04-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు పురుషోత్తములుగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు, దేవతలు పురుషోత్తములు ఎందుకంటే వారు పావనులు, మీరు పావనముగా అవుతూ ఉన్నారు’’

ప్రశ్న:-
అనంతమైన తండ్రి తన పిల్లలైన మీకు శరణు ఎందుకు ఇచ్చారు?

జవాబు:-
ఎందుకంటే మనమందరమూ చెత్త కుండీలో పడి ఉన్నాము. తండ్రి మనల్ని చెత్త కుండీ నుండి బయటకు తీసి పుష్పాలుగా తయారుచేస్తారు. ఆసురీ గుణాలు కలవారిని దైవీ గుణాలు కలవారిగా తయారుచేస్తారు. డ్రామానుసారముగా తండ్రి వచ్చి మనల్ని చెత్త నుండి బయటకు తీసి, దత్తత తీసుకుని తనవారిగా చేసుకున్నారు.

పాట:-
ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
రాత్రిని పగలుగా చేయడానికి తండ్రికి రావలసి ఉంటుంది. తండ్రి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ముందు మనము శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారము, శూద్రబుద్ధి కలవారిగా ఉండేవారము. వర్ణాల చిత్రము కూడా అర్థం చేయించేందుకు చాలా మంచిది. మనము ఈ వర్ణాల చక్రములో ఎలా తిరుగుతాము అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనల్ని పరమపిత పరమాత్మ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేశారు. కల్పకల్పము కల్పము యొక్క సంగమయుగములో మనము బ్రాహ్మణులుగా అవుతాము. బ్రాహ్మణులను పురుషోత్తములు అని అనరు. పురుషోత్తములు అని దేవతలను అంటారు. బ్రాహ్మణులు పురుషోత్తములుగా తయారయ్యేందుకు ఇక్కడ పురుషార్థము చేస్తారు. పతితము నుండి పావనముగా తయారయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఎంతవరకు పావనముగా అవుతున్నాను? విద్యార్థులు కూడా చదువు కొరకు విచార సాగర మంథనము చేస్తారు కదా. ఈ చదువు ద్వారా మేము ఈ విధంగా తయారవుతాము అని అర్థం చేసుకుంటారు. దేవతలుగా అయ్యేందుకు ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది అమూల్యమైన జీవితము ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుడు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, పతితము నుండి పావనముగా తయారుచేస్తున్నారు. తద్వారా మీరు పావన దేవతలుగా అవుతారు. వర్ణాలపై అర్థం చేయించడము చాలా మంచిది. సన్యాసులు మొదలైనవారు ఈ విషయాలను అంగీకరించరు. కానీ 84 జన్మల లెక్కను అర్థం చేసుకోగలరు. సన్యాస ధర్మస్థులమైన మేము 84 జన్మలు తీసుకోము అని కూడా వారు అర్థం చేసుకోగలరు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారు కూడా - మేము 84 జన్మలు తీసుకోము అని అర్థం చేసుకుంటారు. అయితే, వారు పునర్జన్మలు తీసుకుంటారు కానీ తక్కువ తీసుకుంటారు. మీరు అర్థం చేయించినట్లయితే వెంటనే అర్థం చేసుకుంటారు. అర్థం చేయించే యుక్తి కూడా కావాలి. పిల్లలైన మీరు ఇక్కడ సమ్ముఖముగా కూర్చున్నారు, బాబా మీ బుద్ధిని రిఫ్రెష్ చేస్తున్నారు. ఇతర పిల్లలు కూడా ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు కదా. మిమ్మల్ని అయితే బాబా - వీటిని ధారణ చేయండి అని చెప్తూ రోజూ రిఫ్రెష్ చేస్తారు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యాము అని బుద్ధిలో ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. బ్రహ్మా సంతానము బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను వీరికి బ్రహ్మా అన్న పేరును పెడతాను. ఈ బ్రహ్మాకుమార-కుమారీలు ఎవరైతే ఉన్నారో, వీరంతా ఒక పరివారము, కావున వీరు తప్పకుండా దత్తత తీసుకోబడినవారే. తండ్రియే దత్తత తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారు, దాదా అని అనరు. తండ్రిని తండ్రి అనే అంటారు. ఆస్తి అనేది తండ్రి నుండే లభిస్తుంది. కొందరిని పినతండ్రులు, మావయ్యలు లేక వారి వంశమువారు కూడా దత్తత తీసుకుంటారు. బాబా ఒక ఉదాహరణ వినిపించారు కదా, ఒక పాప చెత్త కుండీలో పడి ఉంటే, ఆమెను ఎవరో బయటకు తీసి ఒకరికి దత్తత కోసం ఇచ్చారు ఎందుకంటే వారికి పిల్లలు లేరు. ఆ పాప ఎవరి ఒడిలోకైతే వెళ్ళిందో వారినే అమ్మా, నాన్నా అని అనడం మొదలుపెడుతుంది కదా. అలాగే ఇది అనంతమైన విషయము. పిల్లలైన మీరు కూడా ఈ అనంతమైన చెత్త కుండీలో పడి ఉన్నట్లు ఉన్నారు, విషయ వైతరణి నదిలో పడి ఉన్నారు. ఎంత మురికిగా అయిపోయారు. డ్రామానుసారముగా తండ్రి వచ్చి ఈ చెత్త కుండీ నుండి బయటకు తీసి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. తమోప్రధానతను చెత్త అనే అంటారు కదా. ఆసురీ గుణాలు కల మనుష్యులు దేహాభిమానులు. కామ-క్రోధాలు కూడా పెద్ద వికారాలు కదా. మీరు రావణుడి యొక్క పెద్ద చెత్త కుండీలో పడి ఉండేవారు. వాస్తవానికి మీరు శరణార్థులు కూడా. ఇప్పుడు మీరు ఈ చెత్త నుండి బయటపడి పుష్పాల వంటి దేవతలుగా తయారయ్యేందుకు అనంతమైన తండ్రి శరణులోకి వచ్చారు. ఈ సమయములో మొత్తము ప్రపంచమంతా ఒక పెద్ద చెత్త కుండీలో పడి ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చెత్త నుండి బయటికి తీసి తనవారిగా చేసుకుంటారు. కానీ చెత్తలో పడి ఉన్నవారు దానికి ఎలా అలవాటు పడిపోయి ఉన్నారంటే, వారిని బయటికి తీసినా కానీ మళ్ళీ వారికి ఆ చెత్తయే నచ్చుతుంది. తండ్రి వచ్చి అనంతమైన చెత్త నుండి బయటికి తీస్తారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పుష్పాలుగా తయారుచేయండి, ముళ్ళ అడవి నుంచి బయటికి తీసి పుష్పాలుగా తయారుచేయండి, భగవంతుని పూలతోటలో కూర్చోబెట్టండి, ఇప్పుడు అసురుల అడవిలో పడి ఉన్నాము అని పిలుస్తారు కూడా. తండ్రి పిల్లలైన మిమ్మల్ని పూలతోటలోకి తీసుకువెళ్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి, మళ్ళీ దేవతలుగా అవుతారు. అది దేవతల రాజధాని. బ్రాహ్మణులకు రాజ్యము లేదు. పాండవులు అన్న పేరు ఉంది కానీ పాండవులకు రాజ్యము లేదు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితోపాటు కూర్చున్నారు. అనంతమైన రాత్రి ఇప్పుడు పూర్తి అయి అనంతమైన పగలు ప్రారంభమవుతుంది. ఉదయముదయమే ఎవరు వచ్చారు... అన్న పాటను విన్నారు కదా. రాత్రిని తొలగించి పగలును తయారుచేయడానికి ఉదయముదయమే వస్తారు అనగా స్వర్గము యొక్క స్థాపనను మరియు నరకము యొక్క వినాశనమును చేయించడానికి వస్తారు. ఈ విషయము బుద్ధిలో ఉన్నా సరే సంతోషము ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందేవారు ఉన్నారో, వారు ఎప్పుడూ తమ ఆసురీ స్వభావాన్ని చూపించరు. ఏ యజ్ఞము ద్వారానైతే ఇంత ఉన్నతముగా తయారవుతారో, ఆ యజ్ఞానికి ఎంతో ప్రేమతో సేవ చేస్తారు. ఇటువంటి యజ్ఞములోనైతే ఎముకలను సైతం ఇచ్చేయాలి. స్వయాన్ని చూసుకోవాలి - ఈ నడవడికతో నేను ఉన్నత పదవిని ఎలా పొందుతాను! మీరు అర్థం చేసుకోలేనంతటి చిన్న పిల్లలైతే కారు కదా. రాజులు ఎలా తయారవుతారు, ప్రజలు ఎలా తయారవుతారు అనేది అర్థం చేసుకోగలరు. బాబా కూడా రాజులు మొదలైనవారు బాగా పరిచయమున్న అనుభవజ్ఞులైన రథాన్నే తీసుకున్నారు. రాజుల దాస-దాసీలకు కూడా ఎంతో సుఖము లభిస్తుంది. వారు రాజులతోపాటే ఉంటారు. కానీ వారిని దాస-దాసీలు అనే అంటారు. వారికి సుఖమైతే ఉంటుంది కదా. రాజు, రాణి ఏదైతే తింటారో అదే వారికి కూడా లభిస్తుంది. అలా బయటివారెవరూ తినలేరు కదా. దాసీలలో కూడా నంబరువారుగా ఉంటారు. కొందరు అలంకరించేవారు ఉంటారు, కొందరు పిల్లలను సంభాళించేవారు ఉంటారు, కొందరు ఊడవడము మొదలైన పనులు చేసేవారు ఉంటారు. ఇక్కడి రాజులకే ఇంతమంది దాస-దాసీలు ఉంటే, మరి అక్కడ ఎంత ఎక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరికీ వారి-వారి బాధ్యత ఉంటుంది. వారు నివసించే స్థానము వేరుగా ఉంటుంది. వారేమీ రాజు, రాణులు వలె అలంకరింపబడి ఉండరు. సర్వెంట్ క్వార్టర్స్ (సేవకుల గృహాలు) ఉంటాయి కదా. వారు తప్పకుండా రాజభవనాల లోపలికి వస్తారు కానీ ఉండేది మాత్రము సర్వెంట్ క్వార్టర్స్ లోనే. కావున తండ్రి బాగా అర్థం చేయిస్తున్నారు - నేను ఉన్నతోన్నతముగా తయారవ్వాలి అని మీపై మీరు దయ చూపించుకోండి. మనము ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఎంతటి సౌభాగ్యము. ఆ తర్వాత దేవతలుగా అవుతాము. ఈ సంగమయుగము చాలా కళ్యాణకారి అయినది. మీకు సంబంధించిన ప్రతి విషయములోనూ కళ్యాణము నిండి ఉంది. భండారాలో కూడా యోగములో ఉండి భోజనము తయారుచేసినట్లయితే అందులో ఎంతోమంది కళ్యాణము నిండి ఉంది. శ్రీనాథ ద్వారములో భోజనాన్ని పూర్తి నిశ్శబ్దములో ఉండి తయారుచేస్తారు. వారికి శ్రీనాథుడే గుర్తు ఉంటారు. భక్తులు తమ భక్తిలో బాగా ఆనందముగా నిమగ్నమై ఉంటారు. అలా మీరు జ్ఞానములో ఆనందముగా నిమగ్నమై ఉండాలి. శ్రీకృష్ణునికి ఏ విధంగా భక్తి జరుగుతుందంటే ఇక అది వర్ణించలేము. బృందావనములో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు పూర్తి భక్తురాళ్ళు, వాళ్ళు - మేము ఇక ఇక్కడే ఉంటాము, శ్రీకృష్ణుడి స్మృతిలో ఇక్కడే శరీరాన్ని వదులుతాము అని అంటారు. మంచి ఇంటిలో ఉండండి, జ్ఞానము తీసుకోండి అని వారికి ఎంతో చెప్తారు కానీ వాళ్ళు, మేము ఇక్కడే ఉంటాము అని అంటారు. అటువంటి వారిని భక్త శిరోమణులు అని అంటారు. శ్రీకృష్ణుడిపై ఎంతగా బలిహారమవుతారు. ఇప్పుడు మీరు తండ్రిపై బలిహారమవ్వాలి. మొట్టమొదట ప్రారంభములో ఎంతమంది శివబాబాపై బలిహారమయ్యారు. లెక్కలేనంతమంది వచ్చారు. కానీ ఎప్పుడైతే భారత్ లోకి వచ్చారో అప్పుడు ఎంతోమందికి వారి ఇళ్ళు-వాకిళ్ళు గుర్తుకు రావడం మొదలయ్యింది. ఎంతమంది వెళ్ళిపోయారు. గ్రహచారము ఎంతోమందిపై కూర్చుంటుంది కదా. కాసేపు ఒక దశ, మరికాసేపు ఇంకొక దశ వారిపై కూర్చుంటుంది. బాబా అర్థం చేయించారు, ఎవరైనా వస్తే వారిని అడగండి - మీరు ఎక్కడకు వచ్చారు? బయట బ్రహ్మాకుమార, కుమారీలు అన్న బోర్డును చూసారు. ఇది ఒక పరివారము కదా. ఒకరు నిరాకార పరమపిత పరమాత్మ, ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మా కూడా గాయనం చేయబడ్డారు. వీరందరూ వారి పిల్లలు. శివబాబా తాతగారు, వారి నుండి వారసత్వము లభిస్తుంది. వారు సలహా ఇస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా అయిపోతారు. కల్పపూర్వము కూడా తండ్రి ఇటువంటి సలహాను ఇచ్చారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని ఇది కూడా మీ బుద్ధిలో ఉంది.

పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువును చదువుతున్నారు. మీరు తప్పకుండా దైవీ గుణాలను ధారణ చేయాలి. మీ భోజన-పానీయాలు, మాట, వ్యవహారము ఎంత రాయల్ గా ఉండాలి. దేవతలు ఎంత తక్కువగా తింటారు. వారిలో, ఇది తినాలి, అది తినాలి అనే లోభమేమీ ఉండదు. 36 రకాల వంటకాలు తయారవుతాయి, కానీ వారు ఎంత తక్కువ తింటారు. భోజన-పానీయాల విషయములో ఆకర్షణ కలిగి ఉండడము - దీనిని కూడా ఆసురీ నడవడిక అనే అంటారు. దైవీ గుణాలను ధారణ చేయాలంటే భోజన-పానీయాలు చాలా శుద్ధముగా మరియు సాధారణముగా ఉండాలి. కానీ మాయ ఎలా ఉందంటే, అది పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేస్తుంది, దానితో ఇక పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. తండ్రి అంటారు, మీ కళ్యాణము చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయండి. బాగా చదువుకుని, ఇతరులను కూడా చదివించినట్లయితే మీకే బహుమానము లభిస్తుంది. ఆ బహుమానాన్ని తండ్రి ఇవ్వరు, మీరు మీ పురుషార్థముతో దానిని పొందుతారు. స్వయాన్ని చూసుకోవాలి - నేనెంతవరకు సేవ చేస్తున్నాను? నేను ఏమవుతాను? ఈ సమయములో శరీరము వదిలేస్తే ఏం లభిస్తుంది? బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే చెప్తారు, ఈ నడవడిక ద్వారా వీరు ఫలానా పదవిని పొందుతారని అర్థమవుతుంది. పురుషార్థమే చేయకపోతే కల్ప-కల్పాంతరాల కొరకు స్వయాన్ని నష్టపరుచుకుంటారు. మంచి సేవ చేసేవారు తప్పకుండా మంచి పదవిని పొందుతారు. ఫలానావారు వెళ్ళి దాస-దాసీలుగా అవుతారని లోలోపల తెలుస్తుంది. కానీ బయటికి ఆ మాట చెప్పలేరు. స్కూల్లో కూడా విద్యార్థులు - నేను సీనియర్ గా అవుతానా లేక జూనియర్ గా అవుతానా అన్నది అర్థం చేసుకోగలరు. ఇక్కడ కూడా అలాగే. ఎవరైతే సీనియర్లుగా ఉంటారో వారు రాజు, రాణులుగా అవుతారు, జూనియర్లు తక్కువ పదవిని పొందుతారు. షావుకారులలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు. దాస-దాసీలలో కూడా సీనియర్లు మరియు జూనియర్లు ఉంటారు. సీనియర్లుగా ఉండేవారి పదవి ఉన్నతముగా ఉంటుంది. ఊడ్చే పని చేసే దాసీకి రాజమహలు లోపలికి వచ్చే అనుమతి ఉండదు. ఈ విషయాలన్నింటినీ పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకోగలరు. అంతిమములో ఇంకా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఉన్నతముగా తయారుచేసేవారిపై గౌరవము కూడా ఉంచవలసి ఉంటుంది. చూడండి, కుమారకా ఉన్నారు (ప్రకాశమణి దాది), వారు సీనియర్ కావున గౌరవము ఉంచవలసి ఉంటుంది.

తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఏ పిల్లలైతే మహారథులో, వారిపై గౌరవము ఉంచండి. గౌరవము ఉంచకపోతే తమపై తాము పాప భారాన్ని పెంచుకుంటారు. ఈ విషయాలన్నింటి పట్ల తండ్రి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. నంబరువారుగా ఎవరిని ఎలా గౌరవించాలి అన్న విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకు అయితే ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. నీవు ఇలా ఉన్నావు అని ఎవరితోనైనా నేరుగా అంటే వారు ద్రోహులుగా అవ్వడములో ఆలస్యము చేయరు. ఇకదానితో కుమారీలు, మాతలు మొదలైనవారిపై కూడా బంధనాలు ఏర్పడతాయి. ఎన్నో అత్యాచారాలను సహించవలసి వస్తుంది. బాబా, మమ్మల్ని వీరు చాలా విసిగిస్తున్నారు, మేమేమి చేయాలి? అని చాలావరకు మాతలే వ్రాస్తూ ఉంటారు. అరే, మీపై బలవంతం చేయడానికి మీరేమైనా జంతువులా. మీకు లోలోపల కోరిక ఉంది, అందుకే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇందులోనైతే అడగవలసిన విషయమేమీ లేదు. ఆత్మ తనకు తానే మిత్రువు, తనకు తానే శత్రువు. మీకు ఏం కావాలంటే అది చేయండి. మీరు అడుగుతున్నారు అంటే మీకు కోరిక ఉన్నట్లు. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ద్వారానే మీరు పావనముగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు నంబర్ వన్ పావనులు కదా. మమ్మా ఎంత సేవ చేసేవారు. మేము మమ్మా కంటే తెలివైనవారము అని ఎవ్వరూ అనలేరు. మమ్మా జ్ఞానములో అందరికంటే చురుకుగా ఉండేవారు. యోగము విషయములో చాలా మందిలో లోపము ఉంది. వారు స్మృతిలో ఉండలేకపోతారు. మరి స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి! అంతిమ సమయములో స్మృతిలోనే శరీరము వదలాలి అని నియమము చెప్తుంది. శివబాబా స్మృతిలోనే ప్రాణము తనువు నుండి బయటికి పోవాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేని పట్ల ఆసక్తి ఉండకూడదు. దీనిని అభ్యాసము చేయవలసి ఉంటుంది. మనం అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మధురముగా తయారవ్వాలి. దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహాభిమానపు భూతము ఉంటుంది కదా. తమపై తాము చాలా అటెన్షన్ ఉంచాలి. చాలా ప్రేమగా నడుచుకోవాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రాన్ని స్మృతి చేయండి. చక్రము యొక్క రహస్యాన్ని ఎవరికైనా అర్థం చేయిస్తే వారు ఆశ్చర్యపోతారు. 84 జన్మల గురించే ఎవరికీ గుర్తు ఉండదు అన్నప్పుడు ఇక 84 లక్షల జన్మలను ఎవరైనా ఎలా గుర్తుంచుకోగలరు? కనీసం ఆలోచనలోకి కూడా రాదు. ఈ చక్రమునే బుద్ధిలో గుర్తుంచుకున్నా అహో సౌభాగ్యము. ఇప్పుడు ఈ నాటకము పూర్తవుతుంది. పాత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి. బుద్ధియోగము శాంతిధామము మరియు సుఖధామములో ఉండాలి. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. గీతను చదివేవారెవరికీ మన్మనాభవ యొక్క అర్థము తెలియదు. పిల్లలైన మీకు తెలుసు. భగవానువాచ - దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇలా ఎవరు అన్నారు. స్వయంగా తండ్రి. కొందరు - మేము శాస్త్రాలనే నమ్ముతాము, భగవంతుడే వచ్చి చెప్పినా మేము నమ్మము అని అంటారు. వారు అలా శాస్త్రాలను చదువుతూనే ఉంటారు. భగవంతుడు వచ్చారు, వారు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, స్థాపన జరుగుతోంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతుడిపై నిశ్చయమున్నట్లయితే వారసత్వాన్ని తీసుకోవడములో నిమగ్నులవుతారు, ఇక వారి భక్తి కూడా ఆగిపోతుంది. కానీ నిశ్చయము ఏర్పడినప్పుడే కదా ఇది జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేవతలుగా అయ్యేందుకు చాలా రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. భోజన-పానీయాలను చాలా శుద్ధముగా మరియు సాధారణముగా ఉంచుకోవాలి. లోభములోకి రాకూడదు. తమ కళ్యాణము చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి.

2. మీపై మీరు అటెన్షన్ పెట్టుకుంటూ, అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. మీకంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో, వారి పట్ల తప్పకుండా గౌరవము ఉంచాలి. చాలా-చాలా మధురముగా అవ్వాలి. దేహాభిమానములోకి రాకూడదు.

వరదానము:-
గతించిపోయిన విషయాలను దయార్ద్ర హృదయులుగా అయి ఇముడ్చుకునే శుభ చింతక భవ

ఒకవేళ ఎవరివైనా బలహీనతకు సంబంధించిన గతించిపోయిన విషయాలను ఎవరైనా వినిపిస్తే శుభ భావనతో పక్కకు తప్పుకోండి. వ్యర్థ చింతన లేక బలహీనతకు సంబంధించిన విషయాల చర్చ పరస్పరము జరగకూడదు. గతించిపోయిన విషయాలను దయార్ద్ర హృదయులుగా అయి ఇముడ్చుకోండి. ఇముడ్చుకుని శుభ భావనతో ఆ ఆత్మ పట్ల మనసా సేవ చేస్తూ ఉండండి. సంస్కారాలకు వశమై ఎవరైనా తప్పుగా మాట్లాడినా, చేసినా లేక విన్నా సరే, దానిని పరివర్తన చేయండి. ఒకరి నుండి రెండవవారి వరకు, రెండవవారి నుండి మూడవవారి వరకు వెళ్తూ ఇలా వ్యర్థ విషయాల మాల తయారవ్వకూడదు. ఇటువంటి అటెన్షన్ పెట్టడము అనగా శుభచింతకులుగా అవ్వడము.

స్లోగన్:-
సంతుష్టమణులుగా అయినట్లయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

శరీరము మరియు ఆత్మ కంబైండ్ గా ఉంటేనే జీవితము ఉంటుంది. ఒకవేళ ఆత్మ శరీరము నుండి వేరైపోతే జీవితము సమాప్తమైపోతుంది. అలాగే కర్మయోగీ జీవితము అనగా యోగము లేకుండా కర్మ ఉండదు, కర్మ లేకుండా యోగము ఉండదు. సదా కంబైండుగా ఉన్నట్లయితే సఫలత లభిస్తూ ఉంటుంది.