ఓంశాంతి
తండ్రి మనకు కొత్త ప్రపంచ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని ఆత్మిక పిల్లలకు
తెలుసు. పిల్లలకు ఈ విషయమైతే పక్కాగా ఉంది కదా - ఎంతగా మనం తండ్రిని స్మృతి చేస్తామో
అంతగా పవిత్రముగా అవుతాము, ఎంతగా మనం మంచి టీచరుగా అవుతామో అంతగా ఉన్నత పదవిని
పొందుతాము అని. తండ్రి మీకు టీచరు రూపములో చదివించడం నేర్పిస్తారు. మీరు మళ్ళీ
ఇతరులకు నేర్పించాలి. మీరు చదివించే టీచరుగా తప్పకుండా అవుతారు కానీ మీరు ఎవరికీ
గురువుగా అవ్వలేరు, కేవలం టీచరుగా అవ్వగలరు. గురువు అయితే ఒక్క సద్గురువే, వారే
నేర్పిస్తారు. సర్వుల సద్గురువు ఒక్కరే. వారు టీచరుగా తయారుచేస్తారు. మీరు అందరికీ
నేర్పించి ‘మన్మనాభవ’ అన్న దారిని తెలియజేస్తూ ఉంటారు. తండ్రి మీకు ఈ డ్యూటీని
ఇచ్చారు - నన్ను స్మృతి చేయండి మరియు టీచరుగా కూడా అవ్వండి అని. మీరు ఎవరికైనా
తండ్రి పరిచయాన్ని ఇస్తే మరి తండ్రిని స్మృతి చేయడము వారి కర్తవ్యము కూడా. టీచరు
రూపములో సృష్టిచక్ర జ్ఞానాన్ని ఇవ్వవలసి ఉంటుంది. తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి
ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు అంతమవ్వనున్నాయి. మేము పాపాత్ములము అని
పిల్లలకు తెలుసు, అందుకే తండ్రి అందరికీ చెప్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. తండ్రే పతిత-పావనుడు. వారు
యుక్తిని తెలియజేస్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ ఆత్మ పతితముగా అయ్యింది, ఆ
కారణముగా శరీరము కూడా పతితముగా అయ్యింది. మొదట మీరు పవిత్రముగా ఉండేవారు, ఇప్పుడు
అపవిత్రముగా అయ్యారు. ఇప్పుడు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చాలా సహజమైన
యుక్తిని అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రముగా అవుతారు.
లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ తండ్రిని స్మృతి చేయండి. వారు గంగా స్నానాలు చేసేటప్పుడు
గంగను స్మృతి చేస్తారు. గంగ పతిత-పావని అని భావిస్తారు. మరి గంగను స్మృతి చేయడం
ద్వారా పావనముగా అయిపోవాలి. కానీ తండ్రి అంటారు, ఎవరూ పావనముగా అవ్వలేరు. నీటి
ద్వారా పావనముగా ఎలా అవుతారు. తండ్రి అంటారు, నేను పతిత-పావనుడను. ఓ పిల్లలూ, దేహ
సహితముగా దేహపు సర్వ ధర్మాలనూ వదిలి నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనముగా అయి
మళ్ళీ మీ ఇంటికి, ముక్తిధామానికి చేరుకుంటారు. మొత్తం కల్పమంతా ఇంటిని మర్చిపోయారు.
తండ్రి గురించి మొత్తం కల్పమంతా ఎవరికీ తెలియనే తెలియదు. ఒకేసారి తండ్రి స్వయంగా
వచ్చి ఈ నోటి ద్వారా తమ పరిచయాన్ని ఇస్తారు. ఈ నోటికి ఎంతటి మహిమ ఉంది. గోముఖము అని
అంటారు కదా. ఆ గోవు అయితే ఒక జంతువు, కానీ ఇది మానవునికి సంబంధించిన విషయము.
వీరు పెద్ద తల్లి అని మీకు తెలుసు. ఈ తల్లి ద్వారానే శివబాబా మీ అందరినీ దత్తత
తీసుకుంటారు. మీరు ఇప్పుడు బాబా, బాబా అని అనడం మొదలుపెట్టారు. తండ్రి కూడా అంటారు,
ఈ స్మృతియాత్ర ద్వారానే మీ పాపాలు అంతమవ్వనున్నాయి. పిల్లలకు తండ్రి గుర్తుకొస్తారు
కదా. వారి ముఖకవళికలు మొదలైనవన్నీ తమ మనసులో కూర్చుండిపోతాయి. పిల్లలైన మీకు తెలుసు
- ఆత్మలమైన మనము ఎలా ఉన్నామో, అలాగే పరమాత్మ కూడా ఉన్నారు. ముఖకవళికలలో ఇంకెటువంటి
తేడా లేదు. శారీర సంబంధములో అయితే రూపురేఖలు మొదలైనవి వేరుగా ఉంటాయి కానీ ఆత్మ అయితే
ఒకేలా ఉంటుంది. మన ఆత్మ ఎలా అయితే ఉందో, అలాగే తండ్రి కూడా పరమ ఆత్మయే. తండ్రి
పరంధామములో ఉంటారని, మనం కూడా పరంధామములో ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి
ఆత్మకు మరియు మన ఆత్మకు ఇంకెటువంటి తేడా లేదు. వారూ బిందువే, మనమూ బిందువే. ఈ
జ్ఞానము ఇంకెవరిలోనూ లేదు. మీకే తండ్రి తెలియజేసారు. తండ్రి గురించి కూడా ఏమేమి అంటూ
ఉంటారు. సర్వవ్యాపి అని, రాయి-రప్పల్లో ఉన్నారని, ఎవరికి ఏది తోస్తే అది అనేస్తారు.
డ్రామా ప్లాన్ అనుసారముగా భక్తి మార్గములో తండ్రి నామ, రూప, దేశ, కాలాలను
మర్చిపోతారు. మీరు కూడా మర్చిపోతారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది. కొడుకు తన
తండ్రిని మర్చిపోతే ఇంకేమీ తెలుసుకోగలడు. అనగా అనాథగా అయిపోయినట్లే. తమ నాథుడిని
తలచుకోనే తలచుకోరు. ఆ నాథుడి పాత్ర గురించి కూడా తెలియదు. స్వయాన్ని కూడా
మర్చిపోతారు. తప్పకుండా మేము మర్చిపోయాము అని మీకు బాగా తెలుసు. మనం మొదట ఇలా
దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు జంతువులకన్నా హీనంగా అయిపోయాము. ముఖ్యమైనదేమిటంటే
మనం మన ఆత్మనే మర్చిపోయాము. మరి ఇప్పుడు దీనిని ఎవరు రియలైజ్ చేయిస్తారు. ఏ
జీవాత్మకూ కూడా - ఆత్మనైన నేను ఎవరు, ఏ విధముగా మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తాను
అన్నది తెలియనే తెలియదు. మనమందరమూ పరస్పరం సోదరులము - ఈ జ్ఞానము ఇంకెవరిలోనూ లేదు.
ఈ సమయములో మొత్తం సృష్టి అంతా తమోప్రధానముగా అయిపోయింది. జ్ఞానము లేదు. మీలో ఇప్పుడు
జ్ఞానము ఉంది, బుద్ధిలోకి వచ్చింది - ఆత్మ అయిన మనము ఇంత సమయమూ మన తండ్రిని గ్లాని
చేస్తూ వచ్చాము. గ్లాని చేయడం ద్వారా తండ్రి నుండి దూరమవుతూ ఉంటారు. డ్రామా ప్లాన్
అనుసారముగా మెట్లు కిందకు దిగుతూ వచ్చారు. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము.
తండ్రి ఇంకే కష్టమూ ఇవ్వరు. పిల్లలు కేవలం తండ్రిని స్మృతి చేసే కృషి చేయాలి. తండ్రి
ఎప్పుడైనా పిల్లలకు ఎటువంటి కష్టమునైనా ఇవ్వగలరా! లా అలా చెప్పదు. తండ్రి అంటారు,
నేను ఎటువంటి కష్టమునూ ఇవ్వను. ఏవైనా ప్రశ్నలు మొదలైనవి అడిగితే - అందులో మీ
సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు, తండ్రిని స్మృతి చేయండి అని చెప్తాను. నేను
మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకే వచ్చాను, అందుకే పిల్లలైన మీరు స్మృతియాత్ర ద్వారా
పావనముగా అవ్వాలి. నేనే పతిత-పావనుడినైన తండ్రిని. తండ్రి యుక్తిని తెలియజేస్తారు -
ఎక్కడకు వెళ్ళినా తండ్రిని స్మృతి చేయాలి. 84 జన్మల చక్రము యొక్క రహస్యాన్ని కూడా
తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు స్వయాన్ని చెక్ చేసుకోవాలి - ఎంతవరకు నేను తండ్రిని
స్మృతి చేస్తున్నాను. ఇంకెటువైపు గురించి ఆలోచించకూడదు. ఇది చాలా సహజము. తండ్రిని
స్మృతి చేయాలి. కొడుకు కాస్త పెద్ద అయితే ఆటోమేటిక్ గా తల్లి-తండ్రిని స్మృతి చేయడం
మొదలుపెడతాడు. మీరు కూడా - ఆత్మ అయిన మేము తండ్రి పిల్లలము అని భావించండి. వారిని
ఎందుకు స్మృతి చేయవలసి ఉంటుంది! ఎందుకంటే మనపై పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ స్మృతి
ద్వారానే అంతమవుతాయి, అందుకే ఒక్క క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము కూడా ఉంది.
జీవన్ముక్తి ఆధారము చదువుపై ఉంది మరియు ముక్తి ఆధారము స్మృతిపై ఉంది. ఎంతగా మీరు
తండ్రిని స్మృతి చేస్తారో మరియు చదువుపై ధ్యాస ఉంచుతారో, అంతగా ఉన్నతమైన నంబరులో
పదవిని పొందుతారు. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి, తండ్రి ఏమీ వద్దని చెప్పరు.
వ్యాపారాలు మొదలైనవి ఏవైతే మీరు చేస్తారో, అవి కూడా రాత్రింబవళ్ళూ గుర్తుంటాయి కదా.
కావున ఇప్పుడు తండ్రి ఈ ఆత్మిక వ్యాపారాన్ని ఇస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ నన్ను స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. నన్ను స్మృతి
చేయడం ద్వారానే మీరు సతోప్రధానముగా అవుతారు. ఇప్పుడు ఇది పాత వస్త్రమని, తర్వాత
సతోప్రధానమైన కొత్త వస్త్రము లభిస్తుందని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీ వద్ద
బుద్ధిలో సారము ఉంచుకోవాలి, దాని వలన ఎంతో లాభం జరగనున్నది. స్కూల్లో సబ్జెక్టులు
ఎన్నో ఉన్నా కానీ ఇంగ్లీషుకే మంచి మార్కులు ఉంటాయి ఎందుకంటే ఇంగ్లీషు ముఖ్యమైన భాష.
ఇంతకుముందు వారి రాజ్యముండేది, అందుకే అది ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు కూడా
భారతవాసులు ఋణగ్రస్థులుగా ఉన్నారు. ఎవరు ఎంత షావుకార్లుగా ఉన్నా కానీ మా రాజ్య
అధినేతలు ఎవరైతే ఉన్నారో వారు ఋణగ్రస్థులుగా ఉన్నారు అని బుద్ధిలో ఇదైతే ఉంటుంది కదా.
అనగా భారతవాసులమైన మనము ఋణగ్రస్థులము. మేము ఋణగ్రస్థులము అని ప్రజలు తప్పకుండా
అంటారు కదా. ఈ వివేకము కూడా కావాలి కదా. మీరు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు.
మనమందరమూ ఈ ఋణాలన్నింటి నుండి విముక్తులమై సుసంపన్నులుగా అవుతామని, మళ్ళీ అర్ధకల్పము
మనము ఎవరి నుండీ ఋణాలను తీసుకోమని మీకు తెలుసు. ఋణగ్రస్థులు పతిత ప్రపంచానికి
అధిపతులు. ఇప్పుడు మనము ఋణగ్రస్థులము కూడా, పతిత ప్రపంచానికి యజమానులము కూడా. మన
భారత్ ఇలా ఉండేది అని గానం చేస్తారు కదా.
పిల్లలైన మీకు తెలుసు - మనము చాలా షావుకార్లులుగా ఉండేవారము, రాకుమారులు,
రాకుమారీలుగా ఉండేవారము. ఇది గుర్తుంటుంది. మనం ఇలా విశ్వాధిపతులుగా ఉండేవారము.
ఇప్పుడు పూర్తిగా ఋణగ్రస్థులుగా, పతితులుగా అయిపోయాము. ఈ ఆట రిజల్టును తండ్రి
తెలియజేస్తున్నారు. రిజల్టు ఏమైంది. పిల్లలైన మీకు స్మృతి కలిగింది. సత్యయుగములో మనం
ఎంత షావుకార్లుగా ఉండేవారము, మిమ్మల్ని ఎవరు షావుకార్లుగా చేసారు? పిల్లలు అంటారు -
బాబా, మీరు మమ్మల్ని ఎంత షావుకార్లుగా చేసారు. ఒక్క తండ్రే షావుకార్లుగా
తయారుచేసేవారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. లక్షల సంవత్సరాలు అని అనడముతో
అంతా మర్చిపోయారు, ఏమీ తెలియదు. మీరు ఇప్పుడు అంతా తెలుసుకున్నారు. మనము పదమాపదమ
షావుకార్లుగా ఉండేవారము, చాలా పవిత్రముగా ఉండేవారము, చాలా సుఖవంతులుగా ఉండేవారము.
అక్కడ అసత్యము, పాపము మొదలైనవేవీ ఉండవు. మొత్తము విశ్వముపై మీరు విజయాన్ని పొందుతారు.
శివబాబా, మీరు ఏదైతే ఇస్తారో దానిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు అన్న గాయనము కూడా ఉంది.
అర్ధకల్పము కొరకు సుఖాన్ని ఇవ్వగలిగే శక్తి ఎవ్వరికీ లేదు. తండ్రి అంటారు, భక్తి
మార్గములో కూడా మీకు చాలా సుఖము, అపారమైన ధనము ఉంటుంది. ఎన్ని వజ్ర, వైఢూర్యాలు
ఉండేవి, అవన్నీ తర్వాత చివరిలో ఉండేవారి చేతుల్లోకి వస్తాయి. ఇప్పుడైతే అసలు ఆ
వస్తువులు కనే కనిపించవు. మీరు తేడాను చూస్తారు కదా. మీరే పూజ్య దేవీ-దేవతలుగా
ఉండేవారు, తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. తండ్రి
ఏమీ పూజారిగా అవ్వరు కానీ పూజారీ ప్రపంచములోకైతే వస్తారు కదా. తండ్రి అయితే సదా
పూజ్యులు. వారెప్పుడూ పూజారిగా అవ్వరు, వారి పని మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా
తయారుచేయడము. రావణుని పని మిమ్మల్ని పూజారులుగా చేయడము. ఇది ప్రపంచములో ఎవరికీ
తెలియదు. మీరు కూడా మర్చిపోతారు. తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరిని
కావాలనుకుంటే వారిని షావుకార్లుగా తయారుచేయడం లేక పేదవారిగా తయారుచేయడమనేది తండ్రి
చేతుల్లో ఉంది. తండ్రి అంటారు, ఎవరైతే షావుకార్లుగా ఉన్నారో వారు పేదవారిగా
తప్పకుండా అవ్వాలి మరియు అవుతారు కూడా. వారి పాత్ర అలా ఉంది. వారెప్పుడూ నిలవలేరు.
ధనవంతులకు - నేను ఫలానాను, నా వద్ద ఇది, అది ఉంది అని వారికి అహంకారము కూడా ఎంతో
ఉంటుంది కదా. ఆ అహంకారాన్ని తెంచేందుకు బాబా అంటారు, వీరు ఎప్పుడైతే ఇచ్చేందుకు
వస్తారో అప్పుడు బాబా - అవసరం లేదు, అది మీ వద్దే ఉంచుకోండి, అవసరం వచ్చినప్పుడు
తీసుకుంటానులే అని చెప్తారు. ఎందుకంటే అది ఎందుకూ పనికి రాదు, అది వారి అహంకారము అని
గమనిస్తారు. కావున తీసుకోవడమైనా లేక తీసుకోకపోవడమైనా, ఇదంతా బాబా చేతిలో ఉంది కదా.
బాబా ధనమేమి చేసుకుంటారు, అవసరం లేదు. ఈ ఇళ్ళు మొదలైనవన్నీ పిల్లలైన మీ కొరకే
తయారవుతున్నాయి. మీరు వచ్చి బాబాను కలుసుకునే వెళ్ళాలి. సదా అయితే ఇక్కడ ఉండిపోరు.
ధనం అవసరం ఏముంటుంది. ఆయుధాలు, ఫిరంగులు మొదలైనవైతే అవసరం లేదు. మీరు
విశ్వాధిపతులుగా అవుతారు. మీరు యుద్ధ మైదానములో ఉన్నారు, మీరు తండ్రిని స్మృతి
చేయడము తప్ప ఇంకేమీ చేయరు. తండ్రి ఆజ్ఞను ఇచ్చారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీకు
అంతటి శక్తి లభిస్తుంది. మీ ఈ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. తండ్రి
సర్వశక్తివంతుడు. మీరు వారికి చెందినవారు. మొత్తం ఆధారమంతా స్మృతియాత్రపైనే ఉంది.
ఇక్కడ మీరు వింటారు మరియు దానిపై మథనము జరుగుతుంది. ఏ విధంగా ఆవు తిన్న తర్వాత
దానిని నెమరువేస్తుంది కదా, దాని నోరు నెమరువేస్తూనే ఉంటుంది. పిల్లలైన మీకు కూడా
చెప్తారు - జ్ఞాన విషయాల గురించి బాగా ఆలోచించండి. బాబాను మనం ఏమి అడగాలి. తండ్రి
అయితే మన్మనాభవ అని చెప్తారు, దాని ద్వారానే మీరు సతోప్రధానముగా అవుతారు. ఈ
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది.
సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా అవ్వాలి అని మీకు తెలుసు. ఇది
ఆటోమేటిక్ గా మీ లోపల రావాలి. ఎవరి గ్లాని లేక పాపకర్మలు మొదలైనవేవీ జరగకూడదు. మీరు
ఎటువంటి తప్పుడు కర్మలనూ చేయకూడదు. నంబరు వన్ ఈ దేవీ-దేవతలే. పురుషార్థముతో ఉన్నత
పదవిని పొందారు కదా. వారి గురించే అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము అని గానం
చేయబడుతుంది. ఎవరినైనా కొట్టడమనేది హింసయే కదా. తండ్రి అర్థం చేయిస్తారు కావున
పిల్లలు అంతర్ముఖులుగా అయి తమను తాము చూసుకోవాలి - నేను ఎలా తయారయ్యాను? బాబాను నేను
స్మృతి చేస్తున్నానా? ఎంత సమయం నేను స్మృతి చేస్తున్నాను? హృదయము ఎంతగా వారితో
జోడించబడిపోవాలంటే, ఇక వారి స్మృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు అనంతమైన తండ్రి
అంటారు, ఆత్మలైన మీరు నా సంతానము. అందులోనూ మీరు అనాది సంతానము. ఆ ప్రేయసీ, ప్రియులు
ఎవరైతే ఉంటారో వారిది దైహికమైన స్మృతి. సాక్షాత్కారము అయినట్లవుతుంది, మళ్ళీ
మాయమైపోతారు, అలా వారు కూడా ఒకరి ముందుకు ఒకరు వచ్చేస్తారు. ఆ సంతోషములోనే తింటూ,
తాగుతూ, తలచుకుంటూ ఉంటారు. మీ ఈ స్మృతిలోనైతే ఎంతో బలము ఉంది. ఒక్క తండ్రినే స్మృతి
చేస్తూ ఉంటారు. మరియు మీకు మీ భవిష్యత్తు గుర్తుకొస్తుంది. వినాశన సాక్షాత్కారము
కూడా జరుగుతుంది. మున్ముందు త్వరత్వరగా వినాశన సాక్షాత్కారము జరుగుతుంది. అప్పుడు
మీరు - ఇప్పుడిక వినాశనం జరగనున్నది, ఇక తండ్రిని స్మృతి చేయండి అని చెప్పగలుగుతారు.
బాబా వీటన్నింటినీ వదిలేసారు కదా. చివరిలో ఏమీ గుర్తుకు రాకూడదు. ఇప్పుడైతే మనం మన
రాజధానిలోకి వెళ్ళాలి. కొత్త ప్రపంచములోకి తప్పకుండా వెళ్ళాలి. యోగబలముతో
పాపాలన్నింటినీ భస్మము చేసుకోవాలి, ఇందులోనే చాలా కష్టపడాలి. ఘడియ, ఘడియ తండ్రిని
మర్చిపోతారు ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయము. సర్పము, భ్రమరము యొక్క
ఉదాహరణలేవైతే ఇస్తారో, అవన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరము అద్భుతము చేస్తుంది కదా.
దాని కన్నా మీ అద్భుతము గొప్పది. బాబా వ్రాస్తూ ఉంటారు కదా - జ్ఞానాన్ని భూ, భూ
చేస్తూ ఉండండి, చివరికి మేల్కొంటారు, ఎక్కడికి వెళ్తారు, మీ వద్దకే వస్తూ ఉంటారు.
చేరుతూ ఉంటారు. మీ పేరు ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మీరు కొద్దిమందే ఉన్నారు
కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.