30-10-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారీ స్మృతి, ఈ స్మృతితో మీ పాపాలు అంతమవ్వగలవు’’

ప్రశ్న:-
తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని కొందరు సహజముగా అంగీకరిస్తారు, కొందరు కష్టం మీద అర్థం చేసుకుంటారు - దీనికి కారణము ఏమిటి?

జవాబు:-
ఏ పిల్లలైతే ఎంతోకాలంగా భక్తి చేశారో, అర్ధకల్పము నుండి పాత భక్తులుగా ఉన్నారో, వారు తండ్రి చెప్పే ప్రతి విషయాన్ని సహజముగా అంగీకరిస్తారు ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. ఎవరైతే పాత భక్తులు కారో, వారికి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమనిపిస్తుంది. ఇతర ధర్మాలవారైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు కూడా.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరందరూ ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారీ స్మృతి. ఒకటేమో వ్యభిచారీ స్మృతి, ఇంకొకటి అవ్యభిచారీ స్మృతి. మీ అందరిదీ అవ్యభిచారీ స్మృతి. అది ఎవరి స్మృతి? ఒక్క తండ్రి స్మృతి. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పాపాలు అంతమైపోతాయి మరియు మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయి మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఆత్మలే వెళ్ళాలి. ఆత్మయే ఈ ఇంద్రియాల ద్వారా అన్ని కర్మలనూ చేస్తుంది కదా. కావున తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మనుష్యులైతే అనేకానేకులను స్మృతి చేస్తారు. భక్తి మార్గములో మీరు ఒక్కరినే స్మృతి చేయాలి. భక్తి కూడా మొట్టమొదట మీరు ఉన్నతోన్నతుడైన శివబాబాదే చేశారు. దానిని అవ్యభిచారీ భక్తి అని అంటారు. వారే సర్వులకూ సద్గతిని ఇచ్చే రచయిత అయిన తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. సోదరుల నుండి వారసత్వము లభించదు. వారసత్వము ఎల్లప్పుడూ తండ్రి నుండే పిల్లలకు లభిస్తుంది. ఎంతోకొంత కన్యలకు లభిస్తుంది. ఆమె వెళ్ళి హాఫ్-పార్ట్నర్ గా అవుతుంది. ఇక్కడైతే మీరందరూ ఆత్మలే. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. అందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. శరీరాలు స్త్రీ-పురుషులవే అయినా మీరందరూ పరస్పరం సోదరులే. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. వారైతే కేవలం నామమాత్రంగా హిందూ, ముస్లిం భాయి-భాయి అని అంటారు. దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరు ఇప్పుడు దాని అర్థాన్ని అర్థం చేసుకుంటారు. భాయి-భాయి అనగా ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు, తర్వాత ప్రజాపిత బ్రహ్మా పిల్లల రూపములో పరస్పరం సోదరీ-సోదరులు. ఈ ప్రపంచము నుండి అందరూ తిరిగి వెళ్ళాలని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో, వారందరి పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తారు, ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఓ నావికుడా, ఆవలి తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పాడుతారు కూడా. ఈ పాత ప్రపంచము మారి మళ్ళీ కొత్త ప్రపంచముగా తప్పకుండా అవ్వనున్నది. మూలవతనము నుండి మొదలుకుని మొత్తం ప్రపంచము యొక్క చిత్రపటము మీ బుద్ధిలో ఉంది. ఆత్మలమైన మనమందరమూ ఆ మధురమైన ధామమైన శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. మనమంతా సత్యయుగ కొత్త ప్రపంచములో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామములో ఉంటారు. ఆత్మ అయితే ఎప్పుడూ వినాశనము అవ్వదు. ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ కూడా వినాశనమవ్వలేదు. ఉదాహరణకు ఇతను ఇంజనీర్ అనుకోండి, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఖచ్చితముగా ఇలాగే ఇంజనీర్ అవుతారు. ఇవే నామ, రూప, దేశ, కాలాలు ఉంటాయి. ఈ విషయాలన్నింటినీ తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఇది అనాది, అవినాశీ డ్రామా. ఈ డ్రామా ఆయువు 5000 సంవత్సరాలు. ఒక్క క్షణము కూడా ఎక్కువా, తక్కువా అవ్వదు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇందులో అందరికీ పాత్ర లభించి ఉంది. దేహీ-అభిమానులుగా అయి, సాక్షీగా అయి ఆటను చూడాలి. తండ్రికైతే తమ దేహమే లేదు. వారు నాలెడ్జ్ ఫుల్, బీజరూపుడు. మిగిలిన ఆత్మలెవరైతే పైన నిరాకారీ లోకములో ఉంటారో, వారు మళ్ళీ నంబరువారుగా పాత్రను అభినయించడానికి వస్తారు. మొట్టమొదట దేవతల నంబరు ప్రారంభమవుతుంది. మొదటి నంబరు వారి వంశావళి చిత్రాలే ఉన్నాయి, ఆ తర్వాత చంద్రవంశీ రాజ్యకుటుంబపు చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నింటికన్నా ఉన్నతమైనది సూర్యవంశీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము, వారి రాజ్యం ఎప్పుడు మరియు ఎలా స్థాపన అయ్యింది అనేది మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. సత్యయుగ ఆయువునే లక్షల సంవత్సరాలుగా వ్రాసేసారు. ఎవరి జీవిత గాథను గురించి తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణుల జీవిత గాథ గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వంచి నమస్కరించడం లేక మహిమ చేయడమనేది తప్పు. తండ్రి కూర్చుని ముఖ్యమైనవారు ఎవరైతే ఉన్నారో, వారి జీవిత గాథను వినిపిస్తారు. ఏ విధంగా వీరి రాజధాని నడుస్తుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగములో శ్రీకృష్ణుడు ఉండేవారు కదా. ఇప్పుడు ఆ కృష్ణపురి మళ్ళీ స్థాపన అవుతోంది. శ్రీకృష్ణుడైతే స్వర్గపు యువరాజు. లక్ష్మీ-నారాయణుల రాజధాని ఎలా స్థాపన అయ్యింది - అదంతా మీరు అర్థం చేసుకుంటారు.

నంబరువారు మాలను కూడా తయారుచేస్తారు. ఫలానా, ఫలానావారు మాలలోని మణులుగా అవుతారు. కానీ నడుస్తూ-నడుస్తూ మళ్ళీ ఓడిపోతారు. మాయ ఓడించేస్తుంది. ఎప్పటివరకైతే సైన్యములో ఉంటారో, అప్పటివరకూ వీరు కమాండర్, వీరు ఫలానా అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా అవస్థ తగ్గిపోవడము, మాయతో ఓడిపోవడము. ఇక అంతమైపోతారు. ఆశ్చర్యము కలిగేలా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు... అహో మమ మాయ... విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరజీవాగా అవుతారు, తండ్రికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ రామ రాజ్యము నుండి రావణ రాజ్యములోకి వెళ్ళిపోతారు. దీని గురించే కౌరవులు మరియు పాండవుల యుద్ధాన్ని చూపించారు, అలాగే అసురులు మరియు దేవతల యుద్ధాన్ని కూడా చూపించారు. ఒక్క యుద్ధాన్నే చూపించవచ్చు కదా, రెండు ఎందుకు? అది ఇక్కడి విషయమేనని తండ్రి అర్థం చేయిస్తారు. యుద్ధము అనేది హింస అయిపోతుంది, ఇక్కడ ఉన్నది అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము. మీరు ఇప్పుడు డబుల్ అహింసకులుగా అవుతారు. మీది యోగబలము యొక్క విషయము. మారణాయుధాలు మొదలైనవాటితో మీరు ఎవరినీ ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రిస్టియన్లలో కూడా ఎంతో ఉంది. రష్యా మరియు అమెరికా, వారిరువురూ సోదరులే. వీరిరువురి మధ్యన బాంబులు మొదలైనవాటిని తయారుచేసే పోటీ ఉంది. ఇరువురూ ఒకరికన్నా ఒకరు శక్తివంతమైనవారు. వారిలో ఎంతటి శక్తి ఉందంటే, ఒకవేళ వారిరువురూ కలిసిపోతే మొత్తం ప్రపంచమంతటిపైనా వారు రాజ్యం చేయగలుగుతారు. కానీ బాహుబలముతో విశ్వముపై రాజ్యాన్ని పొందగలగడమనేది ‘లా’ (నియమము) కాదు. రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటే, మధ్యలో వెన్నను మూడవవారు తినేశారు అన్న కథ కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఇతనికి ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవాటినన్నింటినీ కూడా తండ్రే దివ్యదృష్టి ద్వారా తయారుచేయించారు మరియు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. వారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు మరియు మొత్తం విశ్వ రాజ్యాధికారాన్ని మీరు తీసేసుకుంటారు. వారిరువురూ చాలా శక్తివంతమైనవారు. అక్కడక్కడ ఒకరితో ఒకరు కొట్లాడుకునేలా చేస్తూ ఉంటారు, అలా చేసి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే వారిది కూడా ఎంతో గొప్ప వ్యాపారము. కావున ఇప్పుడు రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటేనే కదా ఈ మరణాయుధాలు మొదలైనవి ఉపయోగపడతాయి. అక్కడ, ఇక్కడ రెండేసి దేశాలను కొట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. ఈ హిందుస్థాన్, పాకిస్థాన్ ఇంతకుముందు వేరుగా ఉండేవా ఏమిటి? రెండూ కలిసి ఉండేవి. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మీరు యోగబలముతో విశ్వాధిపతులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. వారు పరస్పరం కొట్లాడుకుంటారు, వెన్నను మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వ రాజ్యాధికారము మీకు లభిస్తుంది మరియు అది చాలా సహజరీతిలో లభిస్తుంది. తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళాలి. దానిని నిర్వికారీ ప్రపంచము అని అంటారు, అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. ప్రతి వస్తువూ సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మీలో ఈ బుద్ధి ఉండేది కాదు ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు. భక్తి ఉన్నదే అజ్ఞానాంధకారము. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వారైతే కలియుగము ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని అంటారు. అచ్ఛా, మరి 40,000 సంవత్సరాలు పూర్తయ్యాక ఏమవుతుంది? అది ఎవ్వరికీ తెలియదు కావుననే అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు అని అనడం జరుగుతుంది. భక్తి అజ్ఞానము. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే జ్ఞానసాగరుడైన ఒక్క తండ్రే. మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. ఇంకెవరినీ ఇలా - వీరు మా తండ్రి, టీచర్, గురువు అని అనలేరు. ఇక్కడ ఇది అనంతమైన విషయము. వీరు అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువు. వారు స్వయం కూర్చుని అర్థం చేయిస్తున్నారు - నేను మీ సుప్రీమ్ తండ్రిని, మీరందరూ నా పిల్లలు. అలాగే మీరు కూడా అంటారు - బాబా, మీరు ఆ తండ్రే. తండ్రి కూడా అంటారు, మీరు కల్ప-కల్పమూ కలుస్తారు. కావున వారు పరమ ఆత్మ, సుప్రీమ్. వారు వచ్చి పిల్లలకు అన్ని విషయాలనూ అర్థం చేయిస్తారు. కలియుగ ఆయువు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అనడం పూర్తిగా ప్రగల్భమే. 5000 సంవత్సరాలలో అంతా వచ్చేస్తుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థం చేసుకుంటారు. మీరు అంగీకరించరని కాదు, అంగీకరించకపోతే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందినవారు కాకపోతే వారు అంగీకరించరు. తండ్రి అర్థం చేయించారు, మొత్తమంతా భక్తిపైనే ఆధారపడి ఉంది. ఎవరైతే ఎంతో భక్తి చేశారో, వారికి భక్తి ఫలము కూడా లభించాలి. వారికే తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ పాత ప్రపంచ వినాశనమైతే చూపించబడ్డది, ఇంకే శాస్త్రములోనూ ఇటువంటి విషయము లేదు. ఒక్క గీతయే భారత్ యొక్క ధర్మ శాస్త్రము. ప్రతి ఒక్కరూ తమ ధర్మ శాస్త్రాన్ని చదవాలి మరియు ఆ ధర్మము ఎవరి ద్వారానైతే స్థాపన అయ్యిందో, వారిని కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు క్రిస్టియన్లకు క్రైస్టు గురించి తెలుసు, వారు అతడినే నమ్ముతారు మరియు పూజిస్తారు. మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కావున దేవతలనే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో తమను తాము హిందూ ధర్మమువారిగా చెప్పుకుంటారు.

పిల్లలైన మీరు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీరు రాజఋషులు. వారు హఠయోగీ ఋషులు. రాత్రికీ, పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారి సన్యాసము అపరిపక్వమైనది, హద్దులోనిది. అది కేవలం ఇళ్ళు-వాకిళ్ళను వదిలేది మాత్రమే. మీ సన్యాసము లేక వైరాగ్యము మొత్తం పాత ప్రపంచమంతటినీ వదిలే సన్యాసము. మొట్టమొదట మీ ఇల్లు అయిన మధురమైన ఇంటికి వెళ్ళి ఆ తర్వాత కొత్త ప్రపంచమైన సత్యయుగములోకి వస్తారు. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడైతే ఇది పతిత పాత ప్రపంచము. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటారు. ఇది తప్పకుండా యథార్థమే కదా. ఇందులో నిశ్చయం లేకపోవడం అన్న విషయమే లేదు. ఈ జ్ఞానాన్ని తండ్రే చదివిస్తారు. ఆ తండ్రి టీచరు కూడా, సత్యమైన సద్గురువు కూడా, వారు తమతోపాటు తీసుకువెళ్తారు. ఆ గురువులైతే సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక్క గురువు వెళ్ళిపోతే ఇంకొక గురువును ఆశ్రయిస్తారు. అతని శిష్యుడిని గద్దెపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తండ్రి మరియు పిల్లల విషయము. అక్కడ అది గురువు మరియు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వమైతే తండ్రిదే కావాలి కదా. శివబాబా భారత్ లోకే వస్తారు. శివరాత్రిని మరియు శ్రీకృష్ణుని రాత్రిని జరుపుకుంటారు కదా. శివుని జన్మపత్రి అయితే లేదు, మరి ఎలా వినిపించాలి? వారి తిథి-తారీఖు అంటూ ఏదీ ఉండదు. మొదటి నంబరులో ఉన్న శ్రీకృష్ణుని జన్మపత్రిని చూపిస్తారు. దీపావళిని జరుపుకోవడమనేది ప్రపంచములోని మనుష్యుల పని. పిల్లలైన మీ కొరకు ఇదేమీ దీపావళి కాదు.

మనకు కొత్త సంవత్సరము, కొత్త ప్రపంచము అని సత్యయుగాన్ని అంటారు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచము కొరకు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఆ కుంభమేళాలకు ఎంతమంది మనుష్యులు వెళ్తారు. అక్కడ నీటి నదులపై మేళా జరుగుతుంది. ఎన్ని లెక్కలేనన్ని మేళాలు జరుగుతూ ఉంటాయి. వారిలో కూడా లోలోపల చాలా పంచాయితీ ఉంటుంది. అప్పుడప్పుడూ అయితే వారి మధ్య పెద్ద గొడవలు జరుగుతాయి ఎందుకంటే దేహాభిమానులుగా ఉన్నారు కదా. ఇక్కడైతే గొడవలు మొదలైనవాటి విషయమేదీ లేదు. తండ్రి కేవలం - మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అనే చెప్తారు. మీ ఆత్మ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యింది, మలినాలు కలిసాయి కదా, అవి యోగాగ్ని ద్వారానే తొలగుతాయి. ఇది స్వర్ణకారులకే తెలుస్తుంది. తండ్రినే పతిత-పావనుడు అని అంటారు. తండ్రి సుప్రీమ్ స్వర్ణకారుడు (కంసాలి). అందరిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన బంగారముగా తయారుచేస్తారు. బంగారాన్ని అగ్నిలో వేయడం జరుగుతుంది. ఇది యోగము అనగా స్మృతి అగ్ని ఎందుకంటే స్మృతితోనే పాపాలు భస్మమవుతాయి. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా స్మృతియాత్ర ద్వారానే అవ్వాలి. అందరూ సతోప్రధానులుగా అవ్వరు. కల్పపూర్వము లానే పురుషార్థము చేస్తారు. పరమాత్మది కూడా డ్రామాలో పాత్ర నిశ్చితమై ఉంది, ఏదైతే నిశ్చితమై ఉందో, అదే జరుగుతూ ఉంటుంది, అది మారదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. తండ్రి అంటారు, మున్ముందు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. మొట్టమొదట అయితే - వారు సర్వాత్మలకూ తండ్రి అన్న నిశ్చయాన్ని ఏర్పరచుకోవాలి, వారిని స్మృతి చేయాలి. మన్మనాభవ అర్థము కూడా ఇదే. అంతేకానీ శ్రీకృష్ణ భగవానువాచ అన్నదేమీ లేదు. ఒకవేళ శ్రీకృష్ణుడు అయినట్లయితే అందరూ అతని వద్దకు తరలి వచ్చేవారు, వెంటనే గుర్తించగలిగేవారు కదా. మరి కోట్లాదిమందిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అని ఎందుకు అంటారు. ఇక్కడైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు, అందుకే మనుష్యులకు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. ఇంతకుముందు కూడా ఇలా జరిగింది. నేనే వచ్చి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసాను. ఇక తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మాయమైపోతాయి. మళ్ళీ తమ సమయమనుసారముగా భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవన్నీ అవే వెలువడుతాయి. సత్యయుగములో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. భక్తి యొక్క నామ-రూపాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇది భక్తి రాజ్యము. అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు శ్రీశ్రీ 108 జగద్గురు అని పిలువబడేవారు. ఈ రోజుల్లో అయితే 1008 అని కూడా అనేస్తారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాలను తిప్పేటప్పుడు అందులోని పుష్పము నిరాకారునిది మరియు ఆ తర్వాత జంట పూసలు ఉంటాయి అని వారికి తెలుసు. బ్రహ్మా-సరస్వతులు జంట పూసలు ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గము వారు నివృత్తి మార్గము వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగాన్ని నేర్చుకోవలసి వస్తుంది. అక్కడైతే అనేక రకాల హఠయోగాలు ఉంటాయి, రాజయోగము ఒకే విధమైనది ఉంటుంది. స్మృతియాత్ర ఒక్కటే, దానినే రాజయోగము అని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు, అవి శారీరక ఆరోగ్యము కోసము. ఈ రాజయోగాన్ని తండ్రే నేర్పిస్తారు. మొట్టమొదట ఆత్మ, ఆ తర్వాత శరీరము. కానీ మీరు స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా శరీరముగా భావించి తలక్రిందులుగా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అనాది, అవినాశీ తయారై, తయారుచేయబడిన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ-అభిమానులుగా అయి, సాక్షీగా అయి చూడాలి. తమ మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయాలి, ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.

2. మాయతో ఓడిపోకూడదు. స్మృతి అగ్నితో పాపాలను నాశనం చేసుకుని ఆత్మను పావనంగా తయారుచేసుకునే పురుషార్థము చేయాలి.

వరదానము:-

దీపావళి నాడు యథార్థ విధితో తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మా భవ

దీపావళి నాడు పూర్వము మనుష్యులు విధి పూర్వకముగా దీపాలను వెలిగించేవారు, దీపము ఆరిపోకుండా ఉండేందుకు శ్రద్ధ తీసుకునేవారు, నూనె పోసేవారు, విధి పూర్వకముగా ఆహ్వానపు అభ్యాసములో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులు వెలిగిస్తున్నారు. దీపావళిని జరుపుకోవటము లేదు, ఇప్పుడు అది ఒక మనోరంజనమైపోయింది. ఆహ్వానించే విధి మరియు సాధన సమాప్తమైపోయాయి. స్నేహము సమాప్తమై, కేవలం స్వార్థమే మిగిలిపోయింది. అందుకే యథార్థ దాత రూపధారీ అయిన లక్ష్మి ఎవరి వద్దకూ రావడం లేదు. కానీ మీరందరూ యథార్థ విధితో మీ దైవీ పదవిని ఆహ్వానిస్తారు, అందుకే స్వయమే పూజ్య దేవీ-దేవతలుగా అయిపోతారు.

స్లోగన్:-

సదా అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి ఉన్నట్లయితే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది.