ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు అనగా భగవంతుడు ఆత్మిక
విద్యార్థులకు చదివిస్తున్నారు. ఆ స్కూళ్ళలో ఏ పిల్లలైతే చదువుకుంటారో, వారిని
ఆత్మిక విద్యార్థులని అనరు. వారు ఆసురీ వికారీ సాంప్రదాయానికి చెందినవారు.
ఇంతకుముందు మీరు కూడా ఆసురీ సాంప్రదాయానికి అనగా రావణ సాంప్రదాయానికి చెందినవారిగా
ఉండేవారు. ఇప్పుడు రామ రాజ్యములోకి వెళ్ళేందుకు పంచ వికారాల రూపీ రావణుడిపై విజయము
పొందే పురుషార్థాన్ని చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోనివారికి, మీరు
రావణ రాజ్యములో ఉన్నారని అర్థం చేయించవలసి ఉంటుంది. వారు స్వయము ఈ విషయము అర్థం
చేసుకోరు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మీరు మీ మిత్ర-సంబంధీకులు
మొదలైనవారితో చెప్తారు, దాని ద్వారా వారు నిశ్చయము ఏర్పరచుకుంటారని కాదు. ఎంతగా
తండ్రి అని చెప్పినా లేక భగవంతుడు అని చెప్పినా కూడా వారు నిశ్చయము ఏర్పరచుకోరు.
కొత్తవారికైతే ఇక్కడికి వచ్చేందుకు అనుమతి లేదు. లెటర్ లేకుండా లేక అడగకుండా ఎవ్వరూ
రాలేరు కూడా. కానీ అక్కడక్కడ కొంతమంది వచ్చేస్తుంటారు, ఇది కూడా నియమాన్ని
ఉల్లంఘించడమే. ఒక్కొక్కరి గురించి పూర్తి సమాచారము, వారి పేరు మొదలైనవి వ్రాసి,
వీరిని పంపించవచ్చా అని అడగాలి. అప్పుడు బాబా పంపించమని చెప్తారు. ఒకవేళ ఆసురీ పతిత
ప్రపంచములోని విద్యార్థులు ఉన్నట్లయితే వారికి తండ్రి ఇలా అర్థం చేయిస్తారు - ఆ
చదువునైతే వికారీ పతితులు చదివిస్తారు, దీనిని ఈశ్వరుడు చదివిస్తారు. ఆ చదువు ద్వారా
పైస అంత విలువ చేసే హోదా లభిస్తుంది. ఎవరైనా చాలా పెద్ద పరీక్షను పాస్ అయినా కూడా,
వారు ఎంతవరకని సంపాదిస్తూ ఉంటారు. వినాశనము అనేది ఎదురుగా నిలబడి ఉంది. ప్రకృతి
వైపరీత్యాలన్నీ కూడా రానున్నాయి. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు, ఎవరైతే అర్థం
చేసుకోరో వారిని బయట విజిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది
ఈశ్వరీయ చదువు, ఇందులో నిశ్చయబుద్ధి కలవారే విజయము పొందుతారు అనగా విశ్వముపై రాజ్యము
చేస్తారు. రావణ సాంప్రదాయము వారికైతే ఇది తెలియదు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రావడానికి లేదు. ఇదేమీ విహరించడానికి వచ్చే స్థానము
కాదు. ఇంకొద్ది సమయములో నియమాలు కఠినమైపోతాయి ఎందుకంటే వీరు హోలియెస్ట్ ఆఫ్ ది హోలీ
అయినవారు (పవిత్రాతి పవిత్రమైనవారు). శివబాబాను ఇంద్రుడని కూడా అంటారు కదా. ఇది
ఇంద్ర సభ. నవ రత్నాల ఉంగరాన్ని కూడా ధరిస్తారు కదా. ఆ రత్నాలలో నీలమణి కూడా ఉంటుంది,
మరకతము, మాణిక్యము కూడా ఉంటాయి. ఈ పేర్లన్నీ పెట్టడం జరిగింది. దేవకన్యలకు కూడా
పేర్లు ఉన్నాయి కదా. దేవకన్యలైన మీరు ఎగిరేటువంటి ఆత్మలు. మీ వర్ణనయే ఉంది. కానీ
మనుష్యులు ఈ విషయాలను ఏ మాత్రమూ అర్థం చేసుకోరు.
ఉంగరములో కూడా రత్నాలను పొదిగేటప్పుడు, వాటిలో పుష్యరాగము, నీలమణి, పేరూజ్ (నీలం
రాయి) కూడా ఉంటాయి. కొన్నింటి విలువ వెయ్యి రూపాయలుంటే కొన్నింటి విలువ 10-20
రూపాయలు ఉంటాయి. పిల్లలలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమందైతే చదువుకుని
యజమానులుగా అవుతారు. కొంతమంది చదువుకుని దాస-దాసీలుగా అవుతారు. రాజధాని స్థాపన
అవుతుంది కదా. కనుక తండ్రి కూర్చొని చదివిస్తారు. ఇంద్రుడు అని కూడా వారినే అంటారు.
ఇది జ్ఞాన వర్షము. జ్ఞానాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఇదే మీ
లక్ష్యము-ఉద్దేశ్యము. ఒకవేళ ఈశ్వరుడే చదివిస్తున్నారని నిశ్చయము ఏర్పడితే, ఇక ఆ
చదువును విడిచిపెట్టరు. ఎవరైతే ఉండటమే రాతిబుద్ధి కలవారిగా ఉంటారో, వారికి ఎప్పుడూ
బాణము తగలదు. వస్తారు, వచ్చి నడుస్తూ-నడుస్తూ మళ్ళీ పడిపోతారు. పంచ వికారాలు
అర్ధకల్పపు శత్రువులు. మాయ దేహాభిమానములోకి తీసుకువచ్చి చెంపదెబ్బ వేస్తుంది, ఆ
తర్వాత ఆశ్చర్యము కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. ఈ మాయ చాలా
శక్తివంతమైనది, ఒక్క దెబ్బతోనే పడేస్తుంది. మేమెప్పుడూ పడిపోమని భావిస్తారు, అయినా
కూడా మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇక్కడ స్త్రీ-పురుషులివురినీ పవిత్రముగా తయారుచేయడము
జరుగుతుంది. ఆ విధముగా ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇది ఈశ్వరీయ మిషన్.
తండ్రిని నావికుడు అని కూడా అంటారు, మీరు నావలు. నావికుడు అందరి నావలను ఆవలి
తీరానికి చేర్చేందుకు వస్తారు. సత్యము యొక్క నావ ఊగిసలాడుతుంది కానీ మునగదు అని
అంటారు కూడా. ఎన్ని లెక్కలేనన్ని మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. జ్ఞానానికి మరియు భక్తికి
యుద్ధము జరుగుతున్నట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు భక్తి కూడా విజయము పొందుతుంది,
చివరికి మాత్రము జ్ఞానమే విజయము పొందుతుంది. భక్తి వైపు ఎంత పెద్ద-పెద్ద యోధులు
ఉన్నారో చూడండి. జ్ఞాన మార్గము వైపు కూడా ఎంత పెద్ద-పెద్ద యోధులు ఉన్నారు. అర్జునుడు,
భీముడు మొదలైన పేర్లు పెట్టారు. ఇవన్నీ కథలుగా తయారుచేసారు. వాస్తవానికి ఆ గాయనము
అనేది మీదే. ఇప్పుడు మీ హీరో-హీరోయిన్ పాత్ర నడుస్తోంది. ఈ సమయములోనే యుద్ధము
జరుగుతుంది. మీలో కూడా ఈ విషయాలను ఏ మాత్రము అర్థం చేసుకోనివారు చాలామంది ఉన్నారు.
మంచి-మంచివారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే బాణము తగులుతుంది. థర్డ్ క్లాస్ వారైతే
కూర్చోలేరు. రోజురోజుకూ చాలా కఠినమైన నియమాలు తయారవుతూ ఉంటాయి. ఏ మాత్రము అర్థం
చేసుకోని రాతిబుద్ధి కలవారు ఇక్కడ కూర్చోవడము కూడా నియమ విరుద్ధమే.
ఈ హాల్ హోలియెస్ట్ ఆఫ్ హోలీ అయినది (పవిత్రాతి పవిత్రమైనది). పోప్ ను హోలీ (పవిత్రమైనవారు)
అని అంటారు. ఈ తండ్రి అయితే హోలియెస్ట్ ఆఫ్ హోలీ అయినవారు (పవిత్రాతి పవిత్రమైనవారు).
తండ్రి అంటారు, నేను వీరందరి కళ్యాణము చేయాలి. వీరంతా వినాశనమైపోయేవారే. ఇది కూడా
అందరూ ఏమీ అర్థం చేసుకోరు. వింటారు కానీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు. ఏమీ
ధారణ చేయరు, చేయించరు. ఇలాంటి మూగవారు-చెవిటివారు కూడా చాలామంది ఉన్నారు. తండ్రి
అంటారు, చెడు వినవద్దు... వాళ్ళు అయితే కోతి చిత్రాలను చూపిస్తారు కానీ వాస్తవానికి
ఇది మనుష్యుల గురించే చెప్పబడుతుంది. మనుష్యులు ఈ సమయములో కోతి కన్నా కూడా హీనముగా
ఉన్నారు. నారదుని కథను కూడా కూర్చుని తయారుచేసారు. నీవు నీ ముఖాన్ని చూసుకో, పంచ
వికారాలనేవి లోపల లేవు కదా అని వారికి చెప్పారు. సాక్షాత్కారము జరిగినట్లుగా ఉంటుంది.
హనుమంతుని సాక్షాత్కారము కూడా జరుగుతుంది కదా. తండ్రి చెప్తున్నారు, కల్ప-కల్పము ఇది
జరుగుతుంది. సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు. ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఎవరైతే
పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఉన్నారో, వారు - కల్పక్రితము కూడా మేము ఈ రాజ్యము చేసాము
అని భావిస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయండి. నియమ
విరుద్ధమైన పనులేవీ చేయకండి. నిందా-స్తుతి అన్నింటిలోనూ ఓర్పును ధారణ చేయాలి.
క్రోధము ఉండకూడదు. మీరు ఎంత ఉన్నతమైన విద్యార్థులు, భగవంతుడైన తండ్రి
చదివిస్తున్నారు. వారు డైరెక్టుగా చదివిస్తున్నారు, అయినా కూడా ఎంతమంది పిల్లలు
మర్చిపోతారు ఎందుకంటే ఇది సాధారణమైన తనువు కదా. తండ్రి అంటారు - దేహధారిని
చూసినట్లయితే మీరు అంత ఉన్నతిలోకి వెళ్ళలేరు. ఆత్మను చూడండి. ఆత్మ ఇక్కడ భృకుటి
మధ్యలో ఉంటుంది. ఆత్మ వింటూ తల ఊపుతుంది. ఎప్పుడూ ఆత్మతోనే మాట్లాడండి. ఆత్మ అయిన
నీవు ఈ శరీరము రూపీ సింహాసనముపై కూర్చొని ఉన్నావు, నీవు తమోప్రధానముగా ఉండేవాడివి,
ఇప్పుడు సతోప్రధానముగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేసినట్లయితే దేహ భానము తొలగిపోతుంది. అర్ధకల్పపు దేహాభిమానము ఉండిపోయింది. ఈ
సమయములో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఆత్మయే అన్నీ ధారణ
చేస్తుంది. తినడము-త్రాగడము, అన్నీ ఆత్మయే చేస్తుంది. తండ్రినైతే అభోక్త అని అంటారు.
వారు నిరాకారుడు. ఈ శరీరధారులే అన్నీ చేస్తారు. వారు ఏమీ తినరు-తాగరు, వారు అభోక్త.
దీనిని వారు కూర్చుని కాపీ చేస్తారు. మనుష్యులను ఎంతగా మోసగిస్తారు. మీ బుద్ధిలో
ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా ఉంది. కల్పక్రితము ఎవరైతే అర్థం చేసుకున్నారో, వారే అర్థం
చేసుకుంటారు. తండ్రి అంటారు, నేనే కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు
సాక్షీగా అయి చూస్తాను. నంబరువారు పురుషార్థానుసారముగా ఇంతకుముందు ఏదైతే చదివారో,
అదే చదువుతారు. సమయము పడుతుంది. కలియుగానికి ఇప్పుడు ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి
ఉందని అంటారు. కావున ఘోర అంధకారములో ఉన్నట్లు కదా. దీనిని అజ్ఞానాంధకారమని అంటారు.
భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇవి
కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలు చాలా సంతోషములో నిమగ్నమై ఉండాలి. అన్నీ
ఉన్నాయి, ఏ కోరిక లేదు. కల్పక్రితము వలె మన మనోకామనలన్నీ పూర్తవుతాయని పిల్లలకు
తెలుసు, అందుకే కడుపు నిండుగా ఉంటుంది. ఎవరికైతే జ్ఞానము లేదో, వారి కడుపు నిండి
ఉండదు. సంతోషము వంటి ఔషధము లేదు అని అనడం జరుగుతుంది. జన్మ-జన్మాంతరాల రాజ్యము
లభిస్తుంది. దాస-దాసీలుగా అయ్యేవారికి అంతటి సంతోషము ఉండదు. పూర్తి మహావీరులుగా
అవ్వాలి. మాయ కదిలించలేని విధముగా ఉండాలి.
తండ్రి అంటారు, కళ్ళను చాలా సంభాళించుకోవాలి. వికారీ దృష్టి వెళ్ళకూడదు. స్త్రీని
చూస్తే చంచలమైపోతారు. అరే, మీరు సోదరీ-సోదరులు, కుమారీ-కుమారులు కదా. మరి
కర్మేంద్రియాలు ఎందుకు చంచలమవుతున్నాయి! పెద్ద-పెద్ద లక్షాధికారులను, కోటీశ్వరులను
కూడా మాయ సమాప్తము చేసేస్తుంది. పేదవారిని కూడా మాయ పూర్తిగా హతమార్చేస్తుంది.
అప్పుడు బాబా, మేము దెబ్బ తిన్నామని అంటారు. అరే, 10 సంవత్సరాల తర్వాత కూడా
ఓడిపోయారా, ఇప్పుడిక పాతాళములో పడిపోయినట్లే. వారి అవస్థ ఎలా ఉంది అనేది లోలోపల
అర్థమవుతుంది. కొంతమందైతే చాలా మంచి సేవ చేస్తారు. కన్యలు కూడా భీష్మ పితామహులు
మొదలైనవారిపై బాణాలు వేసారు కదా. గీతలో కొద్దో-గొప్పో ఉంది. ఇది ఉన్నదే భగవానువాచ.
ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడే గీతను వినిపించినట్లయితే, మరి - నేను ఎవరినో ఎలా ఉన్నానో,
అలా ఏ ఒక్కరో మాత్రమే అరుదుగా తెలుసుకుంటారు అని ఈ విధముగా ఎందుకంటారు. శ్రీకృష్ణుడు
ఇక్కడ ఉండి ఉంటే ఏమి చేసేసేవారో తెలియదు. శ్రీకృష్ణుని శరీరమైతే సత్యయుగములోనే
ఉంటుంది. శ్రీకృష్ణుని అనేక జన్మల అంతిమ శరీరములో నేను ప్రవేశిస్తాను అన్నది వారికి
తెలియదు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉంటే, అతని ముందుకు వెంటనే అందరూ పరుగెత్తుకుంటూ
వచ్చేస్తారు. పోప్ మొదలైనవారు వచ్చినప్పుడు ఎంత గుంపులు గుంపులుగా పోగవుతారు. ఈ
సమయములో అందరూ పతితముగా, తమోప్రధానముగా ఉన్నారని మనుష్యులు అర్థం చేసుకోరు. ఓ
పతిత-పావనా రండి అని అంటారు కూడా, కానీ మేము పతితముగా ఉన్నామని భావించరు. పిల్లలకు
తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. బాబా బుద్ధి అయితే అన్ని సెంటర్లలోని
అనన్యమైన పిల్లల వైపుకు వెళ్ళిపోతుంది. ఎక్కువమంది అనన్యమైన పిల్లలు ఇక్కడకు
వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాను, లేకపోతే బయట ఉన్న పిల్లలను గుర్తు చేసుకోవలసి ఉంటుంది.
వారి ముందు జ్ఞాన డ్యాన్స్ చేస్తాను. మెజారిటీ జ్ఞానీ ఆత్మలు ఉన్నట్లయితే ఆనందము
కూడా కలుగుతుంది. లేదంటే కుమార్తెలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కల్ప-కల్పము
సహనము చేయవలసి ఉంటుంది. జ్ఞానములోకి రావడముతో ఇక భక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లో
మందిరము ఉంది అనుకోండి, స్త్రీ-పురుషులిరువురూ భక్తి చేస్తారు, స్త్రీకి జ్ఞానము
పట్ల అభిరుచి కలిగి భక్తిని వదిలేస్తే ఎంత హంగామా జరుగుతుంది. వికారాలలోకి కూడా
వెళ్ళకుండా, శాస్త్రాలు మొదలైనవి కూడా చదవకుండా ఉంటే గొడవ జరుగుతుంది కదా. ఇందులో
చాలా విఘ్నాలు కలుగుతాయి, ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు అడ్డుకోరు. ఇక్కడ ఉన్నది
పవిత్రత యొక్క విషయము. పురుషులు ఉండలేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోతారు, స్త్రీలు
ఎక్కడికి వెళ్ళాలి. స్త్రీ నరకానికి ద్వారమని వారు భావిస్తారు. కానీ వీరు
స్వర్గానికి ద్వారము అని తండ్రి అంటారు. కుమార్తెలైన మీరు ఇప్పుడు స్వర్గ స్థాపన
చేస్తారు. ఇంతకుముందు నరకానికి ద్వారముగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గ స్థాపన
జరుగుతోంది. సత్యయుగము స్వర్గానికి ద్వారము, కలియుగము నరకానికి ద్వారము. ఇది అర్థం
చేసుకోవలసిన విషయము. పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం
చేసుకుంటారు. పవిత్రముగా అయితే ఉంటారు కానీ జ్ఞాన ధారణ నంబరువారుగా జరుగుతుంది. మీరు
అక్కడ నుండి బయటపడి ఇక్కడకు వచ్చి కూర్చున్నారు, కానీ గృహస్థ వ్యవహారములో ఉండాలని
ఇప్పడు అర్థం చేయించడము జరుగుతుంది. అక్కడ ఉండేవారికి కష్టమవుతుంది. ఇక్కడ
ఉండేవారికైతే ఏ కష్టమూ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, కమలపుష్ప సమానముగా
గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా ఉండండి. ఇది కూడా ఈ అంతిమ జన్మ యొక్క విషయము.
గృహస్థ వ్యవహారములో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే వింటుంది, ఆత్మయే ఇలా
తయారైంది. ఆత్మయే జన్మ-జన్మాంతరాలుగా రకరకాల డ్రెస్సులు ధరిస్తూ వచ్చింది. ఇప్పుడు
ఆత్మలమైన మనము తిరిగి వెళ్ళాలి. తండ్రితో యోగము జోడించాలి. ముఖ్యమైన విషయము ఇదే.
తండ్రి అంటారు, నేను ఆత్మలతో మాట్లాడుతాను. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ
ఇంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరము శవమైపోతుంది. తండ్రి వచ్చి
ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు. పరమాత్మ తప్ప ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేయించలేరు.
సన్యాసులు మొదలైనవారెవ్వరూ ఆత్మను చూడరు. వారు ఆత్మను పరమాత్మగా భావిస్తారు. అలాగే
ఆత్మకు ఏమీ అంటుకోదు అని మరోవైపు అంటారు. శరీరాన్ని శుభ్రము చేసుకునేందుకు గంగ
వద్దకు వెళ్తారు. ఆత్మయే పతితముగా అవుతుందని అర్థం చేసుకోరు. ఆత్మయే అన్నీ చేస్తుంది.
తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, నేను ఫలానాను, వీరు ఫలానా... అని భావించకండి. అలా
కాదు, అందరూ ఆత్మలే. జాతి మొదలైనవాటి భేదాలేవీ ఉండకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించండి.
గవర్నమెంట్ ఏ ధర్మాన్ని నమ్మదు. ఈ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి. కానీ
ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే. చూడటము కూడా ఆత్మను చూడాలి. ఆత్మలందరి స్వధర్మము
శాంతి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.