24-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఒక్క తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ ఉన్నట్లయితే తండ్రి మీకు బాధ్యత వహిస్తారు, తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - నడుస్తూ తిరుగుతూ నన్ను స్మృతి చేయండి’’

ప్రశ్న:-
మంచి గుణవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారి ముఖ్యమైన గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే మంచి సేవను చేస్తారు, వారు ఎవరికీ ముళ్ళు గుచ్చరు, ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు, ఎవరికీ దుఃఖము ఇవ్వరు. దుఃఖము ఇవ్వడము కూడా ముల్లు గుచ్చడమే.

పాట:-
ఈ సమయము వెళ్ళిపోతోంది...

ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు నంబరువారు పురుషార్థానుసారముగా ఈ పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. నంబరువారుగా అని ఎందుకంటారంటే కొందరు ఫస్ట్ గ్రేడ్ (ప్రథమ శ్రేణి) లో అర్థం చేసుకుంటారు, కొందరు సెకండ్ గ్రేడ్ (ద్వితీయ శ్రేణి) లో అర్థం చేసుకుంటారు, కొందరు థర్డ్ గ్రేడ్ (తృతీయ శ్రేణి) లో అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడము కూడా ప్రతి ఒక్కరిదీ ఎవరిది వారిదే ఉంటుంది. నిశ్చయబుద్ధి కూడా ప్రతి ఒక్కరిదీ ఎవరిది వారిదే. ఎల్లప్పుడూ శివబాబాయే వీరి ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారని భావించండి అని తండ్రి అయితే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పము ఆసురీ డైరెక్షన్లపై నడుస్తూ వచ్చారు, ఇప్పుడు ఏమని నిశ్చయము ఏర్పరచుకోండి అంటే, మేము ఈశ్వరీయ డైరెక్షన్లపై నడిస్తే నావ తీరం చేరుకోగలదు. ఒకవేళ ఈశ్వరీయ డైరెక్షన్లుగా భావించకుండా ఒక మనిషి డైరెక్షన్లుగా భావించినట్లయితే తికమకపడతారు. తండ్రి అంటారు - నా డైరెక్షన్ల అనుసారముగా నడుచుకుంటే దానికి నేను బాధ్యుడిని కదా. ఇతని ద్వారా ఏం జరిగినా, ఇతని కర్మలకు నేనే బాధ్యుడిని, వాటిని నేను సరిదిద్దుతాను. మీరు కేవలం నా డైరెక్షన్ల అనుసారముగా నడుచుకోండి. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో, వారే డైరెక్షన్ల అనుసారముగా నడుచుకుంటారు. అడుగడుగునా ఈశ్వరీయ డైరెక్షన్లుగా భావిస్తూ నడుచుకుంటే ఎప్పుడూ నష్టము జరుగదు. నిశ్చయములోనే విజయము ఉంది. చాలామంది పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకోరు. కాస్త జ్ఞానము వచ్చేసరికి దేహాభిమానము వచ్చేస్తుంది. యోగము చాలా తక్కువగా ఉంది. జ్ఞానము అంటే చరిత్ర-భౌగోళికాలను తెలుసుకోవడము, ఇది సహజమే. ఇక్కడ కూడా మనుష్యులు ఎంతగా సైన్సు మొదలైనవి చదువుతుంటారు. ఈ చదువు చాలా సహజమే, ఇకపోతే శ్రమంతా యోగములోనే ఉంది.

బాబా, మేము యోగములో చాలా లీనమై ఉంటాము అని ఎవరైనా అంటే బాబా ఒప్పుకోరు. బాబా ప్రతి ఒక్కరి నడవడికనూ చూస్తారు. తండ్రిని స్మృతి చేసేవారైతే అత్యంత ప్రియముగా ఉంటారు. స్మృతి చేయరు, అందుకే తప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు మీరు ఈ మెట్ల చిత్రముపై కూడా బాగా అర్థం చేయించగలరు. ఈ సమయములో ఇది ఒక ముళ్ళ అడవి, ఇది పుష్పాలతోట కాదు. భారత్ ఒకప్పుడు పుష్పాలతోటలా ఉండేదని స్పష్టముగా అర్థం చేయించాలి. పుష్పాలతోటలో ఎప్పుడైనా అడివి మృగాలు ఉంటాయా? అక్కడైతే దేవీ-దేవతలు ఉంటారు. తండ్రి ఉన్నతోన్నతమైన అథారిటీ, ఆ తర్వాత ఈ ప్రజాపిత బ్రహ్మా కూడా ఉన్నతోన్నతమైన అథారిటీయే. ఈ దాదా అందరికన్నా పెద్ద అథారిటీ. శివుడు మరియు ప్రజాపిత బ్రహ్మా. ఆత్మలు శివబాబాకు పిల్లలు మరియు సాకారములో సోదరీ-సోదరులమైన మనమందరమూ ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలము. వీరు అందరికీ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇటువంటి ఉన్నతోన్నతమైన అథారిటీ కోసం మాకు ఇల్లు కావాలి అని ఇలా మీరు వ్రాయండి, వారి బుద్ధిలో ఏమన్నా వస్తుందేమో చూడండి.

శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మా, వారు ఆత్మలకు తండ్రి మరియు వీరు మనుష్యమాత్రులందరికీ తండ్రి. అర్థం చేయించడానికి ఇది చాలా మంచి పాయింటు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, మర్చిపోతారు, జ్ఞానపు అహంకారము ఎక్కిపోతుంది. బాప్ దాదాలపై కూడా విజయము పొందినట్లుగా భావిస్తారు. ఈ దాదా అంటారు, పోనీ నా మాట వినకండి, ఎల్లప్పుడూ శివబాబాయే అర్థం చేయిస్తారని భావించండి, వారి మతముపై నడవండి. డైరెక్టుగా ఈశ్వరుడే మతాన్ని ఇస్తున్నారు - ఇలా, ఇలా చేయండి, దానికి బాధ్యత నేను వహిస్తాను. ఈశ్వరీయ మతముపై నడవండి. ఇతనేమైనా ఈశ్వరుడా, మీరు ఈశ్వరుని ద్వారా చదువుకోవాలి కదా. ఎల్లప్పుడూ ఈశ్వరుడే ఈ డైరెక్షన్లు ఇస్తున్నారు అన్నట్లు భావించండి. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా భారత్ యొక్క మనుష్యులే. వీరందరూ కూడా మనుష్యులే. కానీ వారు శివాలయములో ఉండేవారు, అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు. కానీ పిల్లలు పూర్తిగా అర్థం చేయించరు, స్వయం యొక్క నషా ఎక్కిపోతుంది. లోపాలైతే చాలామందిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే పూర్తి యోగము ఉంటుందో అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. బాబా చూస్తూ ఉంటారు, మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుని మురికిలో పడేస్తుంది. తండ్రి స్మృతిలోనైతే చాలా సంతోషముగా అత్యంత ప్రసన్నముగా ఉండాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది, మనము ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారవుతున్నాము. ఇది మర్చిపోతే సంతోషపు పాదరసము పైకి ఎక్కదు. మమ్మల్ని యోగములో కూర్చోబెట్టండి, బయట మేము స్మృతి చేయలేకపోతున్నాము అని అంటారు. స్మృతిలో ఉండరు, అందుకే అప్పుడప్పుడు బాబా కూడా ప్రోగ్రామ్ (కార్యక్రమాన్ని) పంపిస్తారు. కానీ స్మృతిలో కూర్చోరు, బుద్ధి ఇటూ-అటూ భ్రమిస్తూ ఉంటుంది. బాబా తమ ఉదాహరణను చెప్తూ ఉంటారు - నారాయణునికి ఎంత పక్కా భక్తుని ఉండేవారు, ఎక్కడికి వెళ్ళినా నారాయణుని చిత్రము వారితోపాటు ఉండేది, అయినా కానీ పూజ సమయములో బుద్ధి ఇటూ-అటూ పరిగెడుతుండేది. ఇందులో కూడా అలా జరుగుతుంది. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అంటారు కానీ కొందరు - అక్కయ్య యోగము చేయించాలి అని అంటారు. యోగము చేయించడము అంటే అసలు అర్థమే లేదు. స్మృతిలో ఉండండి అని తండ్రి ఎల్లప్పుడూ అంటారు. కొందరు పిల్లలు యోగములో కూర్చుంటూ, కూర్చుంటూ ధ్యానములోకి వెళ్ళిపోతారు. జ్ఞానమూ ఉండదు, స్మృతీ ఉండదు. లేకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఎంతోమందికి అలవాటైపోయింది. అది అల్పకాలికమైన శాంతి వంటిది. అంటే మిగిలిన రోజంతా అశాంతి ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయకపోతే పాపాల భారము ఎలా దిగుతుంది? అర్ధకల్పపు భారము ఉంది. ఇందులోనే చాలా శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. బాబాకు చాలామంది పిల్లలు - ఇంత సమయం స్మృతిలో ఉన్నాము అని వ్రాసి పంపిస్తారు కానీ అంత స్మృతి ఉండదు. చార్టును అసలు అర్థమే చేసుకోరు. తండ్రి అనంతమైన తండ్రి. వారు పతిత-పావనుడు కావున సంతోషముగా ఉండాలి. మేమైతే శివబాబాకు చెందినవారిమే కదా అని అనుకోవడం కాదు. ఇలా కూడా చాలామంది ఉన్నారు, మేమైతే బాబాకు చెందినవారిమే కదా అని అనుకుంటారు కానీ స్మృతి అస్సలు చేయరు. ఒకవేళ స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మొదటి నంబరులోకి వెళ్ళాలి. ఎవరికైనా అర్థం చేయించేందుకు కూడా చాలా మంచి బుద్ధి కావాలి. మనము భారత్ ను మహిమ చేస్తాము. కొత్త ప్రపంచములో ఆది సనాతన దేవీ-దేవతల రాజ్యముండేది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, ఇనుప యుగము. అది సుఖధామము, ఇది దుఃఖధామము. భారత్ స్వర్ణిమయుగముగా ఉన్నప్పుడు ఈ దేవీ-దేవతల రాజ్యము ఉండేది. వీరి రాజ్యముండేది అని మేమెలా అర్థం చేసుకోవాలి అని అంటారు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. ఎవరి భాగ్యములో ఏది ఉంటే అది, ఎవరు ఎంత పురుషార్థము చేస్తున్నారు అనేదైతే కనిపిస్తూ ఉంటుంది. మీరు వారి కర్మల ద్వారా, నడవడిక ద్వారా తెలుసుకుంటారు. వాస్తవానికి కలియుగము వారూ మనుష్యులే, సత్యయుగము వారూ మనుష్యులే, మరి ఎందుకు వారి ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు? వారిని స్వర్గానికి యజమానులు అని అంటారు కదా. ఎవరైనా చనిపోతే ఫలనావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కానీ ఈ సమయములో అందరూ నరకవాసులే అన్నది కూడా అర్థం చేసుకోరు. తప్పకుండా పునర్జన్మలు కూడా ఇక్కడే తీసుకుంటారు. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా చూస్తూ ఉంటారు. బాబాకు ఎంత సాధారణ రీతిలో కొందరితో మాట్లాడవలసి వస్తుంది. సంభాళించవలసి ఉంటుంది. తండ్రి ఎంత స్పష్టముగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్న విషయము చాలా సరైనది అని కూడా అర్థం చేసుకుంటారు. అయినా ఎందుకు పెద్ద-పెద్ద ముళ్ళుగా మారిపోతారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇవ్వడం వలన ముళ్ళుగా అయిపోతారు. అలవాటును వదలనే వదలరు. ఇప్పుడు తోట యజమాని అయిన తండ్రి పుష్పాల తోటను నాటుతున్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తూ ఉంటారు. వారి వ్యాపారమే ఇది. ఎవరైతే స్వయం ముళ్ళుగా ఉంటారో వారు పుష్పాలుగా ఎలా తయారుచేస్తారు? ప్రదర్శనీలో జ్ఞానము వినిపించడానికి కూడా చాలా జాగ్రత్తగా ఎవరినైనా పంపించవలసి ఉంటుంది.

ఎవరైతే ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే మంచి సేవ చేస్తారో వారు మంచి గుణవంతులైన పిల్లలు. వారు ఎవ్వరికీ ముళ్ళు గుచ్చరు అనగా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఎప్పుడూ పరస్పరం కొట్లాడుకోరు. పిల్లలైన మీరు చాలా ఏక్యురేట్ గా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరినీ అవమానపరిచే విషయమేమీ లేదు. ఇప్పుడు శివజయంతి కూడా వస్తోంది. మీరు ప్రదర్శనీలు ఎక్కువగా పెడుతూ ఉండండి. చిన్న-చిన్న ప్రదర్శనీల ద్వారా కూడా అర్థం చేయించవచ్చు. ఒక్క క్షణములో స్వర్గవాసులుగా అవ్వండి లేక పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్ఠాచారులుగా అవ్వండి, ఒక క్షణములో జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోండి. జీవన్ముక్తి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. మీరు కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నారు. తండ్రి ద్వారా అందరికీ ముక్తి, జీవన్ముక్తి లభిస్తుంది. కానీ డ్రామాను కూడా తెలుసుకోవాలి. అన్ని ధర్మాలు స్వర్గములోకి రావు. వారంతా తమ-మత సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. తర్వాత తమ-తమ సమయాలలో వచ్చి స్థాపన చేస్తారు. వృక్షము చిత్రములో ఎంత స్పష్టముగా ఉంది. ఒక్క సద్గురువు తప్ప సద్గతిదాతగా ఇంకెవ్వరూ అవ్వలేరు. ఇకపోతే భక్తిని నేర్పించే గురువులైతే ఎంతోమంది ఉన్నారు. సద్గతినిచ్చేందుకు మనుష్యులు గురువులుగా అవ్వలేరు. కానీ అర్థం చేయించేందుకు కూడా తెలివి ఉండాలి, ఇందులో బుద్ధితో పని చేయవలసి ఉంటుంది. డ్రామా ఆట ఎంత అద్భుతమైనది. మీలో కూడా ఈ నషాలో ఉండేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ - 18-3-1968

వాస్తవానికి మీకు శాస్త్రాల గురించి వాద-వివాదాలు చేయవలసిన అవసరమేమీ లేదు. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది మరియు సృష్టి ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. ఈ చక్రము గురించే కేవలం అర్థం చేసుకోవాలి, క్షణములో జీవన్ముక్తి అని దీనికే గాయనము ఉంది. అర్ధకల్పము భక్తి నడుస్తుందంటే పిల్లలైన మీకు ఆశ్చర్యమనిపించవచ్చు. జ్ఞానము కొంచెము కూడా ఉండదు. జ్ఞానము ఉన్నదే తండ్రి వద్ద. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసామాన్యమైనవారు, అందుకే కోట్లలో కొందరే వెలువడుతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరైతే - నేనే తండ్రిని, టీచరును మరియు గురువును అని చెప్తారు. ఇది విని మనుష్యులు ఆశ్చర్యపోతారు. భారత్ ను మాతృదేశము అని అంటారు ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధమైనది. అంబ మేళాలు కూడా చాలా చేస్తుంటారు, అంబ అన్న మాట చాలా మధురమైనది. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాగిస్తుంది, సంభాళిస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈమైతే దత్తత తీసుకున్న పుత్రిక. ఆమెకు పతి అయితే లేరు. ఇది కొత్త విషయము కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా దత్తత తీసుకుంటూ ఉండవచ్చు. ఈ అన్ని విషయాలనూ తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అంబకు ఎన్ని మేళాలను చేస్తుంటారు, పూజ జరుగుతుంది, ఎందుకంటే ఈ కుమార్తె చాలా సేవ చేసారు. మమ్మా ఎంతమందికి చదివించి ఉంటారో, అంతగా మరెవ్వరూ చదివించలేరు. మమ్మా పేరు చాలా ప్రసిద్ధమైనది. మేళాలు కూడా చాలా పెద్దవి చేస్తారు. తండ్రే వచ్చి రచన యొక్క ఆదిమధ్యాంతాల మొత్తము రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేయించారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకు తండ్రి ఇల్లు కూడా తెలిసింది. తండ్రిపై కూడా ప్రేమ ఉంటుంది, అలాగే ఇంటిపై కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు ఎంత సంపాదన జరుగుతుంది. మరి సంతోషము ఉండాలి కదా. మీరు పూర్తిగా సాధారణమైనవారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు అన్న విషయము ప్రపంచానికి తెలియదు. తండ్రే వచ్చి అన్ని కొత్త-కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు. అనంతమైన చదువు ద్వారా కొత్త ప్రపంచము తయారవుతుంది. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము వస్తుంది. పిల్లలైన మీలో జ్ఞాన సంతోషము ఉంటుంది. తండ్రిని మరియు ఇంటిని స్మృతి చెయ్యాలి. ఇంటికైతే అందరూ వెళ్ళవలసిందే. పిల్లలూ, నేను మీకు ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను అని తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా. మరి మీరు ఎందుకు మర్చిపోతారు. నేను మీకు అనంతమైన తండ్రిని. రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను. మరి మీరు శ్రీమతముపై నడవరా! లేదంటే చాలా నష్టపోతారు. ఇది అనంతమైన నష్టము. తండ్రి చేతిని వదిలారంటే సంపాదనలో నష్టము కలుగుతుంది. అచ్ఛా, గుడ్ నైట్. ఓం శాంతి.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి స్మృతితో అత్యంత ప్రియముగా అవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతి మరియు సంతోషములో అత్యంత ప్రసన్నముగా ఉండాలి.

2. అడుగడుగునా ఈశ్వరీయ డైరెక్షన్లపై నడుస్తూ ప్రతి కార్యము చేయాలి. తమ అహంకారాన్ని (దేహాభిమానపు నషాను) చూపించకూడదు. ఏ విధమైన తప్పుడు పనులు చేయకూడదు, తికమకపడకూడదు.

వరదానము:-
సాధారణ కర్మలు చేస్తూ కూడా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే సదా డబుల్ లైట్ భవ

ఏ విధంగా తండ్రి సాధారణ తనువును తీసుకుంటారు, మీరు ఏ విధంగా మాట్లాడుతారో వారూ అదే విధంగా మాట్లాడుతారు, అదే విధంగా నడుస్తారు, కానీ కర్మ సాధారణముగా ఉన్నా సరే వారి స్థితి ఉన్నతముగా ఉంటుంది, అలాగే పిల్లలైన మీ స్థితి కూడా సదా ఉన్నతముగా ఉండాలి. డబుల్ లైట్ గా అయి ఉన్నతమైన స్థితిలో స్థితులై ఏ సాధారణమైన కర్మనైనా చేయండి. నేను అవతరించి, అవతారముగా అయి శ్రేష్ఠ కర్మలు చేయడానికి వచ్చాను అన్న స్మృతి సదా ఉన్నట్లయితే, సాధారణ కర్మలు అలౌకిక కర్మలుగా మారిపోతాయి.

స్లోగన్:-
ఆత్మిక దృష్టిని, వృత్తిని అభ్యాసము చేసేవారే పవిత్రతను సహజముగా ధారణ చేయగలరు.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

ఎంతగా స్వయాన్ని మనసా సేవలో బిజీగా ఉంచుకుంటారో అంతగా సహజముగా మాయాజీతులుగా అయిపోతారు. కేవలం స్వయము కొరకే భావన కలవారిగా అవ్వకండి, ఇతరులను కూడా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా పరివర్తన చేసే సేవ చెయ్యండి. భావన మరియు జ్ఞానము, స్నేహము మరియు యోగము, ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. కళ్యాణకారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు అనంతమైన విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి.