29-10-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మ నుండి వికారాల చెత్తను తొలగించి శుద్ధమైన పుష్పముగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారానే మొత్తం చెత్త అంతా తొలగుతుంది’’

ప్రశ్న:-
పవిత్రముగా అయ్యే పిల్లలు ఏ విషయములో తండ్రిని అనుసరించాలి?

జవాబు:-
ఏ విధంగా తండ్రి పరమ పవిత్రులో, ఎప్పుడూ అపవిత్రమైన చెత్త కల వ్యక్తులతో మిక్స్ అప్ అవ్వరో (కలవరో), చాలా-చాలా పవిత్రముగా ఉంటారో, అలా పవిత్రముగా అయ్యే పిల్లలైన మీరు తండ్రిని అనుసరించండి, చెడు చూడకండి.

ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి వీరిరువురూ తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, ఇంకొకరిని దైహిక తండ్రి అని అంటారు. శరీరమైతే ఇరువురిదీ ఒక్కటే కావున ఇద్దరు తండ్రులూ అర్థం చేయిస్తున్నట్లే. ఒకరు అర్థం చేయిస్తుంటే ఇంకొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు, అయినా కానీ ఇరువురూ అర్థం చేయిస్తారు అనే అనడం జరుగుతుంది. ఇంత చిన్నని ఆత్మపై ఎంతటి మురికి పట్టి ఉంది. ఆ మురికి పట్టడంతో ఎంత నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడైతే శరీరముతోపాటు ఉంటారో, అప్పుడే లాభము లేక నష్టము కనిపిస్తుంది. ఆత్మ అయిన మనం పవిత్రముగా అయినప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల వంటి పవిత్ర శరీరము లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంతటి మురికి పట్టి ఉంది. తేనెను తీసినప్పుడు దానిని వడపోస్తారు, అప్పుడు అందులో నుండి ఎంత మురికి వెలువడుతుంది, అప్పుడు శుద్ధమైన తేనె వేరవుతుంది. అలాగే ఆత్మ కూడా చాలా మురికి పట్టిపోతుంది. ఆత్మయే కాంచనముగా ఉండేది, పూర్తిగా పవిత్రముగా ఉండేది. శరీరము ఎంత సుందరముగా ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణుల శరీరము ఎంత సుందరముగా ఉందో చూడండి. మనుష్యులైతే శరీరాన్నే పూజిస్తారు కదా. వారు ఆత్మ వైపుకు చూడరు. ఆత్మ యొక్క పరిచయం కూడా లేదు. మొదట ఆత్మ సుందరముగా ఉండేది, శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది. మీరు కూడా ఇప్పుడు అలా తయారవ్వాలనుకుంటున్నారు, కావున ఆత్మ ఎంత శుద్ధముగా ఉండాలి. ఆత్మనే తమోప్రధానము అని అంటారు ఎందుకంటే అందులో పూర్తిగా చెత్త ఉంది. ఒకటేమో దేహాభిమానపు చెత్త, ఇంకొకటి కామ-క్రోధాల చెత్త. ఆ చెత్తను తొలగించేందుకే వడపోయడం జరుగుతుంది కదా. వడపోయడంతో దాని రంగే మారిపోతుంది. మీరు కూర్చుని బాగా ఆలోచించినట్లయితే ఎంతో చెత్త నిండి ఉంది అని మీకు అనుభవమవుతుంది. ఆత్మలో రావణుని ప్రవేశము ఉంది. ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే చెత్త తొలగుతుంది. ఇందులో కూడా సమయం పడుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, దేహాభిమానము ఉన్న కారణంగా వికారాల చెత్త ఎంతగా ఉంది. క్రోధము యొక్క చెత్త కూడా తక్కువేమీ కాదు. క్రోధము గల వ్యక్తి లోలోపల కాలిపోతూ ఉన్నట్లు ఉంటారు. ఏదో ఒక విషయములో వారి హృదయం కాలిపోతూ ఉంటుంది. ముఖము కూడా రాగిలా ఎర్రగా ఉంటుంది. మా ఆత్మ కాలిపోయినట్లు ఉందని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలో ఎంత చెత్త ఉంది అన్నది ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు, ఇందులోనైతే ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు కావాలి కదా. ఇప్పుడైతే ఎన్నో లోపాలున్నాయి. మీరైతే అన్ని లోపాలను తొలగించుకుని పూర్తిగా పవిత్రముగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత పవిత్రముగా ఉన్నారు. వాస్తవానికి వారిని ముట్టుకునేందుకు కూడా అనుమతి లేదు. పతితులు వెళ్ళి అంత ఉన్నతమైన పవిత్ర దేవతలను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. అసలు ముట్టుకునేందుకు కూడా యోగ్యులు కారు. శివుడినైతే ముట్టుకోనేలేరు. వారు నిరాకారుడు, వారిని ముట్టుకోనే ముట్టుకోలేరు. వారు అతి పవిత్రమైనవారు. వారి విగ్రహాన్ని పెద్దగా తయారుచేశారు ఎందుకంటే వారు అంత చిన్నని బిందువు కావున వారిని ఎవరూ ముట్టుకోలేరు. ఆత్మ శరీరములోకి ప్రవేశిస్తే శరీరము పెద్దగా అవుతుంది. ఆత్మ అయితే చిన్నగా, పెద్దగా ఏమీ అవ్వదు. ఇది ఉన్నదే చెత్త ప్రపంచము. ఆత్మలో ఎంత చెత్త ఉంది. శివబాబా చాలా పవిత్రమైనవారు. చాలా పవిత్రమైనవారు. ఇక్కడైతే అందరినీ ఒకే విధముగా చేసేస్తారు, ఒకరిని ఒకరు నీవు పశువువు అని కూడా అనేసుకుంటారు. సత్యయుగములో ఇటువంటి భాష ఉండదు. ఇప్పుడు మా ఆత్మలో చాలా మురికి నిండి ఉంది అని మీరు అనుభవం చేస్తారు. ఆత్మ తండ్రిని స్మృతి చేయడానికి అసలు అర్హునిగానే లేదు. అనర్హులుగా భావించి మాయ కూడా వారిని పూర్తిగా పక్కకు తప్పించేస్తుంది.

తండ్రి ఎంత పవిత్రమైనవారు, శుద్ధమైనవారు. ఆత్మలమైన మనము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు - మీరు నన్ను పిలిచిందే ఆత్మను శుద్ధముగా తయారుచేయడానికి. ఆత్మలో చాలా చెత్త నిండి ఉంది. తోటలో అన్నీ ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలు ఏమీ ఉండవు. నంబరువారుగా ఉంటాయి. తండ్రి తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రముగా అవుతుంది, మళ్ళీ ఎంత మురికిగా పూర్తిగా ముల్లులా అయిపోతుంది. ఆత్మలోనే దేహాభిమానము యొక్క, కామ-క్రోధాల యొక్క చెత్త నిండుతుంది. క్రోధము కూడా మనుష్యులలో ఎంతగా ఉంది. మీరు పవిత్రముగా అయిపోతే ఇక ఎవరి ముఖాన్ని చూడాలని కూడా అనిపించదు. చెడు వినకండి. అపవిత్రులను అసలు చూడను కూడా చూడకూడదు. ఆత్మ పవిత్రముగా తయారై పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకుంటే ఇక చెత్తను చూడను కూడా చూడదు. చెత్త యొక్క ప్రపంచమే అంతమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు దేహాభిమానములోకి వచ్చి ఎంత చెత్తగా అయిపోయారు, పతితముగా అయిపోయారు. పిల్లలు పిలుస్తారు కూడా - బాబా, మాలో క్రోధము యొక్క భూతము ఉంది, బాబా, మేము పవిత్రముగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము. తండ్రి అయితే సదా పవిత్రుడు అనైతే తెలుసు. ఇటువంటి ఉన్నతోన్నతుడైన అథారిటీని సర్వవ్యాపి అనేసి ఎంత అప్రతిష్ఠపాలు చేస్తారు. స్వయంపై కూడా ఎంతో ద్వేషం కలుగుతుంది - మేము ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు, ఇంకే సత్సంగము లేక విశ్వవిద్యాలయము మొదలైనవాటిలో ఎక్కడా కూడా ఇటువంటి లక్ష్యము-ఉద్దేశ్యమును ఎవరూ అర్థం చేయించలేరు. మన ఆత్మలో ఏ విధంగా చెత్త నిండుతూ వచ్చింది అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. రెండు కళలు తగ్గాయి, తర్వాత నాలుగు కళలు తగ్గాయి, చెత్త నిండుతూ వచ్చింది, అందుకే తమోప్రధానము అని అంటారు. కొందరు లోభములో, కొందరు మోహములో కాలి మరణిస్తారు, ఈ అవస్థలోనే కాలిపోతూ, కాలిపోతూ మరణించేది ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరైతే శివబాబా స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. శివబాబా మిమ్మల్ని ఈ విధంగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులను ఈ విధంగా తండ్రే తయారుచేశారు. కావున స్వయాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. తుఫానులైతే ఎన్నో వస్తాయి. తుఫానులు మాయవే వస్తాయి, ఇంకే తుఫానులూ లేవు. శాస్త్రాలలో హనుమంతుడు మొదలైనవారి కథలను వ్రాసేశారు. భగవంతుడు శాస్త్రాలను తయారుచేశారు అని అంటారు. భగవంతుడైతే అన్ని వేద-శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. భగవంతుడైతే సద్గతిని ఇచ్చేసారు, వారు శాస్త్రాలను తయారుచేయవలసిన అవసరమేముంది. ఇప్పుడు తండ్రి అంటారు, చెడును వినకండి. ఈ శాస్త్రాలు మొదలైనవాటి ద్వారా మీరు ఉన్నతముగా తయారవ్వలేరు. నేనైతే వీటన్నింటి నుండి వేరుగా ఉన్నాను. నన్ను ఎవరూ గుర్తించరు. తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఎవరెవరు నా సేవను చేస్తున్నారు అనగా కళ్యాణకారులుగా అయి ఇతరుల కళ్యాణాన్ని చేస్తున్నారు అనేది తండ్రికి తెలుసు, వారే హృదయముపైకి ఎక్కుతారు. కొందరు ఎలా ఉన్నారంటే, వారికి సేవ గురించి తెలియను కూడా తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలైన మీకు జ్ఞానమైతే లభించింది. ఆత్మ శుద్ధముగా అయినా ఈ శరీరమైతే పతితముగానే ఉంది కదా. ఎవరి ఆత్మ అయితే శుద్ధముగా అవుతూ ఉంటుందో, వారి నడవడికలో రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. పేరు ఎవరిది తీసుకోవడం జరుగదు, ఒకవేళ పేరు తీసుకుంటే ఇంకా పాడైపోతారు.

ఇప్పుడు మీరు తేడాను చూడగలుగుతారు - మీరు ఎలా ఉండేవారు, ఎలా అయ్యేది ఉంది! కావున శ్రీమతముపై నడవాలి కదా. లోలోపల చెత్త ఏదైతే నిండి ఉందో దానిని తొలగించుకోవాలి. లౌకిక సంబంధములో కూడా కొందరు పిల్లలు చాలా అశుద్ధముగా ఉంటే వారితో వారి తండ్రి కూడా విసిగిపోతారు, అసలు ఇటువంటి పిల్లలు లేకపోతేనే బాగుండేది అని అంటారు. పూలతోటలో సుగంధము ఉంటుంది. కానీ డ్రామానుసారంగా చెత్త కూడా ఉంది. జిల్లేడు పూలనైతే చూడాలని కూడా అనిపించదు. కానీ తోటలోకి వెళ్ళినప్పుడు దృష్టి అయితే అన్నింటిపైనా పడుతుంది కదా. ఇది ఫలానా పుష్పము అని ఆత్మ అంటుంది. సుగంధము కూడా మంచి పూలదే తీసుకుంటారు కదా. తండ్రి కూడా చూస్తారు - వీరి ఆత్మ స్మృతియాత్రలో ఎంతగా ఉంటారు, ఎంతగా పవిత్రముగా అయ్యారు మరియు ఇతరులను కూడా తమ సమానంగా ఎంతగా తయారుచేస్తున్నారు అని. జ్ఞానాన్ని వినిపిస్తారు! ముఖ్యమైన విషయము మన్మనాభవయే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రమైన పుష్పముగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత పవిత్రమైన పుష్పాలుగా ఉండేవారు. వీరి కన్నా శివబాబా ఎంతో పవిత్రమైనవారు. ఈ లక్ష్మీ-నారాయణులను కూడా ఈ విధంగా శివబాబాయే తయారుచేసారని మనుష్యులకు తెలియదు. ఈ పురుషార్థముతోనే ఈ విధంగా తయారయ్యారని మీకు తెలుసు. తండ్రి అయితే ఎంతో అర్థం చేయిస్తారు. ఒకటేమో స్మృతియాత్రలో ఉండాలి, తద్వారా అశుద్ధత తొలగుతుంది, ఆత్మ పవిత్రముగా అవుతుంది. మ్యూజియం మొదలైన చోట్ల మీ వద్దకు ఎంతోమంది వస్తారు. పిల్లలు సేవా అభిరుచిని ఎంతగానో ఉంచాలి. సేవను వదిలి ఎప్పుడూ నిద్రించకూడదు. సేవలో చాలా ఏక్యురేట్ గా ఉండాలి. మ్యూజియంలో కూడా మీరు రెస్ట్ తీసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. గొంతు అలసిపోతుంది, భోజనం మొదలైనవి కూడా తినాలి. కానీ లోలోపల రాత్రింబవళ్ళు ఆ ఉత్సాహము రావాలి. ఎవరైనా వస్తే వారికి దారిని చూపించాలి అన్న ఉత్సాహము ఉండాలి. భోజనం చేసే సమయములో ఎవరైనా వస్తే మొదట వారి విషయం చూసి ఆ తర్వాత భోజనం చేయాలి, అటువంటి సేవాధారులుగా ఉండాలి. కొందరికైతే చాలా దేహాభిమానము వచ్చేస్తుంది, విశ్రాంతిప్రియులుగా ఉంటారు, నవాబులుగా అయిపోతారు. తండ్రి అయితే అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఈ నవాబుతనాన్ని వదిలివేయండి. ఇక తండ్రి - మీ పదవిని చూడండి అని సాక్షాత్కారం కూడా చేయిస్తారు. దేహాభిమానము అనే గొడ్డలి వేటును తమ కాళ్ళపై తామే వేసుకుంటారు. చాలామంది పిల్లలు బాబాపై కూడా ఈర్ష్యపడతారు. అరే, వీరైతే శివబాబా రథము, వీరిని సంభాళించవలసి ఉంటుంది. ఎన్నో మందులు తీసుకుంటూ ఉండేవారు కూడా ఇక్కడ ఉన్నారు. డాక్టర్లతో వైద్యం చేయించుకుంటూ ఉంటారు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని బాబా అంటారు కానీ తమ అవస్థను కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉంటూ భోజనం చేసినట్లయితే ఎప్పుడూ ఏ వస్తువూ నష్టం కలిగించదు. స్మృతితో శక్తి నిండుతుంది. భోజనం చాలా శుద్ధముగా అయిపోతుంది. కానీ ఆ అవస్థ లేదు. బాబా అయితే అంటారు, బ్రాహ్మణుల చేత తయారుచేయబడిన భోజనం ఉత్తమోత్తమమైనది కానీ ఎప్పుడైతే అది స్మృతిలో కూర్చుని తయారుచేస్తారో అప్పుడే అది ఉత్తమోత్తమముగా ఉంటుంది. స్మృతిలో ఉంటూ తయారుచేసినట్లయితే వారికి కూడా లాభం ఉంటుంది, తినేవారికి కూడా లాభం ఉంటుంది.

జిల్లేడు పూలు కూడా ఎన్నో ఉన్నాయి కదా. పాపం వారు ఏ పదవిని పొందుతారు. తండ్రికైతే దయ కలుగుతుంది. కానీ దాస-దాసీలు తయారవ్వడం కూడా నిశ్చితమై ఉంది, అలాగని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మేము ఇలా అవ్వాలి అన్న ఆలోచన కూడా చేయరు. దాస-దాసీలుగా అవ్వడం కన్నా షావుకార్లుగా అవ్వడం మంచిది, అప్పుడు దాస-దాసీలను పెట్టుకోగలుగుతారు. తండ్రి అయితే అంటారు, నిరంతరమూ నన్నొక్కరినే స్మృతి చేయండి, స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి. దీనికి భక్తులు కూర్చుని స్మరించే మాలను తయారుచేశారు. అది భక్తుల పని. తండ్రి అయితే కేవలం ఇదే చెప్తారు - స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, అంతే. ఇంకే జపమునూ చేయకండి, మాలనూ తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి, వారిని స్మృతి చేయాలి. నోటితో బాబా, బాబా అని అనవలసిన అవసరం కూడా లేదు. మీకు తెలుసు - వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి, వారిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధానముగా అయిపోతాము అనగా ఆత్మ కాంచనముగా అయిపోతుంది. ఇది ఎంత సహజము. కానీ ఇది యుద్ధ మైదానము కదా. మీది మాయతో యుద్ధము. అది ఘడియ-ఘడియ మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. ఎంతెంతగా వినాశ కాలములో ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో, అంతగా పదవి లభిస్తుంది. కేవలం ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కల్పపూర్వము కూడా విజయమాలలోని మణులుగా అయినవారు వెలువడ్డారు. బ్రాహ్మణ కులానికి చెందిన మీలో ఎవరైతే చాలా గుప్తముగా కష్టపడ్డారో వారి రుండమాల (విష్ణుమాల) తయారవుతుంది. జ్ఞానము కూడా గుప్తమైనది కదా. తండ్రికైతే ప్రతి ఒక్కరి గురించి బాగా తెలుసు. మంచి-మంచి నంబరు వన్ గా ఉన్నవారు, ఎవరినైతే మహారథులుగా భావించేవారో, వారు ఈ రోజు లేరు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండదు. మాయ చాలా గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. మాలగా తయారవ్వగలిగినవారు చాలా కొద్దిమందే ఉన్నారు. అయినా కానీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు - మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి, మేము ఎంత పవిత్రమైన దేవతలుగా ఉండేవారము, ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాము, చెత్తగా అయిపోయాము. ఇప్పుడు శివబాబా లభించారు కావున వారి మతముపై నడవాలి కదా. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఎవరి స్మృతీ రాకూడదు. చిత్రాలు కూడా ఎవరివీ పెట్టుకోకూడదు. ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. శివబాబాకు శరీరమైతే లేదు. దీనిని కూడా తాత్కాలికముగా అప్పుగా తీసుకుంటాను. మిమ్మల్ని ఈ విధంగా దేవీ-దేవతలుగా, లక్ష్మీ-నారాయణులుగా తయారుచేయడానికి ఎంతగా కష్టపడతారు. తండ్రి అంటారు, మీరు నన్ను పతిత ప్రపంచములోకి పిలుస్తారు, నేను మిమ్మల్ని పావనంగా తయారుచేస్తాను, కానీ మీరు నన్ను పావన ప్రపంచములో పిలువనే పిలువరు. అక్కడకు వచ్చి ఏమి చేస్తారు! వారి సేవయే పావనంగా తయారుచేసే సేవ. పూర్తిగా కాలిపోయి నల్లని బొగ్గులా అయిపోయారని తండ్రికి తెలుసు. మిమ్మల్ని తెల్లగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవలో చాలా ఏక్యురేట్ గా ఉండాలి. రాత్రింబవళ్ళూ సేవా ఉత్సాహము కలుగుతూ ఉండాలి. సేవను వదిలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోకూడదు. తండ్రి సమానముగా కళ్యాణకారులుగా అవ్వాలి.

2. ఒక్కరి స్మృతితో ప్రీతి బుద్ధి కలవారిగా అయి లోపల ఉన్న చెత్తను తొలగించివేయాలి. సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. ఈ చెత్త ప్రపంచముపై మనసు పెట్టుకోకూడదు.

వరదానము:-

మనస్సు-బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితుల రూపీ ఆసనముపై స్థితులై ఉండే తపస్వీమూర్త భవ

తపస్వీలు సదా ఏదో ఒక ఆసనముపై కూర్చుని తపస్య చేస్తారు. తపస్వీ ఆత్మలైన మీ ఆసనాలు - ఏకరస స్థితి, ఫరిశ్తా స్థితి... ఈ శ్రేష్ఠ స్థితులలో స్థితులవ్వడము అనగా ఆసనముపై కూర్చోవడము. స్థూల ఆసనముపైనైతే స్థూల శరీరము కూర్చుంటుంది కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనముపై మనస్సు-బుద్ధిని కూర్చోబెడతారు. ఆ తపస్వీలు ఒక కాలిపై నిలబడతారు మరియు మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రులవుతారు. వారిది హఠయోగము మరియు మీది సహజయోగము.

స్లోగన్:-

ప్రేమసాగరుడైన తండ్రి యొక్క పిల్లలు ప్రేమతో నిండుగా ఉన్న గంగలుగా అయి ఉండండి.