06-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పాత ప్రపంచము యొక్క ముళ్ళను కొత్త ప్రపంచము యొక్క పుష్పాలుగా తయారుచేయడము - ఇది చురుకైన తోటమాలులైన మీ పని’’

ప్రశ్న:-
సంగమయుగములో పిల్లలైన మీరు ఏ శ్రేష్ఠమైన భాగ్యాన్ని తయారుచేసుకుంటారు?

జవాబు:-
ముళ్ళ నుండి సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వడము - ఇది అన్నింటికన్నా శ్రేష్ఠమైన భాగ్యము. ఒకవేళ ఏదైనా ఒక్క వికారము ఉన్నా కూడా వారు ముళ్ళు వంటివారే. ఎప్పుడైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారో అప్పుడు సతోప్రధానమైన దేవీ-దేవతలుగా అవుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు 21 తరాల కొరకు మీ సూర్యవంశీ భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
పాటను పిల్లలు విన్నారు. ఇది సాధారణమైన పాటే ఎందుకంటే మీరు తోటమాలులు, తండ్రి తోట యజమాని. ఇప్పుడు తోటమాలులు ముళ్ళను పుష్పాలుగా తయారుచేయాలి. ఈ పదాలు చాలా స్పష్టముగా ఉన్నాయి. భక్తులు భగవంతుని వద్దకు వచ్చారు. అందరూ భక్తురాళ్ళే కదా. ఇప్పుడు జ్ఞానము యొక్క చదువును చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఈ రాజయోగము యొక్క చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున భక్తురాళ్ళు అంటారు - మేము భాగ్యాన్ని తయారుచేసుకుని వచ్చాము, కొత్త ప్రపంచాన్ని హృదయములో అలంకరించుకుని వచ్చాము. బాబా కూడా రోజు చెప్తారు - మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజ్యాన్ని స్మృతి చేయండి. ఆత్మయే స్మృతి చేయాలి. ప్రతి ఒక్క సెంటరులోనూ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. పుష్పాలలో కూడా నంబరువారుగా ఉంటాయి కదా. శివునిపై పుష్పాలను అర్పిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పుష్పాలను అర్పిస్తారు. గులాబీ పుష్పానికి మరియు జిల్లేడు పుష్పానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది కూడా పుష్పాలతోట. కొందరు మల్లెపువ్వులు, కొందరు సంపెంగలు, కొందరు రత్నజ్యోతులు, కొందరు జిల్లేడు పుష్పాలు కూడా ఉన్నారు. ఈ సమయములో అందరూ ముళ్ళేనని పిల్లలకు తెలుసు. ఈ ప్రపంచమే ముళ్ళ అడవిలా ఉంది, ఇక్కడివారిని కొత్త ప్రపంచములోని పుష్పాలుగా తయారుచేయాలి. ఈ పాత ప్రపంచములో ముళ్ళు ఉన్నారు, అందుకే పాటలో కూడా అంటారు - మేము తండ్రి వద్దకు పాత ప్రపంచపు ముళ్ళ నుండి కొత్త ప్రపంచపు పుష్పాల వలె తయారయ్యేందుకు వచ్చాము. ఆ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా దేవీ-దేవతలుగా తయారవ్వాలి. పాట యొక్క అర్థము ఎంత సహజముగా ఉంది. మనము కొత్త ప్రపంచము కొరకు భాగ్యాన్ని మేలుకొలుపుకునేందుకు వచ్చాము. కొత్త ప్రపంచము సత్యయుగము. కొందరిది సతోప్రధానమైన భాగ్యము, కొందరిది రజోగా, తమోగా ఉంది. కొందరు సూర్యవంశీ రాజులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు, మరికొందరు ప్రజలకు కూడా సేవకులుగా అవుతారు. ఈ కొత్త ప్రపంచపు రాజ్యము స్థాపన అవుతోంది. స్కూల్ కు భాగ్యాన్ని మేలుకొలుపుకునేందుకు వెళ్తారు కదా. ఇక్కడైతే ఇది కొత్త ప్రపంచానికి సంబంధించిన విషయము. ఈ పాత ప్రపంచములో ఏం భాగ్యాన్ని తయారుచేసుకుంటారు! మీరు భవిష్య కొత్త ప్రపంచములో దేవతలుగా అయ్యేందుకు భాగ్యాన్ని తయారుచేసుకుంటున్నారు, ఆ దేవతలకు అందరూ నమస్కరిస్తూ వచ్చారు. మనమే దేవతలుగా, పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. 21 జన్మల వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది, దానినే 21 తరాలు అని అంటారు. వృద్ధావస్థ వరకు ఉన్న కాలాన్ని తరము అని అంటారు. తండ్రి 21 తరాల వారసత్వాన్ని ఇస్తారు ఎందుకంటే యువ అవస్థలోనైనా లేక బాల్యములోనైనా, మధ్యలో అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు, అందుకే దానిని అమరలోకము అని అంటారు. ఇది మృత్యులోకము, రావణ రాజ్యము. ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ వికారాలు ప్రవేశించి ఉన్నాయి, ఎవరిలోనైనా ఒక్క వికారము ఉన్నా వారు ముళ్ళు అయినట్లే కదా. తోటమాలికి రాయల్ సుగంధమయమైన పుష్పాలను తయారుచేయడం తెలియదు అని తండ్రి భావిస్తారు. తోటమాలి మంచిగా ఉంటే మంచి-మంచి పుష్పాలను తయారుచేస్తారు. విజయమాలలో స్మరింపబడేందుకు యోగ్యమైన పుష్పాలు కావాలి. దేవతల వద్దకు మంచి-మంచి పుష్పాలను తీసుకువెళ్తారు కదా. ఒకవేళ క్వీన్ ఎలిజబెత్ వస్తే చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాల మాలను తయారుచేసి తీసుకువెళ్తారు. ఇక్కడి మనుష్యులైతే తమోప్రధానముగా ఉన్నారు. శివుని మందిరాలకు కూడా వెళ్తారు, వారు భగవంతుడు అని భావిస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులనైతే దేవతలు అని అంటారు. శివుడిని భగవంతుడు అని అంటారు. కావున వారు ఉన్నతోన్నతమైనవారు అయినట్లు కదా. శివుని గురించి ఉమ్మెత్త తినేవారని, భంగు త్రాగేవారు అని అంటారు. ఎంతగా గ్లాని చేస్తారు. పుష్పాలు కూడా జిల్లేడు పుష్పాలను తీసుకువెళ్తారు. ఇప్పుడు ఇటువంటి పరమపిత పరమాత్మ, కానీ వారి వద్దకు తీసుకువెళ్తుంది ఏమిటి! తమోప్రధానమైన ముళ్ళ వద్దకైతే ఫస్ట్ క్లాస్ పుష్పాలను తీసుకువెళ్తారు కానీ శివుని మందిరాలకు ఏమి తీసుకునివెళ్తారు! పాలు కూడా ఎటువంటివి అర్పిస్తారు? 5 శాతము పాలు, మిగిలిన 95 శాతము నీరు. భగవంతుని వద్ద ఎటువంటి పాలను అర్పించాలి, ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు మంచి రీతిలో తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు, ఎవరికైతే బాగా తెలుసో వారిని సెంటర్ హెడ్ గా నియమించడం జరుగుతుంది. అందరూ ఒకేలా ఉండరు. చదువు ఒక్కటే, మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము, అయినా కానీ టీచర్లు అయితే నంబరువారుగా ఉన్నారు కదా. విజయమాలలోకి వచ్చేందుకు ముఖ్యమైన ఆధారము చదువు. చదువైతే ఒకటే ఉంటుంది, అందులో పాస్ అవ్వడం నంబరువారుగా అవుతారు కదా. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. కొందరు విజయమాలలోని అష్టరత్నాలలోకి వస్తారు, కొందరు 108 లోకి, కొందరు 16108 లోకి వస్తారు. వంశవృక్షాన్ని తయారుచేస్తారు కదా. వృక్షములో కూడా వంశము వెలువడుతుంది, మొట్టమొదట ఒక ఆకు, రెండు ఆకులు, ఆ తర్వాత అలా పెరుగుతూ ఉంటాయి. ఇది కూడా వృక్షము. వంశాలు ఉంటాయి, ఉదాహరణకు కృపలానీ వంశము మొదలైనవి, అవన్నీ హద్దులోని వంశాలు. ఇది అనంతమైన వంశవృక్షము. ఇందులో మొట్టమొదటి వారు ఎవరు? ప్రజాపిత బ్రహ్మా. వారిని గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మనుష్యమాత్రులకు కొద్దిగా కూడా ఈ సృష్టి రచయిత ఎవరు అన్నది తెలియదు. అహల్య వలె పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే తండ్రి వస్తారు.

మీరు ఇక్కడకు అహల్య వంటి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవ్వడానికి వచ్చారు. కావున జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి కదా. తండ్రిని గుర్తించాలి మరియు చదువు గురించి ఆలోచన చేయాలి. ఈ రోజు వచ్చారు అనుకోండి, రేపు అకస్మాత్తుగా శరీరము వదిలేస్తే ఇక ఏ పదవిని పొందగలరు. జ్ఞానమేమీ తీసుకోలేదు, ఏమీ నేర్చుకోలేదు, ఇక వారు ఏ పదవిని పొందుతారు! రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరైతే ఆలస్యముగా శరీరము వదులుతారో, వారికి సమయము తక్కువగా లభిస్తుంది ఎందుకంటే సమయము తగ్గిపోతూ ఉంటుంది. ఆ కొద్ది సమయములో జన్మ తీసుకుని ఏం చేయగలుగుతారు. అయితే, మీ వద్ద నుండి ఎవరైతే వెళ్తారో, వారు ఏదైనా మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు. సంస్కారాలను తనతోపాటు తీసుకువెళ్తుంది కావున ఆ ఆత్మ వెంటనే మేల్కొంటుంది, శివబాబాను స్మృతి చేయడం మొదలుపెడుతుంది. సంస్కారాలే తయారవ్వకపోతే ఇక ఏమీ జరగదు. దీనిని చాలా సూక్ష్మముగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. తోటమాలి మంచి-మంచి పుష్పాలను తీసుకువస్తే, అతని మహిమ కూడా గాయనము చేయబడుతుంది. పుష్పాలను తయారుచేయడమైతే తోటమాలి పని కదా. ఎంతోమంది పిల్లలకు తండ్రిని స్మృతి చేయడం కూడా చేతకావడం లేదు. భాగ్యముపైనే ఆధారపడి ఉంది కదా. భాగ్యములో లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు. భాగ్యవంతులైన పిల్లలైతే తండ్రిని యథార్థ రీతిగా గుర్తించి వారిని పూర్తిగా స్మృతి చేస్తారు. తండ్రితోపాటుగా కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు. మేము కొత్త ప్రపంచము కొరకు కొత్త భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చాము అని పాటలో కూడా ఉంది కదా. 21 జన్మల కొరకు తండ్రి నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. ఈ నషాలో, ఆనందములో ఉన్నట్లయితే ఇటువంటి పాటల యొక్క అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. స్కూల్లో కూడా ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇదైతే చాలా పెద్ద పరీక్ష. భగవంతుడు స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసమూ. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ దేహధారి మనుష్యులను భగవంతుడు అని అనలేమని మీకు తెలుసు. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా భగవంతుడు అని అనరు. వారు కూడా సూక్ష్మవతనవాసులైన దేవతలు. ఇక్కడ ఉన్నది మనుష్యులు. ఇక్కడ దేవతలు లేరు. ఇది మనుష్య లోకము. ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు దైవీ గుణాలు కలిగిన మనుష్యులు, దానిని దైవీ ధర్మము అని అంటారు. సత్యయుగములో దేవీ-దేవతలందరూ ఉంటారు, సూక్ష్మవతనములో కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు మాత్రమే ఉంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః ... అని పాడుతారు కూడా, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివుడిని దేవత అని అనరు. అలాగే మనుష్యులను భగవంతుడు అని అనలేరు. మూడు అంతస్థులు ఉన్నాయి కదా. మనము మూడవ అంతస్థులో ఉన్నాము. సత్యయుగములోని దైవీగుణధారులైన మనుష్యులెవరైతే ఉండేవారో, వారే మళ్ళీ ఆసురీ గుణాలు కలవారిగా అయిపోతారు. మాయ గ్రహణము పట్టడముతో నల్లగా అయిపోతారు. చంద్రునికి కూడా గ్రహణము పడుతుంది కదా. అవి హద్దులోని విషయాలు, ఇది అనంతమైన విషయము. ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి. బ్రహ్మా యొక్క పగలు మరియు రాత్రి అని గానం చేస్తారు కూడా. మీరు ఇప్పుడు ఒక్క తండ్రి నుండే చదువుకోవాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. తండ్రి ద్వారా చదవడము వలన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇది సత్యాతి, సత్యమైన గీతా పాఠశాల. పాఠశాలలో సదా ఉండరు. భక్తి మార్గము భగవంతుడిని కలుసుకునే మార్గమని, ఎంత ఎక్కువ భక్తి చేస్తే అంతగా భగవంతుడు ప్రసన్నమవుతారని మరియు వచ్చి ఫలాన్ని ఇస్తారని మనుష్యులు భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ మీరు మాత్రమే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. భగవంతుడు ఒక్కరే, వారు ఇప్పుడు ఫలాన్ని ఇస్తున్నారు. ఎవరైతే మొట్టమొదట సూర్యవంశీ పూజ్యులుగా ఉండేవారో, వారే అందరికన్నా ఎక్కువ భక్తి చేసారు. వారే ఇక్కడికి వస్తారు. మీరే మొట్టమొదట శివబాబాకు అవ్యభిచారీ భక్తి చేసారు, కావున తప్పకుండా మీరే మొట్టమొదటి భక్తులు. తర్వాత పడిపోతూ, పడిపోతూ తమోప్రధానముగా అయిపోతారు. అర్ధకల్పము మీరు భక్తి చేసారు, అందుకే మీకే మొట్టమొదట జ్ఞానాన్ని ఇస్తారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు.

మీ ఈ చదువులో - మేము దూరంగా ఉంటాము, అందుకే రోజూ వచ్చి చదువుకోలేము అన్న సాకు చెప్పడానికి వీలు లేదు. కొందరు, మేము 10 మైళ్ళ దూరంలో ఉంటాము అని అంటారు. అరే, బాబా స్మృతిలో మీరు 10 మైళ్ళు నడిచి వెళ్ళినా ఎప్పుడూ అలసట కలగదు. ఎంత పెద్ద ఖజానాను తీసుకునేందుకు వస్తారు. తీర్థయాత్రలలో మనుష్యులు దర్శనం చేసుకునేందుకు కాలినడకన వెళ్తారు, ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఇక్కడైతే ఇది ఒకే ఊరిలోని విషయము. తండ్రి అంటారు, నేను ఎంతో దూరం నుండి వచ్చాను, మీరేమో ఇల్లు 5 మైళ్ళ దూరముంది అని అంటారు... వాహ్! ఖజానాను తీసుకునేందుకైతే పరిగెత్తుకుంటూ రావాలి. అమరనాథ్ కు కేవలం దర్శనం చేసుకునేందుకు ఎక్కడెక్కడి నుండి వెళ్తారు. ఇక్కడైతే అమరనాథుడైన బాబా స్వయంగా చదివించడానికి వచ్చారు. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను. మీరు సాకులు చెప్తూ ఉంటారు. ఉదయం అమృతవేళలోనైతే ఎవరైనా రావచ్చు. ఆ సమయములో ఏ భయమూ ఉండదు. ఎవ్వరూ మిమ్మల్ని దోచుకోరు కూడా. ఒకవేళ నగలు మొదలైన వస్తువులేవైనా ఉంటే దోచుకుంటారు. దొంగలకు కావలసినవే ధనము, వస్తువులు. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే వారు ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. చదవకపోతే తమ పదవిని పోగొట్టుకుంటారు. తండ్రి రావడం కూడా భారత్ లోనే వస్తారు. భారత్ నే స్వర్గముగా తయారుచేస్తారు. క్షణములో జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. కానీ ఎవరైనా పురుషార్థము కూడా చేయాలి కదా. అడుగే వేయకపోతే అక్కడికి ఎలా చేరుకోగలుగుతారు?

ఇది ఆత్మ, పరమాత్మల మేళా అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. స్థాపన పూర్తవ్వగానే వినాశనము మొదలైపోతుంది. ఇది అదే మహాభారత యుద్ధము కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏ జ్ఞాన ఖజానానైతే ఇస్తున్నారో, దానిని తీసుకునేందుకు పరుగుపరుగున రావాలి, ఇందులో ఏ రకమైన సాకులూ చెప్పకూడదు. తండ్రి స్మృతిలో 10 మైళ్ళు కాలినడకన నడిచినా అలసట కలగదు.

2. విజయమాలలోకి వచ్చేందుకు ఆధారము చదువు. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేయాలి. మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజ్యాన్ని స్మృతి చేయాలి.

వరదానము:-
సంగమయుగ మహత్వాన్ని తెలుసుకుని ఒకటికి లెక్కలేనన్ని రెట్లు రిటర్న్ పొందే సర్వ ప్రాప్తి సంపన్న భవ

సంగమయుగములో బాప్ దాదా చేసిన వాగ్దానము ఏమిటంటే - ఒకటి ఇవ్వండి, లక్ష తీసుకోండి. ఏ విధంగా సర్వ శ్రేష్ఠ సమయము, సర్వ శ్రేష్ఠ జన్మ, సర్వ శ్రేష్ఠ టైటిళ్ళు ఈ సమయానికి చెందినవో, సర్వ ప్రాప్తుల అనుభవము ఇప్పుడే కలుగుతుంది. ఇప్పుడు ఒకటికి కేవలం లక్ష రెట్లు మాత్రమే లభించదు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా, ఏది కావాలనుకుంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుని రూపములో బంధించబడి ఉన్నారు. ఒకటికి లెక్కలేనన్ని రెట్లు రిటర్న్లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయములో వరదాతయే మీ వారు. బీజమే మీ చేతిలో ఉన్నప్పుడు ఆ బీజము ద్వారా ఏది కావాలనుకుంటే అది క్షణములో తీసుకుని సర్వ ప్రాప్తులతో సంపన్నముగా అవ్వగలుగుతారు.

స్లోగన్:-
ఎటువంటి పరిస్థితి అయినా, పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ సంతోషము పోకూడదు.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

‘‘ఏకత మరియు ఏకాగ్రత’’ - కార్యము చేయడములో సఫలతకు ఈ రెండూ శ్రేష్ఠమైన భుజాలు. ఏకాగ్రత అనగా సదా నిర్వ్యర్థ సంకల్పము, నిర్వికల్పము. ఎక్కడైతే ఏకత మరియు ఏకాగ్రత ఉంటాయో, అక్కడ సఫలత కంఠహారముగా ఉంటుంది. వరదాతకు ఒక పదము చాలా ఇష్టము - ‘ఏకవ్రత’, ఒకే బలము ఒకే నమ్మకము. దానితో పాటు ఏకమతము ఉండాలి, మన్మతము వద్దు, పరమతము వద్దు, ఏకరసముగా ఉండాలి, ఏ వ్యక్తి లేక వైభవము యొక్క రసము వద్దు. కేవలం ఏకత, ఏకాంతప్రియము.