ఓంశాంతి
పిల్లలు మొట్టమొదట ఈ ఒకే విషయాన్ని అర్థం చేసుకోవాలి - మనమందరమూ సోదరులము మరియు
శివబాబా అందరికీ తండ్రి. వారిని సర్వశక్తివంతుడు అని అంటారు. మీలో సర్వశక్తులూ
ఉండేవి. మీరు విశ్వమంతటిపై రాజ్యము చేసేవారు. భారత్ లో ఈ దేవీ-దేవతల రాజ్యముండేది,
మీరే పవిత్ర దేవీ-దేవతలుగా ఉండేవారు. మీ కులములో లేక వంశములో అందరూ నిర్వికారులుగా
ఉండేవారు. ఎవరు నిర్వికారులుగా ఉండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్ళీ మీరు నిర్వికారులుగా
తయారవుతున్నారు. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో శక్తిని తీసుకుంటున్నారు. తండ్రి
అర్థం చేయించారు, ఆత్మయే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే సతోప్రధానత
యొక్క శక్తి ఉండేది, అది మళ్ళీ రోజురోజుకు తగ్గుతూ ఉంటుంది. సతోప్రధానము నుండి
తమోప్రధానముగా అయితే తయారవ్వవలసిందే. ఉదాహరణకు బ్యాటరీ శక్తి తగ్గిపోతూ ఉంటే మోటార్
ఆగిపోతుంది. బ్యాటరీ డిస్చార్జ్ అయిపోతుంది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిస్చార్జ్
అవ్వదు, ఎంతో కొంత శక్తి మిగిలి ఉంటుంది. ఎవరైనా చనిపోతే దీపము వెలిగిస్తారు, అందులో
నూనె వేస్తూనే ఉంటారు, జ్యోతి ఆరిపోకూడదని. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు,
మీ ఆత్మలో పూర్తి శక్తి ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు
సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడిస్తారు, మీలో శక్తిని నింపుకుంటారు
ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. శక్తి పూర్తిగా సమాప్తమైపోతే ఇక శరీరమే ఉండదు. ఆత్మ
తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పూర్తిగా పవిత్రమైపోతుంది. సత్యయుగములో మీ బ్యాటరీ
పూర్తిగా చార్జ్ అయి ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా కళలు అనగా బ్యాటరీ తక్కువవుతూ
ఉంటుంది. కలియుగ అంతిమము కల్ల ఆత్మ శక్తి చాలా తక్కువైపోతుంది. శక్తి దివాలా
తీసినట్లయ్యింది. తండ్రిని స్మృతి చెయ్యడము ద్వారా ఆత్మ మళ్ళీ నిండుగా అవుతుంది.
కావున ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒక్కరినే స్మృతి చెయ్యాలి.
ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, మిగిలినవారంతా రచన. రచనకు రచన నుండి హద్దులోని
వారసత్వము లభిస్తుంది. రచయిత అయితే ఒక్క అనంతమైన తండ్రే. మిగిలినవారంతా
హద్దులోనివారే. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వము లభిస్తుంది.
కావున పిల్లలు హృదయములో అర్థం చేసుకోవాలి - బాబా మా కోసము స్వర్గాన్ని, కొత్త
ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని. డ్రామా ప్లాన్ అనుసారముగా స్వర్గ స్థాపన
జరుగుతుంది, అందులోకి పిల్లలైన మీరే వచ్చి రాజ్యము చేస్తారు. నేనైతే సదా పవిత్రుడను.
నేనెప్పుడూ గర్భము నుండి జన్మ తీసుకోను, దేవీ-దేవతలలా కూడా జన్మ తీసుకోను. కేవలం
పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి, ఈ బాబా 60 సంవత్సరాల వానప్రస్థావస్థలో
ఉన్నప్పుడు నేను ఇతని తనువులోకి ప్రవేశిస్తాను. తర్వాత ఇతనే నెం.1 తమోప్రధానము నుండి
నెం.1 సతోప్రధానముగా అవుతారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు,
శంకరులు, సూక్ష్మవతనవాసులు. ఈ బ్రహ్మా, విష్ణు, శంకరులు ఎక్కడి నుండి వచ్చారు? ఇది
కేవలం సాక్షాత్కారమవుతుంది. సూక్ష్మవతనము మధ్యలో ఉంటుంది కదా. అక్కడ స్థూల శరీరము
లేదు. సూక్ష్మ శరీరాన్ని కేవలం దివ్యదృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. బ్రహ్మా అయితే
శ్వేత వస్త్రధారి. ఆ విష్ణువు వజ్ర-వైఢూర్యాలతో అలంకరింపబడి ఉన్నారు. ఆ తర్వాత
శంకరుడి మెడలో సర్పము మొదలైనవి చూపిస్తారు. ఇలా శంకరుడు మొదలైనవారు ఎవరూ ఉండరు. అమర్
నాథ్ లో శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారు అన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు
సూక్ష్మవతనములోనైతే మనుష్య సృష్టి లేదు. మరి కథను అక్కడ ఎలా వినిపిస్తారు? ఇకపోతే
కేవలం సూక్ష్మవతనము సాక్షాత్కారమవుతుంది. ఎవరైతే పూర్తిగా పవిత్రముగా అవుతారో, వారి
సాక్షాత్కారమవుతుంది. వారే మళ్ళీ సత్యయుగములోకి వెళ్ళి స్వర్గాధిపతులుగా అవుతారు.
కావున వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు అన్నది బుద్ధిలోకి రావాలి. యుద్ధము
మొదలైనవైతే ఏవీ జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఎవరైనా నమ్మినా, నమ్మకపోయినా,
ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. దేహ సహితముగా దేహపు
సర్వ ధర్మాలను మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి అని గీతలో కూడా ఉంది. మమకారము
ఉండేందుకు తండ్రికైతే తమ దేహమే లేదు. తండ్రి అంటారు, కొద్ది సమయము కొరకు ఈ శరీరాన్ని
అప్పుగా తీసుకుంటాను, లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వను? నేను ఈ వృక్షానికి
చైతన్య బీజరూపుడను. ఈ వృక్షము యొక్క జ్ఞానము నా వద్ద మాత్రమే ఉంది. ఈ సృష్టి ఆయువు
ఎంత, దీని ఉత్పత్తి, పాలన, వినాశనము ఏ విధంగా జరుగుతుంది, మనుష్యులకు ఏమీ తెలియదు.
వారు హద్దులోని చదువును చదువుతారు, తండ్రి అయితే అనంతమైన చదువును చదివించి పిల్లలను
విశ్వాధిపతులుగా తయారుచేస్తారు.
దేహధారి అయిన మనిషిని భగవంతుడు అని ఎప్పుడూ పిలవరు. వీరికి (బ్రహ్మా, విష్ణు,
శంకరులకు) కూడా తమ సూక్ష్మ దేహము ఉంది, అందుకే వీరిని కూడా భగవంతుడు అని అనరు. ఈ
శరీరమైతే ఈ దాదా ఆత్మకు సింహాసనము. అకాల సింహాసనము కదా. ఇప్పుడు ఇది అకాలమూర్తి
అయిన తండ్రి సింహాసనము. అమృత్సర్ లో కూడా అకాల సింహాసనము ఉంది. అక్కడి పెద్ద-పెద్ద
వారెవరైతే ఉంటారో, వారు వెళ్ళి అకాల సింహాసనముపై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం
చేయిస్తారు, ఇది ఆత్మలందరి అకాల సింహాసనము. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు
ఉంటాయి, అందుకే ఇది కర్మల ఫలము అని అంటారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. బాబా ఏమీ
శాస్త్రాలు మొదలైనవి చదివి వినిపించరు. ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైనవాటిలో లేవు,
అందుకే లోకులు వీళ్ళు శాస్త్రాలను నమ్మరు అని అంటూ చిరచిరలాడుతారు. సాధు-సన్యాసులు
మొదలైనవారు గంగలోకి వెళ్ళి స్నానాలు చేస్తారు, మరి వారు పావనమయ్యారా? తిరిగి అయితే
ఎవరూ వెళ్ళలేరు. అందరూ అంతిమములో వెళ్తారు. మిడతల గుంపు లేక తేనెటీగల గుంపు
వెళ్ళినట్లుగా వెళ్తారు. తేనెటీగలలో కూడా రాణీ ఈగ ఒకటి ఉంటుంది, దాని వెనుక అన్నీ
వెళ్తాయి. అలాగే తండ్రి కూడా వెళ్తారు, వారి వెనుక ఆత్మలందరూ కూడా వెళ్తారు.
మూలవతనములో కూడా ఆత్మలందరి గుంపు ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడేమో మనుష్యులందరి గుంపు
ఉంది. ఈ గుంపు కూడా ఒకరోజు పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయేదే ఉంది. తండ్రి వచ్చి
ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు గాయనం చేయబడింది. కుమారులైనా,
కుమార్తెలైనా, తండ్రి వచ్చి పిల్లలకు స్మృతియాత్రను నేర్పిస్తారు. పవిత్రముగా
అవ్వకుండా ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడైతే పవిత్రముగా అవుతుందో, అప్పుడు
మొదట శాంతిధామానికి వెళ్తుంది, ఆ తర్వాత అక్కడి నుండి మెల్లమెల్లగా కిందకు వస్తూ
ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా. అందరూ కలిసి రారు. వృక్షము
మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది కదా. మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉంటుంది,
దానిని తండ్రి స్థాపన చేస్తారు. ఎవరైతే దేవతలుగా అయ్యేది ఉందో, బ్రాహ్మణులుగా కూడా
మొట్టమొదట వారే అవుతారు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఉన్నారు కదా. ప్రజలలో కూడా సోదరీ,
సోదరులు అవుతారు. బ్రహ్మాకుమార, కుమారీలైతే ఇక్కడ అనేకమంది తయారవుతారు. తప్పకుండా
నిశ్చయబుద్ధి కలవారై ఉంటారు, కావుననే ఇన్ని ఎక్కువ మార్కులు తీసుకుంటారు. మీలో
ఎవరైతే పక్కాగా ఉంటారో వారు అక్కడ మొదట వస్తారు, అపరిపక్వముగా ఉన్నవారు చివరిలోనే
వస్తారు. మూలవతనములో ఆత్మలందరూ ఉంటారు, వారు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు వృద్ధి
జరుగుతూ ఉంటుంది. శరీరము లేకుండా ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది? ఇది పాత్రధారుల
ప్రపంచము, ఇది నాలుగు యుగాలలో తిరుగుతూ ఉంటుంది. సత్యయుగములో మనమే దేవతలుగా
ఉండేవారము, తర్వాత మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇప్పుడు ఇది
పురుషోత్తమ సంగమయుగము. ఈ యుగము ఇప్పుడే, తండ్రి వచ్చినప్పుడే తయారవుతుంది. ఈ
అనంతమైన జ్ఞానాన్ని ఇప్పుడు అనంతమైన తండ్రే ఇస్తారు. శివబాబాకు తమ శారీరక నామమేదీ
లేదు. ఈ శరీరమైతే ఈ దాదాకు చెందినది. బాబా కొద్ది సమయము కొరకు దీనిని అప్పుగా
తీసుకున్నారు. తండ్రి అంటారు, నేను మీతో మాట్లాడేందుకు నాకు నోరు అయితే కావాలి కదా.
నోరు లేకపోతే తండ్రి పిల్లలతో మాట్లాడలేరు కూడా. అంతేకాక అనంతమైన జ్ఞానాన్ని కూడా ఈ
నోటి ద్వారా వినిపిస్తాను, కావుననే దీనిని గోముఖము అని కూడా అంటారు. పర్వతాల నుండి
నీరు అయితే ఎక్కడి నుండైనా వెలువడుతూ ఉంటుంది, ఇక్కడ ఒక గోముఖాన్ని తయారుచేసారు,
దాని నుండి నీరు వస్తూ ఉంటుంది, దానిని వారు గంగాజలముగా భావిస్తూ తాగుతారు. ఆ నీటికి
ఎంత మహత్వాన్ని ఇస్తారు. ఈ ప్రపంచములో అంతా అసత్యమే, సత్యమునైతే ఒక్క తండ్రే
వినిపిస్తారు, ఆ అసత్యమైన మనుష్యులేమో ఈ తండ్రి జ్ఞానాన్నే అసత్యముగా భావిస్తారు.
భారత్ లో సత్యయుగము ఉన్నప్పుడు దీనిని సత్యఖండము అని అంటారు. తర్వాత భారత్ యే పాతగా
అయినప్పుడు ప్రతి విషయము, ప్రతి వస్తువు అసత్యముగా అయిపోతుంది. ఎంత తేడా
వచ్చేస్తుంది. తండ్రి అంటారు, మీరు నన్ను ఎంతగా గ్లాని చేస్తారు. సర్వవ్యాపి అంటూ
ఎంతగా అవమానపరిచారు. ఈ పాత ప్రపంచము నుండి తీసుకువెళ్ళండి అనే శివబాబాను పిలుస్తారు.
తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామ చితి పైకి ఎక్కి నిరుపేదలుగా అయిపోయారు. తండ్రి
పిల్లలతో అంటున్నారు, మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా, మీకు ఆ స్మృతి కలుగుతోందా?
తండ్రి పిల్లలకే అర్థం చేయిస్తారు, మొత్తం ప్రపంచానికైతే అర్థం చేయించరు. పిల్లలే
తండ్రిని అర్థం చేసుకుంటారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏం తెలుసు!
అన్నింటికన్నా పెద్ద ముల్లు కామము. దీని పేరే పతిత ప్రపంచము. సత్యయుగము 100 శాతం
పవిత్ర ప్రపంచము. మనుష్యులే పవిత్ర దేవతల వద్దకు వెళ్ళి నమస్కరిస్తారు. శాకాహారము
తినే భక్తులు ఎంతోమంది ఉన్నారు, అలాగని వారు వికారాలలోకి వెళ్ళారని కాదు. ఆ
మాటకొస్తే చాలామంది బాల బ్రహ్మచారులుగా కూడా ఉంటారు. చిన్నప్పటి నుండీ ఏ అశుద్ధమైన
పదార్థాలు తినరు. సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వండి అని అంటారు.
ఇళ్ళు-వాకిళ్ళను సన్యసిస్తారు, మళ్ళీ మరుసటి జన్మలో కూడా ఎవరో ఒక గృహస్థుల వద్ద
జన్మ తీసుకుని మళ్ళీ ఇళ్ళు-వాకిళ్ళు వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు. కానీ పతితుల
నుండి పావనులుగా అవ్వగలరా? అవ్వలేరు. పతిత-పావనుడైన తండ్రి యొక్క శ్రీమతము లేకుండా
ఎవ్వరూ పతితుల నుండి పావనులుగా అవ్వలేరు. భక్తి దిగే కళ యొక్క మార్గము. మరి దాని
ద్వారా పావనముగా ఎలా అవుతారు? పావనముగా అయితే ఇంటికి వెళ్తారు, స్వర్గములోకి వస్తారు.
సత్యయుగీ దేవీ-దేవతలు ఎప్పుడైనా ఇళ్ళు-వాకిళ్ళను వదులుతారా? వాళ్ళది హద్దులోని
సన్యాసము, మీది అనంతమైన సన్యాసము. మొత్తం ప్రపంచమూ, మిత్ర-సంబంధీకులు మొదలైనవారి
అందరి సన్యాసము. మీ కొరకు ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. మీ బుద్ధి స్వర్గము
వైపు ఉంది. మనుష్యులైతే నరకములోనే వేలాడుతున్నారు. పిల్లలైన మీరేమో తండ్రి స్మృతిలో
వేలాడుతున్నారు.
మిమ్మల్ని శీతలాదేవీలుగా చేసేందుకు జ్ఞానచితిపై కూర్చోబెడతారు. శీతలతకు వ్యతిరేక
పదము వేడి. మీ పేరే శీతలాదేవి. ఒక్కరే అయితే ఉండరు కదా. ఈ భారత్ ను శీతలముగా
తయారుచేసినవారు తప్పకుండా చాలామంది ఉండి ఉంటారు. ఈ సమయములో అందరూ కామ చితిపై
కాలిపోతున్నారు. ఇక్కడ మీ పేరు శీతలాదేవీలు. మీరు శీతలముగా చేసే, చల్లని జల్లును
కురిపించే దేవీలు. చల్లని జల్లును కురిపించడానికి వెళ్తారు కదా. ఇవి జ్ఞాన బిందువులు,
ఇవి ఆత్మ పైన చల్లడం జరుగుతుంది. ఆత్మ పవిత్రమవ్వడముతో శీతలమవుతుంది. ఈ సమయములో
ప్రపంచమంతా కామ చితి పైకి ఎక్కి నల్లగా అయిపోయింది. ఇప్పుడు కలశము పిల్లలైన మీకు
లభిస్తుంది. కలశముతో మీరు స్వయమూ శీతలమవుతారు మరియు ఇతరులను కూడా తయారుచేస్తారు.
వీరు కూడా శీతలమయ్యారు కదా. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇళ్ళు-వాకిళ్ళను వదిలే మాట అయితే
లేనే లేదు, కానీ గోశాల తయారైంది అంటే తప్పకుండా ఎవరో ఒకరు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి
ఉంటారు. ఎందుకోసము? జ్ఞానచితిపై కూర్చుని శీతలముగా అయ్యేందుకు. ఎప్పుడైతే మీరు
ఇక్కడ శీతలమవుతారో అప్పుడే మీరు దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగము
పాత ఇంటివైపుకు వెళ్ళకూడదు. తండ్రితో బుద్ధి వేలాడుతూ ఉండాలి ఎందుకంటే మీరందరూ
తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, నేను మిమ్మల్ని
తీసుకువెళ్ళేందుకు పండాగా అయి వచ్చాను. ఇది శివశక్తీ పాండవ సైన్యము. మీరు శివుడి
నుండి శక్తిని తీసుకునేవారు, వారు సర్వశక్తివంతుడు. పరమాత్మ మరణించిన వారిని
జీవింపజేయగలరు అని మనుష్యులు భావిస్తారు. కానీ తండ్రి అంటారు - ప్రియమైన పిల్లలూ, ఈ
డ్రామాలో ప్రతి ఒక్కరికీ అనాది పాత్ర లభించి ఉంది. నేను కూడా క్రియేటర్ ను,
డైరెక్టర్ ను, ముఖ్యమైన యాక్టర్ ను. డ్రామాలోని పాత్రను మనము ఏ మాత్రమూ మార్చలేము.
ఆకు, ఆకు కూడా పరమాత్ముని ఆజ్ఞానుసారముగానే కదులుతుంది అని మనుష్యులు భావిస్తారు
కానీ పరమాత్మ స్వయం అంటారు, నేను కూడా డ్రామాకు ఆధీనమై ఉన్నాను, దీని బంధనములో
బంధింపబడి ఉన్నాను. నా ఆజ్ఞానుసారముగా ఆకులు కదులుతాయని కాదు. సర్వవ్యాపి జ్ఞానము
భారతవాసులను పూర్తిగా పేదవారిగా చేసేసింది. తండ్రి జ్ఞానముతో భారత్ మళ్ళీ
శిరోకిరీటముగా అవుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.