20-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉండే అభ్యాసము చేసినట్లయితే సదా హర్షితముఖులుగా, వికసించిన పుష్పాలలా ఉంటారు, తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది, ఎప్పుడూ వాడిపోరు’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఈ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నషాతో గడపాలి?

జవాబు:-
సదా నషా ఉండాలి - మేము ఈ చదువుతో రాకుమార, రాకుమారీలుగా తయారవుతాము. ఈ జీవితాన్ని నవ్వుతూ-ఆడుతూ, జ్ఞాన నాట్యము చేస్తూ గడపాలి. సదా వారసులై పుష్పాలుగా అయ్యే పురుషార్థము చేస్తూ ఉండండి. ఇది రాకుమార, రాకుమారీలుగా తయారయ్యే కాలేజ్. ఇక్కడ చదువుకోవాలి కూడా, అలాగే చదివించాలి కూడా, ప్రజలను కూడా తయారుచేసుకోవాలి, అప్పుడే రాజుగా అవ్వగలరు. తండ్రి అయితే చదివినవారే, వారు చదవవలసిన అవసరము లేదు.

పాట:-
బాల్యపు రోజులను మర్చిపోవద్దు...

ఓంశాంతి
ఈ పాట విశేషముగా పిల్లల కోసము. ఇది సినిమా పాటే అయినా కానీ కొన్ని పాటలు కేవలం మీ కోసమే ఉన్నాయి. సుపుత్రులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారు ఈ పాటలు వినే సమయములో దాని అర్థాన్ని వారి హృదయములోకి తీసుకురావలసి ఉంటుంది. తండ్రి - నా ప్రియమైన పిల్లలూ అని అర్థం చేయిస్తారు, ఎందుకంటే మీరు పిల్లలుగా అయ్యారు. ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడే తండ్రి వారసత్వము కూడా గుర్తుంటుంది. పిల్లలుగా అవ్వకపోతే ఇక గుర్తు చేసుకోవలసి వస్తుంది. మేము భవిష్యత్తులో బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని పిల్లలకు స్మృతి ఉంటుంది. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. మనము భవిష్యత్తులో రాకుమార, రాకుమారీలుగా అవుతాము. మనము వారి పిల్లలము. మిగిలిన మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవరైతే ఉన్నారో, వారందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దేహము కూడా గుర్తుకు రాకూడదు. దేహాభిమానాన్ని తెంచి దేహీ-అభిమానులుగా అవ్వాలి. దేహాభిమానములోకి రావడం వల్లనే అనేక రకాల సంకల్ప-వికల్పాలు తలక్రిందులుగా పడేస్తాయి. స్మృతి చేసే అభ్యాసము చేస్తూ ఉన్నట్లయితే సదా హర్షితముఖులుగా, వికసించిన పుష్పాలలా ఉంటారు. స్మృతిని మర్చిపోవడముతో పుష్పము వాడిపోతుంది. ధైర్యమునుంచే పిల్లలకు తండ్రి సహాయము చేస్తారు. పిల్లలుగానే అవ్వకపోతే ఇక తండ్రి ఏ విషయములో సహాయము చేస్తారు? ఎందుకంటే అటువంటివారికి మాయ, రావణుడు తల్లి-తండ్రి, కావున వారి నుండి కింద పడేందుకు సహాయము లభిస్తుంది. ఈ పాట అంతా పిల్లలైన మీ పైనే తయారుచేయబడి ఉంది - బాల్యపు రోజులను మర్చిపోకండి... తండ్రిని స్మృతి చెయ్యాలి, స్మృతి చేయకపోతే ఈ రోజు ఎవరైతే నవ్వుతారో, రేపు మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. స్మృతి చేయడము ద్వారా సదా హర్షితముఖులుగా ఉంటారు. పిల్లలైన మీకు తెలుసు - ఒక్క గీతాశాస్త్రములోనే కొన్ని-కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి. యుద్ధ మైదానములో మరణిస్తే స్వర్గములోకి వెళ్తారని వ్రాయబడి ఉంది. కానీ ఇందులో హింసాత్మక యుద్ధము యొక్క విషయమే లేదు. పిల్లలైన మీరు తండ్రి నుండి శక్తి తీసుకుని మాయపై విజయము పొందాలి. కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది, అప్పుడే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. దానికి వారు స్థూల మారణాయుధాలు మొదలైనవి చూపించారు. జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణాలు అనే పదాలు వినేటప్పటికి వాటిని స్థూలరూపములో ఆయుధాలుగా చూపించారు. వాస్తవానికి ఇవి జ్ఞాన విషయాలు. ఇకపోతే ఇన్ని భుజాలు మొదలైనవైతే ఎవరికీ ఉండవు. కావున ఇది యుద్ధ మైదానము. యోగములో ఉంటూ, శక్తిని తీసుకుని వికారాలపై విజయము పొందాలి. తండ్రిని స్మృతి చేయడము వలన వారసత్వము గుర్తుకు వస్తుంది. వారసులే వారసత్వాన్ని తీసుకుంటారు. వారసులుగా అవ్వకపోతే మరి ప్రజలుగా అవుతారు. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. ఇది తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు.

తండ్రి అంటారు, నేను ఈ సాధారణ తనువు యొక్క ఆధారాన్ని తీసుకుని రావలసి వస్తుంది. ప్రకృతి యొక్క ఆధారము తీసుకోకుండా పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించను? ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఇక మాట్లాడటము కుదరదు. మళ్ళీ శరీరాన్ని ధారణ చేసిన తర్వాత, బిడ్డ కాస్త పెరిగి పెద్దయితే బయటకు వస్తాడు మరియు బుద్ధి తెరుచుకుంటుంది. చిన్న పిల్లలు అయితే పవిత్రముగానే ఉంటారు, వారిలో వికారాలు ఉండవు. సన్యాసులు మెట్లు ఎక్కి మళ్ళీ కిందికి దిగుతారు. వారు తమ జీవితాన్ని అర్థం చేసుకోగలరు. పిల్లలైతే ఉండటమే పవిత్రముగా ఉంటారు, అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమని గానం చేయబడింది. పిల్లలైన మీకు తెలుసు - ఈ శరీరాన్ని వదిలి మనము రాకుమార, రాకుమారీలుగా అవుతాము. ఇంతకుముందు కూడా మనము తయారయ్యాము, ఇప్పుడు మళ్ళీ తయారవుతాము. ఇటువంటి ఆలోచనలు విద్యార్థులకు ఉంటాయి. అది కూడా, ఎవరైతే పిల్లలుగా అయి, విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా ఉంటూ శ్రీమతముపై నడుస్తూ ఉంటారో వారి బుద్ధిలోకే వస్తాయి. లేకపోతే శ్రేష్ఠ పదవిని పొందలేరు. టీచరు అయితే చదివినవారే. వారు చదివి, ఆ తర్వాత చదివిస్తారు అని కాదు. అలా కాదు. ఈ టీచరు అయితే చదివినవారే. వీరిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంకెవరికీ తెలియదు. ముందుగా వీరు తండ్రి అనే నిశ్చయము కావాలి. ఒకవేళ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే లోపల ఘర్షణ నడుస్తూ ఉంటుంది. నడవగలమో లేదో తెలియదు అని అనుకుంటారు. బాబా అర్థం చేయించారు - ఎప్పుడైతే మీరు తండ్రి ఒడిలోకి వస్తారో అప్పుడు ఈ వికారాల వ్యాధి ఇంకా ఎక్కువ తీవ్రతతో బయటికి వస్తుంది. వ్యాధి తిరగబడుతుంది అని వైద్యులు కూడా చెప్తారు. తండ్రి కూడా అంటారు, మీరు పిల్లలుగా అయితే దేహాభిమానము, కామము, క్రోధము మొదలైనవాటి వ్యాధి పెరుగుతుంది. లేకపోతే పరీక్ష ఎలా జరుగుతుంది? ఎక్కడైనా తికమకపడుతుంటే అడుగుతూ ఉండండి. ఎప్పుడైతే మీరు మంచి యోధులుగా అవుతారో అప్పుడు మాయ మిమ్మల్ని కింద పడేయడానికి బాగా దెబ్బ వేస్తుంది. మీరు బాక్సింగ్ లో ఉన్నారు. పిల్లలుగా అవ్వకపోతే బాక్సింగ్ యొక్క మాటే లేదు. వాళ్ళైతే వాళ్ళ సంకల్ప-వికల్పాలలోనే మునుగుతూ మోసపోతూ ఉంటారు, వారికి ఏ సహాయమూ లభించదు. బాబా అర్థం చేయిస్తున్నారు - మమ్మా, బాబా అని అంటున్నారంటే తండ్రికి పిల్లలుగా అవ్వవలసి ఉంటుంది, అప్పుడిక వీరు మా ఆత్మిక తండ్రి అని హృదయములో పక్కా అయిపోతుంది. ఇకపోతే ఇది యుద్ధ మైదానము. తుఫానులో నిలవగలుగుతామో లేదోనని ఇందులో భయపడకూడదు. అటువంటివారిని బలహీనులు అని అంటారు. ఇందులో సింహములా అవ్వవలసి ఉంటుంది. పురుషార్థము కోసము మంచి డైరెక్షన్లను తీసుకోవాలి. తండ్రిని అడగాలి. చాలామంది పిల్లలు తమ అవస్థ గురించి వ్రాసి పంపిస్తారు. తండ్రే సర్టిఫికేట్ ఇవ్వాలి. వీరి నుండి దాచగలరు కానీ శివబాబా నుండైతే దాచలేరు. దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు కానీ వారి నుండి ఏదీ దాగలేదు. మంచికి మంచి ఫలము, చెడుకు చెడు ఫలము ఉంటుంది. సత్య, త్రేతా యుగాలలోనైతే అంతా మంచే జరుగుతుంది. మంచి-చెడులు, పాప-పుణ్యాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ దాన పుణ్యాలు కూడా చెయ్యబడవు. అక్కడ ఉండేదే ప్రారబ్ధము. ఇక్కడ మనము పూర్తిగా సరెండర్ (సమర్పణ) అయితే బాబా 21 జన్మల కొరకు రిటర్నులో ఇస్తారు. ఫాలో ఫాదర్ చేయాలి. ఒకవేళ తప్పుడు పని ఏదైనా చేస్తే పేరు కూడా తండ్రిది అప్రతిష్టపాలు చేస్తారు, అందుకే శిక్షణ కూడా ఇవ్వవలసి ఉంటుంది. రూప్, బసంత్ (యోగి, జ్ఞాని) గా కూడా అందరూ తయారవ్వాలి. ఆత్మలైన మనల్ని బాబా చదివించారు, మళ్ళీ మనము ఇతరులను చదివించాలి కూడా. సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన గీతను వినిపించాలి. ఇతర శాస్త్రాల విషమేమీ లేదు. ముఖ్యమైనది గీత. మిగిలినవన్నీ దాని పిల్లలు. వాటితో ఎవరి కళ్యాణమూ జరగదు. నన్ను ఎవరూ వచ్చి కలవరు. నేనే వచ్చి మళ్ళీ సహజ జ్ఞానాన్ని, సహజ యోగాన్ని నేర్పిస్తాను. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత, ఆ సత్యమైన గీత ద్వారా వారసత్వము లభిస్తుంది. శ్రీకృష్ణునికి కూడా గీత ద్వారా వారసత్వము లభించింది. గీతకు కూడా తండ్రి అయిన రచయిత ఎవరైతే ఉన్నారో, వారు కూర్చుని వారసత్వాన్ని ఇస్తారు. అంతేకానీ గీత శాస్త్రము ద్వారా వారసత్వము లభించదు. రచయిత ఒక్కరే, మిగిలినవన్నీ వారి రచన. మొదటి నంబరు శాస్త్రము గీత, ఆ తర్వాత ఏ శాస్త్రాలైతే తయారవుతాయో, వాటి ద్వారా కూడా వారసత్వము లభించదు. వారసత్వము సమ్ముఖముగానే లభిస్తుంది. ముక్తి వారసత్వమైతే అందరికి లభించేది ఉంది, అందరూ తిరిగి వెళ్ళాలి. కానీ స్వర్గ వారసత్వము చదువు ద్వారా లభిస్తుంది. ఆపై ఎవరు ఎంత చదువుకుంటే అంత. తండ్రి సమ్ముఖముగా చదివిస్తారు. ఎప్పటివరకైతే ఎవరు చదివిస్తున్నారు అన్న నిశ్చయము ఉండదో, అప్పటివరకు ఏమి అర్థం చేసుకుంటారు? ఏమి ప్రాప్తి చేసుకోగలరు? అయినా కానీ తండ్రి నుండి వింటూ ఉంటే జ్ఞానము వినాశనము కాదు. ఎంతగా సుఖము లభిస్తుందో, అంతగా ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తారు. ప్రజలను తయారుచేసుకుంటే తర్వాత స్వయం రాజుగా అవుతారు.

మనది విద్యార్థి జీవితము. నవ్వుతూ, ఆడుతూ, జ్ఞాన నాట్యము చేస్తూ మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. నేను రాకుమారునిగా అయ్యేది ఉంది అని విద్యార్థికి తెలుసు కావున సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది రాకుమార, రాకుమారీల కాలేజ్. అక్కడ రాకుమార, రాకుమారీలకు వేర్వేరు కాలేజ్ ఉంటుంది. విమానాలు ఎక్కి వెళ్తారు. విమానాలు కూడా అక్కడ ఫుల్ ప్రూఫ్ గా (పూర్తి సురక్షితముగా) ఉంటాయి, ఎప్పుడూ విరగవు. ఏ రకమైన ప్రమాదాలూ ఎప్పుడూ జరిగేదే లేదు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఒకటేమో, తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని ఉంచవలసి ఉంటుంది, రెండవది, ఎవరెవరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు అని తండ్రికి పూర్తి సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. తండ్రితో పూర్తి సంబంధం పెట్టుకోవలసి ఉంటుంది, అప్పుడు టీచర్ కూడా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఎవరు వారసులుగా అయి పుష్పములా తయారయ్యే పురుషార్థము చేస్తున్నారు? ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు, మరి ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో, అప్పుడు పుష్పాలుగా అవుతారు. లేకపోతే మొగ్గలు మొగ్గలుగానే ఉండిపోతారు అనగా ప్రజలలోకి వస్తారు. ఇప్పుడు ఎవరు ఎటువంటి పురుషార్థము చేస్తే, అటువంటి పదవిని పొందుతారు. ఒకరు పరిగెత్తితే మేము వారి తోక పట్టుకుంటాము అంటే అది అవ్వదు. భారతవాసులు ఇలానే భావిస్తారు. కానీ తోక పట్టుకునే విషయమే లేదు. ఎవరు చేస్తే వారే పొందుతారు. ఎవరైతే పురుషార్థము చేస్తారో, 21 తరాలకు వారి ప్రారబ్ధము తయారవుతుంది. వృద్ధులుగా అయితే తప్పకుండా అవుతారు. కానీ అకాలమృత్యువు ఉండదు. ఎంత గొప్ప పదవి. తండ్రి అర్థం చేసుకుంటారు - వీరి భాగ్యము తెరుచుకుంది, వారసునిగా అయ్యారు, ఇప్పుడు పురుషార్థిగా ఉన్నారు అని. బాబా, ఈ ఈ విఘ్నాలు వస్తున్నాయి, ఇలా అవుతుంది అని రిపోర్టు కూడా చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ లెక్కాపత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇంతటి శ్రమ మరే సత్సంగములోనూ ఉండదు. బాబా అయితే చిన్న-చిన్న పిల్లలను కూడా సందేశీలుగా తయారుచేస్తారు. యుద్ధములో సందేశాన్ని తీసుకువెళ్ళేవారు కూడా కావాలి కదా. ఇది యుద్ధ మైదానము. ఇక్కడ మీరు సమ్ముఖముగా వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది, హృదయము సంతోషిస్తుంది. బయటికి వెళ్ళాక కొంగల సాంగత్యము లభిస్తే సంతోషము ఎగిరిపోతుంది. అక్కడ మాయ ధూళి ఉంది కదా, అందుకే పక్కాగా తయారవ్వవలసి ఉంటుంది.

బాబా ఎంత ప్రేమగా చదివిస్తారు, ఎన్ని సదుపాయాలు కల్పిస్తారు. బాగుంది, బాగుంది అని చెప్పి మళ్ళీ మాయమైపోయేవారు కూడా చాలామంది ఉన్నారు, ఎవరో అరుదుగా నిలబడగలుగుతారు. ఇక్కడ జ్ఞాన నషా కావాలి. మద్యము యొక్క నషా కూడా ఉంటుంది కదా. ఎవరైనా దివాలా తీసి, వారు మద్యము త్రాగితే, జోరుగా దాని నషా ఎక్కితే, ఇక మేము రాజులకే రాజులము అని అనుకుంటారు. ఇక్కడ పిల్లలైన మీకు రోజూ జ్ఞానామృతము యొక్క గిన్నె లభిస్తుంది. ధారణ చేసేందుకు రోజు రోజుకు ఎటువంటి పాయింట్లు లభిస్తాయంటే, వాటితో బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది, అందుకే ఎలాగైనా మురళిని చదవాలి. గీతను రోజూ పఠిస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా రోజూ తండ్రి వద్ద చదువుకోవలసి ఉంటుంది. నా ఉన్నతి జరగడం లేదు, కారణమేమిటి? అని అడగాలి. వచ్చి అర్థం చేసుకోవాలి. వారు మా తండ్రి అని ఎవరికైతే పూర్తి నిశ్చయము ఉంటుందో వారే వస్తారు. అంతేకానీ నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాను అని అనడం కాదు. నిశ్చయమనేది ఒకటే ఉంటుంది, అందులో పర్సెంటేజ్ ఉండదు. తండ్రి ఒక్కరే, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఇక్కడ వేలాదిమంది చదువుకుంటారు, అయినా సరే నేనెలా నిశ్చయము పెట్టుకోవాలి? అని అంటే, వారిని దురదృష్టవంతులు అని అనడం జరుగుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి, అంగీకరిస్తారో, వారు అదృష్టవంతులు. ఎవరైనా రాజు నాకు దత్తపుత్రునిగా అవ్వు అని చెప్తే, అతనికి దత్తతగా వెళ్ళడముతోనే నిశ్చయము ఏర్పడిపోతుంది కదా. అంతేకానీ నిశ్చయమెలా పెట్టుకోవాలి? అని అనరు. ఇది రాజయోగము. తండ్రి స్వర్గ రచయిత కావున స్వర్గానికి యజమానులుగా చేస్తారు. నిశ్చయము లేకపోతే మీ అదృష్టములో లేదు, ఇంకెవరేమి చెయ్యగలరు? అంగీకరించకపోతే ఇక పురుషార్థము ఎలా జరుగుతుంది? వారు కుంటుతూనే నడుస్తారు. అనంతమైన తండ్రి నుండి భారతవాసులకు కల్ప-కల్పము స్వర్గ వారసత్వము లభిస్తుంది. దేవతలు స్వర్గములోనే ఉంటారు. కలియుగములోనైతే రాజ్యము లేదు. ప్రజలపై ప్రజల రాజ్యము ఉంది. ఇది పతిత ప్రపంచము కావున దీనిని పావన ప్రపంచముగా తండ్రి చేయకపోతే మరెవరు చేస్తారు? భాగ్యములో లేకపోతే మరి అర్థం చేసుకోరు. ఇదైతే చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము. లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్య ప్రారబ్ధాన్ని ఎప్పుడు పొందారు? తప్పకుండా ముందు జన్మల కర్మలు ఉన్నాయి, అందుకే ప్రారబ్ధాన్ని పొందారు. లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు నరకము ఉంది కావున అటువంటి శ్రేష్ఠ కర్మలను లేక రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఇప్పుడు అందరిదీ అంతిమ జన్మ. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ద్వాపరములో రాజయోగాన్ని నేర్పిస్తారా. ద్వాపరము తర్వాత సత్యయుగము వస్తుందా. ఇక్కడైతే చాలా బాగా అర్థం చేసుకుని వెళ్తారు. బయటకు వెళ్ళడముతోనే ఖాళీ అయిపోతారు. డబ్బాలో నుండి రత్నాలు పడిపోయి మట్టిపెంకులు మిగిలిపోయినట్లు ఉంటుంది. జ్ఞానము వింటూ, వింటూ మళ్ళీ వికారాలలో పడిపోయారంటే ఇక అంతే. బుద్ధి నుండి జ్ఞాన రత్నాలు బయటకు కొట్టుకుపోతాయి. ఎంతోమంది ఇలా కూడా వ్రాస్తారు - బాబా, కష్టపడుతూ, కష్టపడుతూ మళ్ళీ ఈ రోజు పడిపోయాను. పడిపోయారు అంటే స్వయానికి మరియు కులానికి కళంకము తీసుకొచ్చారు, భాగ్యానికి అడ్డుగీత గీసుకున్నారు. ఇంట్లో కూడా పిల్లలు ఒకవేళ ఏదైనా చేయకూడని పని చేస్తే ఇటువంటి పిల్లలు చనిపోవడము మంచిది అని అంటారు. కావున ఈ అనంతమైన తండ్రి చెప్తున్నారు, కుల కళంకితులుగా అవ్వకండి. ఒకవేళ వికారాలను దానము చేసి మళ్ళీ తిరిగి తీసుకుంటే పదవీ భ్రష్టులుగా అయిపోతారు. పురుషార్థము చెయ్యాలి, విజయము పొందాలి. దెబ్బ తగిలితే మళ్ళీ లేచి నిలబడండి. పదే-పదే దెబ్బలు తింటూ ఉంటే ఇక ఓడిపోయి స్పృహ కోల్పోతారు. తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తారు కానీ ఎవరైనా నిలవాలి కదా. మాయ చాలా తీక్షణమైనది. పవిత్రత ప్రతిజ్ఞను చేసి, మళ్ళీ పడిపోతే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది. నావ పవిత్రతతోనే తీరం చేరుతుంది. పవిత్రత ఉండేది కావుననే భారత్ యొక్క సితార మెరుస్తూ ఉండేది. ఇప్పుడైతే ఘోర అంధకారము ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ యుద్ధ మైదానములో మాయకు భయపడకూడదు. తండ్రి నుండి పురుషార్థము కొరకు మంచి డైరెక్షన్లు తీసుకోవాలి. విశ్వాసపాత్రులుగా, ఆజ్ఞాకారులుగా అయి శ్రీమతముపై నడుస్తూ ఉండాలి.

2. ఆత్మిక నషాలో ఉండేందుకు జ్ఞానామృతము యొక్క గిన్నె నుండి రోజూ త్రాగుతూ ఉండాలి. మురళిని రోజూ చదవాలి. అదృష్టవంతులుగా అయ్యేందుకు తండ్రిపై ఎప్పుడూ సంశయము రాకూడదు.

వరదానము:-
బ్రహ్మాబాబా సమానముగా జీవన్ముక్త స్థితిని అనుభవము చేసే కర్మ బంధనాల నుండి ముక్త భవ

బ్రహ్మాబాబా కర్మలు చేస్తూ కూడా కర్మల బంధనములో చిక్కుకోలేదు. సంబంధాలను నిర్వర్తిస్తూ కూడా సంబంధాల బంధనములో బంధింపబడలేదు. వారు ధనము మరియు సాధనాల యొక్క బంధనము నుండి కూడా ముక్తులుగా ఉన్నారు, బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా జీవన్ముక్త స్థితిని అనుభవము చేసారు, అలా ఫాలో ఫాదర్ చేయండి. ఏ గత లెక్కాచారాల బంధనములోనూ బంధింపబడకండి. సంస్కారాలు, స్వభావము, ప్రభావము మరియు అణచివేత యొక్క బంధనములోకి కూడా రాకండి, అప్పుడే కర్మబంధనముక్తులు, జీవన్ముక్తులు అని అంటారు.

స్లోగన్:-
తమోగుణీ వాయుమండలములో స్వయాన్ని సురక్షితముగా ఉంచుకోవాలంటే సాక్షీగా అయి ఆటను చూసే అభ్యాసము చేయండి.