30-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచములో ఎటువంటి సారమూ లేదు, అందుకే మీరు దీని పట్ల మనస్సు పెట్టుకోకూడదు, తండ్రి స్మృతి తెగిపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది’’

ప్రశ్న:-
తండ్రి యొక్క ముఖ్యమైన డైరెక్షన్ ఏమిటి? దాని ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది?

జవాబు:-
తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - ఎవరి నుండీ సేవ తీసుకోకండి ఎందుకంటే మీరు స్వయమే సేవకులు. కానీ దేహాభిమానము కారణముగా తండ్రి యొక్క ఈ డైరెక్షన్ ను ఉల్లంఘిస్తారు. బాబా అంటారు, మీరు ఇక్కడ సుఖము తీసుకుంటే అక్కడి సుఖము తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు, మేము స్వతంత్రముగా ఉంటాము అని అంటారు కానీ మీరందరూ తండ్రిపై ఆధారపడి ఉన్నారు.

పాట:-
హృదయము యొక్క ఆధారము తెగిపోకూడదు...

ఓంశాంతి
శివ భగవానువాచ తన సాలిగ్రామాల కోసము. శివుడు మరియు సాలిగ్రామాలను గురించైతే మనుష్యులందరికీ తెలుసు. ఇరువురూ నిరాకారియే. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానువాచ అని అనలేరు. భగవంతుడు ఒక్కరే ఉంటారు. మరి శివ భగవానువాచ అనేది ఎవరి కోసము? ఆత్మిక పిల్లల కోసము. బాబా అర్థం చేయించారు, పిల్లలకు ఇప్పుడు సంబంధము ఉన్నది తండ్రితోనే ఎందుకంటే పతిత-పావనుడు, జ్ఞాన సాగరుడు, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు అయితే శివబాబాయే. స్మృతి కూడా వారినే చెయ్యాలి. బ్రహ్మా వారి భాగ్యశాలి రథము. రథము ద్వారానే తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. వారసత్వాన్ని ఇచ్చేవారు బ్రహ్మా కాదు, వారు తీసుకునేవారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. ఒకవేళ ఈ రథానికి ఏమైనా ఇబ్బంది కలిగితే లేక ఏ కారణము వల్లనైనా పిల్లలకు మురళి లభించకపోతే, పిల్లల యొక్క పూర్తి అటెన్షన్ శివబాబా వైపుకు వెళ్తుంది. వారు ఎప్పుడూ అనారోగ్యంపాలు అవ్వరు. పిల్లలకు ఎంతో జ్ఞానము లభించింది, వారు కూడా అర్థం చేయించగలరు. ప్రదర్శినీలో పిల్లలు ఎంతగా అర్థం చేయిస్తారు. జ్ఞానమైతే పిల్లలలో ఉంది కదా. ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానము నిండి ఉంది. పిల్లలకు ఏ అడ్డంకు ఉండదు. ఒకవేళ పోస్ట్ రావడము ఆగిపోయిందనుకోండి, లేక ఏదైనా సమ్మె జరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? జ్ఞానమైతే పిల్లలలో ఉంది. ఒకప్పుడు సత్యయుగము ఉండేది, ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచము అని అర్థం చేయించాలి. పాత ప్రపంచములో సారమేమీ లేదు అని పాటలో కూడా ఉంది, దీని పట్ల మనస్సు పెట్టుకోకూడదు. లేకపోతే శిక్షలు లభిస్తాయి. తండ్రి స్మృతితో శిక్షలు కట్ అవుతూ ఉంటాయి. తండ్రి స్మృతి తెగిపోవడమనేది జరగకూడదు, అలా జరిగితే శిక్షలు తినవలసి వస్తుంది మరియు పాత ప్రపంచములోకి వెళ్ళిపోతారు. అలా ఎంతోమంది వెళ్ళిపోయారు, వారికి తండ్రి గుర్తు కూడా లేరు. వారికి పాత ప్రపంచముపై మనస్సు పడింది. ప్రపంచము చాలా దుర్దశలో ఉంది. ఎవరిపైనైనా మనస్సు పెట్టుకుంటే శిక్షలు చాలా లభిస్తాయి. పిల్లలు జ్ఞానము వినాలి. భక్తి మార్గపు పాటలు కూడా వినకూడదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా మీకు సంగమములోనే జ్ఞానము లభిస్తుంది. జ్ఞాన సాగరుడు ఒక్కరేనని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. వారు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో, అప్పుడు మనుష్యుల సద్గతి జరుగుతుంది. సద్గతిదాత ఒక్కరే, కావున వారి మతముపై నడవాలి. మాయ ఎవ్వరినీ వదలదు. దేహాభిమానములోకి వచ్చినప్పుడే ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. కొందరు సెమి కామానికి (అర్ధ కామానికి) వశమైపోతారు, కొందరు క్రోధానికి వశమైపోతారు. ప్రేమించాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటూ మనసులో ఎన్నో తుఫానులు వస్తాయి. ఎవరి శరీరముపైనా మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే దేహ భానము ఉండదు. లేదంటే తండ్రి ఆజ్ఞ యొక్క ఉల్లంఘన జరుగుతుంది. దేహ అహంకారము వలన చాలా నష్టము జరుగుతుంది, అందుకే దేహ సహితముగా సర్వస్వాన్ని మర్చిపోవాలి. కేవలం తండ్రిని మరియు ఇంటిని స్మృతి చెయ్యాలి. ఆత్మలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, శరీరముతో పని చేస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు భస్మమైపోతాయి. మార్గము అయితే చాలా సహజమైనది. మీ ద్వారా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నది కూడా అర్థమవుతుంది. కానీ అలాగని పొరపాట్లలో చిక్కుకుపోతూనే ఉండడం కాదు. ఒకసారి పొరపాటు జరిగిందంటే, మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు. మళ్ళీ ఈ పొరపాటు చేయను అని చెవులు పట్టుకోవాలి. పురుషార్థము చేయాలి. ఒకవేళ ఘడియ, ఘడియ పొరపాటు జరిగితే దీని వలన నేను చాలా నష్టపోతాను అని అర్థం చేసుకోవాలి. పొరపాట్లు చేస్తూ, చేస్తూనే దుర్గతిని పొందారు కదా. ఎంత పెద్ద మెట్ల వరసను దిగి ఇప్పుడు ఎలా తయారయ్యారు! ఇంతకుముందు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారముగా జ్ఞానములో అందరూ ప్రావీణ్యులు అయ్యారు. ఎంత వీలైతే అంత అంతర్ముఖీగా కూడా ఉండాలి, నోటితో ఏమీ మాట్లాడకూడదు. జ్ఞానములో ప్రావీణ్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారు ఎప్పుడూ పాత ప్రపంచముపై మనస్సు పెట్టుకోరు. వారి బుద్ధిలో, మేమైతే రావణ రాజ్యాన్ని వినాశనము చేయాలనుకుంటున్నాము అని ఉంటుంది. ఈ శరీరము కూడా పాతది, రావణ సాంప్రదాయానికి చెందినది, మరి మనము రావణ సాంప్రదాయాన్ని ఎందుకు స్మృతి చేయాలి? ఒక్క రాముడినే స్మృతి చెయ్యాలి. సత్యమైన పితావ్రతులుగా అయ్యారు కదా.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. పితావ్రతులుగా లేక భగవంతుని వ్రతులుగా అవ్వాలి. ఓ భగవంతుడా, వచ్చి మాకు సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అని భక్తులు భగవంతుడినే తలచుకుంటారు. భక్తి మార్గములోనైతే అర్పణ అవుతారు, బలి అవుతారు. ఇక్కడ బలి అయ్యే మాటే లేదు. మనమైతే జీవిస్తూనే మరణిస్తాము అనగా బలి అవుతాము. జీవిస్తూనే తండ్రికి చెందినవారిగా అవ్వడమంటే ఇదే ఎందుకంటే వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. వారి మతముపై నడవాలి. జీవిస్తూనే బలి అవ్వడమనేది, అర్పణమవ్వడమనేది వాస్తవానికి ఇప్పటి విషయమే. కానీ భక్తి మార్గములో వారు ఎంతగా జీవహత్య మొదలైనవి చేస్తారు. ఇక్కడ జీవహత్య అనే మాటే లేదు. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రితో యోగము జోడించండి, దేహాభిమానములోకి రాకండి. లేస్తూ, కూర్చుంటూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చెయ్యాలి. 100 శాతం పాస్ అయితే ఎవ్వరూ అవ్వలేదు. పైకి కిందకి అవుతూ ఉంటారు. పొరపాట్లు జరుగుతాయి, వాటి పట్ల అటెన్షన్ ఇప్పించకపోతే పొరపాట్లను ఎలా వదలుతారు? మాయ ఎవ్వరినీ వదలదు. బాబా, మేము మాయతో ఓడిపోతున్నాము, పురుషార్థము చేస్తున్నాము కూడా, కానీ మళ్ళీ ఏమవుతుందో తెలియడం లేదు, మా ద్వారా ఇంత కఠినమైన పొరపాట్లు ఎలా జరిగిపోతున్నాయో తెలియడం లేదు. దీని వలన బ్రాహ్మణ కులములో మా పేరు అప్రతిష్టపాలు అవుతుందని తెలుసు కూడా. అయినా కూడా మాయ ద్వారా ఎటువంటి దాడి జరుగుతుందంటే, అది అసలు అర్థం కావడం లేదు. దేహాభిమానములోకి రావడం వలన బుద్ధిహీనులుగా అయినట్లు అయిపోతారు. బుద్ధిహీనమైన పనులు జరిగితే గ్లాని కూడా జరుగుతుంది, వారసత్వము కూడా తగ్గిపోతుంది. ఇలా ఎందరో పొరపాట్లు చేస్తారు. మాయ ఎంత గట్టిగా చెంపదెబ్బ వేస్తుందంటే, దాని వలన వారు స్వయమూ ఓడిపోతారు, అంతేకాక క్రోధములోకి వచ్చి ఎవరినైనా చెంపదెబ్బ కొట్టడం లేక చెప్పుతో కొట్టడం మొదలుపెడతారు, మళ్ళీ పశ్చాత్తాపపడతారు కూడా. బాబా అంటారు, ఇప్పడు ఇక చాలా కృషి చేయవలసి ఉంటుంది. స్వయాన్ని కూడా నష్టపరచుకున్నారు, ఇతరులను కూడా నష్టపరిచారు, ఎంత నష్టము కలిగింది. రాహు గ్రహణము కూర్చుంది. ఇప్పుడు తండ్రి అంటారు, దానము ఇచ్చినట్లయితే గ్రహణము వదిలిపోతుంది. రాహు గ్రహణము పడితే అది వదలడానికి సమయం పట్టేస్తుంది. మెట్లు ఎక్కి మళ్ళీ దిగడం కష్టమవుతుంది. మనుష్యులకు మద్యం సేవించడం అలవాటైతే ఇక అది వదలడానికి ఎంత కష్టమవుతుంది. అన్నింటికంటే పెద్ద పొరపాటు - నల్లముఖము చేసుకోవడము. ఘడియ, ఘడియ శరీరము గుర్తుకొస్తుంది. ఇంకా పిల్లలు పుడితే ఇక వారి స్మృతే ఉంటుంది. ఇక వారు ఇతరులకు జ్ఞానమేమి ఇస్తారు. వారు చెప్పింది ఎవరూ వినరు కూడా. మనమైతే ఇప్పుడు అందరినీ మర్చిపోయే ప్రయత్నము చేసి ఒక్కరినే స్మృతి చేస్తాము. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మాయ చాలా చురుకైనది. రోజంతా శివబాబాను స్మృతి చేసే ఆలోచనే ఉండాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది, మనము వెళ్ళాలి. ఈ శరీరము కూడా అంతమవ్వనున్నది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానము తెగిపోతూ ఉంటుంది మరియు ఇంకెవ్వరి స్మృతి ఉండదు. ఇది ఎంత పెద్ద గమ్యము, ఒక్క తండ్రిపై తప్ప ఇంకెవ్వరిపైనా మనసు పెట్టుకోకూడదు. లేదంటే ఆ వ్యక్తులు తప్పకుండా ఎదురుగా వస్తారు, ప్రతీకారం తీర్చుకుంటారు. చాలా ఉన్నతమైన గమ్యము. చెప్పడం చాలా సులభము, లక్షలలో ఏ ఒక్క మణిపూసో వెలువడుతుంది. కొందరు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. ఎవరైతే మంచి కృషి చేస్తారో, వారు తప్పకుండా స్కాలర్షిప్ తీసుకుంటారు. నేను సేవ ఎలా చేస్తున్నాను? అన్నది సాక్షీ అయి చూడాలి. చాలామంది పిల్లలు లౌకిక ఉద్యోగము వదిలి ఇందులో నిమగ్నమవ్వాలని కోరుకుంటారు. కానీ బాబా పరిస్థితులను కూడా చూస్తారు. ఒంటరిగానే ఉన్నారు, సంబంధీకులు ఎవ్వరూ లేరు అంటే పర్వాలేదు. అయినా కూడా ఏమంటారంటే - ఉద్యోగము కూడా చెయ్యండి మరియు ఈ సేవ కూడా చెయ్యండి. ఉద్యోగములో కూడా చాలామందితో పరిచయమవుతుంది. పిల్లలైన మీకు జ్ఞానమైతే చాలా లభించింది. పిల్లల ద్వారా కూడా తండ్రి చాలా సేవ చేయిస్తూ ఉంటారు. కొందరిలో ప్రవేశించి సేవ చేస్తారు. సేవ అయితే చేయవలసిందే. ఎవరి తలపైనైతే బాధ్యత ఉందో వారు ఎలా నిద్రపోగలరు! శివబాబా అయితే సదా వెలుగుతూ ఉండే జ్యోతి. తండ్రి అంటారు, నేనైతే రాత్రింబవళ్ళు సేవ చేస్తాను, అలసిపోయేది శరీరము. అప్పుడిక ఆత్మ కూడా ఏం చేస్తుంది, శరీరము సహకరించదు. తండ్రి అయితే అలసటలేనివారు కదా. వారు వెలుగుతూ ఉండే జ్యోతి, మొత్తం ప్రపంచాన్ని మేలుకొలుపుతారు. వారి పాత్రయే అద్భుతమైనది, దాని గురించి పిల్లలైన మీలో కూడా కొద్దిమందికే తెలుసు. కాలుడికే కాలుడు తండ్రి. వారి ఆజ్ఞను పాటించకపోతే ధర్మరాజు ద్వారా దెబ్బలు తింటారు. తండ్రి యొక్క ముఖ్యమైన డైరెక్షన్ ఏమిటంటే - ఎవరి నుండీ సేవ తీసుకోకండి. కానీ దేహాభిమానములోకి వచ్చి తండ్రి ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. బాబా అంటారు, మీరు స్వయమే సేవకులు. ఇక్కడ సుఖము తీసుకుంటే అక్కడ సుఖము తగ్గిపోతుంది. అలవాటైపోతే ఇక సేవకులు లేకుండా ఉండలేరు. కొందరు, మేమైతే స్వతంత్రముగా ఉంటాము అని అంటారు కానీ తండ్రి అంటారు, ఆధారపడి ఉండడం మంచిది. మీరందరూ తండ్రిపై ఆధారపడి ఉన్నారు. స్వతంత్రముగా ఉన్నట్లయితే కింద పడిపోతారు. మీరందరూ శివబాబాపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచమంతా ఆధారపడి ఉంది, అందుకే - ఓ పతితపావనా రండి అని అంటారు. వారి ద్వారానే సుఖ-శాంతులు లభిస్తాయి, కానీ అది అర్థం చేసుకోరు. ఈ భక్తి మార్గపు సమయాన్ని కూడా దాటవలసిందే. ఎప్పుడైతే రాత్రి పూర్తవుతుందో, అప్పుడు తండ్రి వస్తారు. ఒక్క క్షణము కూడా తేడా రాదు. తండ్రి అంటారు, నేను ఈ డ్రామా గురించి తెలిసినవాడిని. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. సత్యయుగము నుండి మొదలుకుని ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. ఇప్పుడు మీకు రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, దీనినే జ్ఞానము అని అంటారు, మిగిలినదంతా భక్తి. తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. మనకు ఆ జ్ఞానము లభిస్తూ ఉంది. పిల్లలకు నషా కూడా బాగా ఉండాలి. కానీ రాజధాని స్థాపన అవుతుందని కూడా మీకు తెలుసు. కొందరైతే ప్రజలలో కూడా సాధారణ సేవకులుగా అవుతారు. కొద్దిగా కూడా జ్ఞానము అర్థం కాదు. ఆశ్చర్యము కదా! జ్ఞానమైతే చాలా సహజము. 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు ఇక మన ఇంటికి వెళ్ళాలి. మనము డ్రామాలోని ముఖ్యమైన పాత్రధారులము. మొత్తం డ్రామా అంతటినీ తెలుసుకున్నాము. మొత్తం డ్రామాలో హీరో, హీరోయిన్ పాత్రధారులము మనమే. ఇది ఎంత సహజము. కానీ భాగ్యములో లేకపోతే ఇక పురుషార్థము కూడా ఏం చేస్తారు! చదువులో ఇలా అవుతుంది. కొందరు ఫెయిల్ అయిపోతారు. ఇది ఎంత పెద్ద స్కూల్. రాజధాని స్థాపన అవ్వనున్నది. ఇప్పుడు ఎవరు ఎంత చదువుకుంటే అంత. తాము ఏ పదవిని పొందుతారు అనేది పిల్లలు తెలుసుకోగలరు. ఎంతోమంది ఉన్నారు, అందరూ వారసులుగా అయితే అవ్వరు. పవిత్రముగా అవ్వడం చాలా కష్టము. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తారు, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. తండ్రి స్మృతితో సతోప్రధానముగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. కానీ భాగ్యములో లేకపోతే తండ్రికి బదులుగా వేరే-వేరేవారిని స్మృతి చేస్తారు. మనసు పెట్టుకుంటే చాలా ఏడవాల్సి వస్తుంది కూడా. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచముపై మనస్సు పెట్టుకోకూడదు. ఇదైతే అంతమవ్వనున్నది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. కలియుగము ఇప్పుడు ఇంకా చాలా సమయము ఉండబోతుంది అని వారు భావిస్తారు. ఘోరమైన నిద్రలో పడుకుని ఉన్నారు. మీ ఈ ప్రదర్శినీ ప్రజలను తయారుచేసుకునేందుకు విహంగ మార్గపు సేవా సాధనము. రాజులు, రాణులు కూడా కొందరు వెలువడుతారు. సేవ పట్ల చాలా అభిరుచి ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు పేదవారు ఉన్నారు, కొందరు షావుకారులు ఉన్నారు. ఇతరులను తమ సమానముగా తయారుచేస్తారు, దాని నుండి కూడా లాభం కలుగుతుంది కదా. అంధులకు చేతికర్రగా అవ్వలి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పాలి. ఎప్పుడైతే వినాశన సమయాన్ని దగ్గరగా చూస్తారో, అప్పుడు మీ మాటలు వింటారు. మీ సేవ కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది నిజమే అని అర్థం చేసుకుంటారు. వినాశనము అవ్వనున్నది అని మీరు చెప్తూనే ఉంటారు.

మీ ప్రదర్శినీ సేవలు, మేళా సేవలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఏదైనా మంచి హాలు దొరుకుతుందేమో ప్రయత్నించాలి. అద్దె ఇచ్చేందుకైతే మేము సిద్ధముగా ఉన్నాము, మీ పేరు ఇంకా ప్రసిద్ధి అవుతుంది అని చెప్పండి. ఇలా చాలామంది వద్ద హాలులు పడి ఉంటాయి. పురుషార్థము చేస్తే మూడడుగుల భూమి లభిస్తుంది. అప్పటివరకు మీరు చిన్న-చిన ప్రదర్శనీలు పెట్టండి. శివజయంతిని కూడా మీరు జరిపితే శబ్దము వ్యాపిస్తుంది. శివజయంతిని సెలవు దినముగా ప్రకటించండి అని మీరు వ్రాస్తారు కూడా. వాస్తవానికి జన్మదినమైతే ఈ ఒక్కరిదే జరుపుకోవాలి. వారే పతిత-పావనుడు. స్టాంప్ కూడా అసలు వాస్తవానికి ఈ త్రిమూర్తిదే. సత్యమేవ జయతే... ఇది విజయము పొందే సమయము. అర్థం చేయించేవారు కూడా మంచివారు కావాలి. అన్ని సెంటర్ల యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. మన స్టాంప్ కూడా తయారుచేయవచ్చు. ఇది త్రిమూర్తి శివజయంతి. కేవలం శివజయంతి అని అంటే అర్థం చేసుకోలేరు. ఇప్పుడిక పని అయితే పిల్లలే చేయాలి. ఎంతోమంది కళ్యాణము జరిగితే ఎంత లిఫ్ట్ దొరుకుతుంది, సేవ ద్వారా ఎంతో లిఫ్ట్ లభిస్తుంది. ప్రదర్శినీ ద్వారా ఎంతో సేవ జరగగలదు. ప్రజలైతే తయారవుతారు కదా. ఏ పిల్లలకు సేవ పట్ల అటెన్షన్ ఉంటుంది అనేది బాబా చూస్తారు! వారే హృదయాన్ని అధిరోహిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒకవేళ ఒక్కసారి ఏదైనా పొరపాటు జరిగితే ఆ సమయములోనే చెవులు పట్టుకోవాలి, మళ్ళీ ఆ పొరపాటు చేయకూడదు. ఎప్పుడూ కూడా దేహ-అహంకారములోకి రాకూడదు. జ్ఞానములో ప్రావీణ్యులు అయ్యి అంతర్ముఖులుగా ఉండాలి.

2. సత్యమైన పితావ్రతులుగా అవ్వాలి, జీవిస్తూనే బలి అవ్వాలి. ఎవరిపైనా మనసు పెట్టుకోకూడదు. బుద్ధిహీనమైన పనులేవీ చేయకూడదు.

వరదానము:-
వియోగానికి సదా కాలము కొరకు వీడ్కోలు ఇచ్చే స్నేహీ స్వరూప భవ

స్నేహీలకు ఏదైతే ఇష్టమో అదే స్నేహము చేసేవారికి కూడా ఇష్టమవ్వాలి - ఇదే స్నేహము యొక్క స్వరూపము. నడవటము, తినటము, త్రాగటము, ఉండటము స్నేహితుని మనసుకు నచ్చేటట్లుగా ఉండాలి, అందుకే ఏ సంకల్పము లేక కర్మను చేసినా, ఇది స్నేహీ తండ్రి మనసుకు నచ్చేటట్లుగా ఉందా అని ముందు ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహీలుగా అయినట్లయితే నిరంతర యోగులుగా, సహజయోగులుగా అయిపోతారు. ఒకవేళ స్నేహీ స్వరూపాన్ని సమాన స్వరూపములోకి పరివర్తన చేసినట్లయితే అమర భవ అన్న వరదానము లభిస్తుంది మరియు వియోగానికి సదా కాలము కొరకు వీడ్కోలు లభిస్తాయి.

స్లోగన్:-
స్వభావాన్ని ఈజీగా మరియు పురుషార్థాన్ని అటెన్షన్ కలదిగా తయారుచేసుకోండి.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

ఏ విధంగానైతే బీజములో మొత్తము వృక్షము ఇమిడి ఉంటుందో, అలా సంకల్పాల రూపీ బీజములో మొత్తము వృక్షము యొక్క విస్తారము ఇమిడిపోవాలి, అప్పుడు సంకల్పాల అలజడి సమాప్తమవుతుంది. ఈ రోజుల్లో ప్రపంచములో రాజనీతి విషయములో అలజడి, వస్తువుల ధర విషయములో అలజడి, కరెన్సీ విషయములో అలజడి, కర్మభోగము విషయములో అలజడి, ధర్మము విషయములో అలజడి... ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఆ అలజడుల నుండి స్వయాన్ని మరియు సర్వులను రక్షించేందుకు మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసము చేస్తూ సకాష్ ను ఇచ్చే సేవ చేస్తూ ఉండండి.