21-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు కరెంట్ ఇవ్వడానికి వచ్చారు, మీరు దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే, బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉన్నట్లయితే కరెంట్ లభిస్తూ ఉంటుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మీలో ఉండకూడని, అన్నింటికన్నా పెద్ద ఆసురీ స్వభావము ఏమిటి?

జవాబు:-
అశాంతిని వ్యాపింపజేయడము, ఇదే అన్నింటికన్నా పెద్ద ఆసురీ స్వభావము. అశాంతిని వ్యాపింపజేసేవారితో మనుష్యులు విసిగిపోతారు. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అశాంతిని వ్యాపింపజేస్తారు, అందుకే భగవంతుడి నుండి అందరూ శాంతి వరమును కోరుకుంటారు.

పాట:-
ఇది దీపము మరియు తుఫానుల కథ...

ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలము దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు. ఈ పాట అయితే భక్తి మార్గానికి చెందినది, దీనిని మళ్ళీ జ్ఞానములోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఇంకెవ్వరూ ఇలా ట్రాన్స్ఫర్ చేయలేరు. దీపము అంటే ఏమిటి, తుఫాను అంటే ఏమిటి అనేది మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసుకోగలరు! ఆత్మ జ్యోతి ఆరిపోయి ఉందని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వచ్చారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్యోతిని వెలిగిస్తారు. దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ దీపము ఒకవేళ ఆరిపోతే ఇక ఆ ఆత్మ అంధకారములోకి వెళ్ళవలసి వస్తుంది అని భావిస్తారు, అందుకే దీపాన్ని వెలిగించి ఉంచుతారు. ఇప్పుడు సత్యయుగములోనైతే ఈ విషయాలు ఉండవు. అక్కడైతే ప్రకాశములోనే ఉంటారు. ఆకలి మొదలైన విషయాలేవీ అక్కడ ఉండవు, అక్కడ ఎన్నో లభిస్తాయి. ఇక్కడ ఉన్నది ఘోర అంధకారము. ఇది ఛీ-ఛీ ప్రపంచము కదా. ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది. అందరికన్నా ఎక్కువగా మీ జ్యోతియే ఆరిపోయి ఉంది. విశేషముగా మీ కోసమే తండ్రి వస్తారు. మీ జ్యోతి ఆరిపోయింది, మరి దానికి కరెంట్ ఎక్కడి నుండి లభిస్తుంది? కరెంట్ అయితే తండ్రి నుండే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కరెంటు శక్తిశాలిగా ఉంటే బల్బులో కాంతి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మీరు పెద్ద మెషిన్ నుండి కరెంట్ తీసుకుంటున్నారు. చూడండి, బొంబాయి వంటి నగరాలలో ఎంత ఎక్కువమంది వ్యక్తులు ఉంటారు, వారికి ఎంత ఎక్కువ కరెంట్ కావలసి ఉంటుంది. కావున తప్పకుండా అంత పెద్ద మెషిన్ ఉంటుంది. ఇక్కడ ఇది అనంతమైన విషయము. మొత్తము ప్రపంచములోని ఆత్మలందరి జ్యోతి ఆరిపోయి ఉంది, వారికి కరెంటు ఇవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్న ముఖ్యమైన విషయము ఏమిటంటే - బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. దేహీ-అభిమానులుగా అవ్వండి. వీరు ఎంత గొప్ప తండ్రి, మొత్తము ప్రపంచములోని పతిత మనుష్యులందరినీ పావనముగా తయారుచేసే సుప్రీమ్ తండ్రి అందరి జ్యోతులను వెలిగించడానికి వచ్చారు. వారు మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులందరి జ్యోతులను వెలిగిస్తారు. తండ్రి ఎవరు, వారు ఏ విధంగా జ్యోతులను వెలిగిస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. వారిని జ్యోతి స్వరూపుడు అని కూడా అంటారు, మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అనేస్తారు. జ్యోతి ఆరిపోయింది కావున జ్యోతి స్వరూపుడిని పిలుస్తారు. అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారము కూడా జరుగుతుంది. నేను ఈ ప్రకాశ తీవ్రతను సహించలేకపోతున్నాను అని అర్జునుడు అన్నట్లుగా చూపించారు. చాలా కరెంట్ ఉన్నట్లుగా చూపించారు. ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అందరికీ అర్థం చేయించాల్సింది కూడా ఏమిటంటే - నీవు ఆత్మవు. ఆత్మలు పై నుండి ఇక్కడకు వస్తాయి. మొదట ఆత్మ పవిత్రముగా ఉంటుంది, తనలో శక్తి ఉంటుంది, సతోప్రధానముగా ఉంటుంది. బంగారుయుగములో పవిత్ర ఆత్మలు ఉంటాయి, తర్వాత అవి అపవిత్రముగా కూడా అవ్వవలసి ఉంటుంది. అపవిత్రముగా అయినప్పుడు - మీరు వచ్చి మమ్మల్ని విముక్తులుగా చేయండి అని గాడ్ ఫాదర్ ను పిలుస్తారు అనగా దుఃఖము నుండి విముక్తులుగా చేయమని పిలుస్తారు. విముక్తులుగా చేయడము మరియు పావనముగా చేయడము, ఈ రెండింటికీ అర్థము వేరు వేరు. తప్పకుండా ఎవరివల్లనో పతితముగా అయ్యారు, అందుకే కదా అంటారు - బాబా రండి, వచ్చి విముక్తులుగా కూడా చేయండి, పావనముగా కూడా చేయండి, ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళండి, శాంతి యొక్క వరాన్ని ఇవ్వండి. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - ఇక్కడైతే శాంతిలో ఉండలేరు, శాంతి అనేది శాంతిధామములో ఉంటుంది. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉన్నాయి కావున శాంతి ఉంటుంది. అక్కడ ఏ గొడవలు ఉండవు. ఇక్కడ మనుష్యులు అశాంతితో విసిగిపోతారు. ఒకే ఇంటిలో ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ, పురుషుల మధ్య గొడవ జరిగిందంటే, ఇక తల్లిదండ్రులు, పిల్లలు, సోదరీ-సోదరులు మొదలైనవారందరూ విసుగు చెందుతారు. ఆశాంతిమయమైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అశాంతినే వ్యాపింపజేస్తాడు ఎందుకంటే ఆసురీ స్వభావము ఉంది కదా. సత్యయుగము సుఖధామము అని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖము మరియు శాంతి, రెండూ ఉంటాయి. మరియు అక్కడ (పరంధామములోనైతే) కేవలం శాంతి మాత్రమే ఉంటుంది, దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ (మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు) అని అంటారు. ముక్తిధామము కోరుకునేవారికి కేవలం ఇంతే అర్థం చేయించవలసి ఉంటుంది - మీకు ముక్తి కావాలి కదా, అయితే తండ్రిని స్మృతి చేయండి అని.

ముక్తి తర్వాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది. మొదట జీవన్ముక్తులుగా ఉంటారు, ఆ తర్వాత జీవన బంధనములోకి వస్తారు. సగం సగం ఉంటాయి కదా. సతోప్రధానత నుండి మళ్ళీ సతో, రజో, తమోలోకి తప్పకుండా రావలసి ఉంటుంది. ఎవరైతే చివరిలో వచ్చి ఒకటి, అర జన్మలు తీసుకుంటారో, వారు ఏం సుఖ-దుఃఖాలను అనుభవం చేస్తూ ఉండవచ్చు. మీరైతే మొత్తము అంతటినీ అనుభవం చేస్తారు. మీకు తెలుసు - ఇన్ని జన్మలు మనము సుఖములో ఉంటాము, తర్వాత ఇన్ని జన్మలు దుఃఖములో ఉంటాము. ఫలానా-ఫలానా ధర్మాలు కొత్త ప్రపంచములోకి రాలేవు. వారి పాత్రయే తర్వాత ఉంటుంది. అయితే కొత్త ఖండము ఉంటుంది, వారికి అది కొత్త ప్రపంచము వంటిదే. ఉదాహరణకు బౌద్ధ ఖండము, క్రిస్టియన్ ఖండము, అవి కొత్తవి కదా. వారు కూడా సతో, రజో, తమోలను దాటవలసి ఉంటుంది. వృక్షములో కూడా ఈ విధంగా ఉంటుంది కదా. మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. మొదట ఎవరైతే వస్తారో వారు కల్పవృక్షములో కిందే ఉంటారు. కొత్త-కొత్త ఆకులు ఏ విధంగా వెలువడుతాయి అనేది మీరు చూసారు కదా. చిన్న-చిన్న పచ్చని ఆకులు వెలువడుతూ ఉంటాయి, ఆ తర్వాత పుష్పాలు వెలువడుతాయి. కొత్త వృక్షము చాలా చిన్నగా ఉంటుంది. కొత్త బీజము వేసినప్పుడు దానికి పూర్తిగా పాలన జరగకపోతే అది వాడిపోతుంది, అలాగే మీరు కూడా పూర్తిగా పాలన చేయకపోతే వారు వాడిపోతారు. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు, ఇక అందులో నంబరువారుగా తయారవుతారు. రాజధాని స్థాపన అవుతోంది కదా. చాలామంది ఫెయిల్ అయిపోతారు.

పిల్లల అవస్థ ఏ విధంగా ఉంటుందో, అటువంటి ప్రేమ తండ్రి నుండి వారికి లభిస్తుంది. కొంతమంది పిల్లలను బాహ్యముగా కూడా ప్రేమించవలసి ఉంటుంది. కొంతమంది వ్రాస్తుంటారు - బాబా, మేము ఫెయిల్ అయిపోయాము, పతితముగా అయిపోయాము. ఇప్పుడు వారిని ఎవరు ముట్టుకుంటారు! వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. పవిత్రమైనవారికే తండ్రి వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. మొదట ఒక్కొక్కరినీ పూర్తి సమాచారము అడిగి వారి లెక్కాపత్రము తీసుకుంటారు. ఎటువంటి అవస్థనో, అటువంటి ప్రేమ. బాహ్యముగా ప్రేమించినా కానీ - ఇతడు చాలా మూర్ఖుడు, సేవ చేయలేడు అని లోలోపల తెలుస్తుంది. ఆలోచన అయితే ఉంటుంది కదా. అజ్ఞాన కాలములో కూడా కొడుకు బాగా సంపాదిస్తూ ఉంటే తండ్రి కూడా చాలా ప్రేమతో కలుసుకుంటారు, అంతగా సంపాదించని కొడుకు అయితే, ఆ తండ్రికి కూడా అంత ప్రేమ ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తుంటారు కదా. ఏ ధర్మమువారైనా సరే, వారికి అర్థం చేయించాలి. తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరు, వారి పరిచయాన్ని ఇవ్వాలి. సుప్రీమ్ గాడ్ ఫాదర్ వస్తారు, వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు, మీరు ఎంత పతితముగా అయ్యారు. పవిత్రత లేదు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రి అయితే సదా పవిత్రమైనవారు. మిగిలినవారందరూ పవిత్రుల నుండి అపవిత్రులుగా తప్పకుండా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకి దిగుతూ ఉంటారు. ఈ సమయములో అందరూ పతితముగా ఉన్నారు, అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు - పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. ఇప్పుడు మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము యొక్క అంతిమము. మాయ ఆర్భాటము ఎంతగా ఉంది, అందుకే మనుష్యులు - ఇదే స్వర్గము అని భావిస్తారు. విమానాలు, కరెంట్ మొదలైనవి ఏమేమో ఉన్నాయి, ఇదంతా మాయ ఆర్భాటము. ఇది ఇప్పుడు అంతమవ్వనున్నది. ఇక స్వర్గము స్థాపన అవుతుంది. ఈ కరెంట్ మొదలైనవన్నీ స్వర్గములో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్వర్గములోకి ఎలా వస్తాయి. తప్పకుండా వీటి గురించి తెలిసినవారు కావాలి కదా. మీ వద్దకు ఎంతో మంచి-మంచి నైపుణ్యము కలవారు కూడా వస్తారు. వారు రాజ్యములోకి అయితే రారు కానీ మీ ప్రజల్లోకి వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి-మంచి నైపుణ్యము కలవారు, బాగా నేర్చుకున్నవారు మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్ అంతా బయట విదేశాల నుండి వస్తూ ఉంటుంది. కావున విదేశాల వారికి కూడా మీరు శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి. వారికి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. మీరు కూడా యోగములో ఉండే పురుషార్థమే చాలా చేయాలి, ఇందులోనే మాయా తుఫానులు ఎన్నో వస్తూ ఉంటాయి. తండ్రి కేవలం - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఇది మంచి విషయమే కదా. క్రైస్టు కూడా వారి రచనయే. రచయిత అయిన పరమ ఆత్మ ఒక్కరే. మిగిలినవారంతా రచనే. వారసత్వము రచయిత నుండే లభిస్తుంది. ఇటువంటి మంచి-మంచి పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకోవాలి.

తండ్రి ముఖ్య కర్తవ్యము ఏమిటంటే - అందరినీ దుఃఖము నుండి విముక్తులుగా చేయడము. వారు సుఖధామము మరియు శాంతిధామము యొక్క గేట్ ను తెరుస్తారు. వారితో ఏమంటారంటే - ఓ ముక్తిదాతా, దుఃఖము నుండి విముక్తులుగా చేసి మమ్మల్ని శాంతిధామానికి మరియు సుఖధామానికి తీసుకువెళ్ళండి. ఇక్కడ సుఖధామము ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామములో ఉంటాయి. స్వర్గము యొక్క గేట్ ను తండ్రియే తెరుస్తారు. ఒకటి, కొత్త ప్రపంచము యొక్క గేట్ తెరుచుకుంటుంది, రెండు, శాంతిధామము యొక్క గేట్ తెరుచుకుంటుంది. ఇప్పుడు ఏ ఆత్మలైతే అపవిత్రముగా అయిపోయారో, వారికి తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలు కట్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరెవరైతే పురుషార్థము చేస్తారో, వారు తమ ధర్మములోనే ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థము చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. మంచి-మంచి పాయింట్లు నోట్ చేసుకున్నట్లయితే సమయానికి ఉపయోగపడతాయి. శివబాబా కర్తవ్యము గురించి మేము తెలియజేస్తాము అని మీరు వారితో అంటే, వారు అంటారు - గాడ్ ఫాదర్ అయిన శివుని కర్తవ్యము గురించి తెలియజేసే వీరు ఎవరు? మీరు చెప్పండి - ఆత్మ రూపములోనైతే మీరందరూ సోదరులు, తర్వాత ప్రజాపిత బ్రహ్మా ద్వారా రచనను రచించడముతో సోదరీ-సోదరులు అవుతారు. గాడ్ ఫాదర్, ఎవరినైతే ముక్తిప్రదాత, మార్గదర్శకుడు అని అంటారో, వారి కర్తవ్యము గురించి మేము మీకు తెలియజేస్తాము, తప్పకుండా మాకు గాడ్ ఫాదర్ తెలియజేసారు, కావుననే మీకు తెలియజేస్తున్నాము. తండ్రిని కొడుకే ప్రత్యక్షము చేస్తాడు అని కూడా వారికి అర్థం చేయించండి. ఆత్మ చాలా చిన్నని నక్షత్రము వంటిది, ఈ నేత్రాలతో ఆత్మను చూడలేరు. దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము జరగవచ్చు. ఆత్మ ఒక బిందువు, దానిని చూడడం వల్ల లాభమేమీ ఉండదు. తండ్రి కూడా ఇలా ఒక బిందువే, వారిని పరమ ఆత్మ అని అంటారు. ఆత్మ చూడటానికి ఒకేలా ఉంటుంది కానీ వారు అందరికన్నా ఉన్నతమైనవారు, నాలెడ్జ్ ఫుల్, పరమానంద స్వరూపుడు, ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు. వారిని ఎంతో మహిమ చేయవలసి ఉంటుంది. తండ్రి తప్పకుండా వస్తారు, అప్పుడే కదా తమతోపాటు తీసుకువెళ్తారు. వారు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రే చెప్తున్నారు - ఆత్మ ఎంతో చిన్నగా ఉంటుంది, నేను కూడా అలాగే ఉంటాను, జ్ఞానాన్ని కూడా తప్పకుండా ఎవరి శరీరములోనైనా ప్రవేశించే ఇస్తాను, ఈ ఆత్మ పక్కకు వచ్చి కూర్చుంటాను, నాలో శక్తి ఉంది, నాకు ఇంద్రియాలు లభించడంతో నేను కూడా యజమానిని అయ్యాను. నేను కూర్చుని ఈ ఇంద్రియాల ద్వారా అర్థం చేయిస్తాను. ఇతడిని ఆడమ్ అని కూడా అంటారు. ఆడమ్ మొట్టమొదటి మానవుడు. మనుష్యుల వంశవృక్షము కదా. వీరు మాతా-పితలుగా కూడా అవుతారు, వీరి ద్వారా మళ్ళీ రచన జరుగుతుంది. వీరు అందరికంటే పురాతనమైనవారు కానీ వీరిని దత్తత తీసుకోవడం జరిగింది, లేదంటే బ్రహ్మా ఎక్కడి నుండి వస్తారు. బ్రహ్మా యొక్క తండ్రి పేరును ఎవరైనా చెప్పగలరా. బ్రహ్మా, విష్ణు, శంకరులు - వీరు తప్పకుండా ఎవరో ఒకరి యొక్క రచన అయి ఉంటారు కదా! రచయిత అయితే ఒక్కరే, తండ్రి వీరిని దత్తత తీసుకున్నారు. ఒకవేళ చిన్న పిల్లలు కూర్చుని వీటిని అర్థం చేయిస్తుంటే, ఇది చాలా గొప్ప జ్ఞానము అని వారు అంటారు.

ఏ పిల్లలలోనైతే బాగా ధారణ జరుగుతుందో, వారికి చాలా సంతోషము ఉంటుంది, వారికి ఎప్పుడూ ఆవలింతలు రావు. ఎవరికైతే ఏమీ అర్థము కాదో వారు ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు. సంపాదించే సమయములో ఎప్పుడూ ఆవలింతలు రావు. కస్టమర్లు లేకపోతే, వ్యాపారము బాగా నడవకపోతే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ధారణ జరగదు. కొందరైతే ఏ మాత్రమూ అర్థం చేసుకోరు ఎందుకంటే దేహాభిమానము ఉంది. వారు దేహీ-అభిమానులై కూర్చోలేరు. బయట విషయాలు ఏవో ఒకటి గుర్తొస్తూ ఉంటాయి. వారు పాయింట్లు మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు. తెలివైన బుద్ధి కలవారు - ఈ పాయింట్లు చాలా బాగున్నాయి అని వెంటనే నోట్ చేసుకుంటారు. విద్యార్థుల నడవడిక కూడా టీచరుకు కనిపిస్తుంది కదా. తెలివైన టీచరు దృష్టి అన్ని వైపులా ఉంటుంది, అందుకే చదువు యొక్క సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారు. మ్యానర్స్ యొక్క సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అనే లెక్క కూడా చూస్తారు. ఇక్కడైతే ప్రెసెంట్ అవుతారు (వస్తారు), కానీ ఏమీ అర్థం చేసుకోరు, ధారణ జరగదు. కొందరు - మాది మంద బుద్ధి, ధారణ జరగడం లేదు అని అంటారు. దానికి బాబా ఏం చేస్తారు! అది మీ కర్మల లెక్కాచారము. తండ్రి అయితే అందరి చేత ఒకే పురుషార్థము చేయిస్తారు, మీ భాగ్యములో లేకపోతే ఇక ఏమి చేస్తారు. స్కూలులో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చదువు, దీనిని అనంతమైన తండ్రి చదివిస్తారు. ఇతర ధర్మాలవారు గీత విషయాన్ని అర్థం చేసుకోరు. వారి దేశాన్ని బట్టి వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మొట్టమొదట ఉన్నతోన్నతుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వారు ఏ విధంగా ముక్తిదాత మరియు మార్గదర్శకుడు అనేది తెలియజేయాలి. స్వర్గములో ఈ వికారాలు ఉండవు. ఈ సమయములో దీనిని ఆసురీ రాజ్యము అని అంటారు. ఇది పాత ప్రపంచము కదా, దీనిని బంగారుయుగము అని అనరు. కొత్త ప్రపంచము ఉండేది, ఇప్పుడు అది పాతగా అయ్యింది. పిల్లల్లో ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉందో, వారు పాయింట్లు నోట్ చేసుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువులో చాలా-చాలా సంపాదన ఉంది, అందుకే చాలా-చాలా సంతోషముగా సంపాదన చేసుకోవాలి. చదువుకునే సమయములో ఎప్పుడూ ఆవలింతలు రాకూడదు, బుద్ధియోగము అటూ, ఇటూ భ్రమించకూడదు. పాయింట్లను నోట్ చేసుకుని ధారణ చేస్తూ ఉండండి.

2. పవిత్రముగా అయి తండ్రి యొక్క హృదయపూర్వకమైన ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చురుకుగా అవ్వాలి, మంచి సంపాదనను చేసుకోవాలి మరియు ఇతరుల చేత చేయించాలి.

వరదానము:-
మరజీవా జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మబంధనాలను సమాప్తము చేసే కర్మయోగీ భవ

ఈ మరజీవా దివ్య జన్మ కర్మ బంధన జన్మ కాదు, ఇది కర్మయోగీ జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రమైనది, అంతేకానీ పరతంత్రమైనది కాదు. ఈ దేహము లోన్ గా లభించింది. మొత్తము విశ్వ సేవ కొరకు పాత శరీరాలలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాధ్యత తండ్రిది, మీది కాదు. కర్మ చెయ్యండి అని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు, మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తున్నారు. ఈ విశేష ధారణతోనే కర్మ బంధనాలను సమాప్తము చేసి కర్మయోగిగా అవ్వండి.

స్లోగన్:-
సమయ సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

ఎంతెంతగా స్మృతిలో ఉంటారో, అంతగా అనుభవము చేస్తారు - ఆత్మనైన నేను ఒంటరిగా లేను, బాప్ దాదా సదా తోడుగా ఉన్నారు. ఏదైనా సమస్య ఎదురుగా వస్తే - నేను కంబైండుగా ఉన్నాను అన్నదే స్మృతిలో ఉండాలి, అప్పుడు గాభరాపడరు. కంబైండ్ రూపపు స్మృతి ద్వారా ఏ కష్టమైన కార్యమైనా సహజమైపోతుంది. మీ భారాలన్నింటినీ తండ్రిపై పెట్టి స్వయము తేలికగా అవ్వండి, అప్పుడు సదా స్వయాన్ని అదృష్టవంతులుగా అనుభవం చేస్తారు మరియు ఫరిశ్తాల సమానముగా నాట్యము చేస్తూ ఉంటారు.