్క సమాప్తి లోపు, ఇప్పుడైతే ఇంకా
సమయముంది, ఈ సీజన్ యొక్క సమాప్తి లోపు తీవ్రగతితో ఏదో ఒక
ప్రతాపము చేసి చూపించండి. ఇష్టమేనా? ఇష్టమేనా? లక్ష్యము మరియు
లక్షణాలు, రెండింటినీ స్మృతిలో ఉంచుకుంటాము అని ఎవరైతే
భావిస్తున్నారో వారు చేతులెత్తండి. డబుల్ విదేశీయులు కూడా
లక్ష్యము పెట్టుకుంటారా, టీచర్లు కూడా పెట్టుకుంటారా మరియు యూత్
కూడా పెట్టుకుంటారా మరియు మొదటి లైన్ లోని వారు కూడా
పెట్టుకుంటారా! అయితే మరి ముందుగానే పదమాల, పదమాల, పదమాల రెట్లు
అభినందనలు. అచ్ఛా!
ఇప్పుడిప్పుడే ఈ అభ్యాసము చెయ్యండి - ఒక్క క్షణములో
నిర్వికల్పము, నిర్వ్యర్థ సంకల్పము కలవారిగా అయ్యి
ఏకాగ్రమవ్వండి, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈ ఒకే ఒక్క
సంకల్పములో ఏకాగ్రులై కూర్చోగలరా! మరే ఇతర సంకల్పము ఉండకూడదు.
ఒకే ఒక్క సంకల్పము యొక్క ఏకాగ్రతా శక్తి యొక్క అనుభవములో
కూర్చోండి. దీని కోసం సమయము పట్టకూడదు, ఒక్క క్షణము, అంతే.
అచ్ఛా!
నలువైపులా ఉన్న పిల్లలకు, ఎవరెవరైతే విశేష ప్రియస్మృతులను
పంపించారో, ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితముగా
ప్రియస్మృతులను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి.
మా స్మృతి కూడా, మా స్మృతి కూడా అని ప్రతి ఒక్కరికీ మనసులో
అనిపిస్తుంది అన్నది బాప్ దాదా చూస్తున్నారు. కానీ పిల్లలైన
మీరు సంకల్పము చేసినప్పుడు బాప్ దాదా వద్దకు ఆ సమయములోనే
చేరుకుంటుంది. అందుకే పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ, పేరు మరియు
విశేషత సహితముగా ప్రియస్మృతులను ఇస్తున్నారు.
సదా స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపులు అయిన అనుభవీ
స్వరూపులైన శ్రేష్ఠమైన పిల్లలకు, సదా ఏదైతే శుభము ఆలోచిస్తారో,
దానిని వెంటనే కర్మలోకి తీసుకువచ్చేవారికి, ఎలా అయితే త్వరిత
దానానికి మహత్వము ఉంటుందో అలాగే వెంటనే పరివర్తన
తీసుకువచ్చినదానికి కూడా మహత్వము ఉంటుంది, కావున అలా వెంటనే
పరివర్తన చేసే విశ్వ పరివర్తక పిల్లలకు, సదా పరమాత్మ పాలన,
పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు మరియు పరమాత్మ శ్రీమతాన్ని ప్రతి
కర్మలోకి తీసుకువచ్చే మహావీరులైన పిల్లలకు, సదా ధైర్యము మరియు
ఏకాగ్రత, ఏకత ద్వారా నంబర్ వన్ తీవ్ర పురుషార్థము చేసే పిల్లలకు
బాప్ దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు
హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు నమస్తే.
దాదీలతో - అందరూ మంచి పాత్రను పోషిస్తున్నారు. బాప్ దాదా
ప్రతి ఒక్కరి పాత్రను చూసి సంతోషిస్తారు. చిన్న-చిన్నవారు కూడా
మంచిగా పాత్రను పోషిస్తున్నారు. మేము చిన్నవారము కదా అని
భావించవద్దు. చిన్న పిల్లలు భగవంతునితో సమానమైనవారు అని అంటారు.
శక్తుల పాత్ర శక్తులది, పాండవుల పాత్ర పాండవులది. పాండవులు
లేకపోయినా కూడా పని జరగదు, శక్తులు లేకపోయినా కూడా పని జరగదు.
అందుకే భారత్ లో చతుర్భుజుని స్మృతిచిహ్నము ఉంది. వేరే ఏ ఇతర
ధర్మాలలోనూ చతుర్భుజ రూపాన్ని చూపించరు, కానీ భారత్ యొక్క
స్మృతిచిహ్నాలలో చతుర్భుజ రూపానికి మహత్వము ఉంది. కనుక ఇరువురూ
మంచి పాత్రను పోషిస్తున్నారు, కానీ ఇప్పుడు త్వరగా చెయ్యాలి,
అంతే. అప్పుడప్పుడు కాస్త ఢీలా అయిపోతారు. ఇప్పుడు ఢీలాగా
అయ్యేందుకు సమయము లేదు. రకరకాల విషయాలైతే ఉంటూనే ఉంటాయి. కానీ
మనము విషయాలలో ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకుని రహస్యయుక్తముగా,
యోగయుక్తముగా, స్నేహయుక్తముగా, సహయోగయుక్తముగా అయ్యి
నడుచుకోవాలి. సరేనా! (దాదీజీతో) చాలా బాగా అనిపిస్తుంది కదా?
చూడండి, ఎంతమంది వచ్చారు? ఎందుకు వచ్చారు? వీరందరూ ఎందుకు
వచ్చారు! మిమ్మల్ని కలిసేందుకు వచ్చారు. బాప్ దాదాను
కలవడానికైతే ఎలాగూ వచ్చారు కానీ దానితోపాటు దాదీలు లేకపోతే మజా
రాదు అని అంటారు కదా. అలాగే మీరందరూ లేకపోయినా కూడా మజా ఉండదు.