22-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ అతి అమూల్యమైన సమయము, ఇందులో మీరు తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వండి, సహాయకులైన పిల్లలే ఉన్నత పదవిని పొందుతారు’’

ప్రశ్న:-
సేవాధారులైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పడానికి వీలులేదు?

జవాబు:-
బాబా, ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చలిగా ఉంది, అందుకే మేము సేవ చేయలేము అని సేవాధారులైన పిల్లలు ఇటువంటి సాకులు చెప్పలేరు. కొద్దిగా వేడిగా ఉన్నా లేక చలిగా ఉన్నా నాజూకుగా అవ్వకూడదు. మేము అసలు సహించలేము అన్నట్లు ఉండకూడదు. ఈ దుఃఖధామములో దుఃఖము-సుఖము, వేడి-చలి, నింద-స్తుతి అన్నింటినీ సహనము చేయాలి. సాకులు చెప్పకూడదు.

పాట:-
ఓర్పు వహించు మానవా...

ఓంశాంతి
సుఖము మరియు దుఃఖము అని వేటిని అంటారు అనేది పిల్లలకే తెలుసు. ఈ జీవితములో సుఖము ఎప్పుడు లభిస్తుంది మరియు దుఃఖము ఎప్పుడు లభిస్తుంది అనేది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఈ ప్రపంచమే దుఃఖ ప్రపంచము. ఇందులో కొద్ది సమయము కొరకు సుఖము-దుఃఖము, స్తుతి-నింద, అన్నింటినీ సహనము చేయవలసి ఉంటుంది. వీటన్నింటినీ దాటివేయాలి. ఎవరికైనా కొద్దిగా వేడిగా అనిపిస్తే, మేము చల్లదనం ఉన్న స్థానములో ఉంటాము అని అంటారు. ఇప్పుడు పిల్లలైతే వేడిలోనైనా లేక చలిలోనైనా సేవ చేయాలి కదా. ఈ సమయములో కొద్దో-గొప్పో ఈ దుఃఖము ఉన్నా కానీ ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది ఉన్నదే దుఃఖధామము. ఇప్పుడు పిల్లలైన మీరు సుఖధామములోకి వెళ్ళేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఇది మీ అతి అమూల్యమైన సమయము. ఇందులో సాకులు నడవవు. బాబా సేవాధారులైన పిల్ల కోసం చెప్తున్నారు. ఎవరికైతే సేవ చేయడమే తెలియదో వారు దేనికీ పనికిరారు. ఇక్కడకు తండ్రి కేవలం భారత్ ను మాత్రమే కాకుండా పూర్తి విశ్వాన్ని సుఖధామముగా తయారుచేయడానికి వచ్చారు. కావున బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకులుగా అవ్వాలి. తండ్రి వచ్చారు, కావున వారి మతముపై నడవాలి. ఒకప్పుడు స్వర్గముగా ఉన్న భారత్ ఇప్పుడు నరకముగా ఉంది, దీనిని మళ్ళీ స్వర్గముగా చేయాలి. ఇది కూడా ఇప్పుడే తెలిసింది. సత్యయుగములో ఈ పవిత్ర రాజుల రాజ్యము ఉండేది, చాలా సుఖముగా ఉండేవారు. తర్వాత అపవిత్ర రాజులు కూడా తయారవుతారు, ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేయటం వలన వారు తయారవుతారు, వారికి కూడా శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఉన్నదే ప్రజారాజ్యము. కానీ వీరెవ్వరూ భారత్ యొక్క సేవ చేయలేరు. భారత్ యొక్క సేవను మరియు విశ్వమంతటి సేవను ఒక్క అనంతమైన తండ్రి మాత్రమే చేస్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు నాతో పాటు నాకు సహాయకులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. దేహీ-అభిమానులైన పిల్లలు అర్థం చేసుకుంటారు. దేహాభిమానులు ఏం సహాయము చేయగలరు ఎందుకంటే వారు మాయా సంకెళ్ళలో చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు తండ్రి డైరెక్షన్ ఇచ్చారు - అందరినీ మాయా సంకెళ్ళ నుండి మరియు గురువుల సంకెళ్ళ నుండి విడిపించండి. ఇదే మీ వ్యాపారము. తండ్రి అంటారు, నాకు ఎవరైతే మంచి సహాయకులుగా అవుతారో, పదవిని కూడా వారే పొందుతారు. తండ్రి స్వయంగా సమ్ముఖముగా చెప్తున్నారు - నేను ఎవరిని, ఎలా ఉన్నాను అనేది సాధారణముగా ఉన్న కారణముగా నన్ను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు అన్నది తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. వీరు రాజ్యాన్ని ఎలా పొందారు, తిరిగి ఎలా పోగొట్టుకున్నారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులదైతే పూర్తిగా తుచ్ఛ బుద్ధి. ఇప్పుడు తండ్రి అందరి బుద్ధి తాళాన్ని తెరవడానికి వచ్చారు, రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తయారుచేయడానికి వచ్చారు. బాబా అంటారు, ఇప్పుడు సహాయకులుగా అవ్వండి. వాళ్ళు ఖుదాయీ ఖిద్మత్గార్ (భగవంతుని సేవకులు) అని చెప్పకుంటారు కానీ వాస్తవానికి వారు సహాయకులుగా అవ్వనే అవ్వరు. ఖుదా వచ్చి ఎవరినైతే పావనముగా తయారుచేస్తారో, వారితోనే అంటారు - ఇప్పుడు ఇతరులను మీ సమానముగా తయారుచేయండి. శ్రీమతముపై నడవండి. తండ్రి వచ్చిందే పావన స్వర్గవాసులుగా తయారుచేయడానికి.

ఇది మృత్యులోకము అని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. కూర్చుని, కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు జరుగుతూ ఉంటుంది, మరి మనము ముందు నుండే కృషి చేసి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుని మన భవిష్య జీవితాన్ని ఎందుకు తయారుచేసుకోకూడదు. మనుష్యులకు ఎప్పుడైతే వానప్రస్థావస్థ వస్తుందో, అప్పుడు - ఇక మేము భక్తిలో నిమగ్నమైపోతాము అని అనుకుంటారు. వానప్రస్థావస్థ రానంతవరకు బాగా ధనము మొదలైనవి సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థావస్థ. మరి ఇక తండ్రికి సహాయకులుగా ఎందుకు అవ్వకూడదు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము తండ్రికి సహాయకులుగా అవుతున్నామా. సేవాధారి పిల్లలైతే ప్రసిద్ధమైనవారు, వారు మంచి కృషి చేస్తారు. యోగములో ఉండడము ద్వారా సేవ చేయగలుగుతారు. స్మృతి శక్తి ద్వారానే మొత్తము ప్రపంచమంతటినీ పవిత్రముగా తయారుచేయాలి. మొత్తము విశ్వమంతటినీ పావనముగా తయారుచేయడానికి మీరు నిమిత్తమయ్యారు. మీ కోసము మరి పవిత్ర ప్రపంచము కూడా తప్పకుండా కావాలి, అందుకే పతిత ప్రపంచము యొక్క వినాశనము జరగబోతుంది. ఇప్పుడు అందరికీ ఇదే తెలియజేస్తూ ఉండండి - దేహాభిమానాన్ని వదలండి, ఒక్క తండ్రినే స్మృతి చేయండి, వారే పతిత-పావనుడు. అందరూ స్మృతి కూడా వారినే చేస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారందరూ తమ వేలుతో - పరమాత్మ ఒక్కరే అని సైగ చేస్తారు, వారే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. ఈశ్వరా లేక పరమాత్మ అని అంటారు కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. కొందరు గణేశుడిని, కొందరు హనుమంతుడిని, కొందరు తమ గురువులను తలచుకుంటూ ఉంటారు. వారంతా భక్తి మార్గానికి చెందినవారని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి మార్గము కూడా అర్ధకల్పము కొనసాగుతుంది. పెద్ద-పెద్ద ఋషులు, మునులు అందరూ నేతి-నేతి అని అంటూ వచ్చారు. రచయిత మరియు రచన గురించి మాకు తెలియదు అని అంటూ వచ్చారు. తండ్రి అంటారు, వాళ్ళు త్రికాలదర్శులైతే కాదు కదా. బీజరూపుడు, జ్ఞానసాగరుడు అయితే ఒక్కరే. వారు రావడము కూడా భారత్ లోనే వస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు మరియు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. అప్పుడు కృష్ణుడిని తలచుకుంటారు. శివుని గురించైతే తెలియదు. శివబాబా అంటారు, పతిత-పావనుడిని, జ్ఞానసాగరుడిని నేనే. కృష్ణుడి విషయములో ఈ విధంగా అనలేరు. గీతా భగవానుడు ఎవరు? ఈ చిత్రము చాలా బాగుంటుంది. తండ్రి ఈ చిత్రాలు మొదలైనవాటన్నింటినీ పిల్లల కళ్యాణము కొరకే తయారుచేయిస్తారు. శివబాబా మహిమను పూర్తిగా వ్రాయాలి. మొత్తమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. పై నుండి ఎవరు వచ్చినా, వారు పవిత్రముగానే ఉంటారు. పవిత్రముగా అవ్వకుండా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ముఖ్యమైన విషయము పవిత్రముగా అవ్వడము. ఆ ధామమే పవిత్ర ధామము, అక్కడ ఆత్మలన్నీ నివసిస్తాయి. ఇక్కడ మీరు పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ పతితముగా అయిపోయారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ పావనులో, వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. దేవి-దేవతా ధర్మము యొక్క నామ-రూపాలే మాయమైపోయాయి. దేవతా ధర్మము అన్న పేరును మార్చి హిందూ ధర్మము అన్న పేరును పెట్టారు. మీరే స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటారు మరియు మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయతో ఓడిపోతే ఓటమి, మాయపై గెలిస్తే గెలుపు. మనుష్యులైతే రావణుడి పెద్ద దిష్టిబొమ్మను ఎంత ఖర్చు పెట్టి తయారుచేస్తారు, మళ్ళీ ఒక్క రోజులోనే దానిని అంతము చేసేస్తారు. అతడు శత్రువు కదా. కానీ ఇది ఒక బొమ్మలాటలా ఉన్నట్లు. శివబాబా లింగాన్ని కూడా తయారుచేసి, దానిని పూజించి, మళ్ళీ పగలగొట్టేస్తారు. దేవీల చిత్రాలను కూడా అలా తయారుచేసి, మళ్ళీ వెళ్ళి ముంచేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుంది అంటూ అనంతమైన చరిత్ర మరియు భౌగోళికము గురించి తెలుసు. సత్య, త్రేతాయుగాల గురించి ఎవ్వరికీ తెలియదు. దేవతల చిత్రాలను కూడా గ్లాని చేసేటట్లు తయారుచేసారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి మీకు ఏదైతే పథ్యము చెప్పారో, ఆ పథ్యాన్ని పాటించండి, స్మృతిలో ఉంటూ భోజనము తయారుచేయండి, యోగములో ఉంటూ భోజనము తినండి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా మళ్ళీ తయారవుతారు. తండ్రి కూడా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు విశ్వానికి యజమానులుగా పూర్తిగా అవ్వాలి. తల్లిని, తండ్రిని ఫాలో చేయండి. కేవలం తండ్రి ఒక్కరే ఉండరు. సన్యాసులు - మేమందరమూ తండ్రులమే ఎందుకంటే ఆత్మయే పరమాత్మ అని అంటారు, కానీ అది తప్పు. ఇక్కడ తల్లి, తండ్రి ఇరువురూ పురుషార్థము చేస్తారు. తల్లిని, తండ్రిని ఫాలో చేయండి, ఈ మాట కూడా ఇక్కడిదే. ఇప్పుడు మీకు తెలుసు - ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో, పవిత్రముగా ఉండేవారో, వారు ఇప్పుడు అపవిత్రముగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పవిత్రముగా అవుతూ ఉన్నారు. మనము కూడా వారి శ్రీమతముపై నడుస్తూ ఆ పదవిని ప్రాప్తి చేసుకుంటాము. వారు వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు, దానిపై నడుచుకోవాలి. వారు ఇస్తున్న డైరెక్షన్లను ఫాలో చేయకపోతే కేవలం నోటితో బాబా, బాబా అని అంటూ నోరు తీపి చేసుకున్నట్లే. ఫాలో చేసేవారినే సుపుత్రులు అని అంటారు కదా. మమ్మా, బాబాలను ఫాలో చేసినట్లయితే మేము రాజరికములోకి వెళ్తాము అని మీకు తెలుసు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రే కేవలం అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇతరులకు ఏమి అర్థం చేయించండి అంటే - మీరు 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అపవిత్రముగా అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పవిత్రముగా అవుతూ ఉంటారు. చాలా స్మృతి చేసేవారే కొత్త ప్రపంచములో మొట్టమొదట వస్తారు. అంతేకాక ఇతరులను కూడా మీ సమానముగా తయారుచేయాలి. ప్రదర్శనీలో అర్థం చేయించేందుకు మమ్మా, బాబా వెళ్ళలేరు. విదేశాల నుండి ఎవరైనా పెద్ద వ్యక్తి వస్తే, ఎవరు వచ్చారు అంటూ వారిని చూడడానికి ఎంతమంది వెళ్తారు. కానీ వీరు ఎంత గుప్తముగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను ఈ బ్రహ్మా తనువు ద్వారా మీకు చెప్తున్నాను, నేను ఈ బిడ్డ యొక్క బాధ్యత వహిస్తాను. శివబాబాయే చెప్తున్నారు మరియు చదివిస్తున్నారు అని మీరు ఎల్లప్పుడూ భావించండి. మీరు శివబాబానే చూడాలి, వీరిని చూడకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పరమాత్మ తండ్రిని స్మృతి చేయండి. మనము ఆత్మ. ఆత్మలో మొత్తము పాత్ర అంతా నిండి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కేవలం ప్రాపంచిక విషయాలే బుద్ధిలో ఉన్నట్లయితే వారికి ఏమీ తెలియనట్లే. వారు పూర్తిగా బుద్ధిహీనులుగా ఉన్నట్లు. కానీ ఇటువంటి వారి కళ్యాణము కూడా చేయవలసిందే. వారు స్వర్గములోకైతే వెళ్తారు కానీ ఉన్నత పదవి లభించదు. శిక్షలు అనుభవించి వెళ్తారు. ఉన్నత పదవిని ఎలా పొందుతారు అనేది తండ్రి అర్థం చేయించారు. ఒకటేమో స్వదర్శన చక్రధారులుగా అవ్వండి మరియు ఇతరులను తయారుచేయండి. పక్కా యోగిగా అవ్వండి మరియు తయారుచేయండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, కానీ మీరు - బాబా, మేము మర్చిపోతున్నాము అని అంటారు. సిగ్గుగా అనిపించడం లేదా! నిజం చెప్పనివారు ఎంతోమంది ఉన్నారు, వారు స్మృతిని చాలా మర్చిపోతూ ఉంటారు. తండ్రి అర్థం చేయించారు - ఎవరైనా వస్తే వారికి తండ్రి పరిచయము ఇవ్వండి. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తవుతుంది, ఇక తిరిగి వెళ్ళాలి. రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు... అని అంటారు, దీని అర్థము కూడా ఎంత సహజము. రాముని పరివారము మరియు రావణుని పరివారము ఉంది అంటే, తప్పకుండా అది సంగమయుగమే అయి ఉంటుంది. అందరూ వినాశనము అయిపోతారు, కొద్దిమంది మాత్రమే మిగులుతారు అని కూడా తెలుసు. మీకు రాజ్యము ఏ విధంగా లభిస్తుంది అనేది కూడా మున్ముందు అంతా తెలిసిపోతుంది. ముందు నుండే అన్నీ చెప్పరు కదా. అప్పుడు అది ఆట అవ్వదు. మీరు సాక్షీగా అయి చూడాలి. సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఈ 84 జన్మల చక్రము గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది - మనము తిరిగి వెళ్తాము, రావణ రాజ్యము నుండి ఇప్పుడు ముక్తి లభిస్తుంది, మళ్ళీ మన రాజధానిలోకి వస్తాము. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది కదా. అనేక సార్లు ఈ చక్రములో తిరిగాము, ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఏ కర్మబంధాలలోనైతే చిక్కుకొని ఉన్నారో, వాటిని మర్చిపోండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ మర్చిపోతూ ఉండండి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనము ఇంటికి వెళ్ళాలి, ఈ మహాభారత యుద్ధము తర్వాతనే స్వర్గము యొక్క గేట్లు తెరుచుకుంటాయి, అందుకే బాబా - గేట్ వే టు హెవెన్ అన్న పేరు చాలా బాగుంది అని అన్నారు. యుద్ధాలైతే ఎప్పటి నుండో జరుగుతున్నాయి కదా అని కొందరు అంటారు. కానీ మీరు చెప్పండి - మిసైల్స్ తో యుద్ధము ఎప్పుడు జరిగింది, ఈ మిసైల్స్ తో జరిగే యుద్ధమే అంతిమ యుద్ధము. 5000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధము జరిగినప్పుడు ఈ యజ్ఞాన్ని కూడా రచించడం జరిగింది. ఈ పాత ప్రపంచము యొక్క వినాశనము ఇప్పుడు జరగనున్నది. కొత్త రాజధాని స్థాపన అవుతోంది.

మీరు రాజ్యాన్ని తీసుకునేందుకు ఈ ఆత్మిక చదువును చదువుతున్నారు. మీ వ్యాపారము ఆత్మిక వ్యాపారము. భౌతిక విద్య అయితే ఎందుకూ ఉపయోగపడేది లేదు, శాస్త్రాలు కూడా ఉపయోగపడవు, మరి ఈ వ్యాపారములో ఎందుకు నిమగ్నమవ్వకూడదు. తండ్రి అయితే విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఏ చదువులో నిమగ్నమవ్వాలి అని ఆలోచించాలి. వారైతే కొన్ని డిగ్రీలు పొందేందుకు చదువుతూ ఉంటారు, మీరైతే రాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఆ చదువు చదవడము ద్వారా కనీసము శనగలు కూడా దొరుకుతాయో లేదో తెలియదు. ఎవరైనా శరీరము వదిలేస్తే ఆ శనగలు కూడా పోతాయి. ఈ సంపాదన అయితే మీతోపాటు వస్తుంది. మృత్యువు అయితే తలపై నిలబడి ఉంది. ముందు మనము మన పూర్తి సంపాదన చేసుకోవాలి. ఈ సంపాదన చేసుకుంటూ, చేసుకుంటూ ఉండగా ప్రపంచమే వినాశనమైపోనున్నది. మీ చదువు పూర్తి అయిన తర్వాతనే వినాశనమవుతుంది. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారందరి పిడికిలిలో ఉన్నది శనగలు మాత్రమే. వాటినే కోతిలా పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు మీరు రత్నాలను తీసుకుంటున్నారు. ఈ శనగల పట్ల మమకారాన్ని వదలండి. ఎప్పుడైతే బాగా అర్థం చేసుకుంటారో, అప్పుడు ఈ పిడికిలిలోని శనగలను వదిలేస్తారు. ఇవన్నీ బూడిదగా అయిపోనున్నాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువును చదువుకోవాలి మరియు చదివించాలి. అవినాశీ జ్ఞాన రత్నాలతో మీ పిడికిలిని నింపుకోవాలి. శనగల వెనుక సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. ఇప్పుడు నాటకం పూర్తి కానున్నది, కావున స్వయాన్ని కర్మ బంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి మరియు తయారుచేయాలి. తల్లిని మరియు తండ్రిని ఫాలో చేసి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి.

వరదానము:-
సంకల్పాలను కూడా చెక్ చేసుకుని వ్యర్థ ఖాతాను సమాప్తము చేసే శ్రేష్ఠ సేవాధారీ భవ

ఎవరిదైతే ప్రతి సంకల్పము శక్తిశాలియో, వారే శ్రేష్ఠ సేవాధారి. ఒక్క సంకల్పము కూడా ఎక్కడా వ్యర్థముగా పోకూడదు. ఎందుకంటే సేవాధారి అనగా విశ్వమనే స్టేజ్ పై యాక్టింగ్ చేసేవారు. మొత్తము విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. ఒకవేళ మీరు ఒక్క సంకల్పాన్ని వ్యర్థము చేస్తే అది కేవలం మీ కొరకే వ్యర్థము చేసుకున్నట్లు కాదు, కానీ అనేకులకు నిమిత్తము అయినట్లు, అందుకే ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తము చేసి శ్రేష్ఠ సేవాధారిగా అవ్వండి.

స్లోగన్:-
సేవా వాయుమండలముతోపాటు అనంతమైన వైరాగ్య వృత్తితో కూడిన వాయుమండలాన్ని తయారుచేయండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీగా అవ్వండి’’

సంగమయుగము ఉన్నదే కంబైండుగా ఉండే యుగము. తండ్రి నుండి వేరు అవ్వలేరు. మీరు సదా కాలము కొరకు సహచరులు. సదా తండ్రితో పాటు ఉండటము అనగా సదా సంతుష్టముగా ఉండటము. తండ్రి మరియు మీరు సదా కంబైండుగా ఉన్నట్లయితే కంబైండుగా ఉన్న శక్తి చాలా గొప్పది, ఒక కార్యానికి బదులుగా వెయ్యి కార్యాలను చెయ్యగలరు ఎందుకంటే వేయి భుజాలు కల తండ్రి మీతోపాటు ఉన్నారు.